scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'అన్ని కష్టాలు భరించినా చివరికి ‘అమ్మే’ గెలిచింది!'

'కుటుంబాన్ని పోషించడం, ఇంటిని చక్కబెట్టడం, పిల్లల్ని పెంచడం.. మొదలైన విషయాల్లో భార్యభర్తల బాధ్యత సమానంగా ఉంటుంది. ఒకవేళ భర్త సంపాదించడం చేతకాని అసమర్థుడైతే ఆ బాధ్యతలను పూర్తిగా భార్యే స్వీకరిస్తుంది. కానీ, తను సంపాదించకపోగా భార్య సంపాదనను కూడా తన స్వార్థం కోసం వాడుకొనే భర్త ఉంటే.. ఇక ఆ ఇల్లాలు, పిల్లలు అనుభవించే వేదన మాటల్లో చెప్పలేం..! అలాంటి నరకాన్ని తన తల్లి కూడా అనుభవించిందని చెబుతోంది ఓ యువతి. అయినా వాటికి వెరవకుండా ఎన్నో కష్టాలకోర్చి ప్రస్తుతం సొంత గుర్తింపు సంపాదించుకున్న అమ్మే తనకు అన్ని విధాలా స్ఫూర్తి ప్రదాత అంటూ.. ‘మాతృ దినోత్సవం’ సందర్భంగా తన హృదయరాగం మనందరితో పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చింది.'

Know More

Movie Masala

 
category logo

రెండు క్లోజప్‌లు తీసి మొహంలో కళ లేదన్నారు!

Nireekshana Fame  Archana In Alitho Saradaga Chat Show

‘ఆకాశం ఏనాటిదో...అనురాగం ఆనాటిది’ అంటూ ‘నిరీక్షణ’ సినిమాలో భానుచందర్‌తో కలిసి ఆడిపాడారు అర్చన. ఆ సినిమాలో మాటల్లో చలాకీ తనం, చూపుల్లో అమాయకత్వం కలగలిపిన గిరిజన యువతి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారామె. ఆ తర్వాత ‘లేడీస్ టైలర్‌’, ‘మట్టి మనుషులు’, ‘దాసి’, ‘భారత్‌ బంద్‌’.. లాంటి విభిన్న కథా చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రంగు తక్కువ అంటూ తొలినాళ్లలో నటిగా తిరస్కరణకు గురైన ఆమె... వరుసగా రెండు సార్లు జాతీయ అవార్డు అందుకున్నారు. చాలా కాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్న ఈ అందాల తార సుమారు పాతికేళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి కెమెరా ముందుకొచ్చారు. ఈ సందర్భంగా ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో పాల్గొని తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను సరదాగా షేర్‌ చేసుకున్నారు అర్చన.

alithoarchana650-6.jpg
ఆలీ: తెరకు దూరం కావడానికి కారణమేమిటి?
అర్చన: ఈ ఆర్టిస్ట్‌తోనే, ఇలాంటి సినిమాలే చేయాలనే ఆలోచన ఉన్న దర్శకులు నాకు దొరికారు. అలాంటి కథలు నా దగ్గరకు వచ్చాయి. ఒక స్టేజ్‌ తర్వాత అలాంటి పాత్రలు కొంతమేర కనుమరుగయ్యాయి. నేను చేసే పాత్రలు చాలా తక్కువగా వచ్చాయి. అలా నేనూ దూరమయ్యాను.
ఆలీ: కమర్షియల్‌ సినిమాల్లో మీకు అవకాశాలు వచ్చాయా?
అర్చన: కమర్షియల్‌ కథలు చేయమని నాకు ఆఫర్స్‌ వచ్చాయి. బాడీ లాంగ్వేజ్‌, మనస్తత్వానికి చక్కగా నప్పే సినిమాలు వస్తే అప్పట్లో నటించాను. సినీ రంగంలోకి వచ్చిన తొలినాళ్లలో అన్ని సినిమాల్లోనూ నటించొచ్చు. కానీ ఒక గుర్తింపు వచ్చాక మనం ఒక బ్రాండ్‌ అవుతాం. అప్పుడు ఒక ఛాయిస్‌ ఉంటుంది. అలా నాకు నచ్చిన సినిమాలే ఎంచుకున్నాను.
ఆలీ: పాతికేళ్లు ఏమైపోయారు?
అర్చన: గొప్ప గొప్ప దర్శకుల సినిమాల్లో నటించాను. నా సినిమాలు నాకు సంతృప్తినిచ్చాయి. ఐదారు భాషల్లో నటించాను. కొవిడ్‌ లేకపోయి ఉండుంటే నేను నటించిన ఏదో ఒక చిత్రం అమెరికా, లండన్‌ లాంటి ప్రాంతాల్లో నిర్వహించే ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితం అవుతూ ఉంటుంది. నేను నటించిన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోని ఎన్నో సినిమాలు ఇప్పటికీ ఆయా ఫెస్టివల్స్‌లో ప్రదర్శిస్తున్నారు. నటిగా నాకు ఇంతకంటే భాగ్యం మరొకటి లేదు.
ఆలీ: విదేశాల్లో మీ సినిమా ప్రదర్శనలు జరిగిన ఫెస్టివల్స్‌కి మీరు వెళ్లారా?
అర్చన: కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నన్ను ముఖ్య అతిథిగా అలాంటి ఫెస్టివల్స్‌కు పంపించింది. కళాకారులకు మన దేశం ఇస్తున్న గౌరవం అది. అలా హంగేరీకి వెళ్లాను. శ్రీలంకలో ఓ ఫెస్టివల్‌ను కూడా ప్రారంభించాను.
ఆలీ: జాతీయ చలన చిత్ర అవార్డుల జ్యూరీలో మీరు సభ్యురాలు కదా?
అర్చన: దక్షిణాదికి చెందిన వాళ్లని జ్యూరీ మెంబర్‌గా ఎన్నుకోవడం గౌరవం. దానిని నేను గౌరవం కంటే మించిన బాధ్యతగా భావిస్తున్నాను. అదొక ప్రభుత్వ ఉద్యోగంగా భావించి, ఫెస్టివల్‌కి వెళ్లి పని చేశాను. ఆ అవకాశం రావడం నా అదృష్టం.
ఆలీ: తెలుగు కుటుంబానికి చెందిన అర్చన.. తమిళ అమ్మాయిగా ఎలా మారింది?
అర్చన: మాది ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ పరిసర ప్రాంతాల్లోని ఓ ఊరు. నేను 11 నెలల బిడ్డగా ఉన్నప్పుడు మా కుటుంబం తమిళనాడుకి వలస వెళ్లింది. నేను పెరిగింది, చదువు పూర్తి చేసుకున్నది అంతా తమిళనాడులోనే! కాకపోతే అమ్మ తెలుగు మాట్లాడడం నేర్పించింది.
ఆలీ: మీ అసలు పేరు ఏమిటి?
అర్చన: నా అసలు పేరు సుధ. నేను ఇండస్ట్రీలోకి వచ్చే సమయానికి సుధ పేరుతో చాలామంది నటీమణులున్నారు. ముఖ్యంగా జయసుధ అక్క. ఆమె సినిమాలు చూసి ఎంతోమంది నటన నేర్చుకున్నారు. సుధ అనే పేరుతో గొప్ప నటీమణి ఉన్నప్పుడు, అదే పేరుతో ఎందుకు సినిమాల్లో చేయడం అని నా మనసుకు అనిపించింది. ఆ తర్వాత నా గురువు బాలుమహేంద్ర గారితో మాట్లాడి.. ‘అర్చన’గా ప్రేక్షకులకు పరిచయమయ్యాను.

