అమ్మతనం... ఆడవారికి మాత్రమే దక్కిన అరుదైన గౌరవం. మాతృత్వంతో మహిళల జీవితానికి పరిపూర్ణత వస్తుందని చాలామంది భావిస్తారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ నవ మాసాల ప్రయాణమనేది ప్రతి మహిళకు ఓ పెను సవాలే. గర్భం దాల్చినా దురదృష్టవశాత్తూ చాలామందికి అది నిలవకపోవచ్చు. ఇందుకు ఎవరూ అతీతులు కాదు. ఈ క్రమంలో తానూ గర్భశోకంతో తల్లడిల్లానంటూ చెప్పుకొచ్చింది బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ సతీమణి మేగన్ మార్కల్. రెండోసారి గర్భం ధరించాక కడుపులోనే బిడ్డను పోగొట్టుకున్నానంటూ వాపోయింది. ఈ సందర్భంగా తనకెదురైన చేదు అనుభవాన్ని అందరితో షేర్ చేసుకుందీ యువరాణి.
కడుపులోనే బిడ్డను పోగొట్టుకున్నా!
మేగన్ మార్కల్... సాధారణ కుటుంబంలో పుట్టి, హాలీవుడ్ నటిగా ఎదిగింది. 2018లో బ్రిటిష్ యువరాజు ప్రిన్స్ హ్యారీని పెళ్లాడి బ్రిటిష్ రాజవంశ కోడలిగా ప్యాలస్‌లో అడుగుపెట్టింది. తద్వారా మరింత పాపులారిటీని సొంతం చేసుకున్న ఆమె గతేడాది మేలో ‘ఆర్చి’ అనే బేబీ ప్రిన్స్‌కు జన్మనిచ్చింది. అయితే తనకున్న ప్రత్యేక గుర్తింపు, అస్తిత్వాన్ని కోల్పోవడం ఏ మాత్రం ఇష్టం లేని మేగన్ ఈ ఏడాది ప్రారంభంలో బ్రిటిష్ రాజ ప్రాసాదాన్ని వీడి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం భర్త ప్రిన్స్ హ్యారీ, కుమారుడు ఆర్చీతో కలిసి కాలిఫోర్నియాలో నివాసముంటోన్న ఈ అందాల తార ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సాధారణ జీవితం గడుపుతోంది. ఈ క్రమంలో రెండోసారి గర్భం ధరించిన తనకు జులైలో గర్భస్రావం అయ్యిందని చెప్పుకొచ్చింది మేగన్. ఈ సందర్భంగా తన జీవితంలోని విషాద ఘట్టాన్ని షేర్ చేసుకుంటూ ‘The Losses We Share’ పేరుతో ఓ మ్యాగజైన్‌కు వ్యాసం రాసింది.
అనర్థం జరిగిందని నాకు అర్థమైపోయింది!
‘అది జులై నెల.. ఎప్పటిలాగే ఆరోజు ఉదయం కూడా మామూలుగానే ప్రారంభమైంది. అందరికీ బ్రేక్‌ఫాస్ట్ తయారుచేశాను. పెంపుడు కుక్కలకు ఆహారం పెట్టాను. విటమిన్ ట్యాబ్లెట్లను తీసుకున్నాను. టేబుల్ కింద పడి ఉన్న క్రేయాన్ను పైకి తీశాను. ఊయలలో ఉన్న బాబు (ఆర్చి)ని చేతుల్లోకి తీసుకునే ముందు జుట్టును ముడి వేసుకున్నాను. బాబుకు డైపర్ మార్చాక.. నాకు ఏదో ఇబ్బందిగా అనిపించింది. చేతుల్లో ఉన్న పిల్లాడిని తీసుకుని అలాగే నేలపై కూలబడిపోయాను. ఏదో జరగరాని అనర్థం జరిగిందని నాకు అర్థమైంది. ఆ క్షణం నా నోటి నుంచి వెలువడుతున్న జోలపాట కూడా ఆగిపోయింది. బాబును గట్టిగా పట్టుకున్నా... నా కడుపులో పెరుగుతున్న రెండో చిన్నారి ఇక లేదు అని నాకు అర్థమైపోయింది’!
ఆస్పత్రి గోడల వైపు చూస్తుండిపోయాను!
‘కళ్లు మూసి తెరిచేసరికి లాస్ ఏంజెలిస్‌లోని ఓ ఆస్పత్రి బెడ్‌పై ఉన్నాను. నా కళ్లల్లో నీటి సుడులు ఆగడం లేదు. పక్కనే విచారంగా నిలబడ్డ నా భర్త చేతిని గట్టిగా పట్టుకున్నాను. ఆ స్పర్శలో వెచ్చదనం నాకు తెలుస్తూనే ఉంది. ఈ విషాదం నుంచి తేరుకోవడం ఎలాగో తెలియక ఆస్పత్రి గోడల వైపు అలా చూస్తూ ఉండిపోయాను. మొదటి బిడ్డను చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఎంత సంతోషమేసిందో రెండో బిడ్డను కడుపులోనే పొగొట్టుకున్నప్పుడు అంతకు రెట్టింపు బాధ అనుభవించాను. బిడ్డను కోల్పోవడం అంటే భరించలేని బాధను మోయడం. ఈ ఆవేదనను ఎందరో అనుభవిస్తారు. కానీ కొందరు మాత్రమే అందరితో పంచుకుంటారు. నేను ఉన్న ప్రసూతి గదిలో దాదాపు 100 మంది మహిళలుంటారు. అందులో 10 నుంచి 20 మంది దాకా నాలాంటి అభాగ్యులే. వీరిలో చాలామంది తమకు జరిగిన నష్టం గురించి మాట్లాడేందుకు సిగ్గుపడ్డారు. ఒంటరిగా బాధను భరించారు’ అని తన చేదు జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంది మేగన్.
బ్రిటన్ రాజవంశానికి చెందిన ఉన్నత వ్యక్తులెవరూ ఇలా తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను బయటకు వెల్లడించలేదు. అందులోనూ ఇలాంటి విషయాల గురించి మాట్లాడడం ఇదే ప్రథమం. దీంతో ‘The Losses We Share’ పేరుతో మేగన్ రాసిన వ్యాసం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇదే క్రమంలో తనకు జరిగిన చేదు అనుభవాన్ని ధైర్యంగా బయటపెట్టిన ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తనలాగే మరికొంతమంది తల్లులు తమకు జరిగిన నష్టాన్ని అందరితో షేర్ చేసుకుంటున్నారు.