కరోనా వచ్చిన దగ్గర్నుంచి అందరిలో ఆరోగ్య స్పృహ పెరిగింది. ఈ క్రమంలో ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి తీసుకునే ఆహారం దగ్గర్నుంచి చేసే పనుల దాకా ప్రతి విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే గార్డెనింగ్‌కి ఆదరణ పెరిగింది. సామాన్యుల దగ్గర్నుంచి సెలబ్రిటీల దాకా సహజ పద్ధతుల్లో కాయగూరలు పండించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. అందులోనూ ఎలాంటి మట్టి ఉపయోగించకుండా కేవలం నీటితోనే మొక్కల్ని పెంచే హైడ్రోపోనిక్ గార్డెనింగ్‌కి ఓటేస్తున్నారు. తాను కూడా ఇలాంటి పద్ధతిలోనే తన ఇంట్లో మొక్కల్ని పెంచుకుంటున్నానని చెబుతోంది బాలీవుడ్ ఫిట్నెస్ ఫ్రీక్ శిల్పాశెట్టి. ఈ క్రమంలోనే ఇటీవల తన హైడ్రోపోనిక్ గార్డెన్‌కి సంబంధించిన ఓ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది శిల్ప. ఇక మొన్నటికి మొన్న అలనాటి అందాల తార సుహాసిని కూడా తన హైడ్రోపోనిక్ గార్డెన్‌ని తన ఫ్యాన్స్‌కి పరిచయం చేసింది. వీళ్లే కాదు.. ఇంకొందరు ముద్దుగుమ్మలు కూడా ఈ సరికొత్త గార్డెనింగ్ ట్రెండ్‌ని తమ లైఫ్స్టైల్లో భాగం చేసుకొని అందరిలో ఆరోగ్య స్పృహ పెంచుతున్నారు. మరి, వాళ్లెవరో చూసేద్దామా..?!
ఆరోగ్యం, ఫిట్నెస్.. వంటి విషయాల్లో శ్రద్ధ వహించే అందాల తారల్లో శిల్పాశెట్టి ముందు వరుసలో ఉంటుంది. ఈ క్రమంలోనే తాను తయారుచేసే ఆరోగ్యకరమైన వంటకాలు, చేసే వ్యాయామాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటుంది శిల్ప. ఇప్పటికే తన అవుట్డోర్ గార్డెన్‌ని తన ఫ్యాన్స్‌కి పరిచయం చేసిన శిల్ప.. ఈసారి హైడ్రోపోనిక్ గార్డెనింగ్‌తో మన ముందుకొచ్చింది. దానికి సంబంధించిన ఓ వీడియోను ఇటీవలే ఇన్‌స్టాలో పోస్ట్ చేసిందీ యమ్మీ మమ్మీ.
25 రోజుల్లోనే నా సలాడ్ రడీ!
తన హైడ్రోపోనిక్ గార్డెనింగ్‌ని పరిచయం చేస్తూ రూపొందించిన వీడియోను ఇన్‌స్టాలో పంచుకున్న శిల్ప.. ‘మా ఇంటి ఆవరణలో సాగు చేస్తోన్న హైడ్రోపోనిక్ ఫామ్ ఇది. దీని ద్వారా 25 రోజుల్లోనే మా సలాడ్లోకి కావాల్సిన ఆకుకూరల్ని మేము పండించుకోగలుగుతున్నాం. పుదీనా, పాలకూర, తులసితో పాటు ఇతర ఆకుకూరలన్నీ మా ఈ ఫామ్‌లో పెంచుకుంటున్నాం. మన తపన ఫలప్రదమైతే సొంతమయ్యే సంతోషం బహుశా ఇలాగే ఉంటుందేమో! హైడ్రోపోనిక్ గార్డెనింగ్ గురించి అవగాహన లేని వారందరికీ నేను చెప్పదలచుకున్నది ఒక్కటే.. ఎలాంటి మట్టి ఉపయోగించకుండా, ఖనిజ లవణాలు పుష్కలంగా లభించే నీటిని ఉపయోగించి ఈ పద్ధతిలో కాయగూరల్ని సాగు చేస్తారు. తక్కువ స్థలంలో ఎక్కువ కాయగూరల్ని, ఆకుకూరల్ని సాగు చేసుకోవడానికి అనువైన ఈ పద్ధతి ద్వారా పండించిన పదార్థాలన్నీ ఆరోగ్యకరమైనవే! కాబట్టి మీరు కూడా ఈ పద్ధతి ద్వారా మీకు కావాల్సిన ఆహారాన్ని మీరే పండించుకోండి..’ అంటూ ఆరోగ్యం విషయంలో తన ఫ్యాన్స్‌ని మరోసారి అలర్ట్ చేస్తోంది శిల్ప.
