‘సంపాదించడం మగవారి పని.. ఇంటిపని ఆడవారిది’.. ఇది నాటి కాలపు మాట. ప్రస్తుతం అమ్మాయిలు, మగవారితో సమానంగా.. ఇంకా చెప్పాలంటే వారి కంటే నాలుగు రాళ్లు ఎక్కువే సంపాదిస్తున్నారు. ఇందుకు ఆయా రంగాల్లో సంపాదనపరంగా దూసుకుపోతోన్న కొందరు మహిళామణులే ప్రత్యక్ష నిదర్శనం. తాజాగా ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసిన ‘అత్యధిక ఆర్జన గల వందమంది సెలబ్రిటీల’ జాబితా చూస్తే ఈ విషయం మరోసారి నిరూపితమవుతుంది. వారి సంపాదన, పాపులారిటీ, సోషల్ మీడియాలో వారికి ఉన్న ఆదరణ.. వంటి పలు అంశాల్ని ఆధారంగా చేసుకొని కొంతమంది సెలబ్రిటీలకు ఈ లిస్టులో చోటుకల్పించింది ఫోర్బ్స్.
ప్రతి ఏడాది చివర్లో భారతదేశంలో అత్యధిక సంపాదన గల సెలబ్రిటీ లిస్ట్‌ని ఫోర్బ్స్ విడుదల చేయడం పరిపాటే. ఈ క్రమంలో ఈ ఏడాదికి గాను ‘అత్యధిక ఆర్జన గల వందమంది సెలబ్రిటీల’ జాబితాను తాజాగా విడుదల చేసింది ఫోర్బ్స్ ఇండియా. ఇందులో ఇండియన్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానం ఆక్రమించగా.. బాలీవుడ్ క్యూటీ అలియా భట్‌ది లిస్ట్‌లో 8వ స్థానమైనా.. మహిళల్లో టాప్‌లో నిలిచింది. ఇక మరో బాలీవుడ్ భామ దీపికా పదుకొణె ఈ జాబితాలో పదో స్థానం దక్కించుకోగా.. మహిళల్లో ఆమె రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది. గతేడాది విడుదల చేసిన ఇదే లిస్ట్‌లో 17మంది మహిళలు స్థానం సంపాదించగా.. ఈ సంవత్సరం వారి సంఖ్య దాదాపు రెట్టింపై.. 30 మందికి పెరగడం విశేషం. మరి ఈ ఏడాది ఫోర్బ్స్ అత్యధిక సంపాదనపరులైన మహిళా సెలబ్రిటీలెవరో తెలుసుకుందామా!

అలియా భట్ #8
2019లో విడుదలైన ‘గల్లీ బాయ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. దీంతో పాటు అలియా ప్రస్తుతం ఎన్నో బ్రాండ్స్‌కి అంబాసిడర్‌గానూ వ్యవహరిస్తూ తన సంపాదనను, క్రేజ్‌ని పెంచుకుంటూ పోతోంది. ఈ క్రమంలో ఒక ఏడాదిలో తన సంపాదన సుమారు రూ. 59.21 కోట్లు ఉండడం గమనార్హం. ప్రస్తుతం అల్లూ బేబీ లేస్, ఫిలిప్స్, మాన్యవర్ మోహే, ఫ్యూజీ ఇన్స్టాక్స్, నోకియా, మ్యాంగో ఫ్రూటీ, మేక్ మై ట్రిప్.. ఇలా చాలా రకాల బ్రాండ్స్‌కి ప్రచారకర్తగా కొనసాగుతోంది.