alithoarchana650-1.jpg
ఆలీ: కథానాయికగా మీ మొదటి సినిమా?
అర్చన: ‘నిరీక్షణ’. ఆ సినిమా కంటే ముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించాను. కానీ హీరోయిన్‌గా నటించింది, మేజర్‌ రోల్‌ పోషించింది మాత్రం ‘నిరీక్షణ’లోనే! అందుకే ఆ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడుతుంటాను.
ఆలీ: ‘నిరీక్షణ’లో హీరోయిన్‌గా మిమ్మల్నే ఎంచుకోవడానికి గల కారణమేమిటి?
అర్చన: నా గురువు బాలుమహేంద్ర గారే ‘నిరీక్షణ’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ సినిమాకు ముందు ఆయనే నన్ను తమిళ సినిమా ద్వారా వెండితెరకు మొదట పరిచయం చేశారు. ఆయన ‘నిరీక్షణ’ తెరకెక్కించాలని అనుకుంటున్నప్పుడు గిరిజన యువతి పాత్రలో నటించడానికి నేను సరిపోతానని భావించి నాకు ఆ పాత్ర ఇచ్చారు.

alithoarchana650-4.jpg
ఆలీ: గ్లామర్ రంగంలో గిరిజన యువతిగా పాత్రలు పోషించడం కష్టమే కదా?
అర్చన: అలాంటి సమయంలో ఆ పాత్రను పూర్తిగా అర్థం చేసుకుని.. గిరిజన యువతి పాత్రలో నటించడం సాహసమనే చెప్పాలి. నేను ఆ పాత్రకు అంగీకరించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. నేను నా దర్శకుణ్ని నమ్మాను. ఎందుకంటే ఆయన చిత్రీకరించిన ఏ సినిమాలోనూ అశ్లీలత ఉండదు, గ్లామర్‌ అనేది ఉండదు. అందుకే ఏమీ ఆలోచించకుండా అందులో నటించాను. ఆ సినిమా విజయవంతమైంది. నా ఆలోచన కూడా సక్సెస్ అయ్యింది.
ఆలీ: మీరు సినిమాలు చూడరా?(నవ్వులు)
అర్చన: సినిమాలు ఎక్కువగా చూస్తాను. కానీ నా సినిమాలు నేను పెద్దగా చూడను. ఏ భాషలోనైనా మంచి సినిమాలు విడుదలైతే చూస్తాను. ‘మహానటి’, ‘జనతా గ్యారేజ్‌’.. ఈ మధ్య కాలంలో ఈ రెండు చిత్రాలు నాకు బాగా నచ్చాయి.
ఆలీ: ఈతరం హీరోల్లో తెలుగులో ఏ హీరో నటన మీకు బాగా నచ్చింది?
అర్చన: ‘జనతా గ్యారేజ్‌’ చూసినప్పుడు నాకు తారక్‌ నటన బాగా నచ్చింది. మోహన్‌లాల్‌ లాంటి పెద్ద నటుడికి.. ఆయన స్పేస్‌ ఆయనకు ఇచ్చి, ఈయన స్పేస్‌ ఈయన తీసుకొని నటించడం అనేది పెద్ద ఛాలెంజ్‌. తెలుగులో ఇంత మంచి చిత్రాలు వస్తున్నందుకు నేను చాలా సంతోషించాను.

alithoarchana650-3.jpg
ఆలీ: మీరు వద్దనుకున్న తెలుగు చిత్రాలు ఏమైనా ఉన్నాయా?
అర్చన: చాలా ఉన్నాయి. కానీ ఎవరిన్నీ బాధపెట్టడం ఇష్టం లేదు, అందుకే చెప్పను. నా దర్శకులు నా కోసం ఎంతో అందమైన స్క్రిప్ట్స్‌ రాసి, నా చేత నటింపజేసి నాకొక పెద్ద గుర్తింపు తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టారు. ఆ ఇమేజ్‌ని నేనే బ్రేక్‌ చేయకూడదు కదా. నన్ను ఈ స్థాయికి తీసుకురావడానికి నా దర్శకులు ఎంత కష్టపడుంటారు. నన్ను బాలుమహేంద్ర గారు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసేటప్పటికీ నేను తిరస్కారానికి గురైన నటిని. అలాంటి నన్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి, నిలబెట్టారు. అతికొద్ది సమయంలో నాకు రెండు సార్లు జాతీయ అవార్డు లభించింది. అందుకే మంచి చిత్రాలు వస్తే చేయాలి తప్ప ఈ కీర్తిని పాడుచేసుకోకూడదు అని నా మనసుకు అనిపించింది.
ఆలీ: మిమ్మల్ని తిరస్కరించిన చిత్రాలు ఏవి?
అర్చన: ‘కొత్త అమ్మాయి, సినిమాకే పనికిరాదు, రెండు క్లోజ్‌అప్‌లు తీసిన వెంటనే.. మొహంలో కళ లేదు, మొహమే పనికిరాదు’ అని నన్ను తిరస్కరించారు. అప్పుడు బాలు మహేంద్ర గారు నన్ను సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. అప్పటికి ఆయన భారతీయ చలనచిత్ర రంగంలో గొప్ప సినిమాటోగ్రాఫర్‌, ఫిల్మ్‌మేకర్‌. పరిశ్రమలో హీరోకి, నటుడికి, హీరోయిన్‌కి, రైటర్‌కు క్లాప్స్‌ కొడతారు. కానీ ఓ సినిమాటోగ్రాఫర్‌కి క్లాప్స్ కొట్టిన ఘనత బాలుమహేంద్రగారికి మాత్రమే దక్కింది. అలాంటి గొప్ప సినిమాటోగ్రాఫర్‌, దర్శకుడు నన్ను పరిచయం చేశారు.

alithoarchana650-7.jpg
ఆలీ: బాలుమహేంద్ర దర్శకత్వంలో మీరు ఎన్ని చిత్రాల్లో నటించారు?
అర్చన: దగ్గరదగ్గరగా ఐదు చిత్రాలు చేశాను. తెలుగు, తమిళ భాషల్లో నటించాను. హిందీలోనూ చేశాను. షాజీ.ఎన్.‌కరున్‌ దర్శకత్వంలో ‘నిషాద్‌‌’ అనే సినిమా చేశాను. ఆయన పద్మశ్రీ గ్రహీత, గొప్ప సినిమాటోగ్రాఫర్‌, దర్శకుడు.
ఆలీ: మీకు చిత్రాల్లో ప్రయోగాలు చేయడమంటే ఇష్టమా?
అర్చన: ‘సంధ్యారాగం’లో తొమ్మిది నెలల గర్భిణిగా సినిమా అంతటా కనిపించాను. నాకు ప్రయోగాత్మక సినిమాలంటే చాలా ఇష్టం. వాస్తవానికి దగ్గరగా ఉండే చిత్రాలు చేయడమంటే మక్కువ చూపుతాను. ఎందుకంటే నేను మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని. అందుకే నన్ను పక్కింటి అమ్మాయిలా చూసేవారు. దానివల్ల మిగిలిన వారి కంటే నాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది.
ఆలీ: మీరు నటించిన ‘దాసి’ చిత్రానికి ఐదు జాతీయ అవార్డులు వచ్చినప్పుడు మీకెలా అనిపించింది?
అర్చన: భారతీయ చలనచిత్ర రంగంలో ఒక గొప్ప చరిత్రను సృష్టించింది ‘దాసి’. ఆ సినిమాకు ఐదు పురస్కారాలు వచ్చాయి. అది దర్శకుడు బి.నర్సింగరావు గారి అంకితభావం. ఈ చిత్రంతో మమ్మల్ని ఆయన ఉన్నత స్థానంలో నిలిపారు.
ఆలీ: వరుస సంవత్సరాల్లో మీకు జాతీయ అవార్డులు వచ్చాయి. ఇంతవరకు మీ చరిత్రను ఎవరూ తిరగరాయలేదా?
అర్చన: ఒకటికి మించి జాతీయ పురస్కారాలు తీసుకున్న వారు ఉన్నారు. కానీ వరుస సంవత్సరాల్లో తీసుకున్నవాళ్లు లేరు. నేను 1988, 1989లో రెండు వరుస సంవత్సరాల్లో జాతీయ అవార్డులు అందుకున్నాను.

