‘లీడర్’ తో వెండితెరకు పరిచయమై ‘మిరపకాయ్’, ‘మిర్చి’ సినిమాలతో మెప్పించిన బార్బీ గర్ల్ రిచా గంగోపాధ్యాయ్. వీటితో పాటు ‘నాగవల్లి’ ‘సారొచ్చారు’, తమిళంలో ‘మాయక్కమ్ ఎన్న’, ‘ఒస్తే’, బెంగాలీలో ‘బిక్రమ్ సింఘా’ చిత్రాల్లో నటించి సందడి చేసిందీ ముద్దుగుమ్మ. చివరిగా ఆమె 2013లో ‘భాయ్’ అనే తెలుగు చిత్రంలో కనిపించింది. సుమారు నాలుగేళ్ల పాటు తెలుగు, తమిళ, బెంగాలీ భాషల్లో హీరోయిన్గా మెప్పించిన ఈ బ్యూటీ..ఆరేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పేసిన ఈ భామ తాజాగా మళ్లీ మన ముందుకొచ్చింది. అయితే కొత్త సినిమాతో కాదండోయ్. తన మనసుకు నచ్చిన వాడిని పెళ్లాడి...!. ఈ ఏడాది జనవరిలో తన ప్రేమికుడు జోయ్‌తో కలిసి ఉంగరాలు మార్చుకున్న ఈ భామ తాజాగా పెళ్లి దండలు కూడా మార్చుకుంది.

మోడల్‌గా మొదలెట్టి..!
దిల్లీలో పుట్టి పెరిగిన రిచా మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. ఈ క్రమంలో 2007లో ‘మిస్ ఇండియా యూఎస్ఏ’ కిరీటాన్ని కూడా సొంతం చేసుకుందీ బ్యూటీ. అనంతరం అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్కూల్లో నటనకు సంబంధించిన ఓనమాలు నేర్చుకుంది. ఈ క్రమంలోనే ‘వాటికా హెయిర్ ఆయిల్’, ‘పీటర్ ఇంగ్లండ్ పీపుల్’, ‘పెపే జీన్స్’, ‘మలబార్ గోల్డ్’, ‘కళానికేతన్’.. వంటి ప్రముఖ ఉత్పత్తుల టీవీ ప్రకటనల్లోనూ నటించిందీ అందాల తార. ఇక 2010లో ‘లీడర్’ సినిమాతో మొట్టమొదటి సారిగా సిల్వర్ స్ర్కీన్‌పై కనిపించిన ఈ ముద్దుగుమ్మ వివిధ భాషల్లో మొత్తం తొమ్మిది చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా తమిళంలో తెరకెక్కిన ‘మాయక్కమ్ ఎన్న’ (తెలుగులో Mr. కార్తిక్) సినిమాలో రిచా నటన అందరినీ ఆకట్టుకుంది. తాగుబోతు భర్తను భరిస్తూ, అతడిని తన ప్రేమతో మార్చుకునే భార్య పాత్రలో పలువురి ప్రశంసలు అందుకుందీ అందాల తార. అందుకే ఈ చిత్రానికి గానూ ‘ఉత్తమనటిగా’ పలు అవార్డులు కూడా గెలుచుకుంది రిచా.

రెండేళ్ల ప్రేమాయణం!
ఈ క్రమంలో ఆరేళ్ల క్రితం ఇక సినిమాల్లో నటించను అంటూ అమెరికా వెళ్లిపోయిందీ ముద్దుగుమ్మ. అక్కడ వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన ఓ బిజిసెస్ స్కూల్లో చేరింది. అలా చదువుకుంటున్న సమయంలోనే సహ విద్యార్థి జోయ్ ను కలిసింది. మొదట మాటలతో మొదలైన వీరిద్దరి పరిచయం మనసుల్ని ఇచ్చిపుచ్చుకునేదాకా వెళ్లింది. అలా రెండేళ్ల పాటు వీరి ప్రేమాయణం కొనసాగింది.

ఏడడుగులు నడిచారు!
ఈ ఏడాది జనవరిలో నిశ్చితార్థంతో ఉంగరాలు మార్చుకుందీ అందాల జంట. అప్పుడే తన జీవిత భాగస్వామి జోయ్‌ను ట్విట్టర్ ద్వారా అందరికీ పరిచయం చేసింది రిచా. తాజాగా తమ ప్రేమ బంధాన్ని వైవాహిక బంధంగా మార్చుకుంటూ ఏడడుగులు నడిచారీ లవ్లీ కపుల్. క్రిస్టియన్, హిందూ సంప్రదాయాల ప్రకారం జరిగిన వీరి వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. అయితే ఈ జంట తమ వివాహ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం ఈ ముద్దుల జంట పెళ్లి వేడుకకు సంబంధించిన పలు ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

మరి ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకుని కొత్త జీవితం ప్రారంభించిన రిచా-జోయ్లకు మనం కూడా శుభాకాంక్షలు చెబుదాం.
-హ్యాపీ మ్యారీడ్ లైఫ్ లవ్లీ కపుల్!

