ప్రతి స్త్రీ తన జీవితంలో మాతృత్వపు మధురిమల్ని ఆస్వాదించాలని కోరుకుంటుంది. అయితే మారుతున్న జీవనశైలి, ప్రత్యుత్పత్తి వ్యవస్థలో లోపాలు, ప్రెగ్నెన్సీని వాయిదా వేయడం.. వంటి పలు కారణాలతో కొంతమంది మహిళలు అమ్మతనానికి దూరమవుతున్నారు. దీంతో అలాంటి వారు అనాథ చిన్నారులను దత్తత తీసుకుని అమ్మగా ప్రమోషన్ పొందుతున్నారు. వీరితో పాటు అప్పటికే పిల్లలున్నా-లేకపోయినా, వివాహం చేసుకున్నా-చేసుకోకపోయినా కొంతమంది మహిళలు సామాజిక దృక్పథంతో అనాథ పిల్లలను దత్తత తీసుకుంటున్నారు. ఓవైపు అమ్మతనాన్ని ఆస్వాదిస్తూనే.. మరోవైపు ఆ చిన్నారులకు బంగారు భవిష్యత్తును అందిస్తున్నారు. అలాంటి వారిలో ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ ఒకరు. రెండు పదులు వయసులో.. అది కూడా పెళ్లి కాకుండానే ఇద్దరు అనాథ బాలికలను అక్కున చేర్చుకుందీ అందాల తార. ఈ సందర్భంగా పిల్లల్ని దత్తత తీసుకోవడం, వారి పెంపకం విషయంలో తాను ఎదుర్కొన్న అనుభవాలను తాజాగా అందరితో షేర్ చేసుకుందీ ముద్దుగుమ్మ.
20 ఏళ్ల వయసులోనే..!
‘బంగారు బుల్లోడు’, ‘ఆకాశ వీధిలో’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’.. వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది రవీనా టాండన్. 90వ దశకంలో తన అందం, అభినయంతో బాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరిగా గుర్తింపు పొందింది. అయితే తన 20 ఏళ్ల వయసులో.. అప్పటికింకా బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదుగుతున్న రవీనా.. ఛాయ, పూజ అనే ఇద్దరు అనాథలను అక్కున చేర్చుకుంది. ఈ క్రమంలో పెళ్లి కాకుండానే ఇద్దరు అనాథ పిల్లలకు అమ్మగా మారి అందరినీ ఆశ్చర్యపరిచిందామె. అయితే పిల్లలను దత్తత తీసుకున్నప్పుడు తనపై పలు విమర్శలు వచ్చాయంటోంది రవీనా. ఈ సందర్భంగా దత్త పుత్రికల పెంపకం విషయంలో తనకెదురైన అనుభవాలను తాజాగా అందరితో పంచుకుంది.
నాకు పెళ్లి కాదని భయపెట్టారు!
‘నా 21వ ఏట.. 1995లో ఇద్దరు అనాథ బాలికలను దత్తత తీసుకుని వారికి తల్లిగా మారాను. అప్పటికి నేను ఇంకా బాలీవుడ్లో పూర్తిగా నిలదొక్కుకోలేదు. దీంతో ఆ సమయంలో నా నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. పూజ, ఛాయలను దత్తత తీసుకున్నప్పుడు చాలామంది నా నిర్ణయాన్ని ప్రశ్నించారు. పలు అనుమానాలు రేకెత్తించారు. ఇంత చిన్న వయసులో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అంత శ్రేయస్కరం కాదన్నారు. దీని ఫలితంగా నా సినిమా కెరీర్ ముగిసిపోతుందని.. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకురారని భయపెట్టారు. అయితే చాలామంది అనుకున్నట్లు పిల్లల దత్తత నా వృత్తిగత, వ్యక్తిగత జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపలేదు. పైగా నా జీవితంలో నేను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాల్లో ఇది ఒకటి’.
వారే నన్ను పెళ్లి మండపానికి తీసుకొచ్చారు!
‘పూజ, ఛాయ.. ఇద్దరూ దేవుడు నాకిచ్చిన వరాల మూటలు. మొదటిసారిగా వారిని నా చేతుల్లోకి తీసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు వారితో గడిపిన ప్రతిక్షణం నా జీవితంలో ఓ మధురమైన జ్ఞాపకం. నా బిడ్డలిద్దరికి సంబంధించిన ప్రతి సందర్భాన్నీ నేను బాగా ఆస్వాదించాను. ప్రత్యేకించి నా వివాహ సమయంలో ఇద్దరు నా పక్కన నిల్చుని నన్ను పెళ్లి మండపానికి తీసుకొచ్చారు. పెళ్లికి ముందే ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకున్నందుకు చాలామంది నాకు పెళ్లి కాదన్నారు.. కానీ ఇలా ఆ దేవుడు నన్ను గొప్పగా ఆశీర్వదించాడు. ఎంతో ఉన్నత స్థితిలో నిలబెట్టాడు’ అని చెప్పుకొచ్చిందీ అందాల తార.
అమ్మమ్మ హోదాలో!
దత్త పుత్రికల ఆలనాపాలన చూసుకుంటూనే 2004లో అనిత్ తడానీ అనే వ్యాపార వేత్తను వివాహం చేసుకుంది రవీనా. తర్వాత రవా, రణ్‌బీర్ వర్ధన్ అనే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. అయినా తన దత్త పుత్రికల బాధ్యతలను విస్మరించలేదీ అందాల తార. తల్లిగా వారిద్దరికీ బంగారు భవిష్యత్తును అందజేసి వారిని ఉన్నత స్థితిలో నిలబెట్టింది. ఘనంగా పెళ్లిళ్లు చేసింది. ప్రస్తుతం ఛాయ ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తుండగా, పూజ ఈవెంట్ మేనేజర్‌గా స్థిరపడింది. కొన్ని నెలల క్రితం ఛాయ ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో అమ్మమ్మ హోదాను కూడా అందుకుందీ అందాల తార.
ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రవీనా ‘కేజీఎఫ్-2’ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.