నీటి వృథాను అరికట్టడానికే..!
మట్టి లేకుండా తక్కువ నీటితో, సహజ పద్ధతుల్లో మొక్కలను పెంచడం వెనకున్న ఆనందం మాటల్లో చెప్పలేనంటున్నారు అలనాటి అందాల తార సుహాసిని. తాను ఎన్నో ఏళ్లుగా టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నా.. ఇటీవలే హైడ్రోపోనిక్స్ విధానంలో మొక్కల్ని పెంచడం అలవాటు చేసుకున్నానంటున్నారామె.
‘కరోనా కారణంగా చాలా సమయం దొరికింది. దాంతో రోజంతా మొక్కల మధ్యే గడిపేదాన్ని. అలా ఎక్కువ మొక్కలను కూడా పెంచాను. హైడ్రోపోనిక్స్ విధానంలో టొమాటోలు, చిక్కుళ్లు, వంకాయ, కొత్తిమీర, కీరా, పచ్చిమిర్చి, దోస, పుదీనా, ఆకుకూరలు.. వంటివన్నీ పెంచుతున్నా. వీటి కోసం వాడే ఎరువును కూడా వంటగదిలోని వ్యర్థాల నుంచి స్వయంగా తయారుచేస్తాను. నాకేదైనా సందేహం వస్తే వ్యవసాయ శాఖలో పనిచేసే స్నేహితులను అడిగి తెలుసుకుంటాను. సహజ పద్ధతిలో పెంచిన తోట నుంచి కోసి, వండుకోవడం వల్ల వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేను. అయితే ఈ విధానంలో ఖర్చు కాస్త ఎక్కువే అయినా.. మట్టి లేకుండా, తక్కువ నీటితో మొక్కలను పెంచచ్చు. మా వారికి ఇక్కడ పండించే ఆకుకూరలంటే చాలా ఇష్టం..’ అంటూ తన గార్డెనింగ్ గురించి చెబుతున్నారు సుహాసిని.
మన జీవితాన్ని మార్చే అలవాటిది!
కరోనా ప్రతికూల పరిస్థితుల్లో ఆరోగ్యం విలువేంటో తెలిసిందంటోంది అక్కినేని వారి కోడలు పిల్ల సమంత. ఈ క్రమంలోనే తానే స్వయంగా తనకు కావాల్సిన కాయగూరలు, ఆకుకూరలను పండించుకోవడం మొదలుపెట్టింది. మట్టితోనే కాదు.. మట్టి లేకుండా హైడ్రోపోనిక్స్ విధానంలోనూ వ్యవసాయం చేయడం ప్రారంభించింది సామ్. అంతేకాదు.. తన ఈ ప్రయాణాన్ని పలు సందర్భాల్లో ఫొటోలు, వీడియోల రూపంలోనూ తన ఫ్యాన్స్‌తో పంచుకుందీ ముద్దుగుమ్మ.
‘మనం తినే ఆహారం మనమే పండించుకుంటున్నామన్న ఆలోచనే ఎంతో గొప్పగా అనిపిస్తోంది. అందుకే ఈ క్రమంలో మిమ్మల్నీ పాలు పంచుకోమని కోరుతున్నా. ఇలా ఈ జర్నీలో మిమ్మల్ని భాగం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.. రండి.. అందరం కలిసి మొక్కలు పెంచుదాం.. ఇందుకోసం కుండీ, మట్టి, విత్తనాలు, ఖాళీ పాల ప్యాకెట్ లేదంటే హైడ్రోపోనిక్ హోమ్‌కిట్.. వంటివి ఉంటే చాలు. ఈజీగా మొక్కలు పెంచుకోవచ్చు. ఈ అలవాటు మన జీవితంలో మార్పులు తీసుకొస్తుంది..’ అంటూ #GrowWithMe అనే హ్యాష్‌ట్యాగ్ వేదికగా అందరూ గార్డెనింగ్‌లో భాగమవ్వాలని కోరుతోందీ చక్కనమ్మ. ఈ క్రమంలో తన హైడ్రోపోనిక్ గార్డెనింగ్ విశేషాలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టా వేదికగా పంచుకుంటూ తన అభిమానులకు గార్డెనింగ్ టిప్స్‌ని కూడా అందిస్తోంది సామ్.
ఆరోగ్యాన్ని అందించే ఔషధాలివి!
అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ కూడా హైడ్రోపోనిక్స్ విధానంలో మొక్కల్ని పెంచుతోంది. ఈ క్రమంలో సామ్ విసిరిన #GrowWithMe ఛాలెంజ్‌ని స్వీకరించిన ఈ పంజాబీ బ్యూటీ.. తన హోమ్ గార్డెన్‌ని ఓ వీడియో రూపంలో ఫ్యాన్స్‌కి పరిచయం చేసింది.
