లైంగిక వేధింపులు... ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా సమాజంలోని ఆడపిల్లలందరూ ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఇది. సాధారణ అతివలే కాదు... కొందరు సెలబ్రిటీలూ ఈ సమస్యలను ఎదుర్కొన్న వారిలో ఉన్నారు. అయితే వీటి బారిన పడి మానసిక కుంగుబాటుకు లోనయ్యే వారు కొందరైతే... తమ చేదు అనుభవాల గురించి ధైర్యంగా బయటకు చెప్పి ఇతర మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేవారు మరికొందరు. ఈ రెండో కోవకే చెందుతుంది ప్రముఖ సింగర్ నేహాభాసిన్. హుషారైన పాటలు పాడుతూ యువతలో ఉత్సాహం నింపే ఈ స్టార్ సింగర్ పదేళ్ల వయసులోనే లైంగిక వేధింపులకు గురయ్యానంటోంది. ఆ తర్వాత కూడా మరికొన్నిసార్లు ఈ సమస్య బారిన పడ్డానంటోంది. ఈ సందర్భంగా తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి ధైర్యంగా ముందుకొచ్చి చెప్పిందీ ట్యాలెంటెడ్ సింగర్.
లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను!
సినిమా రంగంలో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న వారిని చూసి ‘అదృష్టమంటే సినిమా వాళ్లదే! చేతినిండా డబ్బు... లగ్జరీ లైఫ్‌స్టైల్!’ అనుకుంటాం. కానీ వాళ్లు ఆ స్థాయికి చేరుకోవడానికి ఎంత కష్టపడ్డారో వాళ్లకు తప్ప మరెవరికీ తెలియదు. ఈ క్రమంలో వాళ్లు ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చాలామంది పలు సందర్భాల్లో పంచుకున్న విషయం తెలిసిందే. ఇలాంటి అనుభవాలు తనకూ ఎదురయ్యాయని చెబుతోంది నేహా భాసిన్. ‘అటు నువ్వే... ఇటు నువ్వే’ అంటూ ‘కరెంట్’ సినిమాలో టాలీవుడ్లోకి అడుగు పెట్టిన ఆమె ‘ఊసరవెల్లి’, ‘దడ’, ‘నువ్వా-నేనా’, ‘వన్: నేనొక్కడినే’ ‘జనతా గ్యారేజ్’, ‘జై లవకుశ’ వంటి హిట్ సినిమాల్లో పాటలు పాడింది. ‘భారత్’, ‘రేస్ 3’, ‘టైగర్ జిందా హై’, ‘సుల్తాన్’, ‘నీర్జా’... మొదలైన హిందీ సినిమాల్లోనూ తన గొంతును సవరించుకుంది. వీటితో పాటు తమిళ, పంజాబీ భాషల్లోనూ హుషారైన పాటలు పాడి మంచి గాయనిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సామాజిక దృక్పథం మెండుగా ఉన్న నేహ ఆన్లైన్ ట్రోల్స్, లింగ వివక్ష, బంధుప్రీతి, బాడీ షేమింగ్ వంటి సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందించింది. ఈ క్రమంలో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ధైర్యంగా బయటపెట్టి మరోసారి వార్తల్లో నిలిచింది.
నన్ను అసభ్యంగా తాకాడు!
‘లైంగిక వేధింపులు నాకు కొత్త కాదు. చిన్నప్పటి నుంచే నేను ఇటువంటివి ఎదుర్కొంటున్నాను. నాకు పదేళ్ల వయసు ఉన్నప్పుడు మా కుటుంబమంతా కలిసి హరిద్వార్ వెళ్లాం. అక్కడ మా అమ్మ నాకు కొంచెం దూరంలో నిల్చొని ఉంది. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి నన్ను అసభ్యంగా తాకాడు. నేను షాక్ అయ్యాను. వెంటనే అక్కడి నుంచి పారిపోయాను. కొన్నేళ్ల తర్వాత మరో వ్యక్తి అలాగే అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ సంఘటనలు నాకు బాగా గుర్తున్నాయి. ఇందులో నాదే తప్పు ఉందేమోనని మొదట ఆత్మన్యూనతా భావానికి గురయ్యాను. కానీ ఆ విషయాల్లో నా తప్పు ఏమీ లేదని మెల్లగా తెలుసుకున్నాను. ఇక ఇప్పటికీ కొందరు నన్ను సోషల్ మీడియా వేదికగా వేధిస్తున్నారు. నేను షేర్ చేసిన పోస్టులకు అసభ్యకరంగా కామెంట్లు పెడుతుంటారు. నన్నే కాదు చాలామందిని ఇలాగే ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా, మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు కొంతమంది నెటిజన్లు. ఇదొక రకమైన టెర్రరిజం. దీనికి ఫేస్ అంటూ ఉండదు’ అని చెప్పుకొచ్చిందీ బ్యూటిఫుల్ సింగర్.
రేప్ చేస్తామని బెదిరించారు!
నాలుగేళ్ల క్రితం సమీర్ అనే మ్యూజిక్ కంపోజర్‌ను వివాహం చేసుకుంది నేహ. ఇటలీలో వీరి వివాహ వేడుక జరిగింది. ప్లే బ్యాక్ సింగర్‌గానే కాదు నటనలోనూ ప్రావీణ్యమున్న ఆమె ‘లైఫ్‌కి తో లగ్ గయి’ అనే హిందీ సినిమాలో నటించింది. పలు టీవీ షోలు, రియాలిటీ షోల్లో కంటెస్టెంట్ గా, న్యాయనిర్ణేతగా పాల్గొంది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఓ మ్యూజిక్ బ్యాండ్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలపై తీవ్ర పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు కొంతమంది నెటిజన్లు. ‘కే-బ్యాండ్ (కొరియన్ మ్యూజిక్ బ్యాండ్)కి నేను పెద్ద అభిమానిని కాదు’ అన్నందుకు ఆ మ్యూజిక్ బ్యాండ్ అభిమానులు నన్ను బెదిరించారు. ‘రేప్ చేసి చంపేస్తాం’ అని మెసేజ్‌లు పంపించారు. ఆ సమయంలో నేను కూడా వారికి సరైన సమాధానం చెప్పాలనుకున్నాను. అందుకే వారి గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఏ తప్పూ చేయకుండా ఎవ్వరూ శిక్ష అనుభవించకూడదు. తప్పు లేనప్పుడు మన గొంతుని వినిపించాలి’ అని చెప్పుకొచ్చిందీ స్టార్ సింగర్.