ప్రేమించి పెళ్లి చేసుకున్న బాలీవుడ్ జంటల్లో కాజోల్-అజయ్ దేవ్‌గణ్ జోడీ కూడా ఒకటి. వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి సుమారు రెండు దశాబ్దాలకు పైగా గడిచినా..ఎంతో అన్యోన్యంగా ఉంటూ నేటి తరం జంటలకు ఆదర్శంగా నిలుస్తుంటారీ లవ్లీ కపుల్. ఇక గతేడాది ‘తానాజీ... ది అన్ సంగ్ వారియర్’ సినిమాలో కలిసి నటించిన వీరిద్దరూ... ఆన్ స్ర్కీన్... ఆఫ్ స్ర్కీన్ ఎక్కడైనా తమది ‘పర్ఫెక్ట్ జోడీ’ అని మరోసారి నిరూపించుకున్నారు. ఇలా ఓవైపు తల్లిగా తన ఇద్దరు పిల్లల ఆలనాపాలన చూసుకుంటూనే ... మరోవైపు నటిగా వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తోంది కాజోల్. ఈ క్రమంలో ఆమె నటించిన తాజా చిత్రం ‘త్రిభంగ’ జనవరి 15 న నెట్‌ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా తన వృత్తిగత, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను అందరితో షేర్ చేసుకుంది.
1992లో ‘బేఖుడి’ సినిమాతో వెండితెరకి పరిచయం అయిన కాజోల్ తన రెండో సినిమా ‘బాజీగర్’తోనే ప్రశంసలు అందుకుంది. ఇక ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమాలోని ‘సిమ్రన్’ పాత్రతో యువత కలల రాకుమారిగా మారిపోయిందీ ముద్దుగుమ్మ. ఇవే కాదు ‘కుచ్ కుచ్ హోతా హై’, ‘కభీ ఖుషి కభీ గమ్’, ‘ప్యార్ తో హోనా హై థా’, ‘యే దిల్ లగీ’, ‘దిల్ క్యా కరే’, ‘హమ్ ఆప్కే దిల్ మే రెహ్తే హై’, ‘ఫనా’, ‘మై నేమ్ ఈజ్ ఖాన్’, ‘దిల్ వాలే’ తదితర హిట్ చిత్రాల్లో నటించి బాలీవుడ్ ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఈ క్రమంలో 1994లో విడుదలైన ‘గుండారాజ్’ సినిమా షూటింగ్లో అజయ్‌తో ప్రేమలో పడిన కాజల్...ఐదేళ్ల తర్వాత 1999లో అతనితో కలిసి పెళ్లిపీటలెక్కింది. 22 ఏళ్ల అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా వీరికి నైసా, యుగ్ అనే ఇద్దరు పిల్లలున్నారు.
నా పెళ్లికి నాన్న ఒప్పుకోలేదు!
అజయ్‌తో పెళ్లిపీటలెక్కేటప్పటికి కాజోల్ వయసు కేవలం 24 ఏళ్లే. అప్పటికి బాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళుతోన్న ఆమె వివాహానికి తన తండ్రి (షోము ముఖర్జీ) అస్సలు ఒప్పుకోలేదట.
‘నా నిజ జీవితంలో ఆడ-మగ అనే లింగ భేదం లేకుండానే పెరిగాను. ఇక నేను పెరిగిన వాతావరణంలో పితృస్వామ్యాన్ని ఎదిరించే అవసరం రాలేదు. కానీ నా 24 వ ఏటనే అజయ్‌తో పెళ్లి అని చెప్పినప్పుడు మాత్రం నాన్న నా నిర్ణయాన్ని వ్యతిరేకించారు. నటిగా మంచి విజయాలతో దూసుకుపోతున్న తరుణంలో ఇలాంటి నిర్ణయాలతో కెరీర్ పాడుచేసుకోవద్దని హెచ్చరించారు. పెళ్లి నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని మందలించారు. ఈ డిస్కషన్ జరిగిన తర్వాత నాలుగు రోజుల వరకు నాన్న నాతో మాట్లాడలేదు. అయితే మా అమ్మ తనూజ మాత్రం నా అభిప్రాయానికి మద్దతు పలికింది. నీకు మనసులో ఏది అనిపిస్తుందో అదే చెయ్యమని ఆమె చెప్పిన మాటలు నా జీవితాంతం గుర్తుంటాయి. అమ్మ ఒక్కర్తే కాదు.. నా చుట్టుక్కల ఉన్నవారు సైతం నా నిర్ణయానికి మద్దతు పలికారు. దీంతో నేను కోరుకున్నట్లే అజయ్‌ను వివాహమాడాను’ అని పెళ్లి నాటి జ్ఞాపకాలను గుది గుచ్చిందీ ముద్దుగుమ్మ.
వారిద్దరి ప్రేరణతోనే స్వతంత్రంగా ఎదిగాను!
ఇక ‘త్రిభంగ’ సినిమా విషయానికొస్తే... మూడు తరాల మహిళల మధ్య చోటు చేసుకున్న ఓ కుటుంబ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. రేణుకా సహానే తెరకెక్కించిన ఈ సినిమాలో కాజోల్‌తో పాటు మిథిలా పాల్కర్, తన్వీ అజ్మీ తదితర ప్రముఖులు నటిస్తున్నారు. ఇందులో అను అనే ఒడిస్సీ నృత్య కళాకారిణిగా కనిపించనుంది కాజోల్.
ఈ సందర్భంగా సినిమా గురించి మాట్లాడుతూ- ‘నేను ఈ సినిమా చేసేటప్పుడు నా నిజ జీవితం గుర్తుకు వచ్చింది. నా చిన్నతనంలోనే అమ్మానాన్నలు విడిపోయారు. దీంతో నేను ఎక్కువగా అమ్మమ్మ శోభన సమర్థ్ దగ్గరే పెరిగాను. నా జీవితంలో స్వతంత్రంగా ఉండేందుకు అమ్మ, అమ్మమ్మలు అందించిన ప్రేరణే కారణం. వారిద్దరూ ఎంతో ఆత్మాభిమానం గల మనుషులు. ఇక మమ్మల్ని చూసి నా కూతురు నైసా కూడా ఇదే అలవర్చుకుంది. ఇక ఈ సినిమాలో నా క్యారక్టర్ విషయానికొస్తే... ప్రేమను, ద్వేషాన్ని, అలవాట్లను చాలా లోతుగా చూసే పాత్ర నాది. మూడు తరాల మహిళల మధ్య చోటు చేసుకున్న సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది’ అని చెప్పుకొచ్చింది కాజోల్.