Photo: Screengrab
కంటికి కనిపించని కరోనా వైరస్ ఇప్పట్లో అంతమయ్యేలా లేదు. ఓవైపు వివిధ దేశాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ... మరోవైపు కొత్త రూపు దాల్చుకుని విరుచుకుపడుతోందీ మహమ్మారి. లక్షణాలు తెలియనివ్వకుండా, కొత్త కొత్త లక్షణాలతో ‘స్ట్రెయిన్’, ‘వేరియంట్’, ‘మ్యుటేషన్’ అంటూ అందరిలో గుబులు రేపుతోంది. దీంతో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఎంత అప్రమత్తంగా ఉంటున్నా సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారు. అదే సమయంలో సరైన మందు లేని ఈ మహమ్మారిని మనోధైర్యంతో జయిస్తున్నారు. సరైన సమయంలో చికిత్స తీసుకుని వైరస్‌పై విజయం సాధిస్తున్నారు. ఈక్రమంలో ప్రముఖ అమెరికన్ నటి ఎలెన్ డీజెనెరెస్ కొద్దిరోజుల క్రితం కొవిడ్ బారిన పడ్డారు. ఇంట్లోనే చికిత్స తీసుకుని ఇటీవలే పూర్తిగా కోలుకున్నారు. ఈ సందర్భంగా కరోనాకు సంబంధించిన తన అనుభవాలను అందరితో షేర్ చేసుకునేందుకు ఇలా మన ముందుకు వచ్చారు.
నేనూ కరోనా బారిన పడ్డాను!
62 ఏళ్ల ఎలెన్‌కు అమెరికన్ సినిమా ఇండస్ట్రీలో బహుముఖ ప్రజ్ఞాశాలి అనే పేరుంది. నటిగా, కమెడియన్‌గా, టీవీ వ్యాఖ్యాతగా, రచయితగా, నిర్మాతగా... ఇలా అన్ని రంగాల్లో సత్తా చాటారామె. ఇక ‘ఎలెన్ డీజెనెరెస్’ అనే కామెడీ టాక్ షో ద్వారా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన ఆమె... తన రిలేషన్షిప్ విషయంలోనూ అందరి నోళ్లలో నానారు. అమెరికన్-ఆస్ట్రేలియన్ మోడల్ అయిన పోర్షియా డే రోసీతో నాలుగేళ్లు డేటింగ్ చేసి వార్తల్లో నిలిచిన ఎలెన్.. 2008లో ఆమెతో కలిసి పెళ్లిపీటలెక్కారు. ఇలా అమెరికన్ సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఎలెన్ గతేడాది డిసెంబర్లో కరోనా బారిన పడ్డారు. ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండి మెరుగైన వైద్యం తీసుకున్న ఆమె.. కొద్ది రోజుల క్రితమే కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో మళ్లీ ‘ఎలెన్ డీజెనెరెస్’ షో హోస్టింగ్ బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఈ ఏడాది ప్రారంభమైన మొదటి ఎపిసోడ్లో తన కరోనా అనుభవాలేంటో అందరితో చెప్పుకొచ్చారు.
అతనలా చెప్పగానే అందరూ దూరంగా వెళ్లిపోయారు!
‘గతేడాది డిసెంబర్లో నేను ఓ టీవీ షో షూటింగ్‌కు హాజరయ్యాను. అక్కడ నా హెయిర్ డ్రస్సర్, మేకప్ ఆర్టిస్టులందరూ నా చుట్టూ నిలబడి నన్ను ముస్తాబు చేస్తున్నారు. నేను మరింత అందంగా కనిపించేందుకు ఓ ఆర్టిస్ట్ నా ముఖంపై పౌడర్ అద్దుతుండగా సడెన్‌గా నా అసిస్టెంట్ క్రెయిగ్ షూటింగ్ స్పాట్‌కు వచ్చాడు. ‘మేడమ్.. మీకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది’ అని చెప్పాడు. దీంతో అప్పటివరకు నా చుట్టూ ఉన్న వాళ్లందరూ వెంటనే నా నుంచి దూరంగా వెళ్లిపోయారు. కొవిడ్ అంటే వారికున్న భయమే వారితో అలా చేయించిందని నాకు అర్థమైంది. అలా నానుంచి దూరంగా వెళ్లిపోయిన వారిలో కొందరు మళ్లీ ఇప్పటివరకు నా ముందుకు రాలేదు(నవ్వుతూ).’