alithoarchana650-8.jpg
ఆలీ: ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల్లో నుంచి బెస్ట్‌ కమెడియన్‌ అవార్డు తొలగించారు. దీనికి మీరేమంటారు?
అర్చన: ఈ విషయమై నేను కచ్చితంగా మాట్లాడతాను. ఒక గంభీరమైన పాత్రలు చేయడం ఎంతో సులభం. కానీ, కామెడీ చేయడం చాలా కష్టం. నవ్వులు పంచడమనేది సాధారణ విషయం కాదు. అందుకే నేను అందరు కమెడియన్లను ఎంతో గౌరవిస్తాను.
ఆలీ: జాతీయ అవార్డు కమిటీ జ్యూరీలో నుంచి ఎందుకు మీరు వెళ్లిపోవాలనుకున్నారు?
అర్చన: కమిటీ జ్యూరీలో భాగంగా అగ్రిమెంట్‌ ఇచ్చాను. ఇక ఏం జరిగినా వెనుకడగు వేయకూడదు. నేనున్న కమిటీకి ఒక థియేటర్‌ ఇచ్చారు, అక్కడకు వెళ్లి చూసేటప్పటికీ చాలా చిన్నదిగా, అస్సలు బాగోలేదు. ఏ మాత్రం నాణ్యత లేదు. అలాంటి థియేటర్‌లో సినిమా చూసి దాని గురించి ఎలా చెప్పగలం అనిపించింది. ‘ఇదేనా థియేటర్‌. ఇందులో నేను చూడను’ అని అన్నాను. దానికి వాళ్లు ‘మేం ఏం చేయలేం’ అన్నారు. దాంతో నేను ‘చెన్నైకి నాకు టికెట్‌ కావాలి’ అన్నాను. ‘జ్యూరీ సభ్యురాలు కావడం నాకు గౌరవంగా కాదు.. బాధ్యతగా భావిస్తున్నాను’ అని చెప్పాను. వెంటనే జ్యూరీ ఛైర్‌ పర్సన్‌ వచ్చి మరొక థియేటర్‌కి మార్చారు. తర్వాత నన్ను వాళ్లు చక్కగా అర్థం చేసుకున్నారు.
ఆలీ: ‘నిరీక్షణ’లో భానుచందర్‌తో కలిసి నటించిన అనుభూతి ఎలా ఉండేది?
అర్చన: భానుచందర్‌తోనే నా కెరీర్‌ మొదలుపెట్టాను. తమిళంలో నా మొదటి చిత్రం ఆయనతోనే చేశాను. నాకు రెండోసారి జాతీయ అవార్డు వచ్చింది ఆయనతో నటించిన సినిమాలోనే. తర్వాత అతనితో నటించిన ‘నిరీక్షణ’లో నాకు స్పెషల్‌ జ్యూరీ అవార్డు వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన నాకు అన్నయ్య. మా మధ్య పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయి. కానీ రెండో రోజుకే కాంప్రమైజ్‌ అయిపోతాం. అంత లైవ్లీ, లవ్లీ రిలేషన్‌షిప్‌ మాది. మా మధ్య మధ్యవర్తి బాలుమహేంద్ర గారు. గొడవలు వచ్చినప్పుడు మా ఇద్దరి మధ్య సంది కుదిర్చేది ఆయనే.
ఆలీ: మీ కలర్‌ మీకు ప్లస్సా? మైనస్సా?
అర్చన: కలర్‌ విషయంలో మైనస్‌ అనే మాటకు అసలు అర్థమే లేదు. మనం భారతీయులం, ద్రవిడులం.. మన ఐడెంటిటీయే డార్క్‌. అందుకే నేను ఎప్పుడూ రంగును మైనస్‌ అనుకోలేదు. ఒక తెలుపు రంగు ఛాయ ఉన్న అమ్మాయి మంచి నటి అవుతుంది. అదే ఒక ఛాయ తక్కువ అమ్మాయి కెమెరా ముందుకు వస్తే కెమెరామెన్‌లకు లడ్డూలు తింటున్నట్టు ఉంటుంది. వాళ్లు ఆ డార్క్‌‌ని ఎలా కావాలంటే అలా మలచుకోవచ్చు. గొప్ప నటులందరూ ఛాయ తక్కువవారే. నా రంగు విషయంలో నేను చాలా గర్వపడుతున్నాను.
ఆలీ: బాలుమహేంద్రగారికి మీరు ఎక్కడ కనిపించారు. ఆయన మిమ్మల్ని ఎలా చూశారు?
అర్చన: ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో నేను సంవత్సరం పాటు యాక్టింగ్ కోర్సులో చేశాను. అక్కడికి అమెరికన్‌ దర్శకుడు విలియమ్‌ బ్రీవ్స్‌ వచ్చారు. అక్కడ నేను, నాజర్‌ కలసి ఓ ప్రదర్శన చేశాం. అందులో మా నటనను చూసి మెచ్చి, నాకు భారతీయ దర్శకుడు ఒకరు తెలుసు అని ఆయన దగ్గరికి తీసుకెళ్లారు. అలా నేను బాలుమహేంద్రను కలిశాను.

