సాధారణంగా మహిళలపై ఏవైనా అఘాయిత్యాలు, అరాచకాలు జరిగితే అందుకు మహిళనే బాధ్యురాలిగా చేస్తుంటారు. దీంతో చాలా సందర్భాల్లో మహిళలు మౌనమే సమాధానంగా మిన్నకుండిపోతున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. తప్పొప్పులు ఎవరివో సామాజిక మాధ్యమాల సాక్షిగా ఎండగడుతున్నారు. ఈ క్రమంలో సున్నితమైన ఇలాంటి విషయాల్లో బాధితులనే తప్పుపట్టడం సరికాదంటోంది బాలీవుడ్ సింగర్ సోనా మహాపాత్ర. ఈ సందర్భంగా #IneverAskForIt ఛాలెంజ్ పేరుతో బాధితులనే బాధ్యులుగా చేసిన సంఘటనల గురించి నిర్మొహమాటంగా స్పందించాలంటూ పిలుపునిస్తోంది.
బాలీవుడ్‌కు సంబంధించి సింగర్‌గా, మ్యూజిక్ కంపోజర్‌గా, పాటల రచయితగా ప్రత్యేక గుర్తింపు పొందింది సోనా. ‘ఐ హేట్ లవ్ స్టోరీస్’, ‘దిల్లీ బెల్లీ’, ‘తలాష్’, ‘ఫక్రీ’, ‘ఖూబ్సూరత్’, ‘హంటర్’, ‘రామన్ రాఘవ్ 2.0’, ‘తాయిష్’ తదితర హిందీ సినిమాల్లో పాటలు పాడిన ఆమె పలు మ్యూజిక్ వీడియోలు, ఆల్బమ్‌లు, స్టేజి షోల్లో పాల్గొంది. ఇక సినిమా ఇండస్ట్రీలోని చీకటి గుట్టును వెలుగులోకి తెచ్చిన ‘మీటూ’ ఉద్యమంలో బలంగా తన గొంతును వినిపించిందీ స్టార్ సింగర్. ఈ సందర్భంగా బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూమాలిక్, స్టార్ సింగర్ కైలాష్ ఖేర్ తనను లైంగికంగా వేధించారని బయటపెట్టింది. ఇక షాహిద్ కపూర్ నటించిన ‘కబీర్ సింగ్’ మహిళలపై హింసను ప్రేరేపించేలా ఉందని సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించింది. అదేవిధంగా సల్మాన్ ఖాన్ సినిమా ‘భారత్’ నుంచి ప్రియాంకాచోప్రా తప్పుకున్నప్పుడు ప్రియాంకపై సల్మాన్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టింది. వీటితో పాటు సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నప్పుడు కొందరు సినీ ప్రముఖులపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించింది.
‘చున్నీ సరిగా వేసుకోవచ్చు కదా’.. అన్నాడు!
తాజాగా #IneverAskForIt ఛాలెంజ్ విసిరిన సోనా బాధితులనే దోషులుగా చేసిన సంఘటనల గురించి షేర్ చేసుకోవాలని పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ముందుగా తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని ట్విట్టర్ వేదికగా అందరితో పంచుకుంది.
‘నేను బీటెక్ చదువుతున్న రోజులవి. వదులైన సల్వార్ సూట్ ధరించిన నేను మైక్రో ప్రాసెసర్ ల్యాబ్‌కు వెళుతున్నాను. అక్కడ ఉన్న సీనియర్లు నన్ను చూసి విజిల్స్ వేశారు. నేను ధరించిన లోదుస్తుల గురించి అందరికీ వినిపించేలా ఏవేవో కామెంట్లు చేశారు. అది చూసిన ఓ వ్యక్తి నా దగ్గరకు వచ్చి ‘అలా ఎక్స్పోజింగ్ చేయకుండా చున్నీ సరిగా వేసుకోవచ్చు కదా’! అని సలహా ఇచ్చాడు’ అని అప్పటి అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకుంది. అదేవిధంగా ఇలాంటి వేధింపులు మీకు ఎదురైతే వాటిని పంచుకోండి అంటూ బాలీవుడ్ నటి సోనమ్ కపూర్, సింగర్ చిన్మయి శ్రీపాదతో పాటు మరికొందరిని తన ట్వీట్లో ట్యాగ్ చేసింది.
నా శరీరం... నా ఇష్టం!
సోనా షేర్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోనా పిలుపునకు స్పందించిన చిన్మయి సంగీత దర్శకుడు వైరముత్తు నుంచి తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి షేర్ చేసుకుంది. ఆమెతో పాటు పలువురు నెటిజన్లు తమకెదురైన చేదు అనుభవాలను షేర్ చేసుకుంటూ పోస్టులు పెడుతున్నారు.
ఇదేక్రమంలో అందరి దృష్టిని ఆకర్షించేందుకే సోనా ఇలాంటివి చేస్తుందని కొంతమంది నెటిజన్లు నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ ‘అందరి దృష్టిని ఆకర్షించేందుకు, సింపతీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇంత బాధపడిపోతున్న మీరు హాట్ ఫొటో షూట్లకు ఎందుకు హాజరవుతున్నారు? క్లీవేజ్ బాగా కనిపించే ఫొటోలను సోషల్ మీడియాలో ఎందుకు షేర్ చేస్తున్నారు? మీ డ్రామాలన్నీ మానేసి పాటలు పాడడంపై దృష్టి సారించండి’ అని కామెంట్ పెట్టాడు. దీనికి తనదైన శైలిలో సమాధానమిచ్చిన సోనా ‘మిస్టర్ జై... ఇది నా శరీరం... నా క్లీవేజ్... నాకు ఎలా నచ్చితే అలా ఉంటాను’ అని రిప్లై ఇచ్చింది.
ఇతరులకు ఇబ్బంది లేనంతవరకు, అసభ్యతకు తావు లేనంతవరకు - ఎవరు ఎలాంటి డ్రస్సులు ధరించినా ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలూ ఉండాల్సిన అవసరం లేదు.. ఆ మాటకొస్తే వేషధారణ విషయంలో ఎవరి వ్యక్తిగత ఇష్టాయిష్టాలు వాళ్లవి..
ఈ క్రమంలో - అమ్మాయిలూ.. మీకూ ఇలాంటి అనుభవాలు ఎప్పుడైనా ఎదురయ్యాయా? అయినట్లయితే వాటి గురించి పంచుకోండి.. ప్రతి విషయాన్నీ నెగెటివ్ గా ఆలోచించే వారి ఆలోచనా ధోరణిలో కాస్తైనా మార్పు వస్తుందేమో చూద్దాం..!