దీపికా పదుకొణె #10
దీపిక గతేడాది పద్మావత్‌లో రాణి పద్మినిగా మెప్పించింది. ఇక ఈ ఏడాది సినిమా విడుదల కాకపోయినా వచ్చే ఏడాది జనవరి రెండో వారంలో ‘ఛపాక్’ సినిమాతో ఆమ్ల బాధితురాలిగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా ఈ ఏడాది ఒక్క సినిమా విడుదల కాకపోయినా ఫోర్బ్స్ లిస్టులో టాప్ 10లో స్థానం సంపాదించుకుంది దీప్స్. అయితే గతేడాది కంటే ఈ ఏడాది ఆరు స్థానాలు దిగజారడం గమనార్హం. ప్రస్తుతం దీపిక లాయిడ్ ఇండియా, లోరియల్ ప్యారిస్, యాక్సిక్ బ్యాంక్, ఓప్పో, తనిష్క్, గో ఐబిబో, లక్స్.. ఇలా ఎన్నో రకాల బ్రాండ్స్‌కు ప్రచారకర్తగా కొనసాగుతోంది. ఇలా ఓ బ్రాండ్ అంబాసిడర్‌గా ఈ ఏడాది దీప్స్ ఆదాయం సుమారు రూ. 48 కోట్లు.

ప్రియాంక చోప్రా #14
తన నటనతో గ్లోబల్ స్టార్‌గా పేరుగాంచిన ప్రియాంక ఫోర్బ్స్ లిస్ట్‌లో 14వ స్థానాన్ని కైవసం చేసుకుంది. అటు ప్యాంటీన్, హర్మన్ కర్డన్, అసోం టూరిజం.. వంటి వాటికి ప్రచార కర్తగా వ్యవహరిస్తూ.. ఇటు నిర్మాతగా కూడా కొనసాగుతోంది. ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన జాబితా ప్రకారం ఏడాదికి తన సంపాదన రూ. 23 కోట్లు ఉంది.

అనుష్కా శర్మ #21
గతేడాదితో పోలిస్తే అనుష్క జోరు తగ్గిందనే చెప్పుకోవాలి. 2018లో 16వ ర్యాంక్‌ను కైవసం చేసుకున్న అనుష్క.. ఈ ఏడాది 21వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అటు నటిగా, నిర్మాతగా తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ.. ఇటు ఎన్నో బ్రాండ్స్‌కి ప్రచార కర్తగా వ్యవహరిస్తోందీ అందాల తార. నష్, రజనీ గంధ పర్ల్స్, నివియా, కెరోవిట్.. వంటి బ్రాండ్స్‌తో ఒప్పందం కుదుర్చుకుని వాటిని ప్రచారంలో భాగంగా అప్పుడప్పుడూ తన సోషల్ మీడియాలో కూడా పోస్ట్‌లు పెడుతుంటుంది అనుష్క. తాజా ఫోర్బ్స్ లిస్టు ప్రకారం ఏడాదికి దాదాపు రూ. 29 కోట్లు ఆర్జిస్తోందీ బాలీవుడ్ బేబ్.

కత్రినా కైఫ్ #23
కత్రినా ర్యాంక్ కూడా గతేడాదితో పోలిస్తే తగ్గిందని చెప్పుకోవచ్చు. 2018లో 21వ స్థానంలో నిలిచిన క్యాట్.. తాజా జాబితాలో 23వ స్థానానికి పడిపోయింది. నటిగా మాత్రమే కాకుండా.. ఈ మధ్యే ‘కె ఫర్ క్యాట్’ అనే బ్యూటీ లైన్‌ను కూడా ప్రారంభించిందీ పొడుగు కాళ్ల సుందరి. వీటితో పాటు జాన్సన్ టైల్స్, బర్జర్, హంక్ చాక్లెట్, ట్రోపికానా, మ్యాంగో స్లైస్, లినో పెరోస్.. వంటి బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తోందీ బ్యూటీ. ఇలా ఈ ఏడాది క్యాట్ దాదాపు రూ. 24 కోట్లు ఆర్జించినట్లు ఫోర్బ్స్ ప్రకటించింది.

