ఈ కరోనా సమయంలో మన సెలబ్రిటీలందరూ స్వీయ నిర్బంధం పాటిస్తూ వారికి సంబంధించిన విషయాలను తమ అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ వారిలో స్ఫూర్తి నింపడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనాలీలోని తన ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉన్న బాలీవుడ్ బ్యూటీ కంగన.. ప్రస్తుతం భక్తిభావంలో మునిగి తేలుతోంది. ఉత్తరాదిన ఎక్కువగా జరుపుకొనే చైత్ర నవరాత్రిని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటోన్న కంగన.. తన గురించి మనందరికీ తెలియని బోలెడన్ని విషయాలను వీడియోల రూపంలో పంచుకుంటోంది. ఈ క్రమంలో కంగన తాజాగా పెట్టిన ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరలైంది. పదిహేనేళ్ల వయసులో తాను చేసిన ఓ పని గురించి ఈ వీడియోలో చెప్పడమే అందుకు కారణం. మరి, ఇంతకీ కంగన ఏమందో తెలుసుకుందామా..
కంగనా రనౌత్.. దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుందీ బ్యూటీ. ఏ విషయాన్నైనా.. నిర్మొహమాటంగా చెప్పడం ఈ ముద్దుగుమ్మకు వెన్నతో పెట్టిన విద్య. అంతేకాదు.. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఎంతో నమ్మకం కలిగిన కంగన.. ప్రస్తుతం ఉత్తరాదిన పెద్ద ఎత్తున జరుపుకొనే చైత్ర నవరాత్రిని ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటోంది. ఇలా ప్రస్తుతం అటువంటి ఆధ్యాత్మిక ప్రపంచంలో తన సమయాన్ని గడుపుతూ.. తన గురించి మనందరికీ తెలియని బోలెడన్ని విషయాలను వీడియోల రూపంలో అభిమానులతో పంచుకుంటోంది.
15 ఏళ్లకే ఇంటి నుండి పారిపోయా..
తన పాత రోజుల్ని గుర్తు చేసుకుంటూ.. ‘పరిస్థితులను చెడ్డ రోజులుగా భావించకండి. నిజానికి మనం చెడుగా భావించే రోజులు మంచివనే చెప్పాలి. నేను 15-16 ఏళ్ల వయసులోనే ఇంటి నుండి పారిపోయాను. ఆ సమయంలో నేను నక్షత్రాలనైనా ఈజీగా అందుకోగలను అనే భావనలో ఉన్నాను. ఇంటి నుండి పారిపోయిన ఒకట్రెండు సంవత్సరాల్లోనే నటిగా మారాను.. అంతేకాదు డ్రగ్స్‌కి బానిసయ్యాను. నా జీవితం ఎలా అయిపోయిందంటే.. చావు మాత్రమే నన్ను ఆ పరిస్థితి నుంచి గట్టెక్కించగలదు అనే స్థితికి చేరుకున్నాను. ఇదంతా నేను టీనేజర్‌గా ఉన్నప్పుడే జరిగింది’ అంటూ నటిగా తన తొలినాళ్లను గుర్తుచేసుకుంది కంగన.
ఆధ్యాత్మిక చింతనే కోలుకునేలా చేసింది..
‘అలాంటి పరిస్థితుల్లో నా జీవితంలోకి ఓ మంచి ఫ్రెండ్ రాక నా జీవనగమనాన్నే మార్చింది. తను నాకు ‘రాజయోగా’ అనే పుస్తకాన్ని ఇవ్వడంతో పాటు యోగా గొప్పతనాన్ని తెలియజేశారు. ఆపై స్వామి వివేకానందుడిని నా గురువుగా భావించాను. ఆయన స్ఫూర్తితో నన్ను నేను ఎంతో మార్చుకోగలిగాను. నా మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకోవడమే అందుకు కారణం. అంతేకాదు.. నా సంకల్ప బలం పెరగడానికి, మానసిక దృఢత్వం పెంపొందడానికి కూడా ఆధ్యాత్మిక చింతనే కారణం. చివరగా మీకు నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే.. ప్రస్తుతం ఉన్న ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.. చెడు సమయాన్ని మంచి పనులకు కేటాయించండి.
చూశారుగా.. స్వీయ నిర్బంధ సమయాన్ని ఆధ్యాత్మిక చింతనతో గడుపుతూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తోంది కంగన.. మరి మనమూ తన బాటలోనే నడుస్తూ కరోనా గురించి అనవసర భయాందోళనలు చెందకుండా మనకు నచ్చిన పనులు చేస్తూ అటు మానసికంగా, ఇటు శారీరకంగా దృఢంగా తయారవుదాం..!