Photos: Instagram
పూజా కుమార్...‘విశ్వరూపం’ సిరీస్‌లో కమల్ హాసన్‌తో పోటీపడి నటించి మంచి మార్కులు కొట్టేసిన హీరోయిన్. తెలుగులో నటించింది కొన్ని చిత్రాల్లో అయినా తన అందం, అభినయంతో టాలీవుడ్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుందీ అందాల తార. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషా సినిమాల్లోను నటించిన ఈ ముద్దుగుమ్మ తన నటనతో అక్కడి ప్రేక్షకుల మెప్పు కూడా పొందింది. ఈక్రమంలో సుమారు రెండేళ్లుగా సిల్వర్ స్ర్కీన్‌పై కనిపించని ఈ అందాల భామ అమ్మగా ప్రమోషన్ పొందింది. తన భర్త విశాల్జోషితో కలిసి ప్రస్తుతం అమెరికాలో ఉంటోన్న ఆమె ఇటీవల ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా సోషల్ మీడియా వేదికగా తన కూతురును ప్రపంచానికి పరిచయం చేసిందీ అందాల తార.

‘విశ్వరూపం’తో గుర్తింపు..
అమెరికాలోని మిస్సోరిలోని సెయింట్ లూయిస్‌లో జన్మించిన పూజ అక్కడే పెరిగింది. ఆమె తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడ్డ ప్రవాస భారతీయులు. అమెరికాలో పుట్టి పెరిగినప్పటికీ భరతనాట్యం, కథక్, కూచిపుడిలో ఎంతో ప్రావీణ్యం సంపాదించింది. ఈ క్రమంలో మోడలింగ్‌లో అడుగుపెట్టి 1995లో ‘మిస్ ఇండియా యూఎస్ఏ’ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఇండియా వచ్చిన ఆమె 2000లో ‘కాదల్ రోజావే’ అని తమిళ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యింది. ఆ తర్వాత కొన్ని మలయాళ, హిందీ, ఇంగ్లిష్, చిత్రాల్లో నటించింది. అయితే కమల్‌తో చేసిన ‘విశ్వరూపం’ చిత్రం తనకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. 2013లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ థ్రిల్లర్ సినిమాలో ‘డాక్టర్ నిరూపమా విశ్వనాథ్’ పాత్రకు ప్రాణం పోసి పలువురి ప్రశంసలు అందుకుంది. ఈక్రమంలో తన అభినయాన్ని మెచ్చుకున్న కమల్ ‘విశ్వరూపం-2’, ‘ఉత్తమ విలన్’ సినిమాల్లో కూడా తనకే హీరోయిన్గా అవకాశం కల్పించాడు. తెలుగులో రాజశేఖర్ సరసన నటించిన ‘పీఎస్వీ గరుడవేగ’ కూడా ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇక ‘మ్యాన్ ఆన్ ఎ లెడ్జ్’, ‘బ్రాల్ ఇన్ సెల్ బ్లాక్ 99’, ‘ఎనిథింగ్ ఫర్ యు’ వంటి హాలీవుడ్ చిత్రాల్లోనూ నటించి మెప్పించిందీ ముద్దుగుమ్మ.

రహస్యంగా పెళ్లి!
ఇదిలా ఉంటే పూజ సిల్వర్ స్ర్కీన్‌పై కనిపించి సుమారు రెండేళ్లయింది. ఈక్రమంలోనే ప్రముఖ వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీ ‘జాయ్’ సీఈఓ విశాల్ జోషిని రహస్యంగా వివాహం చేసుకుందామె. భర్తతో కలిసి ప్రస్తుతం అమెరికాలో ఉంటోన్న పూజ ఇటీవల ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పాపకు ‘నవ్యా జోషి’ అని పేరుపెట్టుకున్న ఈ లవ్లీ కపుల్ తాజాగా తన కూతురును ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ సందర్భంగా తమ చిన్నారితో దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసుకున్న విశాల్ ‘ఒకప్పుడు మేము ఇద్దరం. కానీ ఇప్పుడు ముగ్గురమయ్యాం. మా చిన్నారి పాప నవ్యా జోషిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు ఎంతో సంతోషపడుతున్నాం. నేను కలలుగన్న జీవిత భాగస్వామిగా నా జీవితంలో ప్రవేశించినందుకు, లిటిల్ నవ్యను ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చినందుకు నీకు (పూజ) ధన్యవాదాలు. నా ఈ పుట్టినరోజుని మరింత మధురంగా మార్చావు. లవ్యూ బోత్ సో మచ్...’ అంటూ తన సతీమణి, కూతురుపై ప్రేమను కురిపించాడు.

ఈ సందర్భంగా తమ కూతురును పరిచయం చేస్తూ పూజ దంపతులు షేర్ చేసిన ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. పలువురు సెలబ్రిటీలతో పాటు అభిమానులు, నెటిజన్లు వారికి శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ క్యూట్ కపుల్ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.!!