కాస్త బొద్దుగా ఉన్న అమ్మాయిలు కనిపిస్తే చాలు..‘అబ్బ ఎంత లావుగా ఉందో... బరువు తగ్గి కొంచెం సన్నగా మారొచ్చు కదా! ’ అని కామెంట్ చేసేవారు, ఉచిత సలహాలు ఇచ్చేవారు చాలామందే ఉంటారు. కొన్ని నెలల క్రితం ఇలాంటి విమర్శలనే ఎదుర్కొంది మలయాళీ నటుడు మోహన్‌లాల్ కుమార్తె విస్మయ. సోషల్ మీడియాలో తన ఫొటోలు షేర్ చేసినప్పుడల్లా ‘స్టార్ హీరో కూతురేంటి ఇలా ఉంది’?అని చాలామంది నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు. ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం వరకు బొద్దుగా కనిపించిన ఈ స్టార్ కిడ్ ఇప్పుడు నాజుగ్గా మారిపోయింది. ఫిట్నెస్, మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్స్ దగ్గర కఠినమైన శిక్షణ తీసుకుని 22 కిలోల బరువు తగ్గిపోయింది. ఈ సందర్భంగా బొద్దుగుమ్మగా ఉన్న తాను ముద్దుగుమ్మగా ఎలా మారిందో, ఈ జర్నీలో తనకెదురైన అనుభవాలేంటో సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టిందీ అందాల తార. బరువు తగ్గడానికి తానెంత కష్టపడిందో చెబుతోన్న ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.
సన్నబడి ‘విస్మయ’పరిచింది!
మోహన్‌లాల్... భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా పేరు పొందిన ఈ నటుడి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక ఆయన కుమారుడు ప్రణవ్ మోహన్‌లాల్ కూడా తండ్రిలాగే హీరోగా రాణిస్తున్నాడు. అయితే వీరిద్దరికీ భిన్నంగా ఆన్‌స్ర్కీన్‌లో కాకుండా ఆఫ్‌స్ర్కీన్‌లో సత్తా చాటుతోంది ఆయన కూతురు విస్మయ. రైటర్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇందులో భాగంగా ఆమె రాసిన ‘గ్రెయిన్స్ ఆఫ్ స్టార్ డస్ట్’ అనే పుస్తకం త్వరలో మార్కెట్లోకి విడుదల కానుంది. ఇక మార్షల్ ఆర్ట్స్‌లోనూ విస్మయకు ఎంతో నైపుణ్యం ఉంది. థాయ్‌లాండ్‌లో నివసిస్తోన్న ఆమె కొన్ని నెలల క్రితం వరకు లావుగా, బొద్దుగా కనిపించేది. అయితే ఒక్కసారిగా సన్నబడి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చిందీ స్టార్ కిడ్. ఇందుకోసం తీవ్రంగా శ్రమించిన ఆమె ప్రత్యేక వ్యాయామాలు, మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంది. ఈ క్రమంలోనే 22 కిలోల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
అప్పటి నుంచే బరువు తగ్గాలనుకుంటున్నా!
తన వర్కవుట్కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేసుకుంటూ వస్తోన్న ఆమె తాజాగా మరో పోస్ట్ పెట్టింది. విపరీతమైన బరువున్న తన ఒకప్పటి ఫొటోకి, ప్రస్తుతం బరువు తగ్గిన తన ఫొటోని జత చేసి, దానితో పాటు తన మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్‌కు సంబంధించిన వీడియోలను అందరితో పంచుకుంది.
‘థాయ్‌లాండ్‌లో గడిపిన ప్రతి క్షణానికి ఇప్పుడు నేనెంతో సంతోషిస్తున్నాను. ఇక్కడి శిక్షణ బృందం చాలా మంచివారు. కొన్నేళ్ల క్రితం కొన్ని మెట్లు ఎక్కగానే ఊపిరాడక ఇబ్బంది పడేదాన్ని. అప్పటి నుంచే బరువు తగ్గాలనే ఆలోచనలో ఉన్నాను. ఇందులో భాగంగా మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుందామని కొన్ని నెలల క్రితం థాయ్‌లాండ్ వచ్చాను. అయితే మొదట్లో ఇక్కడకు వచ్చినప్పుడు అసలు నేను ఏం చేయాలో నాకే సరైన స్పష్టత లేదు. బరువు తగ్గి ఫిట్‌గా మారాలంటే ఎలాంటి వ్యాయామాలు చేయాలో నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుని 22 కిలోల బరువు తగ్గాను’..
ఈ క్రెడిట్ అంతా కోచ్‌దే!
‘ఇప్పుడు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ ఫ్యాట్ టు ఫిట్ ప్రయాణం బాగా నచ్చింది. ఇదంతా నా కోచ్ వల్లే సాధ్యమైంది. ట్రైనింగ్ విషయంలో ఆయన నాకెంతో సహాయం చేశారు. శిక్షణలో భాగంగా ఇది నేను చేయలేననే ఆలోచన నాకెన్నోసార్లు వచ్చింది. కానీ... ఆయన నా మీద నాకు నమ్మకం కలిగేలా చేశారు. నేను ఏదైనా చేయగలను అనేలా చేశారు. ప్రతిరోజూ నేను బెస్ట్ ఇచ్చేలా నన్ను ప్రోత్సహించారు. కేవలం బరువు తగ్గడానికే కాకుండా ఈ శిక్షణ నన్ను ఎన్నో విధాలుగా మార్చింది’ అని ఈ సందర్భంగా రాసుకొచ్చింది విస్మయ.
మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించింది!
ఈ సందర్భంగా విస్మయ షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. బరువు తగ్గేందుకు ఆమె పడిన కష్టాన్ని చూసి నెటిజన్లందరూ ఆమెను అభినందిస్తున్నారు. ‘సూపర్బ్ మేడమ్... మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించింది’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.