alithoarchana650-2.jpg
ఆలీ: మీలో ఉన్న డ్యాన్సర్‌ను చలనచిత్ర పరిశ్రమ ఉపయోగించుకుందా?
అర్చన: డ్యాన్స్‌కు ప్రాధాన్యమున్న పాత్ర చేయలేదనే కొరత నాకు అలాగే ఉండిపోయింది.
ఆలీ: 25 ఏళ్ల తరువాత మీరు ఒక పెద్ద తెలుగు చిత్రం ఒప్పుకున్నారని విన్నాను... నిజమేనా?
అర్చన: అవును ఓ సినిమా ఒప్పుకున్నాను. అంతేకాదు 25 ఏళ్ల తరువాత తొలిసారి నేను హైదరాబాద్‌ వచ్చాను. 25 ఏళ్ల తరువాత ఇదే నా మొదటి ఇంటర్వ్యూ. ఆ సినిమా గురించి మేనేజర్‌ చలపతి నా వెంటపడి మరీ కథ వినడానికి ఒప్పించాడు. దర్శకుడు స్క్రిప్ట్‌ చెప్పాక చాలా బాగుందనిపించింది. ఈ మధ్య కాలంలో అంతమంచి కథ ఏ భాషలోనూ వినలేదు. దాంతో పాటు ఆ దర్శకుడి యాటిట్యూడ్‌ కూడా నచ్చింది. ఆ తర్వాత నిర్మాత గురించి కూడా విన్నాను. తెలుగు పరిశ్రమలో చాలా ముఖ్యమైన నిర్మాత. కొవిడ్ తర్వాత ఎప్పుడు సినిమా మొదలైనా, నేను ఎక్కడున్నా, ఎంత దూరంలో ఉన్నా ఆ సినిమా చేస్తాను. అది నా బాధ్యత.. దానికి నేను సిద్ధంగా ఉన్నాను. స్క్రిప్ట్‌ మహిమ అది.
ఆలీ: మీ డ్రీమ్‌ రోల్‌ ఏదైనా ఉందా?
అర్చన: శాస్త్రీయ నృత్యం నేపథ్యంలో సినిమా చేయలేకపోయాను అనే బాధ ఉంది. దాంతో పాటు నేను సాధారణ ప్రజలకు దగ్గరగా ఉండే పాత్ర చేయాలనుకుంటున్నాను. సినిమాలో నా పాత్ర చూసి... ఇలాంటి అమ్మాయిని ఎక్కడో చూశాం అనిపించాలి. అలా ప్రతి కుటుంబంలో నేనుండాలి. అలాంటి పాత్రలు చేయాలి.. అంతేకాకుండా నాకు మూగ, చెవుడు ఉన్న అమ్మాయి పాత్ర చేయాలని అనిపిస్తుంటుంది. అలాగే కర్ణాటిక్‌ సింగర్ పాత్ర చేయాలనే డ్రీమ్‌ రోల్‌ ఉంది.
ఆలీ: ఈ షోకే మీకు రావాలని ఎందుకు అనిపించింది?
అర్చన: నాలుగేళ్లుగా మీరు నన్ను ఇంటర్వ్యూకి రమ్మని అడుగుతున్నారు. మీరు షోను హోస్ట్‌ చేస్తున్న విధానం నాకు నచ్చింది. మీకు నటుల విలువ తెలుసు.
అలీ: ‘నిరీక్షణ’ సినిమా చూస్తున్నప్పుడు... మీలో రేఖను చూసుకున్నాను?
అర్చన: ధన్యవాదాలు. రేఖను చూస్తే ఓ దేవతను చూస్తున్నట్లు ఉంటుంది.
ఆలీ: మీ చిత్రాలకు మీరే డబ్బింగ్‌ చెప్పేవారా?
అర్చన: కొన్ని చిత్రాలకు చెప్పాను. కొన్ని చిత్రాలు మనసుకు అతకలేదు. అందుకే చెప్పలేదు.
ఆలీ: తెలుగు చిత్రాల్లో నటించడం మానేయడానికి ఒక చేదు అనుభవం కారణమని అన్నారు. ఏమిటది?
అర్చన: అందులో పెద్దగా నిజం లేదు. కొన్ని పాత్రలు నాకు నచ్చలేదు. ఆత్మాభిమానం నాకు ముఖ్యం. నా విలువ తెలిసిన వాళ్లతో మాత్రమే నేను పనిచేయగలను. 30 సినిమాల్లో నటించాను. అందులో నాకు రెండు సినిమాలు నచ్చాయి. నేనే కాదు... 300 సినిమాలు నటించిన కథానాయికకు కూడా రెండోమూడో సినిమాలే వాళ్ల మనసుకు చాలా దగ్గరగా ఉంటాయి.

ఒక్క మాటలో...
బాలు మహేంద్ర- నా గురువు, మిత్రుడు
నిరీక్షణ - నాకు గుర్తుండిపోయే చిత్రం
భానుచందర్‌- మా అన్నయ్య
నలుపు- నేను
ఇళయరాజా- నా ప్రాణం
ఎస్పీ బాలసుబ్రమణ్యం- మాటలు లేవు
జాతీయ అవార్డు- ఇంకా ఆ నీడలోనే ఉన్నాను, ఆ నీడే నన్ను నిలబెడుతోంది
తెలుగు సినిమా- మంచి సినిమాలు వస్తున్నాయి. ఒక స్టేజీలో వంద సినిమాల్లో పది మాత్రమే మంచి చిత్రాలు.. మిగతావి చెప్పలేం అన్నట్టు ఉండేవి. ఇప్పుడు కంటెంట్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు బాగానే వస్తున్నాయి.

women icon@teamvasundhara
neha-dhupia-shares-empowering-message-on-breastfeeding-in-telugu

పాలిచ్చే తల్లుల్ని ఆ దృష్టితో చూడడమెందుకు?!

అమ్మ తన రక్తాన్ని పాలుగా మార్చి బిడ్డ ఆకలి తీర్చుతుంది.. ఇలా తన చిన్నారికి పాలిచ్చే క్రమంలో ఎంతో భావోద్వేగానికి, ఎనలేని ఆనందానికి లోనవుతుంటుంది. అయితే అమ్మతనానికి అద్దం పట్టే ఈ బ్రెస్ట్‌ఫీడింగ్‌ ప్రక్రియ గురించి మహిళల్లో ఎంత అవగాహన కల్పించినప్పటికీ అది నాలుగ్గోడలకే పరిమితమవుతుంది తప్ప.. బహిరంగ ప్రదేశాల్లో బిడ్డకు పాలివ్వడానికి నేటికీ చాలామంది తల్లులు ముందుకు రావట్లేదు. ఇందుకు కారణాలు అనేకం! ముఖ్యంగా తల్లి ఎంతో ప్రేమగా బిడ్డకు పాలిచ్చే ఈ ప్రక్రియను కొంతమంది చెడు దృష్టితో, లైంగిక విషయంగా పరిగణిస్తుంటారు. తల్లి పాలు తాగి పెరిగి.. తల్లితో సమానమైన అలాంటి మహిళలు వారి పిల్లలకు పాలిచ్చే క్రమంలో వారిని తప్పుడు దృష్టితో చూడడం, విమర్శించడం చేసే కొందరు మూర్ఖులు మన సమాజంలో కొందరున్నారు. అలాంటి వారికి తనదైన రీతిలో సమాధానమిచ్చింది బాలీవుడ్‌ లవ్లీ బ్యూటీ నేహా ధూపియా. ఈ క్రమంలో బ్రెస్ట్‌ఫీడింగ్‌ విషయంలో ఇటీవలే ఓ తల్లి ఎదుర్కొన్న చేదు అనుభవానికి మద్దతుగా నిలుస్తూ.. ఈ ప్రక్రియ ప్రాముఖ్యతను వివరిస్తూ ఈ ముద్దుగుమ్మ తాజాగా ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Know More

women icon@teamvasundhara
urvashi-dholakia-says-her-twin-sons-want-her-to-get-married-again-in-telugu

నా పిల్లలు నన్ను మళ్లీ పెళ్లి చేసుకోమంటున్నారు!

విడాకులకు సంబంధించి మన సమాజంలో పాటిస్తోన్న కొన్ని కట్టుబాట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తే మహిళలు, పురుషుల మధ్య ఉన్న అసమానతలేంటో స్పష్టంగా కనిపిస్తాయి. విడాకులు పొందిన మగవారు స్వేచ్ఛగా మరో వివాహం చేసుకోవచ్చు. పైగా ఈ విషయంలో అతనికి కుటుంబ సభ్యుల సానుభూతి, సహకారం రెండూ తోడవుతాయి. ఇదే ఆడవారి విషయానికొస్తే మాత్రం కుటుంబంలోనే కాదు సమాజంలోనూ భిన్న స్వరాలు వినిపిస్తుంటాయి. భర్త చనిపోయిన లేదా విడాకులు తీసుకున్న మహిళ రెండో పెళ్లి చేసుకుంటే అదొక పెద్ద నేరంగా భావిస్తారు. ఇక పిల్లలుండి రెండోసారి పెళ్లిపీటలెక్కిన వారైతే సూటి పోటి మాటలు, అవమానాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే.

