ఎదుటి వ్యక్తి అందం, శరీరాకృతి, బరువు, వర్ణం.. మొదలైన వాటిపై వాళ్ల మనోభావాలు దెబ్బతినేలా విమర్శలు చేయడాన్ని ‘బాడీ షేమింగ్’ అంటారు. ప్రస్తుతం మన సమాజంలో ఆడవాళ్లు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఇది కూడా ఒకటి. వీరిలో సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు సైతం ఉండడం గమనార్హం. ముఖ్యంగా సినిమా పరిశ్రమకు చెందిన హీరోయిన్లపై ఇలాంటి విమర్శలు తరచుగా వినిపిస్తుంటాయి. సోషల్ మీడియా వచ్చాక ఈ కామెంట్లు మరీ ఎక్కువైపోయాయి. కొంతమంది నెటిజన్లైతే హీరోయిన్ల సోషల్ మీడియా అకౌంట్లను ట్యాగ్ చేసి మరీ.. వారి శరీరాకృతిని విమర్శిస్తూ అభ్యంతరకర కామెంట్లు పెడుతున్నారు. అయితే కొంతమంది హీరోయిన్లు ఇలాంటి కామెంట్లను చూసీ చూడనట్లు వదిలేస్తుంటే.. కొంతమంది మాత్రం వీటిపై ఘాటుగా స్పందిస్తూ అలాంటి వాళ్లకు బుద్ధి చెబుతున్నారు. ఈ క్రమంలో అందాల తార శృతి హాసన్ కూడా తనపై వస్తోన్న బాడీ షేమింగ్ కామెంట్లపై తీవ్రంగా స్పందించింది. అంతేకాదు, ‘మన శరీరం, ఆలోచనల్లో వచ్చే మార్పులను అంగీకరిస్తూ జీవితంలో ముందుకెళ్లడమే మనకు మనం చేసుకునే అతిపెద్ద సహాయం’ అంటూ ఇలాంటి విమర్శలు ఎదుర్కొంటోన్న తోటి మహిళల్లో ధైర్యం నింపుతోందీ బ్యూటీ.
ప్రఖ్యాత నటుడు కమల్ హాసన్ నట వారసురాలిగా వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. తన ప్రతిభతో పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. శృతికి కేవలం నటనలోనే కాదు సంగీతంలోనూ మంచి ప్రావీణ్యముంది. సినిమాల్లోకి రాక ముందు తను ఓ రాక్‌బ్యాండ్‌లో సింగర్‌గా పని చేసిన సంగతి విదితమే. ఇప్పటికీ వివిధ ప్రదేశాల్లో జరిగే మ్యూజిక్ కన్సర్ట్స్‌లో పాల్గొంటూ తన గాత్రంతో శ్రోతలను అలరిస్తుంటుందీ లవ్లీ గర్ల్. అయితే శృతి కొంత గ్యాప్ తర్వాత ప్రస్తుతం మళ్లీ సినిమా షూటింగ్స్‌లో బిజీగా మారింది. ఈ క్రమంలో తను కొంచెం బరువు తగ్గింది. దీంతో ఆమె శరీరాకృతిని విమర్శిస్తూ కొన్నిరోజులుగా నెటిజన్లు శృతిపై రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో శృతి ఇన్‌స్టా వేదిక ద్వారా వీటికి సమాధానమిచ్చింది.
ఈ విషయాలు ఒప్పుకోవడానికి నేనెప్పుడూ సిగ్గుపడను..!
