Photo: Instagram
సాధారణంగా తమ అభిమాన నటీనటుల గురించి వెతకడానికి అందరూ అంతర్జాలాన్నే ఆశ్రయిస్తారు. వారి వ్యక్తిగత, వృత్తిపరమైన వివరాలు, ఫొటోలు, వీడియోలు.. ఎలాంటి సమాచారం పొందాలనుకున్నా ఇంటర్నెట్లోనే శోధిస్తారు. ఈక్రమంలో 2020 సంవత్సరానికి సంబంధించి తమ ప్లాట్‌ఫాం వేదికగా ఎక్కువమంది వెతికిన ప్రముఖుల గురించిన జాబితాను విడుదల చేసింది ప్రముఖ సెర్చింజన్ సంస్థ ‘యాహూ’. ‘మోస్ట్ సెర్చ్డ్ ఇండియన్ సెలబ్రిటీస్ ఆఫ్ 2020’ పేరుతో విడుదలైన ఈ జాబితాలో దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అగ్రస్థానంలో నిలిచాడు. ఇక సుశాంత్ ఆత్మహత్య కేసు, డ్రగ్స్ ఆరోపణలను ఎదుర్కొన్న రియా చక్రవర్తి మహిళల కేటగిరీలో మొదటి స్థానంలో నిలిచింది. ఆమెతో పాటు కంగన, దీపిక, సన్నీలియోని, ప్రియాంక చోప్రా.. తదితరులు ‘మోస్ట్ సెర్చ్డ్ ఫిమేల్ సెలబ్రిటీస్’ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
రియా చక్రవర్తి
మోడల్‌గా కెరీర్ ఆరంభించిన రియా చక్రవర్తి ‘తూనీగ తూనీగ’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. పలు బాలీవుడ్ సినిమాల్లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ సుశాంత్ ఆత్మహత్య కారణంగా ఈ ఏడాదంతా వార్తల్లో నిలిచింది. గతంలో అతనితో రిలేషన్షిప్లో ఉండడం, అతనికి డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఆరోపణలు రావడంతో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. దక్షిణ ముంబయిలోని బైకుల్లా జైలులో నెల రోజులున్న ఆమె అక్టోబర్ 7న బెయిల్‌పై బయటకు వచ్చింది. ఈ కారణాలతో ఆమె గురించి వెతికేందుకు నెటిజన్లు ఆసక్తి చూపారు. తద్వారా యాహూ ‘మోస్ట్ సెర్చ్డ్ ఫిమేల్ సెలబ్రిటీ’ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది రియా.
కంగనా రనౌత్
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సమాజంలో జరిగే అన్ని విషయాలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తుంటుంది కంగనా రనౌత్. ఈక్రమంలో సుశాంత్ ఆత్మహత్యకు బాలీవుడ్‌లోని కొందరు పెద్దలే కారణమన్న ఆమె మాటలు బంధుప్రీతిపై పెద్ద ఎత్తున చర్చను లేవదీశాయి. ఇక ముంబయిని పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చడం, మహారాష్ట్ర ప్రభుత్వంతో వాదోపవాదాలు ‘క్వీన్’ను వార్తల్లో నిలిచేలా చేశాయి. కొద్ది రోజుల క్రితం బాంద్రాలోని ఆమె కార్యాలయాన్ని బీఎంసీ(ముంబయి మున్సిపాలిటీ) అధికారులు కూలగొట్టారు. అయితే కంగనపై కక్షతోనే తన ఆఫీసును కూల్చేశారని ముంబయి హైకోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఇలా తన గురించి మాట్లాడుకునేలా చేసిన ఈ ఫైర్‌బ్రాండ్ ఈ జాబితాలో రెండో స్థానం దక్కించుకుంది.
దీపికా పదుకొణె
‘ఛపాక్’ సినిమాతో ఈ ఏడాదికి స్వాగతం పలికింది దీపిక. అదే సమయంలో దిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో జరిగిన ఆందోళనలను ఖండించిన ఆమె అక్కడి విద్యార్థులకు అండగా నిలబడింది. ఇక సుశాంత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్లో వెలుగు చూసిన డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలో దీపిక పేరు కూడా వినిపించడంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఆమెను విచారించారు. వెరసి.. తాజాగా యాహూ విడుదల చేసిన జాబితాలో దీపిక మూడో స్థానంలో నిలిచింది.
సన్నీలియోని
గత కొన్నేళ్లుగా ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తోన్న సన్నీ తాజా లిస్టులో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. కరోనా కాలంలో పూర్తిగా ఇంటికే పరిమితమైన ఆమె కరోనా జాగ్రత్తలపై సోషల్ మీడియా వేదికగా అవగాహన కల్పించింది. అలాగే తన భర్త, పిల్లలతో గడిపిన ఫొటోలను అందరితో పంచుకుంటూ మురిసిపోయిందీ ముద్దుగుమ్మ.