Know More

women icon@teamvasundhara
naagin-5-actress-kajal-pisal-tests-negative-for-covid-19-and-shares-her-scary-experiences

కరోనాతో చావు అంచుల దాకా వెళ్లొచ్చాను!

రోగులతో కిటకిటలాడుతోన్న ఆస్పత్రులు... చాలాచోట్ల పడకలు లేక బయటే బాధితుల పడిగాపులు... ఆక్సిజన్‌ కొరతతో గాల్లో కలిసిపోతోన్న నిండు ప్రాణాలు...ఇలా కరోనా వైరస్ రెండో దశ యావత్‌ దేశాన్ని కలవరపెడుతోంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే... సామాన్యులే కాదు... పలువురు సెలబ్రిటీలు కూడా ఈ వైరస్‌ బారిన పడుతున్నారు. అలాంటి వారిలో ప్రముఖ బుల్లితెర నటీమణి కాజల్ పిసల్ ఒకరు. ‘నాగిన్ 5’ సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె... కొద్దిరోజుల క్రితం కరోనాకు గురైంది. ప్రస్తుతం పూర్తిగా కోలుకోనప్పటికీ... ఇటీవల జరిగిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో తనకు నెగెటివ్‌ అని తేలింది.

Know More

women icon@teamvasundhara
women-should-not-give-up-on-any-of-their-passions-says-geeta-basra

ఆ పవర్ మనకు పుట్టుకతోనే వచ్చింది!

అప్పటిదాకా జీవితంలో ఏదో సాధించాలని ఆరాట పడే మహిళల్లో చాలామంది పెళ్లి తర్వాత తమ కలలను పక్కన పెట్టేస్తుంటారు. భర్త, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు... తదితర బాధ్యతలలో పడి తమ ఆకాంక్షలు, ఆశయాలను త్యాగం చేసేస్తుంటారు. అయితే మల్టీ టాస్కింగ్‌ పవర్‌ అనేది మహిళల్లో సహజంగా ఉంటుందని... ఎవరూ పెళ్లి, పిల్లల కోసం తమ కలలను త్యాగం చేయాల్సిన అవసరం లేదంటోంది బాలీవుడ్‌ బ్యూటీ గీతా బస్రా. మాతృత్వం అనేది కేవలం వ్యక్తిగత విషయమని, ఓ మహిళ జీవితాన్ని అది పూర్తిగా నిర్వచించలేదని ఆమె చెబుతోంది. ఆరేళ్ల క్రితం టీమిండియా మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌తో పెళ్లిపీటలెక్కిన గీతకు హినయా హీర్‌ అనే నాలుగేళ్ల కూతురుంది. ఈ క్రమంలో మరోసారి తల్లి కాబోతున్న ఆమె తన వృత్తిగత, వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
pregnant-shreya-ghoshal-shares-pics-from-surprise-baby-shower

శ్రేయా ఘోషల్ సీమంతం వేడుకలు చూశారా?

ఆకట్టుకునే రూపం, అంతకుమించిన అద్భుతమైన స్వరంతో సంగీత ప్రియుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది శ్రేయా ఘోషల్‌. ‘జల జల జలపాతం’ అంటూ ప్రస్తుతం మనందరి మదిని మీటుతోన్న ఈ బ్యూటిఫుల్‌ సింగర్‌ త్వరలోనే తల్లిగా తన జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఈ మేరకు కొద్ది రోజుల క్రితమే ఈ శుభవార్తను సోషల్‌ మీడియాలో పంచుకుని మురిసిపోయిందీ అందాల గాయని. పుట్టబోయే బిడ్డ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తోన్న ఆమె బేబీ షవర్‌ (సీమంతం) ఫంక్షన్‌ వేడుకగా జరిగింది. శ్రేయ సన్నిహితులు, స్నేహితుల ఆధ్వర్యంలో వర్చువల్‌గా ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Know More

women icon@teamvasundhara
kanika-kapoor-recalls-the-hate-she-received-after-covid-diagnosis

అప్పుడు కరోనా కంటే వాళ్ల కామెంట్లే నన్ను ఎక్కువగా బాధపెట్టాయి!

సాఫీగా సాగిపోతున్న మన జీవితాల్లోకి కోరుకోని అతిథిలా వచ్చింది కరోనా. కనికరం లేకుండా కొన్ని లక్షల మందిని బలి తీసుకుంది. అదే సమయంలో భయం పేరుతో మనుషుల్లోని మానవత్వాన్ని కూడా మంటగలిపిందీ మహమ్మారి. ఇప్పుడు కరోనాకు భయపడడం కాస్త తగ్గింది కానీ సరిగ్గా ఏడాది క్రితం దేశమంతా లాక్‌డౌన్‌లో ఉన్న సమయాన అక్కడక్కడా జరిగిన కొన్ని సంఘటనలు మానవత్వానికి మాయని మచ్చలుగా మిగిలిపోయాయి. చాలా ప్రాంతాల్లో కరోనా సోకిన వారి పట్ల వివక్ష చూపడం, వారి కుటుంబ సభ్యులను అవమానాలకు గురిచేయడం లాంటి సంఘటనల గురించి మనకు తెలిసిందే.

Know More

women icon@teamvasundhara
mira-rajput-interacting-with-instagram-fans-and-held-thisorthat-session

అదంటే ఎక్కువ ఇష్టం.. ఆ విషయం షాహిద్‌కి కూడా తెలుసు!

మీరా రాజ్‌పుత్‌.. బాలీవుడ్‌ స్టార్‌ హీరో షాహిద్‌ కపూర్‌ సతీమణి అయిన ఈ ముద్దుగుమ్మకు సోషల్‌ మీడియాలో స్టార్‌ హీరోయిన్లను మించిన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఇన్‌స్టాలో ఆమెను 2.5 మిలియన్ల మంది అనుసరిస్తున్నారంటే ఆమెకున్న క్రేజ్‌ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. భర్త, పిల్లలు, కుటుంబ బాధ్యతలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్‌ మీడియాలో తన ఫ్యాన్స్‌కు నిత్యం టచ్‌లోనే ఉంటుందీ బ్యూటిఫుల్‌ మామ్‌. తన గ్లామరస్‌, ఫ్యాషనబుల్‌ ఫొటోలు, వీడియోలను షేర్‌ చేసుకోవడంతో పాటు...వీలు చిక్కినప్పుడల్లా ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తూనే ఉంటుంది. అలా తాజాగా తన అభిమానులతో ‘దిస్‌ ఆర్‌ దట్‌’ సెషన్‌ను నిర్వహించింది మీరా. ఈ సందర్భంగా తన వ్యక్తిగత విశేషాలు, అభిరుచులు, షాహిద్‌తో తనకున్న అనుబంధం గురించి బోలెడన్ని విషయాలు పంచుకుంది. మరి, అవేంటో మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
dia-mirza-clarification-over-her-pregnancy-getting-married

అందుకే అప్పుడు ప్రెగ్నెన్సీ గురించి చెప్పలేకపోయాను!

