దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుండడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. నిత్యం షూటింగ్స్‌తో బిజీగా ఉండే సినీ తారలు సైతం ఇంటిపట్టునే ఉంటూ.. ఈ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడిపేందుకు కేటాయిస్తున్నారు. అంతేకాదు, వీలు కుదిరినప్పుడల్లా సోషల్ మీడియా లైవ్/చాట్ ద్వారా తమ అభిమానులను పలకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో అందాల భామ పూజా హెగ్డే కూడా తాజాగా ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. #AskPooja అనే హ్యాష్‌ట్యాగ్ ద్వారా నెటిజన్లు అడిగిన ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలిచ్చిందీ ‘బుట్టబొమ్మ’.
మీరు మీ షూటింగ్స్/ఫొటోషూట్స్‌ను మిస్ అవుతున్నారా..?
అవును..! సెట్స్‌లో గడపడమంటే నాకు చాలా ఇష్టం..! కానీ, మనమంతా ఇంట్లోనే గడపాల్సిన సమయం ఇది. అందుకే ఈ సమయాన్ని నా గురించి నేను మరింతగా తెలుసుకునేందుకు ఉపయోగిస్తున్నా..!
సెలబ్రిటీగా మారిన తర్వాత మీ గురించి మీరు తెలుసుకున్న ఓ విషయం..?
నేను అనుకున్న దానికంటే మానసికంగా చాలా బలవంతురాలినని తెలుసుకున్నాను.
మీరు స్కూల్లో చదువుకునే రోజుల్లో మీకు ఇష్టమైన సబ్జెక్ట్స్ ఏవి..?
ఫిజిక్స్, ఇంగ్లిష్, టెక్నికల్ డ్రాయింగ్
మీకు ఆదర్శంగా నిలిచే వ్యక్తులెవరు?
నాకు ఆదర్శంగా నిలిచిన మహిళలు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా రీస్ విథర్స్పూన్, ఎలెన్ డి జనరస్, ఎమ్మా వాట్సన్‌లు నాకు ఎన్నో రకాలుగా స్ఫూర్తినిచ్చారు. మంచితనం, వృత్తి పట్ల నిబద్ధత, బాధ నుంచి త్వరగా కోలుకునేతత్వం.. వంటి లక్షణాలతో పాటు, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే మహిళలే నా దృష్టిలో నిజమైన ‘స్టార్స్’.
తెలుగు సినీ అభిమానుల గురించి మీ అభిప్రాయం..?
నా జీవితం..!
షారుఖ్ ఖాన్ గురించి మీ అభిప్రాయం..?
కింగ్ ఆఫ్ రొమాన్స్..! ఆ విషయంలో ఆయనకు పోటీ లేరు..!
మీకు ఈ సాంగ్ (‘ముకుంద’ సినిమాలో ‘గోపికమ్మా..’ పాట) గుర్తుందా..? ఇందులో మీ డ్యాన్స్, ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటాయి.
కెరీర్ ప్రారంభంలోనే ఇంత అందమైన సోలో సాంగ్‌లో నటించే అవకాశం దక్కడం నా అదృష్టం. కొంతమంది ఇప్పటికీ నన్ను ‘గోపికమ్మా..!’ అని పిలుస్తుంటారు.
‘బుట్టబొమ్మ’ పాటలో స్టెప్స్ వేయడానికి మీరు ఎంతసేపు ప్రాక్టీస్ చేశారు..?
కొన్ని క్షణాలు మాత్రమే..!
మీరెప్పుడూ నవ్వుతూ, సంతోషంగా కనిపిస్తారు. ఇది మీకెలా సాధ్యమవుతోంది?
నిజానికి ఇది చాలా సులభం..! కష్ట సమయాల్లో కూడా నేను ఆనందంగా ఉండడానికే ఇష్టపడతాను. మనసు బాధతో నిండి ఉన్నప్పుడు మీ జీవితానికి సంబంధించిన మధురమైన జ్ఞాపకాలను.. ఆనంద క్షణాలను ఒక్కసారి నెమరు వేసుకోండి. మీ ముఖంపై వెంటనే చిరునవ్వు వస్తుంది.
మీ కురులు ఇంత అందంగా, స్ట్రాంగ్‌గా ఉండడానికి కారణం..?
కొబ్బరినూనె (నవ్వుతోన్న ఎమోజీని జత చేస్తూ)
ఇతరులు మీ చేత చేయించిన లేదా మిమ్మల్ని నమ్మించిన ఓ అర్థం లేని పని గురించి చెప్పండి..?
చిన్నతనంలో శాంతాక్లాజ్‌ను విపరీతంగా నమ్మేదాన్ని. ఆయనకు ఎన్నో ఉత్తరాలు కూడా రాశాను..! ఏదోక రోజు వాటిని మీతో పంచుకుంటాను..!
అనుకోకుండా మీకు అతీతశక్తులు వస్తే ఏం చేస్తారు..?
టెలీపోర్ట్ (అంతరిక్షంలో ప్రయాణం చేయడం), ఇష్టమైన ప్రదేశాలకు క్షణాల్లో వెళ్లిపోతా, టైమ్ ట్రావెల్ కూడా చేస్తాను.
మీ ఫేవరెట్ సాంగ్ ఏది..?
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలోని ‘మనసా.. మనసా..’ అనే పాటంటే నాకు చాలా ఇష్టం. మీరు ఈ పాట విన్నారా..?
ఈ లాక్డౌన్ సమయంలో మీ డైలీ రొటీన్ ఏంటి..?
తినడం, పడుకోవడం, సినిమాలు/సిరీస్‌లు చూడడం.. వీటిని రిపీట్ చేయడం..!
మీరు ఎక్కువగా ఉపయోగించే మొబైల్ యాప్ ఏది..?
వాట్సాప్, ఇన్స్టాగ్రామ్..!
రోజూ సెట్‌కు వెళ్లి నటించడం మీకు ఆసక్తిగా అనిపిస్తుంటుందా..? లేదా మిగతా ఉద్యోగాల లాగానే అక్కడ కూడా చేసిన పనినే మళ్లీ మళ్లీ చేయాలని బోర్ అనిపిస్తుంటుందా..?
ఇది కచ్చితంగా ఆఫీస్ జాబ్ లాగా మాత్రం ఉండదు. నేను మాత్రం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు సెట్‌కు వెళ్తానా అని ఎదురు చూస్తుంటా..! ఈ వృత్తిలో అడుగడుగునా ఎన్నో సవాళ్లుంటాయి. కానీ, ఈ రంగంలో మనం పడే శ్రమకు కచ్చితంగా ఫలితం లభిస్తుంది.
మీరు నటి కాకపోయుంటే.. ఏ వృత్తిని ఎంచుకునేవారు..?
స్టైలిస్ట్ లేదా ఫొటోగ్రాఫర్ అయ్యుండేదాన్ని..!
మీ ఫేవరెట్ సింగర్ ఎవరు..?
ఫేవరెట్ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, మ్యుజీషియన్.. అంతా ఒక్కరే. ఆయనే ఏఆర్ రెహమాన్.
మీకోసమే ఈ స్పెషల్ ఎడిట్ చేశాను..? ఎలా ఉంది..?
నాకు Twix అంటే చాలా ఇష్టం. నన్ను Twixలా కూడా మార్చరా ప్లీజ్..!
పూజ ప్రస్తుతం ప్రభాస్ సరస ‘జాన్’ సినిమాలో.. అఖిల్‌కు జంటగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. లాక్డౌన్ కారణంగా ఈ షూటింగ్స్‌కు బ్రేక్ పడడంతో తను ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో గడుపుతోంది.