ప్రియాంక చోప్రా
గ్లోబల్ బ్యూటీగా పేరొందిన ప్రియాంక చోప్రా ఈ జాబితాలో ఐదో నిలిచింది. కరోనా కాలంలోనూ బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్లో ఆమె దక్కించుకున్న క్రేజీ ప్రాజెక్టులే ఆమెను వార్తల్లో నిలిచేలా చేశాయి. ప్రస్తుతం ‘ది వైట్ టైగర్’, ‘వుయ్ కెన్ బీ హీరోస్’ వంటి బాలీవుడ్ చిత్రాలతో పాటు ప్రతిష్ఠాత్మక చిత్రం ‘మ్యాట్రిక్స్-4’ లో కూడా నటిస్తోంది పీసీ. వీటితో పాటు పలు హాలీవుడ్ సినిమాలకు కూడా సంతకం చేసిందీ ముద్దుగుమ్మ. ఇక తన జీవిత చరిత్రకు అక్షర రూపమిస్తూ ఆమె రాసుకున్న ఆత్మకథ ‘అన్ఫినిష్డ్’ త్వరలో మార్కెట్లోకి విడుదల కానుంది.
కత్రినా కైఫ్
ప్రియాంక లాగే కరోనా సమయంలో పలు క్రేజీ ప్రాజెక్టులకు సైన్ చేసింది కత్రినా కైఫ్. అక్షయ్ కుమార్ సరసన ఆమె నటించిన ‘సూర్యవంశి’ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో పాటు ‘ఫోన్ బూత్’ అనే కామెడీ హారర్ సినిమాలోనూ, అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కిస్తోన్న ఓ సూపర్ హీరో మూవీలోనూ నటిస్తోందీ ముద్దుగుమ్మ. ఇలా తన క్రేజీ ప్రాజెక్టులతో యాహూ ‘మోస్ట్ సెర్చ్డ్ ఫిమేల్ సెలబ్రిటీ’ జాబితాలో ఆరో స్థానం దక్కించుకుంది కత్రిన.
నేహా కక్కర్
బాలీవుడ్లో హుషారైన పాటలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నేహా కక్కర్ కొద్ది రోజుల క్రితం మరో సింగర్ రోహన్‌ప్రీత్ సింగ్‌తో కలిసి పెళ్లిపీటలెక్కింది. అంగరంగ వైభవంగా జరిగిన తన వివాహ వేడుకలు, హనీమూన్ ఫొటోలతో అందరి నోళ్లలో నానిన నేహ.. తాజా జాబితాలో ఏడో స్థానంలో నిలిచింది.
కనికా కపూర్
‘బేబీ డాల్’ అంటూ యువతను ఉర్రూతలూగించింది గాయని కనికా కపూర్. అదే సమయంలో కరోనా బారిన పడిన తొలి బాలీవుడ్ సెలబ్రిటీగా అందరి నోళ్లలో నానింది. చాలా రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న ఆమె ఆరోగ్య పరిస్థితి ఒక దశలో విషమించిందంటూ వార్తలొచ్చాయి. అయితే అదృష్టవశాత్తూ ఈ మహమ్మారి నుంచి సురక్షితంగా కోలుకుంది. అలా కరోనా కారణంగా వార్తల్లో నిలిచిన కనిక తాజా జాబితాలో ఎనిమిదో స్థానం దక్కించుకుంది.
కరీనా కపూర్!
ఈ ఏడాదే ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టిన కరీనా కపూర్ తాజా జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. మరికొన్ని రోజుల్లో రెండోసారి అమ్మగా ప్రమోషన్ పొందనున్న బెబో.. మొదటిసారిలాగే గర్భం ధరించినా తన వృత్తిగత జీవితాన్ని కొనసాగిస్తోంది. అలాగే తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన పోస్టులు, ఫొటోలతో వార్తల్లో నిలిచిందీ అందాల అమ్మ.
సారా అలీఖాన్
సుశాంత్ ఆత్మహత్య తర్వాత స్టార్ కిడ్‌గా కొంతమంది నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంది సారా అలీఖాన్. ఆ తర్వాత బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలోనూ తనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఆమెను విచారించారు. ఇదిలా ఉంటే వరుణ్ ధావన్ సరసన ఆమె నటించిన ‘కూలీనం.1’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈక్రమంలో యాహూ ‘మోస్ట్ సెర్చ్డ్ ఫిమేల్ సెలబ్రిటీ’ జాబితాలో పదో స్థానంలో నిలిచింది సారా.