‘బోల్డ్‌ అండ్‌ బ్యూటిఫుల్‌’ అన్న మాటలకు సరిగ్గా సరిపోతుంది బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా. సామాజిక అంశాలు, మహిళల సమస్యలపై తనదైన శైలిలో స్పందించే తెగువే ఆమెకు ఆ ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఇటీవల తాను తల్లిని కాబోతున్నానంటూ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించిందీ అందాల తార. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండో వివాహం చేసుకున్న దియా తన ప్రెగ్నెన్సీ విషయం చెప్పగానే పెళ్లికి ముందే ఆమె గర్భం దాల్చిందా? అన్న సందేహాలు చాలామందిలో తలెత్తాయి. కొందరు నెటిజన్లు ఆమెపై ట్రోల్స్‌, విమర్శలు కూడా గుప్పించారు. ఈ క్రమంలో తన ప్రెగ్నెన్సీకి సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు, నెటిజన్లు లేవనెత్తిన పలు సందేహాలకు తనదైన శైలిలో సమాధానమిచ్చిందీ అందాల తార.

Know More

women icon@teamvasundhara
actress-and-tv-host-hariteja-blessed-with-a-baby-girl-in-telugu
women icon@teamvasundhara
from-yoga-to-ghar-ka-khaana-shilpa-shetty-reveals-20-things-she-loves

ఈ 20 నాకెంతో ఇష్టం!

శిల్పా శెట్టి...ఈ పేరు తలచుకోగానే సన్నజాజి తీగ లాంటి నాజూకైన శరీరాకృతి, అందమైన రూపం మన కళ్ల ముందు కదలాడుతుంది. వయసు పెరుగుతోన్నా వన్నె తరగని ఈ అందాల రాణి పూర్తి స్థాయి సినిమాలో నటించి సుమారు పద్నాలుగేళ్లు గడిచాయి. అయినా తన క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదంటే అందుకు ప్రధాన కారణం సోషల్‌ మీడియానే అని చెప్పుకోవచ్చు. తన గ్లామరస్‌, ఫ్యాషనబుల్‌ ఫొటోలు, వీడియోలతో పాటు.. తాను పాటించే ఆహార, ఫిట్‌నెస్‌ నియమాల వివరాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకోవడం ఈ సొగసరికి అలవాటు. అందుకు తగ్గట్టే సామాజిక మాధ్యమాల్లో శిల్పను అనుసరించే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఇన్‌స్టా ఫాలోవర్ల సంఖ్య 20 మిలియన్లకు చేరుకుంది. ఈ సందర్భంగా తన అభిమానులకు ధన్యవాదాలు చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ.

Know More

women icon@teamvasundhara
miss-india-finalist-diksha-singh-to-contest-up-panchayat-poll

ఈ అందాల రాణి అందుకే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తుందట!

ప్రస్తుతం దేశమంతా ఎన్నికల ఫీవర్‌ నడుస్తోంది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు, లోక్‌సభ స్థానాలతో పాటు ఆయా రాష్ట్రాల్లోని మున్సిపాలిటీ, పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండడంతో ఎక్కడ చూసినా ఎన్నికల కోలాహలమే కనిపిస్తోంది. ఈక్రమంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ తారలు ఎంపీగానో, ఎమ్మెల్యేగానో పోటీ చేస్తూ రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కానీ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మోడల్‌ మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తూ పంచాయతీ ఎన్నికల బరిలో దిగింది. 2015మిస్ ఇండియా ఫైనలిస్ట్‌ అయిన ఆమె.. పలు వాణిజ్య ప్రకటనలు, మ్యూజిక్ వీడియోల్లోనూ నటించి మెప్పించింది. మరి అలాంటి అందాల రాణి పంచాయతీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తుందో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
kirti-kulhari-announces-separation-from-husband-saahil-sehagal-after-5-years-of-marriage
women icon@teamvasundhara
these-star-kids-are-making-a-splash-on-social-media-in-telugu

women icon@teamvasundhara
meet-geeta-a-52-years-teacher-turned-lingerie-model-who-is-redefining-beauty-standards

ఈ వయసులో లో దుస్తుల మోడలింగ్‌ ఎందుకంటే!

చూడగానే ఆకట్టుకునే అందం... సొగసైన శరీరాకృతి... పొడవాటి కేశ సౌందర్యం... ఇలా నవ యవ్వనంతో మెరిసిపోయే యువ అందాలనే తమ ఉత్పత్తుల ప్రచారకర్తలుగా, అంబాసిడర్లుగా నియమించుకుంటాయి దుస్తుల తయారీ సంస్థలు. యువతులు, మధ్య వయసు మహిళలు, వృద్ధులు... ఏ వయసు వారి దుస్తులకైనా యువతులనే ప్రచారకర్తలుగా తీసుకుంటాయి. వయసు ప్రతిపాదికన మోడల్స్‌ను తీసుకునే సంస్థలు ఎక్కడా కనిపించవు. ఈ క్రమంలో ‘నా వయసు వారి లో దుస్తులకు నా వయసు వారినే మోడల్స్‌గా ఎందుకు నియమించకూడదు’ అనే ఓ సరికొత్త ఆలోచనను రేకెత్తించింది ముంబయికి చెందిన 52 ఏళ్ల గీత. లో దుస్తుల మోడలింగ్‌లో దూసుకెళుతోన్న ఆమె లింగరీ మోడలింగ్‌పై ఆన్‌లైన్‌ వేదికగా ఒక ఉద్యమమే చేస్తున్నారు. ఇంతకీ ఎవరామె ఎందుకీ ఉద్యమం చేస్తున్నారో తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
shweta-tiwari-on-how-failed-marriages-impacted-her-children

నేను చేసిన తప్పులు నా కూతురు అస్సలు చేయదు!

స్వశక్తితో సొంత కాళ్లపై నిలబడినా... వ్యక్తిగతంగా ఎంత ఎత్తుకు ఎదిగినా విడాకులు తీసుకున్న స్త్రీలంటే ఈ సమాజంలో కాస్త చిన్నచూపు ఉంటుంది. వాళ్లేదో తప్పు చేశారన్నట్లుగా చాలామంది వారిని చులకన భావంతో చూస్తుంటారు. తల్లిదండ్రుల వ్యక్తిగత జీవితాన్ని వారి పిల్లలకు ముడిపెడుతూ సూటిపోటి మాటలతో అవమానాలకు గురిచేస్తుంటారు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత జీవితంలో తాను చేసిన కొన్ని పొరపాట్ల కారణంగా నేటికీ తాను, తన పిల్లలు ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొంటున్నామంటోంది ప్రముఖ బుల్లితెర నటి శ్వేతా తివారీ. తన అందం, అభినయంతో బాలీవుడ్‌ బుల్లితెరను ఏలుతోన్న ఈ ముద్దుగుమ్మ రెండుసార్లు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టినా చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ప్రస్తుతం సింగిల్ మదర్‌గానే కొనసాగుతోన్న ఆమె.. ఓవైపు తన కెరీర్‌ను కొనసాగిస్తూనే.. మరోవైపు తన ఇద్దరు పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటోంది. ఈక్రమంలో తన విడాకుల వ్యవహారం, పిల్లలపై దాని ప్రభావం గురించి పలు ఆసక్తికర విషయాలను అందరితో షేర్‌ చేసుకుందీ అందాల తార.

Know More

women icon@teamvasundhara
rubina-dilaik-opens-up-about-her-mental-health-issues-in-telugu

అప్పుడు డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను!

