Photo: Instagram
తల్లిదండ్రులు చేసే పనులను పిల్లలూ అనుకరిస్తారంటారు.. వారి అలవాట్లు చిన్నారుల పైనా ప్రభావితం చూపుతాయంటారు. అలా తన తల్లిదండ్రుల ఆహారపుటలవాట్లు తన పైనా ప్రభావం చూపాయంటోంది మాజీ ప్రపంచ సుందరి మానుషీ ఛిల్లర్. 2017లో ప్రపంచ సుందరిగా అవతరించి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన మానుషి.. మహిళా సాధికారతకు కృషి చేస్తూ తన మంచి మనసును సైతం చాటుకుంటోంది. అంతేనా.. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై దృష్టి సారించే ఈ చక్కనమ్మ.. ఈ క్రమంలో తాను పాటించే చిట్కాలను సైతం సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ తన ఫ్యాన్స్‌లో స్ఫూర్తి నింపుతుంటుంది. ఇందులో భాగంగానే ఇటీవలే ఓ సందర్భంలో మాట్లాడుతూ తన ఆరోగ్యకరమైన జీవనశైలి వెనకున్న మరో సీక్రెట్‌ని బయటపెట్టిందీ అందాల తార.
ప్రపంచ సుందరిగా అవతరించిన నాటి నుంచి ఆరోగ్యం, ఫిట్నెస్, మహిళా అంశాలపై సందర్భం వచ్చినప్పుడల్లా తన మనసులోని మాటల్ని పంచుకుంటోంది మానుషి. ఈ క్రమంలోనే ఇటీవల ‘జాతీయ పోషకాహార దినోత్సవం’ సందర్భంగా తాను తీసుకునే పోషకాహారం గురించి పలు సీక్రెట్స్‌ని బయటపెట్టిన ఈ చక్కనమ్మ.. తాజాగా తన ఆరోగ్యం వెనకున్న మరో రహస్యాన్ని పంచుకుంది.
అమ్మానాన్నల స్ఫూర్తితోనే..!
తాను శాకాహారినంటూ మానుషి పలు సందర్భాల్లో ప్రస్తావించిన విషయం తెలిసిందే. తాజాగా ‘అంతర్జాతీయ మాంసాహార రహిత దినోత్సవం’ సందర్భంగా తాను శాకాహారం ఎంచుకోవడం వెనకున్న అసలు రహస్యాన్ని బయటపెట్టిందీ సుందరి. ‘నాకు సంబంధించినంత వరకు శాకాహారం ఎంచుకోవడం అనేది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. ఇవే ఆహారపుటలవాట్లను ఇప్పుడూ కొనసాగిస్తున్నా.. ఇకపైనా కొనసాగిస్తా. మా అమ్మానాన్నలు ముందునుంచీ శాకాహారులే.. వారిని చూసి స్ఫూర్తి పొందే నేను శాకాహారానికి అలవాటు పడ్డా. అంతేకానీ వాళ్లు ఈ విషయంలో నన్నెప్పుడూ బలవంతం చేయలేదు. ఈ ఆహార పద్ధతి నా శరీరతత్వానికి బాగా సరిపోతుందని, ఆరోగ్యకరమైనది గ్రహించాకే నేను ఈ నిర్ణయం తీసుకున్నా. ఇక అప్పట్నుంచి నేను ఏదైనా సరే పరిశుభ్రంగా, తాజాగా తీసుకోవడం అలవాటు చేసుకున్నా. ఈ క్రమంలో నాకు మొక్కల ఆధారిత పదార్థాలు (ప్లాంట్ బేస్డ్ డైట్) బాగా ఉపకరించాయి. దీనివల్ల ఇప్పటిదాకా ఏ చిన్న అనారోగ్యం కూడా నాకు ఎదురుకాలేదు. ఇక ఈ తరహా పద్ధతిని ఎంచుకోవాలనుకునే వారికి దీన్ని సిఫార్సు చేయడానికీ నేను వెనకాడను. ఇలా మొత్తానికి శాకాహారం నా జీవితంలో ఓ భాగమైపోయింది.. నాకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తోంది..’ అంటోంది మానుషి.
అందుకు నేను హ్యాపీ!
ఇలా శాకాహారాన్ని ప్రోత్సహిస్తోన్న ఈ అందాల తారను గతేడాది పెటా ‘సెక్సీయెస్ట్ వెజిటేరియన్ పర్సనాలిటీ’గా గుర్తించి గౌరవించింది. ఈ క్రమంలో ‘శాకాహారం ఎన్నో పోషకాల మిళితం.. తద్వారా బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా మనకు చేకూరతాయి. దీనివల్ల మన శరీరంలో కొవ్వు స్థాయులు తగ్గుతాయి.. బీపీ అదుపులో ఉంటుంది.. పోషకాహార లేమికి చెక్ పెట్టచ్చు.. తద్వారా ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఒక జంతు ప్రేమికురాలిగా, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తిగా నా ఈ నిర్ణయం పట్ల నేను సంతృప్తిగా, సంతోషంగా ఉన్నా..’ అంటూ చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ.
ప్రస్తుతం అక్షయ్ కుమార్ సరసన ‘పృథ్వీరాజ్’ అనే సినిమాలో నటిస్తోన్న మానుషి.. ఈ చిత్రంతో చిత్ర పరిశ్రమకు నటిగా తనని తాను పరిచయం చేసుకునేందుకు, ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సన్నద్ధమవుతోంది.