Photo: Instagram
అమ్మాయిలకు పెళ్లి కాస్త ఆలస్యమైతే చాలు.. ‘పెళ్లెప్పుడూ?’ అంటారు. అదే పెళ్లైతే ‘పిల్లల్నెప్పుడు కంటావ్?’ అని అడుగుతుంటారు. నిజానికి ఇలాంటి మాటలు మనలాంటి వారికే కాదు.. సెలబ్రిటీలకూ కామనే! అయితే పెళ్లి చేసుకోవడానికి, పిల్లల్ని కనడానికి వయసుతో సంబంధం లేదంటోంది బాలీవుడ్ నటి మోనా సింగ్. తన 39 ఏళ్ల వయసులో ఫిల్మ్ మేకర్ శ్యామ్ రాజగోపాలన్‌ను వివాహం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన పెళ్లికి ఇదే సరైన సమయమని చెబుతోంది. అంతేకాదు.. పెళ్లికి ముందే తన అండాల్ని భద్రపరచుకున్నానంటూ బోల్డ్‌గా మాట్లాడిన మోనా.. పెళ్లి, పిల్లల గురించి సమాజం ఎలా ఆలోచిస్తుందన్న విషయాల గురించి తన మనసులోని మాటల్ని నిర్మొహమాటంగా బయటపెట్టింది.
వయసు దాటిపోతున్నా, పెళ్లై ఏడాది దాటినా.. ‘ఇంకా ఎప్పుడు పెళ్లి చేసుకుంటావ్?’, ‘ఆలస్యం చేస్తే పిల్లలు పుట్టడం కష్టమవుతుంది!’ అంటూ ఆడపిల్లలు సమాజం నుంచి ఎన్నో మాటలు పడాల్సి వస్తుంది. అయితే పెళ్లి చేసుకోవడం కూడా పిల్లల్ని కనడానికే అన్న భావన సైతం చాలామందిలో లేకపోలేదు. ఇక వయసు పెరిగే కొద్దీ పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గిపోతుంటాయని చెబుతుంటారు కూడా! అందుకే ఈ రోజుల్లో ఆ సమస్య రాకూడదని ముందుగానే తమ అండాల్ని భద్రపరుచుకొనే పద్ధతి అందుబాటులోకొచ్చేసింది. తద్వారా వయసుతో సంబంధం లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లల్ని కనొచ్చు. అలా తన 34 ఏళ్ల వయసులో తన అండాల్ని కూడా భద్రపరచుకున్నానంటోంది బాలీవుడ్ నటి మోనా సింగ్.
మనసు చెప్పినప్పుడే పెళ్లి చేసుకోండి!
గతేడాది అంటే తన 39 ఏళ్ల వయసులో ఫిల్మ్ మేకర్ శ్యామ్ రాజగోపాలన్‌ను వివాహం చేసుకున్న మోనా.. తన పెళ్లి సరైన సమయానికే జరిగిందంటోంది. ‘ప్రస్తుతం మనం అధునాతన ప్రపంచంలో జీవిస్తున్నాం.. ఇక్కడ పెళ్లికి, వయసుకు సంబంధం లేదు. అందుకే నేనూ అంత తొందరపడలేదు. నేను సరైన వయసులోనే పెళ్లి చేసుకున్నా. ఎందుకంటే ఈ వయసుకొచ్చేసరికి మన జీవితంలో ఎదురైన ఎత్తుపల్లాలతో మనపై మనకు పూర్తి అవగాహన ఏర్పడుతుంది. ఇద్దరు వ్యక్తులు ఏకం కావడానికి అలాంటి అనుభవాలే కీలకం! అందుకే మీకు పెళ్లి చేసుకోవాలనిపించినప్పుడు, ఇదే అందుకు సరైన సమయం అనిపించినప్పుడే వివాహ బంధంలోకి అడుగుపెట్టండి..’ అంటోంది మోనా.
నా నిర్ణయంతో అమ్మ చాలా హ్యాపీ!
ఇక కెరీర్ పరంగానో, పెళ్లైన వెంటనే పిల్లల బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా లేకపోవడం వల్లనో చాలామంది పిల్లల్ని కనడాన్ని వాయిదా వేస్తున్నారు. అయితే వయసు పెరిగిన కొద్దీ అండాల నిల్వ తగ్గిపోతుండడం వల్ల వయసులో ఉన్నప్పుడే తమ అండాల్ని భద్రపరుచుకునే వారూ ఈ రోజుల్లో పెరిగిపోతున్నారు. తానూ తన 34 ఏళ్ల వయసులో అదే పని చేశానంటోంది మోనా.