డిప్రెషన్... ప్రపంచంలో ఎక్కువమంది ఎదుర్కొంటున్న మానసిక సమస్యల్లో ఇది కూడా ఒకటి. ఆకాశమంత ఎదిగిన మనిషిని కూడా అధఃపాతాళానికి తొక్కేస్తుందీ సమస్య. హార్మోన్ల స్థాయుల్లో మార్పులు, వ్యక్తిగత, ఆర్థికపరమైన సమస్యలు, పని ఒత్తిడి... వంటి ఎన్నో కారణాలు డిప్రెషన్‌ తలెత్తడానికి దోహదం చేస్తాయి. మనిషిని శారీరకంగా, మానసికంగా ఎంతో కుంగదీసే ఈ సమస్యను మొదట్లోనే అడ్డుకోవాలి. లేకపోతే దీనిని భరించలేక చాలామందికి చనిపోవాలనే ఆలోచన కూడా వస్తుంటుంది. ఈ నేపథ్యంలో మానసిక ఆందోళనతో గతంలో తన మదిలోనూ ఆత్మహత్య ఆలోచనలు మెదిలాయంటోంది ‘ఛోటీ బహూ’ రుబీనా దిలాయిక్‌. ఆకట్టుకునే అందం, అలరించే అభినయంతో బాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకుల అభిమానం చూరగొంటున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల ముగిసిన బిగ్‌బాస్‌-14 సీజన్‌లోనూ విజేతగా అవతరించింది. తద్వారా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. అప్పటి నుంచి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకుంటున్న ఈ ముద్దుగుమ్మ... తాజాగా డిప్రెషన్‌తో తనకెలాంటి గడ్డు పరిస్థితులెదురయ్యాయో అందరితో పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
ankita-lokhande-shares-casting-couch-experience-in-telugu

సినిమా ఛాన్స్ కావాలంటే నిర్మాతతో కాంప్రమైజ్‌ కావాలన్నాడు!

రంగుల ప్రపంచం లాంటి సినిమా ఇండస్ట్రీలో ఒక మహిళ రాణించాలంటే ఎన్నో ముళ్ల దారులు దాటాల్సి ఉంటుంది. అవకాశమొస్తే కాటేయాలని చూసే ఎన్నో మృగాలు ఆ దారిలో కాచుకుని ఉంటాయి. వాటి నుంచి తప్పించుకుని తెరపై కనిపించి, అభిమానులు మెచ్చిన నటిగా గుర్తింపు పొందాలంటే అంత సులభమేమీ కాదు. ఈక్రమంలో చాలామందిలాగే తానూ ఎన్నో ముళ్లదారులను దాటాకే సినిమా పరిశ్రమలో నిలదొక్కుకున్నానంటోంది బాలీవుడ్‌ నటి అంకితా లోఖండే. దివంగత నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ప్రేయసిగా ఎక్కువగా వార్తల్లో నిలిచిన ఆమె కెరీర్‌ ప్రారంభంలో తానూ క్యాస్టింగ్‌ కౌచ్‌ బారిన పడ్డానంటోంది. ఈ నేపథ్యంలోనే దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకెదురైన కొన్ని చేదు అనుభవాలను అందరితో పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
sameera-reddy-says-she-had-it-hard-as-a-teenager-as-she-would-stammer-and-was-on-the-heavier-side

అప్పట్లో ఆ కామెంట్లను తట్టుకోలేకపోయాను!

కాస్త బొద్దుగా ఉన్న అమ్మాయిల్ని చూడగానే కొంతమంది వెంటనే ‘అబ్బ ఎంత లావుగా ఉంది’ అంటూ నవ్వుకోవడం, హేళన చేయడం చేస్తుంటారు. ఇక సోషల్‌ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు... బొద్దుగా ఉన్న వాళ్లు సరదాకి ఏదైనా ఫొటో షేర్ చేస్తే చాలు... కామెంట్ల రూపంలో అసభ్యకర మాటలు, దూషణలు కనిపిస్తుంటాయి. ఇలాంటి మాటలతో ఎదుటివారి ఆత్మాభిమానం దెబ్బతింటుందని తెలిసినా ఇలాగే ప్రవర్తిస్తుంటారు. ఈ క్రమంలో అధిక బరువు కారణంగా తానూ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానంటోంది బాలీవుడ్‌ అందాల తార సమీరా రెడ్డి. అయితే సమాజంలో అన్ని విషయాలను సహనంతో ఎదుర్కొన్నానని, తన పిల్లలకు కూడా అదే నేర్పిస్తానంటూ ఇన్‌స్టాలో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ను షేర్‌ చేసిందీ సూపర్‌ మామ్.

Know More

women icon@teamvasundhara
geeta-basra-harbhajan-expecting-second-child-in-july

మరోసారి అమ్మను కాబోతున్నా!

అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందుతున్నామని తెలియగానే కలిగే ఆనందం అనిర్వచనీయం. ఇక మొదటిసారి పేరెంట్స్‌గా మారిన జంటలు... మరోసారి తల్లిదండ్రులయ్యేసరికి మరింత ఆనందోత్సాహాలకు, భావోద్వేగానికి గురవుతుంటారు. తమ సంతోషాన్ని అందరితో షేర్‌ చేసుకుని మురిసిపోతుంటారు. ప్రస్తుతం అలాంటి ఆనందంలోనే మునిగి తేలుతున్నారు బాలీవుడ్‌ బ్యూటీ గీతా బస్రా-టీమిండియా మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌. ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతులకు ఇప్పటికే హినయా హీర్‌ అనే నాలుగేళ్ల కూతురుంది. ఈ సందర్భంగా త్వరలోనే తాము మరోసారి తల్లిదండ్రులం కాబోతున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసుకున్నారీ లవ్లీ కపుల్.

Know More

women icon@teamvasundhara
actress-varalakshmi-and-vijayalalitha-in-alitho-saradaga-chat-show

ఆకలి బాధ ఎలా ఉంటుందో తెలుసు..!

వారిద్దరూ విభిన్న పరిస్థితుల మధ్య వెండితెరకు పరిచయమయ్యారు. ఒకరు చెల్లెలిగా మెప్పిస్తే.. మరొకరు ప్రత్యేక పాత్రలు, స్పెషల్‌ సాంగ్స్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. తమ సుదీర్ఘ సినీ ప్రస్థానంలో చిరస్థాయిగా నిలిచిపోయే పాత్రలెన్నో పోషించారు. అద్భుత అభినయంతో అశేష అభిమానాన్ని సొంతం చేసుకున్న వారే సీనియర్‌ నటీమణులు వరలక్ష్మి, జయలలిత. ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను సైతం అలరిస్తోన్న వీరు ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ సినీ కెరీర్‌, ఎదుర్కొన్న ఒడిదొడుకులు, ఆనంద క్షణాలు.. ఇలా ఎన్నో అనుభూతులను అందరితో పంచుకున్నారు. మరి, ఆ సరదా సంగతులేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
sunitha-takes-instagram-to-counter-trolls-on-women’s-day

మీరు నిందిస్తారు.. అండగా నిలవరు.. అయినా క్షమిస్తా!

రాజ్యాంగం అందించిన ‘భావ ప్రకటన స్వేచ్ఛ’ను అడ్డుపెడ్డుకుంటూ కొంతమంది అవసరం లేకపోయినా ఇతరుల జీవితాల్లోకి తొంగిచూస్తుంటారు. తాము ఎలా ఉన్నా సరే... వారిని మాత్రం నోటికొచ్చినట్లు ఆడిపోసుకుంటుంటారు. ఇక సోషల్‌ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొంతమంది నెటిజన్లు ఎదుటివారి మనోభావాలు దెబ్బతినేలా కామెంట్లు పెడుతుంటారు. ప్రత్యేకించి వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలను టార్గెట్‌ చేసుకుని, వివిధ సామాజిక మాధ్యమాల వేదికగా వారిని ట్యాగ్ చేస్తూ విమర్శిస్తుంటారు. ఈ క్రమంలో ప్రముఖ సింగర్‌ సునీత కూడా సోషల్‌ మీడియాలో ఎన్నోసార్లు నెగెటివ్‌ కామెంట్స్‌, ట్రోల్స్‌ను ఎదుర్కొంది. అయితే ఎప్పుడూ పెద్దగా వాటిపై స్పందించని ఈ స్టార్‌ సింగర్‌ తాజాగా నోరు విప్పింది. సోషల్‌ మీడియా ట్రోల్స్‌ కారణంగా తానెలా ఆవేదన చెందానో అందరితో షేర్‌ చేసుకుంది. అదే సందర్భంలో అకారణంగా తనను ఆడిపోసుకున్న వారికి సున్నితంగా సమాధానమిచ్చింది.

