‘జీవితమంటే డబ్బు సంపాదించడం మాత్రమే కాదు..!’ అని చెబుతోంది బాలీవుడ్ బ్యూటీ కంగన. లాక్డౌన్ కారణంగా కంగన ప్రస్తుతం మనాలీలోని తన మ్యాన్షన్‌లో గడుపుతోంది. ఈ సమయాన్ని తను ధ్యానం చేయడానికి, ఆధ్యాత్మికతకు సంబంధించిన కొత్త విషయాలు తెలుసుకోవడానికి వినియోగిస్తోంది. ఈ నేపథ్యంలో తన మనసులోని భావాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటోందీ భామ. ఈ క్రమంలో మనుషుల ఆలోచన తీరు గురించి తన అభిప్రాయాలను పంచుకొంటూ కంగన ఇటీవల ఓ వీడియోను పోస్ట్ చేసింది. మరి ఈ బ్యూటీ ఏం చెబుతోందో మీరే చూడండి..!
ఈ విషయం చెప్పడానికి ఇదే సరైన సమయం అనిపించింది..!
‘‘కంగన ఓ సూపర్‌స్టార్, ఫ్యాషనిస్టా, ఉత్తమ నటి.. అలాంటిది తను అప్పుడప్పుడు యోగి, సన్యాసినిలా మారిపోతుంటుంది ఎందుకు..?’ అని మీరు నా గురించి అనుకుంటారు. అలా మీరు నన్ను వింతగా చూడడం నాకూ వింతగానే అనిపిస్తుంటుంది. జీవితమంటే డబ్బు సంపాదించడం మాత్రమే కాదు..! పాశ్చాత్య సంస్కృతి మనల్ని అలా ప్రభావితం చేసింది. జీవితమంతా డబ్బు ఆర్జించడం పైనే దృష్టి పెట్టాలని వాళ్లు మనకు అలవాటు చేశారు. మరి అలా ఆలోచించే వాళ్లంతా ఇవాళ ఏమయ్యారు..? ఎక్కడికి వెళ్లిపోయారు..?తమ ఇళ్లలో దాక్కొని ‘మా దగ్గరున్న డబ్బంతా తీసుకున్నా ఫర్వాలేదు కానీ, ఈ కరోనా మహమ్మారి నుంచి మమ్మల్ని రక్షించండి’ అంటూ వేడుకొంటున్నారు.
జీవితమంటే ఉద్యోగం, వ్యాపారం, సమాజంలో పేరు, కీర్తి, సోషల్ మీడియా ఫాలోయింగ్, బంధాలు, బంధుత్వాలు.. ఇవేవీ కావని జనాలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. జీవితమంటే.. జీవితమే..! ఈ విషయాన్ని నేను ఇదివరకే చెప్పుండొచ్చు.. కొంతమంది దీనిని అర్థం చేసుకోకుండా నాపై అసభ్యకరమైన కామెంట్లు చేస్తారని నేను చెప్పలేదు. కానీ, ఇప్పుడంతా ఇళ్లలో దాక్కున్నారు కదా.. అందుకే ఈ విషయం చెప్పడానికి ఇదే సరైన సమయం అనిపించింది. పాశ్యాత్య దేశాలకు చెందిన వారిలో చాలామంది మన భారతీయులపై జాతి వివక్షను చూపిస్తుంటారు, మనల్ని చులకనగా చూస్తుంటారు. కానీ, తమ వ్యక్తిగత ఆనందాలు, మానసిక ప్రశాంతత పొందేందుకు మాత్రం మన దేశానికి చెందిన పరమహంస, సద్గురు లాంటి వాళ్ల పాదాల దగ్గరకు వచ్చి చేరుతుంటారు. జులియా రాబర్ట్స్, మడోనా, స్టీవ్ జాబ్స్.. ఇలా ఎందరో ప్రముఖులకు మన వాళ్లే గురువులుగా ఉన్నారనే విషయం మాత్రం మర్చిపోకండి..!
ఈ వీడియో ద్వారా మీకు మరో విషయం కూడా చెప్పాలనుకుంటున్నా..! ధ్యానం, యోగాలు అనేవి కేవలం సాధువులకు మాత్రమే కావు..! జీవితంలో విజయాలు సాధించడం, ఫ్యాషనబుల్‌గా ఉండడం, డబ్బు సంపాదించడం.. మొదలైనవంటే కూడా నాకు చాలా ఇష్టం. కానీ, నా జీవితంలో ప్రతి క్షణం సంతృప్తితో గడపాలనే నేను కోరుకుంటా. సంతోషంగా, సౌకర్యవంతంగా బతకడంతో పాటు.. మనసుకు నచ్చినట్లుగా ఎలా జీవించాలో కూడా మనకు తెలిసుండాలి..!’ అంటూ తన మనసులోని భావాలను చెప్పుకొచ్చింది కంగన.
కంగనతో పాటు పలువురు నటీనటులు సైతం ఈ లాక్డౌన్ సమయంలో తమ మనసుకు నచ్చిన పనులు చేస్తూ ఆనందంగా గడుపుతున్నారు.