రోజులో 16 గంటలు నిద్రలోనే ఉండిపోయాను!
‘నాకు కరోనా సోకిందన్న విషయం తెలిసిన వెంటనే స్టూడియో నుంచి నేరుగా ఇంటికి వెళ్లిపోయాను. మా సేఫ్టీ కొవిడ్ టీం ఈ విషయాన్ని అందరికీ చేరవేసింది. నన్ను కలిసిన వారందరూ కరోనా నిర్ధారిత పరీక్షలు చేయించుకోవాలని, కొద్ది రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని సూచించారు. దీంతో వెంటనే సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లిపోయాను. ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ పోర్షియాకు దూరంగా వేరే గదిలో ఉండిపోయాను. అప్పటినుంచి మొదటి మూడు రోజులు గది నుంచి అసలు బయటికి రాలేదు. రోజులో కనీసం 16 గంటల పాటు నిద్రలోనే ఉండిపోయాను. అలా కొత్త బెడ్‌పై ఎక్కువ సేపు నిద్రపోవడంతో కండరాల నొప్పులు మొదలయ్యాయి. దీంతో పాటు వెన్నునొప్పి నన్ను తీవ్రంగా బాధించింది. వైద్యులు కొన్ని రకాల నొప్పి నివారణ మాత్రలు ఇచ్చినా ఫలితం లేకపోయింది. వెన్ను నొప్పి మరింత ఎక్కువైంది. బాధను భరించలేక ఓ సమయంలో నా పక్కటెముకలన్నీ విరిగిపోయాయేమో అనిపించింది. చివరకు కొన్ని స్టెరాయిడ్లు తీసుకున్నాను. అవి బాగా పనిచేశాయి. కండరాల నొప్పులు, వెన్నునొప్పి క్రమంగా తగ్గిపోయాయి. వీటితో పాటు డాక్టర్లు సూచించిన మందులు క్రమం తప్పకుండా తీసుకున్నాను. అయితే ఇక్కడ మీకో విషయం చెప్పాలి.. నా వెన్నునొప్పి తగ్గించుకోవడానికి మాత్రమే నేను స్టెరాయిడ్లను తీసుకున్నాను. అంతేకానీ కరోనా నుంచి కాపాడుకోవడానికి ఇవి ప్రత్యామ్నాయ మందులు కావు’.
వెన్నునొప్పి కూడా ఒక లక్షణమే!
‘నేను సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నప్పుడు కరోనా ప్రాథమిక లక్షణాలైన దగ్గు, జ్వరం, తలనొప్పి, జలుబు ఏవీ నాలో కనిపించలేదు. కేవలం వెన్నునొప్పి మాత్రమే నన్ను బాగా బాధించింది. కరోనా బారిన పడిన మా స్నేహితుల్లో కొందరు కూడా ఇలాగే వెన్నునొప్పి/నడుంనొప్పితో అల్లాడిపోయారు. దీంతో ఇది కూడా ఒక కొవిడ్ లక్షణమే అని నాకు అర్థమైంది. అలాగని వెన్నునొప్పి వచ్చిన వారందరూ కరోనా బాధితులు కారు’.
అది ఇప్పటికీ ఓ మిస్టరీనే!
‘నేను నిత్యం మాస్క్ ధరిస్తాను. క్రమం తప్పకుండా చేతులు శుభ్రం చేసుకుంటాను. డోర్ హ్యాండిల్స్ ముట్టుకున్నప్పుడల్లా చేతులు శానిటైజ్ చేసుకుంటాను. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ఇంకా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాను. అయినా కరోనా నా దగ్గరకు వచ్చింది. అది ఎక్కడ, ఎలా, ఏవిధంగా నాకు సోకిందో నాకు తెలియడం లేదు. అది ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. భగవంతుడి ఆశీర్వాద బలంతో నేను మళ్లీ ఇలా మీ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం నాలాగే ఎంతోమంది కరోనా బారిన పడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ దేవుడు కరోనాను జయించే శక్తి సామర్థ్యాలను వారందరికీ అందించాలని నేను ఆకాంక్షిస్తున్నాను!’ అంటూ తన కరోనా అనుభవాల గురించి చెప్పుకొచ్చారు ఎలెన్.