కరోనా వ్యాప్తిని అరికట్టే టీకా కోసం పరిశోధకులు, వైద్యులు విపరీతంగా శ్రమిస్తున్నారు. అయితే స్వీయ నిర్బంధం, సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం.. ఈ మూడు మార్గాలే మనల్ని కరోనా బారిన పడకుండా రక్షిస్తాయన్న విషయం తెలిసిందే. అందుకే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు వీటిని తు.చ. తప్పకుండా పాటిస్తున్నాయి. సామాన్యుల నుంచి దేశ ప్రధానుల వరకు స్వీయ నిర్బంధం పాటిస్తూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ క్రమంలో రోజుల కొద్దీ ఇంట్లో గడుపుతుండడంతో ప్రజల ఆలోచన తీరులో క్రమంగా మార్పు వస్తోంది. ఇంతకాలం వృత్తిగత, వ్యక్తిగత జీవితాలతో బిజీగా గడిపిన చాలామందికి ఈ లాక్డౌన్ సమయం తమ గురించి తాము తెలుసుకునేందుకు ఉపయోగపడుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు గడిచిన క్వారంటైన్ సమయం తన ఆలోచన తీరులో ఎలాంటి మార్పును తీసుకొచ్చిందో తాజాగా సోషల్ మీడియా ద్వారా పంచుకుంది బాలీవుడ్ బ్యూటీ అనుష్కా శర్మ.
‘కమ్ముకున్న ప్రతి కారు మబ్బు చుట్టూ తెల్లని రేఖ ఉంటుంది. ప్రస్తుతం గడుస్తోన్న కాలం మనల్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతోంది. కానీ, వృత్తిగతంగా, వ్యక్తిగతంగా నిత్యం ఉరుకులు పరుగులతో బిజీగా సాగే మన లైఫ్‌స్టైల్‌ను ఈ సమయం బలవంతంగా ఆపింది.. మనకు ఏది ముఖ్యమో తెలిసేలా చేసింది. మనకు ఈ పరిస్థితి రావడానికి వెనకున్న కారణాన్ని గుర్తించి.. ఈ సమయాన్ని మనం గౌరవించగలిగితే ఇకనైనా మన జీవితాల్లో నిజమైన వెలుగులు చూడొచ్చు.
ప్రస్తుతం నాకు ఆహారం, నీరు, ఉండడానికి ఆశ్రయం, ఆరోగ్యవంతమైన కుటుంబం.. ఇవే ముఖ్యమని అనిపిస్తోంది. ఇవి కాకుండా నాకు లభించిన సౌకర్యాలన్నీ నాకు బోనస్ అని నా భావన. అందుకు నేను కృతజ్ఞురాలిని..! నేను ఇంతకాలం ‘కనీస సౌకర్యాలు’గా భావించినవవేవీ కనీసం కావని.. జీవితంలో చిన్న చిన్న అవసరాల కోసం ఇబ్బందులు పడుతోన్న వారిని చూశాకే నాకు తెలిసింది. అలాంటి వాళ్లందరూ క్షేమంగా, సంతోషంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నా..!
ప్రపంచవ్యాప్తంగా ఎవరికి వారు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికే పరిమితమవడం ద్వారా మనం గొప్ప పాఠాలను నేర్చుకునే అవకాశం లభిస్తోంది. వృత్తిగత, వ్యక్తిగత జీవితాలను సమానంగా ఎలా ప్రేమించాలో, ఎలా సమయం గడపాలో బోధిస్తోంది. మనం సమయం కేటాయించాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయని తెలిసేలా చేస్తోంది.
ప్రస్తుతం నేను సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నా..! కానీ, వివిధ రకాల సమస్యలతో బాధ పడుతోన్న వారి పట్ల నేనెంత సానుభూతితో ఉన్నానో మీకు చెప్పాలనుకుంటున్నా..! వాళ్ల కోసం నాకు చేతనైన సహాయం చేయాలని నిర్ణయించుకున్నా..! నా చుట్టూ ఉండే వాళ్లు కూడా నాలాగే ఆలోచిస్తున్నారని నాకు అర్థమవుతోంది. ఈ సమయం ద్వారా మనమంతా జీవితానికి ఉపయోగపడే పాఠాలు నేర్చుకోవాలని.. అవి జీవితకాలం మనతోనే ప్రయాణించాలని ఆశిస్తున్నా..!’ అంటూ తన మనసులోని మాటలను అక్షరీకరించింది అనుష్క.
అనుష్కతో పాటు వివిధ రంగాలకు చెందిన పలువురు సెలబ్రిటీలు సైతం తమ క్వారంటైన్ అనుభవాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవలే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా తన క్వారంటైన్ పాఠాలను మనతో పంచుకున్న విషయం తెలిసిందే.