‘నేను నా 34 ఏళ్ల వయసులో నా అండాల్ని భద్రపరుచుకున్నాను.. అందుకే ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నా. మొదట నా ఈ నిర్ణయం గురించి అమ్మతో చెప్పినప్పుడు తను చాలా సంతోషించింది. అంతేకాదు.. తనూ నా వెంట ఆస్పత్రికి వచ్చింది. ఇందుకోసం కొన్ని నెలల పాటు కెరీర్‌కు దూరంగా ఉన్నా. ఈ క్రమంలో నా మనసులో ఎన్నో భావోద్వేగాలు రేకెత్తాయి. మొత్తానికి ఐదు నెలల తర్వాత ఈ ప్రక్రియ ముగియడంతో చాలా హ్యాపీగా అనిపించింది..’ అంటూ పెళ్లికి ముందు తాను తీసుకున్న ఈ కీలక నిర్ణయం గురించి బయటపెట్టిందీ బాలీవుడ్ అందం.
దాని గురించి తర్వాత ఆలోచిస్తా!
పెళ్లికి ముందు వరకు కుటుంబం, స్నేహితులతో గడిపినా.. పెళ్లి తర్వాత భర్తతో గడిపే ప్రతి క్షణం ఓ అద్భుతమే అంటోంది మోనా. ‘పెళ్లికి ముందు వరకు నా ఫ్రెండ్స్, కుటుంబంతో కలిసి వివిధ ప్రదేశాలకు వెళ్లేదాన్ని. ఇక ఇప్పుడు పెళ్లయ్యాక నా భర్తతో కలిసి ప్రపంచ దేశాలన్నీ చుడుతూ ఎంజాయ్ చేయాలనుకుంటున్నా.. జీవిత భాగస్వామితో కలిసి ఇలా నచ్చిన ప్రదేశాలకు వెళ్లడం, వేడుకలు-పండగల్ని జరుపుకోవడం.. అదో అందమైన అనుభూతి! మరి, పిల్లల్ని కనడం ఇష్టం లేదా? అని మీరు నన్ను అడగచ్చు..! అయితే అందుకు నేను ఇంకా సన్నద్ధం కాలేదు. ముందు ముందు ఆ విషయం గురించి తప్పకుండా ఆలోచిస్తా..’ అంటూ అసలు విషయాన్ని దాటేసిందీ క్యూటీ.
‘జస్సీ జైసీ కోయీ నహీ’ అనే టీవీ సీరియల్‌తో బుల్లితెరపై పరిచయమైన మోనా.. ‘ఝలక్ ధిక్లా జా’ అనే టీవీ షోలో విజేతగా నిలిచింది. ఆపై పలు సినిమాల్లో, షార్ట్‌ఫిల్మ్స్‌లోనూ మెరిసింది. ఇక ఈ ఏడాది ‘బ్లాక్ విడోస్’ అనే టీవీ షోలో కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. ‘లాల్ సింగ్ చద్దా’ అనే చిత్రంలోనూ నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.
మరి మోనా మాదిరిగా- కెరీర్ పరంగానో, పెళ్లైన వెంటనే పిల్లల బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా లేకపోవడం వల్లనో చాలామంది పిల్లల్ని కనడాన్ని వాయిదా వేస్తున్నారు. ఈ క్రమంలో- వయసు పెరిగిన కొద్దీ అండాల నిల్వ తగ్గిపోయే కారణంగా - వయసులో ఉన్నప్పుడే తమ అండాల్ని భద్రపరుచుకునే వారూ ఈ రోజుల్లో పెరిగిపోతున్నారు.
మరి ఇలా వివిధ కారణాల వల్ల పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం వాయిదా వేయడం మంచిదేనా? పెళ్లి, పిల్లలు అన్నది వ్యక్తిగత నిర్ణయం అయినప్పటికీ - ఈ రకంగా వాయిదా వేయడం వల్ల వచ్చే సమస్యలేవైనా ఉంటాయా? ప్రత్యేకించి మహిళలు, కుటుంబ వ్యవస్థ కోణం లోంచి ఆలోచిస్తే ఇలాంటి నిర్ణయాలు ఎంతవరకు సమంజసం?
మీ అభిప్రాయాలను కింది కామెంట్ బాక్స్ ద్వారా అందరితోనూ పంచుకోండి.. !