‘అందమైన ప్యాలస్‌లో బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ వివాహం..!
బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్.. ఇలా మన దేశంలో వివిధ సినీ ప్రరిశ్రమలకు చెందిన అగ్ర తారలెందరో ఈ వేడుకలో పాల్గొన్నారు..!
అంతేకాదు, తమ ఇంట్లో పెళ్లి జరుగుతున్నట్లు పట్టు వస్త్రాలు ధరించి దగ్గరుండి మరీ ఈ వివాహం జరిపించారు..!’

...పై ఫొటోతో పాటు ప్రస్తుతం నెట్టింట్లో వైరలవుతోన్న మరికొన్ని ఫొటోలను చూసిన వాళ్లెవరైనా అలా అనుకోవడంలో తప్పులేదు. పైగా ఈ ఫొటోల్లో ఒక పక్క పెళ్లి కూతురి గెటప్‌లో పుత్తడి బొమ్మలా రడీ అయిన కత్రినా.. మరోపక్క పట్టు వస్త్రాలు ధరించి పెళ్లి పెద్దలను తలపిస్తోన్న అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, అక్కినేని నాగార్జున వంటి సూపర్ స్టార్లు.

మీరూ సరిగ్గా గమనిస్తే, ఈ ఫొటోల ఆధారంగా పైన చెప్పిన మాటలనే టైటిల్స్‌గా పెట్టి కొంతమంది నెటిజన్లు ఈపాటికి యూట్యూబ్‌లో వీడియోలు కూడా అప్లోడ్ చేసుంటారు. కానీ, అసలు విషయమేంటంటే అది నిజమైన వివాహ వేడుక కాదు..! ఇదంతా ఓ ప్రకటన చిత్రీకరణలో భాగం. ఓ ప్రముఖ జ్యుయలరీ కంపెనీ కోసం రూపొందించిన ఓ యాడ్‌లో ఈ అగ్రతారలంతా కలిసి నటించారు.
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ఓ ప్రముఖ జ్యుయలరీ కంపెనీకి ప్రచారకర్తగా వ్యవహరిస్తోన్న సంగతి విదితమే. ఈ క్రమంలో ఆ కంపెనీ ఉత్తర భారతంతో పాటు దక్షిణ భారత ప్రజలనూ ఆకట్టుకునేలా ఓ ప్రకటనను రూపొందించేందుకు పూనుకుంది. ఈ క్రమంలో కత్రినాతో పాటు బిగ్ బి దంపతులు అమితాబ్-జయ, అక్కినేని నాగార్జున, ప్రభు, శివ రాజ్‌కుమార్‌లు ఈ చిత్రీకరణలో పాల్గొనడం విశేషం. అయితే ఈ చిత్రీకరణలో భాగంగా తీసిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ఇది మా అదృష్టం..!
బిగ్ బి దంపతులు.. నాగార్జున, ప్రభు, శివలతో కలిసి దిగిన ఫొటోను అమితాబ్ ట్విట్టర్లో షేర్ చేస్తూ ‘జయ, నేను.. ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం ఇది. భారత చలన చిత్ర పరిశ్రమలో ధృవ తారల్లా వెలుగొందిన ముగ్గురు సూపర్స్టార్ల వారసులతో కలిసి పని చేసే అవకాశం లభించడం మాకు దక్కిన గొప్ప గౌరవంగా మేము భావిస్తున్నాం.
నాగార్జున – అక్కినేని నాగేశ్వర రావు కుమారుడు, తెలుగు
శివ రాజ్‌కుమార్ - డా. రాజ్‌కుమార్ కుమారుడు, కన్నడ
ప్రభు - శివాజీ గణేశన్ కుమారుడు, తమిళం’ అని రాసుకొచ్చారు.
ఈ ట్వీట్‌కి నాగార్జున స్పందిస్తూ ‘మీ ఇద్దరితో కలిసి పని చేసే అవకాశం లభించడం మా అందరి అదృష్టం సర్..!’ అంటూ రీట్వీట్ చేశాడు.

నా జీవితంలో ఇదే హైలైట్!
అదేవిధంగా రెజీనా, నిధి అగర్వాల్ తదితర నటీమణులతో దిగిన ఫొటోలను కూడా ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు బిగ్ బి. ‘నేడు ఈ మహిళలతో కలిసి యాడ్ చిత్రీకరణలో పాల్గొన్నాను. వీరందరూ వాళ్ల వాళ్ల వ్యక్తిగత, వృత్తి పరమైన జీవితాల్లో అసాధారణంగా దూసుకుపోతోన్న సెలబ్రిటీలు. ఈ రోజు నా జీవితంలో మరో అందమైన రోజు. చిత్రీకరణ చివరి దశకు చేరుకోవడం కాస్త బాధగానే ఉంది.. కానీ మన జీవితంలో ‘రేపు’ అనే మరో రోజు ఉంది కదా’ అని రాసుకొచ్చారీ బాలీవుడ్ మెగాస్టార్.
ఈక్రమంలో బిగ్ బి పోస్ట్ చేసిన ట్వీట్‌పై నిధి అగర్వాల్ స్పందించింది. ‘సర్..మీతో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది. నేను మీకు వీరాభిమానిని. ఈరోజు నుంచి మీపై అభిమానం రెట్టింపైంది. నా జీవితంలో ఇదే హైలైట్. ఇక మీరు చెప్పినట్లుగానే అసాధారణమైన మహిళలను చూసి నేనెంతో స్ఫూర్తి పొందాను..’ అంటూ తన మనసులోని భావాల్ని, బిగ్ బిపై తనకున్న అభిమానానికి అక్షర రూపమిచ్చిందీ ‘ఇస్మార్ట్’ ముద్దుగుమ్మ.
ఈ యాడ్ షూటింగ్‌కు ముందు కత్రినా సెట్లో టెక్నీషియన్స్‌తో సరదాగా కార్డ్స్ ఆడుతుండగా తీసిన ఫొటోలను తను ఇన్‌స్టాలో షేర్ చేసింది.
మరి ఇంతమంది సెలబ్రిటీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన ఈ కమర్షియల్ యాడ్ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.
Image Courtesy:https://twitter.com/KatrinaKaifFB/status/1220088327187189762