Photos: Instagram
‘భావ ప్రకటన స్వేచ్ఛ’ పేరుతో సోషల్ మీడియాలో కొంత మంది నెటిజన్లు ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా కామెంట్లు పెడుతుంటారు. ప్రత్యేకించి సెలబ్రిటీల విషయంలో సోషల్ మీడియా వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో అన్నే నష్టాలున్నాయనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కొందరు ఆకతాయిలు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని తమకు ఇష్టమొచ్చినట్లు విమర్శలు, కామెంట్లు చేస్తుండడం మనం తరచుగా వింటూనే ఉన్నాం. మరికొందరు నెటిజన్లు తమకిష్టం వచ్చిన సెలబ్రిటీలను ట్యాగ్ చేస్తూ ఇష్టమొచ్చిన పోస్ట్‌లు పెడుతూ వారి మనోభావాలను దెబ్బతీస్తుంటారు. ఈక్రమంలో ‘ప్రపంచంలో అత్యంత అందమైన ముఖం’ గల యువతిగా గెలిచిన ఓ అందాల తార కూడా ఇలాంటి విమర్శలు ఎదుర్కొందట. ఇంతకీ ఎవరామె?ఎందుకు ట్రోలింగ్ బారిన పడిందో తెలుసుకుందాం రండి...
అప్పుడు కూడా వేధింపులు తప్పలేదు!
ఇండిపెండెంట్ క్రిటిక్స్ వెబ్సైట్ ఏటా ప్రపంచం మొత్తాన్ని జల్లెడ పట్టి...అందమైన ముఖ సౌందర్యం కలిగిన వంద మంది యువతుల జాబితాను తయారుచేస్తుంది. అందులో ఒకరిని ‘మోస్ట్ బ్యూటిఫుల్ ఫేస్’గా ఎంపిక చేసి విజేతగా ప్రకటిస్తుంది. దేశం, ప్రాంతం, జాతి భేదం లేకుండా కేవలం అందచందాలే ప్రామాణికంగా ఈ పోటీలు సాగుతాయి. కాగా, 2020కి గానూ ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని ఇజ్రాయెల్‌కు చెందిన 19 ఏళ్ల నటి యేల్ షెల్బియా గెలుచుకుంది. ‘ప్రపంచంలోనే అత్యంత అందమైన ముఖం’ గల యువతిగా ఎంపిక కావడంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ సందర్భంగా తనను విజేతగా నిలిపిన అభిమానులందరికీ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపింది షెల్బియా. అయితే అక్కడ కూడా కొందరు నెటిజన్లు ఆమెపై విమర్శల బాణాలు సంధించారాట. ఆమె శరీర ఛాయను టార్గెట్ చేస్తూ విపరీతమైన ట్రోలింగ్‌కు దిగారట. ఈక్రమంలో ప్రతిష్ఠాత్మక పోటీల్లో గెలిచిన తర్వాత కూడా తాను ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నానంటూ అందరి ముందు వాపోయిందీ అందాల తార.
‘అగ్లీ క్వీన్’ అంటూ అవహేళన చేశారు!
‘ఈ పోటీల్లో విజేతగా నిలుస్తానని నేను ఊహించలేదు. అసలు ఈ రేసులో ఉన్నట్లు కూడా తెలియకుండానే కిరీటం గెల్చుకున్నాను. నాకు ఓటేసి విజేతగా నిలిపిన వారందరికీ కృతజ్ఞతలు. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు మొత్తం 4వేలకు పైగా కామెంట్లు వచ్చాయి. అందులో చాలావరకు ప్రశంసలు, అభినందనలున్నా విమర్శలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. నన్ను ద్వేషించే వాళ్లు ఎప్పటిలాగానే మళ్లీ నన్ను టార్గెట్ చేసుకున్నారు. ‘బ్యూటీ క్వీన్’ కాదు ‘అగ్లీ క్వీన్’ అంటూ అవహేళన చేస్తూ కామెంట్లు పెట్టారు. అయితే ఎప్పటిలాగానే నేనూ వాటిని పట్టించుకోవడం మానేశాను. అలా ముందుకు వెళితేనే మనం జీవితంలో సక్సెస్ అవుతాం. నా దృష్టిలో అందమనేది ఓ వ్యక్తిగత అభిప్రాయం. ఆడవారందరూ అందమైన వారే. అందమైన ముఖమే కాకుండా...దయ, వినయం, సానుకూల దృక్పథం లాంటి లక్షణాల వల్ల కూడా వ్యక్తులు అందంగా కనిపించవచ్చు. మనం మంచి ప్రవర్తనతో ఉంటే అది మన కళ్లలో కనిపిస్తుంది. ఎందుకంటే మన కళ్లు ఎప్పటికీ అబద్ధం చెప్పవు’ అంటూ చెప్పుకొచ్చిందీ గ్లామర్ క్వీన్.
16 ఏళ్లకే మోడలింగ్!
ఇజ్రాయెల్ పట్టణంలోని ఒక చిన్న యూదు కుటుంబంలో జన్మించింది షెల్బియా. తల్లి పేరు ఓఫ్రా కోహెన్. తండ్రి ఓఫర్ కొహెన్ ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. ఈక్రమంలో 16 ఏళ్ల వయసులో అందమైన సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకోవడం అలవాటు చేసుకుంది షెల్బియా. స్థానికంగా ఉండే ఓ ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ ఆ ఫొటోలను చూసి ఫిదా అయిపోయాడు. మరింత అందంగా తన ఫొటోలు తీసి తనను ప్రపంచానికి పరిచయం చేశాడు. అలా 16 ఏళ్ల వయసులో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది షెల్బియా. ఆ తర్వాత ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అందాల తారలు కిమ్ కర్దాషియన్, కైలీ జెన్నర్ల సౌందర్య ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేసింది. ఆపై బుల్లితెరపైకి అడుగుపెట్టి పలు టీవీ షోలు, సీరియల్స్‌లో నటించింది. మోడల్‌గా, బుల్లితెర నటిగా అశేష అభిమానం సంపాదించుకున్న షెల్బియా ప్రస్తుతం ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్‌లో వలంటరీ సోల్జర్‌గా విధులు నిర్వర్తిస్తుండడం విశేషం. ఈ కారణంగానే ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.
నాలుగో సారి అగ్రస్థానం!
టీసీ కాండ్లర్ ‘మోస్ట్ బ్యూటిఫుల్ ఫేస్’ పోటీలో షెల్బియా పాల్గొనడం ఇది నాలుగోసారి. 2017లో14వ స్థానం, 2018లో 3వ స్థానం, 2019లో రెండో స్థానంతో నిలిచిన ఆమె ఈసారి మాత్రం అగ్రస్థానంలో నిలవడం విశేషం. మరి ప్రపంచంలో ‘అత్యంత అందమైన ముఖం’ గలిగిన షెల్బియా అందమైన ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.