కరోనా కోరల్లో చిక్కుకుని ప్రపంచం విలవిల్లాడుతోంది. ఈ మహమ్మారి కారణంగా మనదేశంలో ఇప్పటివరకు లక్ష మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ఈ మహమ్మారి కాటుకు బలవుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను బలి తీసుకున్న ఈ వైరస్ తాజాగా మరో వర్ధమాన నటిని కబళించింది. పలు బాలీవుడ్ సీరియళ్లలో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దివ్యా భట్నాగర్ (34) కరోనాతో కన్ను మూసింది. కరోనాతో కొద్ది రోజుల క్రితం ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆమె కోలుకోలేక తుదిశ్వాస విడిచింది.
‘గులాబో’ పాత్రతో!
దిల్లీలో పుట్టి పెరిగిన దివ్య తండ్రి పేరు వినయ్ కుమార్ భట్నాగర్. తల్లి పేరు డాలీ భట్నాగర్. కాలేజీలో చదువుతున్నప్పుడే నటనపై ఆసక్తి పెంచుకుంది దివ్య. నాటకాలు వేస్తూ అందరినీ ఆకట్టుకుంది. ఆమెలోని నటనా ప్రతిభను గుర్తించిన నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా తనకు మరింత శిక్షణనిచ్చి ప్రోత్సహించింది. ఈ క్రమంలో 2006లో ‘చాంద్‌కే పార్ ఛలో’ అనే షోతో బుల్లితెరపై అడుగుపెట్టింది. 2009లో ‘యే రిష్తా క్యా కెహలాతా హై’ సీరియల్లో ఆమె పోషించిన ‘గులాబో’ పాత్ర హిందీ టీవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘తేరా యార్ యూ మై’, ‘ఉదాన్’, ‘విష్’, ‘సంస్కార్’, ‘శ్రీమాన్ శ్రీమతి ఫిర్సే’... తదితర సీరియల్స్, టీవీ షోలలో నటించి మెప్పించింది. ‘99’, ‘సప్నే సాకార్ కరో’ లాంటి బాలీవుడ్ చిత్రాల్లోనూ మెరిసిన ఆమె పలు కమర్షియల్ ప్రకటనల్లోనూ నటించింది. తన టిక్‌టాక్ వీడియోలతోనూ పలువురి అభిమానం సంపాదించుకుంది.
ఇక దివ్య వ్యక్తిగత జీవితానికి వస్తే... గగన్ అనే ఆర్టిస్ట్ మేనేజర్‌తో ప్రేమలో పడిన ఆమె ఐదేళ్ల క్రితం అతనితో కలిసి నిశ్చితార్థం జరుపుకొంది. అయితే వీరిద్దరివి వేర్వేరు కులాలు కావడంతో దివ్య తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో గతేడాది డిసెంబర్లో గురుద్వారా వేదికగా రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అయితే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో కొన్ని నెలల నుంచి విడివిడిగా ఉంటున్నారు.
పలు ఆస్పత్రులకు తిప్పినా!
కరోనా బారిన పడకముందు పలు సీరియల్ షూటింగ్‌లకు హాజరైంది దివ్య. ఈ క్రమంలో నవంబర్ 26న ఓ సీరియల్ షూటింగ్ మధ్యలోనే తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ముంబయిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. కొవిడ్ నిర్ధారిత పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. అదే సమయంలో న్యుమోనియా సోకడం, రక్తపోటు సమస్య రావడంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆక్సిజన్ లెవెల్స్ క్రమంగా పడిపోవడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం అందించేందుకు ఆమె కుటుంబ సభ్యులు పలు ఆస్పత్రులకు తిప్పారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.
నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి!
కరోనా కాటుతో 34 ఏళ్ల వయసులోనే కన్ను మూసింది దివ్య. ఆమె మరణం పట్ల బాలీవుడ్ తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేసింది. పలువురు నటీనటులు ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘యే రిష్తా క్యా కెహలాతా హై’ సీరియల్లో దివ్యతో కలిసి నటించిన డివోలినా భట్టాఛార్జీ ఆమెతో తనకున్న అనుబంధాన్ని సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసుకుంది. తనతో కలిసున్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ‘నీ జీవితం ఎన్నో ఒడిదొడుకులకు లోనైందని, ఎంతో బాధను భరించావని నాకు తెలుసు. అయితే ఇప్పుడు నువ్వు ఓ సురక్షితమైన ప్రదేశంలో ఉన్నావు. అక్కడ ఎలాంటి మోసాలు, బాధలు ఉండవు. కానీ నేను నిన్ను చాలా మిస్సవుతున్నాను. నేను నిన్ను ఎంతగా ప్రేమించానో నీకు మాత్రమే తెలుసు. నీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నాను. నువ్వు ఎక్కడున్నా చాలా సంతోషంగా ఉండాలి. ఇప్పుడు నువ్వు నన్ను వదిలిపెట్టి ఉండవచ్చు. కానీ నేను నిన్ను జీవితాంతం గుర్తుంచుకుంటాను’ అని భావోద్వేగంతో రాసుకొచ్చిందీ బుల్లితెర నటి. ఆమెతో పాటు ‘సిల్సిలా ప్యార్‌కా’ టీవీ షోలో తనతో స్ర్కీన్ షేర్ చేసుకున్న శిల్పా శిరోద్కర్ ఇన్‌స్టా వేదికగా ఆమెకు నివాళి అర్పించింది.