‘ఈ విత్తనాలు మొక్కలుగా ఎదగడం చూస్తుంటే ముచ్చటేస్తోంది. మనకు ఆరోగ్యాన్ని అందించే అద్భుత ఔషధాలివి. మీ శరీర అవసరాలకు తగినట్లుగా మీకు మీరే ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోవచ్చు..’ అంటూ ఎవరి ఆహారాన్ని వారు తయారుచేసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చెప్పుకొచ్చింది రకుల్.
అది మనకు మాత్రమే తెలుసు!
ఇక సామ్ విసిరిన ఇదే ఛాలెంజ్‌ని స్వీకరించిన మంచు లక్ష్మి తన హైడ్రోపోనిక్ గార్డెన్‌ని మనందరికీ పరిచయం చేసింది. తన కూతురు విద్యా నిర్వాణతో కలిసి గార్డెనింగ్ చేస్తోన్న వీడియోను ఇన్‌స్టాలో పంచుకుంటూ.. ‘నేను, నా కూతురు గార్డెనింగ్‌లో బిజీగా ఉన్నాం. మొక్కలు మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ఓ వైపు ప్రాణ వాయువును అందిస్తున్నాయి. మరోవైపు ఆహారపు వనరుగా వినియోగపడుతున్నాయి. మన శరీరానికి నప్పే ఆహారమేంటో మనకు మాత్రమే తెలుసు. అలాగే ఈ ప్రతికూల పరిస్థితులు మన ఆరోగ్యం, హెల్దీ లైఫ్‌స్టైల్ గురించి మనకు బోలెడన్ని పాఠాలు నేర్పించాయి. ఏది లేకపోయినా బతకొచ్చేమో గానీ ఆహారం లేకపోతే బతకలేం. అందుకే నా ఆహారాన్ని నేను పండించుకుంటున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది..’ అంటోందీ మంచువారి ఆడపడుచు.
ఆ పాఠాలు అమ్మ దగ్గర్నుంచే నేర్చుకున్నా!
హైడ్రోపోనిక్స్ విధానంలో మొక్కల్ని పెంచడం నేర్చుకుంది బాలీవుడ్ బబ్లీ గర్ల్ భూమి పెడ్నేకర్. దీని గురించి ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ‘హైడ్రోపోనిక్స్ విధానంలో మొక్కల్ని పెంచాలని నాకు, మా అమ్మకు ఎప్పట్నుంచో ఆశ. అది ఇన్నాళ్లకు నెరవేరింది. ఈ క్రమంలో మన ఆహారాన్ని మనమే పండించుకోవచ్చు. మన శరీరానికి నప్పే కాయగూరల్ని, ఆకుకూరల్ని మనమే సాగు చేసుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవచ్చు. ఈ హైడ్రోపోనిక్ గార్డెనింగ్ పాఠాల్ని నేను మా అమ్మ దగ్గర్నుంచే నేర్చుకున్నా..’ అంటూ తన గార్డెనింగ్ సంగతులేంటో చెప్పుకొచ్చింది భూమి.
హైడ్రోపోనిక్స్ అంటే..?!

ఇలా పలువురు ముద్దుగుమ్మలు హైడ్రోపోనిక్స్ విధానంలో సహజసిద్ధంగా వ్యవసాయం చేస్తూ తమ ఫ్యాన్స్‌లోనూ స్ఫూర్తి నింపుతున్నారు. అయితే ఈ క్రమంలో ఈ గార్డెనింగ్ ట్రెండ్ గురించి చాలామంది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఈ పద్ధతి కరోనా కాలంలోనే ట్రెండ్ అయిందని చెప్పుకోవాలి. మట్టి ఉపయోగించకుండా ఖనిజ లవణాలు సమృద్ధిగా లభించే నీటితో వ్యవసాయం చేయడమే హైడ్రోపోనిక్స్ ముఖ్యోద్దేశం. తక్కువ స్థలంలో, తక్కువ సమయంలో ఎక్కువ మొక్కల్ని సాగు చేయడానికి అనువైన పద్ధతి ఇది అని చెబుతున్నారు నిపుణులు. అయితే ఈ క్రమంలో పెంచే మొక్కలకు కాస్త ఎండ తగిలేలా అమర్చడం కూడా ముఖ్యమేనంటున్నారు. అలాగే ఈ పద్ధతిలో మట్టికి బదులుగా పీట్, కాయిర్.. వంటి సహజసిద్ధమైన పదార్థాలను సైతం ఉపయోగించచ్చు. హైడ్రోపోనిక్స్ విధానంలో మొక్కల్ని పెంచడానికి ఎలాగూ మట్టి ఉపయోగించం కాబట్టి చీడపీడల బాధ కూడా ఉండదు.
|