‘ఝుమ్మంది నాదం’ సినిమాతో వెండితెరకు పరిచయమైన తాప్సీ ఆ తర్వాత తెలుగులో పలు విజయవంతమైన సినిమాల్లో నటించింది. ‘ఛష్మే బద్దూర్’ చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ ‘పింక్’ సినిమాతో ఒక్కసారిగా లక్కీ హీరోయిన్గా మారిపోయింది. అప్పటి నుంచి బాలీవుడ్లో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అంతేకాదు తాప్సీ నటిస్తోన్న సినిమాలు బాక్సాఫీసు వద్ద అదే స్థాయిలో విజయాలను సొంతం చేసుకుంటుండడం విశేషం. వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన తాప్సీ త్వరలో ‘థప్పడ్’ అనే విభిన్న కథాంశంతో తెరకెక్కిన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనెల 28న సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న తాప్సీ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇంతకీ తాప్సీ ఏం మాట్లాడిందనేగా.. అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి...

తన మనసులో ఉన్న భావాలను నిర్మొహమాటంగా, నిర్భయంగా వ్యక్తపరచడంలో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది నటి తాప్సీ. ఈ కారణంగానే ఈ భామ నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. ఈ క్రమంలో ఆమె నెటిజన్ల విమర్శలకు గురైన సందర్భాలు కూడా బోలెడున్నాయి. అయితే ఎవరు ఏం అనుకున్నా తన మనసులోని మాటను చెప్పడానికి వెనకాడదీ అందాల భామ. ప్రస్తుతం ‘థప్పడ్’ అనే
విభిన్న కథాంశంతో తెరకెక్కిన చిత్రంలోని ఓ సన్నివేశం గురించి నటిగా స్పష్టంగా తన అభిప్రాయాన్ని పంచుకొని మరోసారి వార్తల్లో నిలిచిందీ సొట్టబుగ్గల బ్యూటీ.

‘థప్పడ్’ కథేంటి...
‘భార్యాభర్తలిద్దరూ విడిపోయారంటే ఎన్నో కారణాలు ఊహించుకుంటుందీ సమాజం. ఇద్దరిలో ఎవరికో ఒకరికి వివాహేతర సంబంధం ఉందని, భర్త శాడిస్టు అని.. ఇలా ఎన్నెన్నో ఊహించుకుంటుంది. అయితే ఒకరిపై ఒకరికి గౌరవం లేకపోయినా కూడా ఆ బంధం నిలిచి ఉండదు’ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిందే ‘థప్పడ్’ చిత్రం. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌ను గమనిస్తే.. కొత్తగా పెళ్లైన ఓ జంట ఎంతో అన్యోన్యంగా జీవితం సాగిస్తుంటారు. ఈ క్రమంలో భర్త ఓ సందర్భంలో భార్య (తాప్సీ)పై చేయిచేసుకుంటాడు. దీంతో కోపంతో ఊగిపోయిన ఆ భార్య, భర్త నుంచి విడాకులు కోరుతుంది. చుట్టూ ఉండేవారు.. ‘ఇంత చిన్న సమస్యకే విడాకులు తీసుకుంటారా’?, ‘జీవితంలో సర్దుకుపోవడం నేర్చుకోవాలి’, ‘భార్యను కొట్టడం కూడా ప్రేమలో ఒక భాగమే’ అని సలహాలిస్తుంటారు. కానీ భార్యను కొట్టడాన్ని చిన్న సమస్యగా భావిస్తున్న ఈ సమాజానికి వ్యతిరేకంగా తాప్సీ న్యాయ పోరాటం చేస్తుంది. ఇదే సినిమా కథ.

మహిళల తరఫున ఎవరూ నిలబడడం లేదు..
తాజాగా ‘థప్పడ్’ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న తాప్సీ ఓ ఇంటర్వ్యూలో భాగంగా మహిళలు ఎదుర్కొంటున్న గృహహింసపై, వారికి దక్కుతోన్న గౌరవం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మహిళలు ఎదుర్కొంటున్న అవమానాలు, గృహహింసపై ఎవరూ మాట్లాడడం లేదు. చివరికి సాటి మహిళలు కూడా స్పందించకపోవడం విచారకరం. కానీ దీనిపై ఎవరికి వారు ఎదురు తిరగాలి. కొంతమంది మహిళలు తమ గొంతును వినిపించలేరు. దీనికి కారణం వారు ఆర్థికంగా వారి భర్తలపై ఆధారపడడమే. వాళ్లు ఎక్కడికీ వెళ్లలేరు.. డబ్బులు సంపాదించలేరు. ఈ కారణంగానే ప్రతిరోజూ అవమానాలతో పాటు హింసను ఎదుర్కొంటున్నారు. ఎవరు ఏమనుకుంటారో అనే కారణంతో చాలామంది తాము ఎదుర్కొంటున్న బాధలను ప్రపంచానికి చెప్పలేకపోతున్నారు.

భార్యను భర్త కొట్టేది ఒక దెబ్బే అయినా, అంతకంటే ఎక్కువైనా సరే లేదా మరే రకమైన గృహహింస అయినా.. అవన్నీ వివక్ష, అవమానం కిందికే వస్తాయి. భార్యని కొట్టడం కూడా ప్రేమలో ఒక భాగమని చెప్పడంలో ఎలాంటి అర్థం లేదు. ఇక హింస మొదట ప్రారంభమయ్యేది తల్లిదండ్రుల నుంచేనని నా భావన. చిన్నారుల్లో భయాన్ని కలిగించేందుకు పెద్దలు వారిని కొడతారు. కానీ పిల్లల్ని పెంచే పద్ధతి ఇది కాదు. వారు చిన్ననాటి నుంచి ఇలాంటివి చూడడం వల్ల కొట్టడం, చేయి పైకెత్తడం వంటివి చిన్నారులకు చాలా సాధారణమైన విషయాలుగా అనిపిస్తుంటాయి. ఇక పెద్దయ్యాక మరీ ముఖ్యంగా అబ్బాయిలు ఇతరుల్ని కంట్రోల్ చేయడానికి ఇదే విధానాన్ని అవలంబిస్తుంటారు. ఇది నిత్యం కొనసాగే ఒక ప్రక్రియ.. దీన్ని మనం ప్రశ్నించాలి’ అని చెప్పుకొచ్చింది తాప్సీ.

గతంలోనూ..
నిజానికి ఈ చెంప దెబ్బ అంశం గతేడాదే టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. తెలుగులో సందీప్ వంగ దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ‘కబీర్ సింగ్’ పేరుతో గతేడాది హిందీలో సందీప్ రీమేక్ చేశాడు. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత అందులో హీరో, హీరోయిన్‌పై చేయి చేసుకునే సన్నివేశం గురించి ఎంతో రచ్చ జరిగింది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డికి ఇదే ప్రశ్న ఎదురుకాగా ‘ఇష్టమైన అమ్మాయిని కొట్టడం కూడా ప్రేమలో ఒక భాగమని’ స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో కొందరు హీరోయిన్లు ఆయనపై అప్పట్లో మండిపడ్డారు. వీరిలో తాప్సీ కూడా ఒకరు. అయితే ఇప్పుడు ఇదే కాన్సెప్ట్‌తో ఓ సినిమా రానుండడం అందులో తాప్సీనే కథానాయికగా నటించడం గమనార్హం.