శ్రద్ధా కపూర్ #28
2018లో 70వ స్థానంతో సరిపుచ్చుకున్న శ్రద్ధా.. ఈ ఏడాది అమాంతం 42 స్థానాల్ని ఎగబాకి 28వ ర్యాంక్‌ని సొంతం చేసుకుంది. పాన్ ఇండియా స్టార్‌గా పేరుగాంచిన ప్రభాస్‌తో ఈ ఏడాది నటించిన ‘సాహో’ చిత్రంలో నటించి మెప్పించింది. ఇలా ఓవైపు నటిగా కొనసాగుతూనే.. మరోవైపు పలు రకాల బ్రాండ్స్‌కి ప్రచారకర్తగా వ్యవహరిస్తోందీ క్యూటీ. ఈ క్రమంలో గోల్డెన్ దేశీ, హెయిర్ అండ్ కేర్ ఆయిల్, సీక్రెట్ టెమ్టేషన్స్, లిప్టన్ గ్రీన్ టీ, సమృద్ధి గ్రూప్.. వంటి వాటితో ఒప్పందం కుదుర్చుకుందీ బాలీవుడ్ లేడీ. ఈ ఏడాది ఈమె సంపాదన దాదాపుగా రూ. 8.3 కోట్లుగా ఉందని ఫోర్బ్స్ ప్రకటించింది.

నేహా కక్కర్ #29
నేహా కక్కర్.. గాయనిగా బాలీవుడ్లో మంచి పేరు సంపాదించుకుంది నేహ. 2006లో ఇండియన్ ఐడల్ సీజన్ 2లో పార్టిసిపెంట్‌గా పాల్గొన్న నేహ.. ఆపై ఇండియన్ ఐడల్ 10, 11 సీజన్లకు జడ్జ్‌గా వ్యవహరించింది. గతేడాది ఫోర్బ్స్ లిస్ట్‌లో పేరు కూడా నమోదు కాని నేహ.. ఈ సంవత్సరం ఏకంగా 29వ స్థానాన్ని సంపాదించడం విశేషం. ఫోర్బ్స్ ప్రకారం ఆమె సంపాదన ఈ ఏడాది రూ. 25 కోట్లుగా ఉంది.
వీళ్లే కాకుండా.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ - రూ. 9.5 కోట్లు (32), కృతీ సనన్ - రూ. 8.09 కోట్లు (38), పరిణీతి చోప్రా - రూ. 12.5 కోట్లు (41), సోనమ్ కపూర్ - రూ. 8.5 కోట్లు (42), దిశా పటానీ - రూ. 5.8 కోట్లు (43), సన్నీ లియోని - రూ. 2.5 కోట్లు (48), మాధురీ దీక్షిత్ - రూ. 11 కోట్లు (57), సోనాక్షీ సిన్హా - రూ. 6.14 కోట్లు (59), పి.వి.సింధు - రూ. 21.05 కోట్లు (63), సారా అలీ ఖాన్ - రూ. 5.75 కోట్లు (66), తాప్సీ - రూ. 6.18 కోట్లు (68), కంగనా రనౌత్ - రూ. 17.5 కోట్లు (70), శిల్పా శెట్టి - రూ. 2.26కోట్లు (75), మలైకా అరోరా - రూ. 2.09 కోట్లు (76), దివ్యాంక త్రిపాఠి - రూ. 1.46 కోట్లు (79), సైనా నెహ్వాల్ - రూ. 3 కోట్లు (81), భారతీ సింగ్ - రూ. 10.92 కోట్లు (81), జోయా అక్తర్ - రూ. 9.33 కోట్లు (82), మేరీ కోమ్ - రూ. 3.9 కోట్లు (87), మిథాలీ రాజ్ - రూ. 2.63 కోట్లు (88), రవీనా టాండన్ - రూ. 2.4 కోట్లు (89), స్మృతీ మంధాన – రూ. 2.85 కోట్లు (90), హర్మన్ ప్రీత్ కౌర్ - రూ. 2.12 కోట్లు (91), కల్కి కొచ్లిన్ - రూ. 3.33 కోట్లు (93).. సంపాదనతో ఈ ఏడాది ఫోర్బ్స్ అత్యధిక సంపాదన పరులైన మహిళా సెలబ్రిటీలుగా నిలిచారు.