Know More

women icon@teamvasundhara
singer-shreya-ghoshal-announces-first-pregnancy-with-this-adorable-post

నేను అమ్మను కాబోతున్నా!

మహిళలకు అమ్మతనానికి మించి మరే విషయం అమితానందాన్ని ఇవ్వదు. అందుకే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన మహిళలందరూ ఎప్పుడెప్పుడు అమ్మగా ప్రమోషన్‌ పొందుదామా? అని వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. ఇక కడుపులో నలుసు పడిందని తెలిసిన మరుక్షణం వారి ఆనందానికి ఆకాశమే హద్దు. ప్రస్తుతం అలాంటి ఆనందాన్నే ఆస్వాదిస్తోంది అందాల సింగర్ శ్రేయాఘోషల్. తన శ్రావ్యమైన స్వరంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ స్టార్‌ సింగర్‌ త్వరలో అమ్మగా ప్రమోషన్‌ పొందనుంది. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా ఈ శుభవార్తను అందరితో షేర్‌ చేసుకున్న ఆమెకు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్ల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Know More

women icon@teamvasundhara
jayasudha-latest-grey-hair-look-goes-viral-on-social-media

మా ‘సహజ నటి’ ఎందుకిలా మారిపోయారు?

జయసుధ... నాలుగున్నర దశాబ్దాలుగా సినీ కళామతల్లికి సేవలు అందిస్తున్న ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అలనాడు కథానాయికగా కుర్రకారు మనసులు దోచుకున్న ఆమె... నేడు మోడ్రన్‌ మదర్‌గా వైవిధ్యమైన పాత్రల్లో మెప్పిస్తున్నారు. ఇలా తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మదిలో ‘సహజనటి’గా సుస్థిర స్థానం సంపాదించుకున్న జయసుధ చివరిగా రెండేళ్ల క్రితం ‘రూలర్‌’ సినిమాలో నటించారు. ఆ సినిమా తర్వాత ఎక్కడా కనిపించని ఆమె చాలా రోజుల తర్వాత మన ముందుకొచ్చారు. ఇందులో భాగంగా ‘జానకి కలగనలేదు’ అనే సీరియల్‌ బృందానికి అభినందనలు తెలుపుతూ సోషల్‌ మీడియాలో ఓ వీడియోను రిలీజ్‌ చేశారీ అందాల తార.

Know More

women icon@teamvasundhara
richa-gangopadhyay-announces-pregnancy-on-social-media

మా బార్బీ డాల్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాం!

అమ్మతనం మాటలకందని అనుభూతినిస్తుంది. కడుపులో నలుసు పడిన క్షణం మొదలు ప్రసవం అయ్యేంత వరకు ప్రతి క్షణం పుట్టబోయే బిడ్డ గురించే ఆలోచిస్తుంటుంది అమ్మ మనసు. ఎప్పుడెప్పుడు తన చిన్నారిని చేతుల్లోకి తీసుకుందామా అని ఎదురుచూస్తూ మాతృత్వంలోని మధురిమలను ఆస్వాదిస్తుంటుంది. ప్రస్తుతం అలాంటి మధురానుభూతుల్లోనే తేలియాడుతోంది రిచా గంగోపాధ్యాయ్‌. ‘మిర్చి’ సినిమాలోని ‘మానస’ పాత్రతో కుర్రకారు మనసులు కొల్లగొట్టిన ఈ అందాల తార త్వరలోనే అమ్మగా ప్రమోషన్‌ పొందనుంది. ఈ మేరకు సోషల్‌ మీడియా ద్వారా తను తల్లి కాబోతున్న శుభవార్తను అందరితో షేర్‌ చేసుకుని మురిసిపోయిందీ ముద్దుగుమ్మ.

Know More

women icon@teamvasundhara
sreemukhi-chitchat-with-fans-in-instagram-in-telugu

నా బాయ్ ఫ్రెండ్ పేరు ఏంటంటే...!

శ్రీముఖి... తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెరపై తనదైన స్టైల్‌, మ్యానరిజమ్స్‌తో ఇట్టే ఆకట్టుకునే ఈ అందాల తార ..‘నేను శైలజ’, ‘జులాయి’ తదితర హిట్ సినిమాలతో వెండితెర ప్రేక్షకులను కూడా మెప్పించింది. ఇక బిగ్‌బాస్‌-3 రియాల్టీ షోలో రన్నరప్‌గా నిలిచి అమితమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్న శ్రీ ప్రస్తుతం పలు టీవీ షోలు, కార్యక్రమాలతో బిజీబిజీగా ఉంటోంది. సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉండే ఈ భామ... తన వృత్తిగత, వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అందులో పోస్ట్‌ చేస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ‘Post A Picture of’! Or ‘Ask Me Anything’ పేరుతో తన అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులతో దిగిన ఫొటోలతో పాటు ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సరదాగా సమాధానాలిచ్చింది.

Know More

women icon@teamvasundhara
mira-rajput-held-an-ask-me-anything-session-on-instagram-and-answered-multiple-questions-about-her-life-marriage-and-more

షాహిద్‌ కాదు.. అతడే నా ఆల్‌టైమ్‌ క్రష్!

మన జీవితంలో మనకు ఇష్టమైన వాళ్లు ఎంతమంది ఉన్నా.. తొలిచూపులోనే మన మనసు దోచుకున్న వాళ్లు (క్రష్‌) మాత్రం ఒక్కరే ఉంటారు. ఈ ప్రశ్నకు సమాధానం తన భర్త షాహిద్‌ మాత్రం కాదంటోంది మీరా రాజ్‌పుత్‌. బాలీవుడ్‌ హ్యాండ్‌సమ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ భార్యగానే కాదు.. తనదైన ఫ్యాషన్‌ సెన్స్‌తో సోషల్‌ మీడియాలో క్రేజ్‌ సంపాదించుకుందీ ముద్దుగుమ్మ. భర్త, పిల్లలు, కుటుంబ బాధ్యతలతో తానెంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్‌ మీడియాలో తన ఫ్యాన్స్‌కు అనుక్షణం టచ్‌లోనే ఉంటుందీ అందాల అమ్మ. అంతేనా.. వీలు చిక్కినప్పుడల్లా వారితో ముచ్చటిస్తుంటుంది కూడా! అలా తాజాగా ఇన్‌స్టాలో ‘ఆస్క్‌ మీ ఎనీథింగ్‌’ సెషన్‌ నిర్వహించింది మీరా. ఈ క్రమంలో తన భర్త, పిల్లలు, బ్యూటీ సీక్రెట్స్‌, ఫిట్‌నెస్‌.. వంటి బోలెడన్ని విషయాలతో పాటు తన క్రష్‌ ఎవరో కూడా చెప్పుకొచ్చింది. మరి, ఆ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More