‘ఓ మహిళగా ఈ సమాజంలో ముందుకెళ్లాలంటే ఎన్నో కట్టుబాట్లను దాటాలి.. మరెన్నో మూస ధోరణుల్ని బద్దలు కొట్టాలి.. అప్పుడే విజయం మనల్ని వరిస్తుంది.. ఇందుకు నేనే తాజా ఉదాహరణ’ అంటోంది ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఆస్ట్రేలియాగా కిరీటం గెలిచిన మారియా థాటిల్. 27 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ భారత సంతతికి చెందిన మహిళ కావడం విశేషం. ప్రేమను ప్రేమతోనే జయించాలి, మన ఆనందాన్ని నలుగురికీ పంచాలని తన తల్లి చెప్పిన సిద్ధాంతాన్ని నమ్మి.. అదే ప్రేమతో, మనో సౌందర్యంతో తాజాగా అందాల కిరీటం గెలిచిన ఈ చక్కనమ్మ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..
వర్ణ వివక్ష, జాతి వివక్ష, లింగ అసమానతలు, ఆడవాళ్లను బలహీనులుగా చూడడం.. నిజానికి ఇవన్నీ మనుషుల మధ్య అంతరాలను పెంచేవే కానీ తగ్గించేవి కావు! ఈ క్రమంలో ఎన్నో కట్టుబాట్లు, మూస ధోరణులు మహిళల విజయానికి అడ్డంకులుగా మారుతున్నాయి. ఇలాంటి నిబంధనల్ని, కట్టుబాట్లను ఛేదించి ‘మిస్ యూనివర్స్ ఆస్ట్రేలియా’గా అవతరించింది భారత సంతతికి చెందిన మారియా థాటిల్.
నా విజయోత్సాహం అంతులేనిది!
‘మిస్ యూనివర్స్ ఆస్ట్రేలియా’ అందాల పోటీలు కరోనా కారణంగా తొలిసారి వర్చువల్‌గా జరిగాయి. ఈ పోటీల్లో విక్టోరియా రాష్ట్రం తరఫున పాల్గొంది మారియా.
ఇతర రాష్ట్రాలకు చెందిన అతివల్ని వెనక్కి నెట్టి తన అందం, ఆత్మ సౌందర్యంతో కిరీటాన్ని తన వశం చేసుకుందీ ఇండో-ఆస్ట్రేలియన్. ఎన్నో సంస్కృతులు, సంప్రదాయాలున్న ఈ సమాజంలో ఓ మహిళగా కిరీటం అందుకోవడం చెప్పలేనంత సంతోషంగా ఉందంటోంది మారియా.
‘ఎన్నో సంస్కృతులు, సంప్రదాయాలు కలబోసిన ఈ సమాజానికి చెందిన నేను ఈ అందాల కిరీటం అందుకోవడాన్ని ఎంతో గర్వంగా, గౌరవంగా భావిస్తున్నా. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నా. ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ జాతి, లింగ భేదం, సామర్థ్యం.. వంటి అంశాలకు అతీతంగా ముందుకు సాగాలి. ప్రతి ఒక్కరికీ వారి మనసులోని భావాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ, హక్కు ఉన్నాయి. కాబట్టి వారి నేపథ్యంతో సంబంధం లేకుండా, వారికి అడ్డుపడకుండా ముందుకెళ్లేలా మన వంతుగా సహకరిద్దాం.. ప్రోత్సహిద్దాం..! నేనూ ఈ సమాజంలో కొన్ని అంతరాలను చవిచూశాను.. మరికొన్ని కట్టుబాట్లను ఎదుర్కొన్నాను.. అయినా వాటిని దాటుకుంటూ ముందుకు సాగాను.. అందుకే ఇప్పుడు మీ అందరి ముందు విజేతగా నిల్చున్నాను..’ అంటూ కిరీటం గెలిచిన ఆనందంలో తన మనసులోని భావాల్ని అందరితో పంచుకుందీ అందాల తార.
భారతీయ మూలాలను మర్చిపోను!
