కరోనా విజృంభణ కొనసాగుతోన్న ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు స్వీయ నిర్బంధం పాటిస్తూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ క్రమంలో వైద్యం, పోలీస్, మీడియా, మున్సిపాలిటీ, విద్యుత్తు.. వంటి అత్యవసర విభాగాలకు చెందిన ఉద్యోగులు మాత్రం తమ విధుల్లో కొనసాగుతున్నారు. ప్రజల క్షేమం కోసం వీళ్లు తమ ప్రాణాలు పణంగా పెట్టి పగలు, రాత్రి అనే తేడాల్లేకుండా తమ వృత్తిధర్మాన్ని పాటిస్తున్నారు. వీళ్లు చేస్తోన్న త్యాగాన్ని గుర్తించి వారికి కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఈ క్రమంలో బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ తమ వీధిని శుభ్రం చేస్తోన్న ఓ మున్సిపాలిటీ ఉద్యోగినికి స్వయంగా కృతజ్ఞతలు తెలిపింది.
లాక్డౌన్ కారణంగా సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం స్వీయ నిర్బంధం, సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. ఈ క్రమంలో తమ క్వారంటైన్ అనుభవాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. అంతేకాదు, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మనందరి క్షేమం కోసం శ్రమిస్తోన్న సిబ్బందికి వాళ్లు వివిధ వేదికల ద్వారా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో తమ వీధిలో పేరుకుపోయిన చెత్తను ఓ మున్సిపాలిటీ ఉద్యోగిని తొలగిస్తుండగా.. విద్య తన ఇంటి బాల్కనీ నుంచే ఆమెకు కృతజ్ఞతలు తెలిపింది.
‘మేడమ్.. మేడమ్.. ఇటు చూడండి..! థ్యాంక్యూ.. ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి..!’ అంటూ ఆమెకు వినిపించేలా గట్టిగా అరుస్తూ కృతజ్ఞతలు చెప్పిందీ బ్యూటీ. విద్య మాటలు విన్న ఆ మహిళ నవ్వుతూ తల ఊపి మళ్లీ తన పని తాను చేసుకుంది. ఈ సందర్భంగా తీసిన వీడియోను విద్య సోషల్ మీడియా ద్వారా పంచుకొంటూ ‘థ్యాంక్యూ..! ఆ భగవంతుడి ఆశీస్సులు మీపై, మీ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా..!’ అంటూ రాసుకొచ్చిందీ తార.
పారిశుద్ధ్య కార్మికులపై పూల వర్షం..!
కొన్ని రోజుల క్రితం ఇలాంటి ఓ సంఘటనే పంజాబ్లో చోటు చేసుకుంది. పంజాబ్లోని నభా అనే నగరంలో తమ వీధిలో, ఇళ్లలో ఉన్న చెత్తను తీసుకెళ్లేందుకు వచ్చిన మున్సిపాలిటీ వర్కర్లపై స్థానికులు పూలు చల్లుతూ, కరెన్సీ నోట్ల దండల్ని మెడలో వేస్తూ, చప్పట్లు కొడుతూ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా తీసిన వీడియోను పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. ‘పారిశుద్ధ్య కార్మికులపై నభా ప్రజలు చూపించిన ఆప్యాయత ఎంతో ఆనందాన్ని కలిగించింది. కొవిడ్-19తో పోరాడే క్రమంలో మన కోసం శ్రమిస్తోన్న ఈ యోధుల్లో మనమంతా ఇలాగే ఉత్సాహం నింపుదాం..!’ అని రాసుకొచ్చారు.