మేకప్ లేకుండా సహజంగా ఉన్న రెండు ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ ‘జీవితాన్ని ఒంటరిగా గడపడం ఇష్టపడేవారు.. అయితే క్రూరమైన జంతువైనా అయ్యుండాలి లేదా దేవుడైనా అయ్యుండాలి..!’ అంటూ శృతి క్యాప్షన్‌ను జోడించింది. ఈ ఫొటోలపై కొన్ని పాజిటివ్ కామెంట్లు రాగా.. కొంతమంది మాత్రం ‘నువ్వు సన్నగా అయిపోయావు, వృద్ధురాలిగా కనిపిస్తున్నావు, మీ ముఖంలో అసలు కళే లేదు’ అంటూ రకరకాల కామెంట్లు పెట్టారు. అయితే ఈ పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే శృతి మరో పోస్ట్ పెట్టింది. బాడీ షేమింగ్ గురించి తన మనసులో ఉన్న మాటలను ఈ పోస్ట్ ద్వారా అందరితో పంచుకుందీ తార.
‘నా గత పోస్ట్ తర్వాతే ఈ పోస్ట్ పెట్టాలని నిర్ణయించుకున్నా..! అలా ఎందుకు అనుకున్నానో మీకు ఇప్పుడు చెబుతా. నేను ఇతరుల అభిప్రాయాలకు అనుగుణంగా జీవించే వ్యక్తిని కాను. కానీ, ‘తను లావుగా మారింది’, ‘తను సన్నగా తయారైంది’.. అంటూ నాపై తరచుగా వచ్చే కామెంట్లను మాత్రం పట్టించుకోకుండా ఉండలేకపోతున్నా. ఇక్కడ మీకు కనిపిస్తోన్న రెండు ఫొటోలు మూడు రోజుల కింద దిగినవి. నేను ఇప్పుడు చెప్పబోయే విషయాన్ని ఎంతోమంది మహిళలు తమ జీవితాలకు అన్వయించుకుంటారని నేను నమ్ముతున్నాను.
నేను కొన్ని సంవత్సరాలుగా హార్మోన్ల సమస్యతో మానసికంగా, శారీరకంగా బాధపడుతున్నా..! ఈ సమస్య నుంచి కోలుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నా. దీనివల్ల కలిగే బాధ, శారీరక మార్పులను తట్టుకోవడం అంత సులభం కాకపోవచ్చు.. కానీ, నా ప్రయాణం గురించి మీతో పంచుకోవడం మాత్రం నాకు చాలా సులభం..! ఈ సమాజంలో ఎదుటి వ్యక్తిని జడ్జ్ చేసేంతటి గొప్ప స్థానంలో ఎవ్వరూ లేరు. అది సరైన పద్ధతి కాదు. ఇది నా జీవితం.. ఇది నా ముఖం.. అవును, నేను గతంలో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను. ఈ విషయాలను ఒప్పుకోవడానికి నేనెప్పుడూ సిగ్గుపడను. నేను ఈ విషయాలను ప్రచారం చేస్తున్నానా..?లేదు..! పోనీ, వాటిని దాచిపెడుతున్నానా..?లేదు..! నేను నా జీవితాన్ని ప్రేమిస్తున్నాను అంతే..!
మన శరీరం, ఆలోచనల్లో వచ్చే మార్పులను అంగీకరిస్తూ జీవితంలో ముందుకెళ్లడమే మనకు మనం చేసుకునే అతిపెద్ద సహాయం. ఇతరులకు ప్రేమను పంచండి. ప్రతిరోజూ నన్ను నేను ఇంకాస్త ఎక్కువగా ఎలా ప్రేమించాలో నేర్చుకుంటున్నా.. ఎందుకంటే నా జీవితంలో జరిగిన గొప్ప ప్రేమకథ మరెవరితోనో కాదు, నాతోనే..! మీ జీవితంలో కూడా ఇది జరగాలని ఆశిస్తున్నాను..!’ అంటూ తనదైన స్టైల్లో చెప్పుకొచ్చిందీ బ్యూటీ.
శృతి ప్రస్తుతం తెలుగులో రవితేజ సరసన ‘క్రాక్’, తమిళంలో విజయ్ సేతుపతితో ‘లాభం’ సినిమాల్లో నటిస్తోంది.