ప్రస్తుతం ఆస్ట్రేలియాలో స్థిరపడ్డా భారతీయ మూలాలను, ఆ దేశంతో అనుబంధాన్ని ఎప్పటికీ మర్చిపోనంటోందీ మిస్ యూనివర్స్ ఆస్ట్రేలియా. ‘మా నాన్నది కేరళ.. అమ్మది కోల్‌కతా. ప్రస్తుతం మేము ఆస్ట్రేలియాలో స్థిరపడ్డా అప్పుడప్పుడూ భారత్‌కు వచ్చి అక్కడున్న మా బంధువుల్ని కలిసి వెళ్తుంటాం. ఇక అమ్మ తరఫు బంధువులంతా మెల్‌బోర్న్‌లోనే స్థిరపడ్డారు. నేను ఆస్ట్రేలియాలోనే పుట్టి పెరిగినా నా రక్తంలో భారతీయత ఉంది.. కాబట్టి ఆసీస్, ఇండియా.. ఈ రెండూ నాకు రెండు కళ్లు..!’ అంటూ ఇండియా పట్ల తన ప్రేమను చాటుకుందీ అందాల రాశి.
అమ్మ మాట మరవను!
సాధారణంగా మనకేదైనా బాధ కలిగితే నలుగురికీ చెప్పుకొని ఆ భారాన్ని కాస్త దించుకుంటాం.. కానీ సంతోషమొచ్చినా నలుగురితో పంచుకోవాలని, ఆ ఆనందాన్ని వారికీ షేర్ చేయాలని అమ్మ ఎప్పుడూ చెబుతుంటుందని, తాను కూడా అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నానంటోందీ బ్యూటీ.
‘నీకొచ్చిన బహుమతులు, దీవెనలు, ఆనందం.. ఇవన్నీ నీలోనే దాచుకోకు.. నలుగురితో పంచుకో.. వారికి ప్రేమను పంచు.. సంతోషాన్ని పంచడంలోనే నిజమైన ఆనందం, సంతృప్తి దాగున్నాయి.. అంటూ అమ్మ ఎప్పుడూ చెబుతుంటుంది. ప్రేమను ప్రేమతోనే జయించాలని, అప్పుడే ఈ వివక్షలనే అడ్డుగోడల్ని బద్దలు కొట్టచ్చని, అందరూ కలిసి ముందుకు సాగితేనే ఏదైనా సాధించగలమని.. ఇలా అమ్మ మాటల్ని ఎప్పటికీ మరవను. అదే సిద్ధాంతాన్ని కొనసాగిస్తా..’ అంటూ తన ఆత్మ సౌందర్యాన్ని చాటుకుందీ ఇండో-ఆస్ట్రేలియన్. కేవలం మాటలకే పరిమితం చేయకుండా.. తన విజయానందాన్ని ఇరుగుపొరుగు వారితో, స్నేహితులతో, మిస్ యూనివర్స్ ఆస్ట్రేలియా బృందంతో, బంధువులతో పూల బొకేలిచ్చి మరీ పంచుకుందీ ముద్దుగుమ్మ.
ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్గా..!
అందమంటే బయటికి కనిపించేది కాదు.. నలుగురికీ ప్రేమ పంచడం అని చెబుతోన్న 27 ఏళ్ల మారియా.. ‘సైకాలజీ ఆఫ్ మేనేజ్మెంట్’ విభాగంలో ఉన్నత విద్యనభ్యసించింది. ప్రస్తుతం ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్గా కొనసాగుతోన్న ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 62 వేల మందికి పైగా ఫాలోవర్లున్నారు. అంతేకాదు.. ‘మారియా థాటిల్’ పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్‌ని కూడా నిర్వహిస్తోందీ టీనేజర్. ఇందులో భాగంగా మేకప్, లైఫ్‌స్టైల్.. తదితర అంశాలకు సంబంధించిన వీడియోల్ని పోస్ట్ చేస్తుంటుందీ అందాల రాశి. ఇక మహిళలు, యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి, వారిని ప్రోత్సహించడానికి #MINDWITHME అనే హ్యాష్‌ట్యాగ్ వేదికగా ఓ ఎంపవర్మెంట్ సిరీస్‌ని కూడా నిర్వహిస్తోంది మారియా. మరి, తాజాగా అందాల కిరీటం గెలిచిన సందర్భంగా మీ ముందున్న లక్ష్యమేంటి అని అడిగితే.. ఇక్కడి పిల్లల సంక్షేమానికి కృషి చేయడమే అంటోంది.
ఇలా ఈ ఏడాది అందాల పోటీలో గెలిచిన మారియాకు గతేడాది విజేత అయిన ప్రియా సెర్రావ్ కిరీటాన్ని అలంకరించింది. అయితే ప్రియ కూడా భారత సంతతికి చెందిన అమ్మాయే కావడం విశేషం. ఇలా వరుసగా రెండుసార్లు మిస్ యూనివర్స్ ఆస్ట్రేలియా కిరీటం భారతీయ వనితలు దక్కించుకోవడం ఇదే తొలిసారి కావడం మరో విశేషం..!