‘కర్వా చౌత్’... భర్త శ్రేయస్సును, కుటుంబ క్షేమాన్ని కాంక్షిస్తూ ఉత్తరాది మహిళలు ఎంతో అట్టహాసంగా ఈ పండగను జరుపుకొంటారు. దీపావళికి 11 రోజుల ముందు వచ్చే ఈ పండగను మన దగ్గర అట్ల తద్ది పేరుతో సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ పర్వదినాన ఆ జగజ్జనని పార్వతీమాతను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అతివలు. భర్త ఆయురారోగ్యాల కోసం నోములు, వ్రతాలు ఆచరిస్తారు. రోజంతా ఉపవాసం ఉండి, చంద్రుడిని చూశాకే అన్న పానీయాలు ముట్టుకుంటారు. పెళ్లైన ఆడవాళ్లతో పాటు వివాహం నిశ్చయమైన అమ్మాయిలు కూడా ఎంతో ఉత్సాహంతో ఈ పండగను జరుపుకొంటారు.
ఈ క్రమంలో అమ్మవారి ఆశీస్సుల కోసం సామాన్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ తమ ఇష్టసఖితో సందడి చేశారు. ఆ మధుర క్షణాలను ఫొటోల్లో బంధించి, వాటిని సోషల్ మీడియాలో పంచుకొని మురిసిపోయారు.
కొత్త ఇంట్లో తొలి పండగ!
పెళ్లయిన వెంటనే కొత్త ఇంట్లోకి అడుగుపెట్టి కొత్త జీవితం ప్రారంభించారు కాజల్, గౌతమ్ జంట. గృహప్రవేశ వేడుక నిర్వహించడంతో పాటు తొలి పండగ కర్వాచౌత్‌ను కూడా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. కాజల్ సోదరి నిషా అగర్వాల్ కూడా ఈ వేడుకల్లో భాగమై బావ చేతికి స్వయంగా మెహందీ పెట్టింది. ఈ సందర్భంగా ఎరుపు రంగు చీరలో, అదే రంగు మ్యాచింగ్ మాస్క్‌తో తళుక్కుమన్న ఫొటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసింది కాజల్. అదేవిధంగా మరో పోస్టులో గోరింటాకు పెట్టుకున్న చేతులను చూపిస్తూ ‘ఎవరో కనిపెట్టండి’ అంటూ ఫ్యాన్స్‌కు సవాల్ విసిరింది.

అందంగా ముస్తాబైన మిహీక!
పెళ్లైన తర్వాత వచ్చిన తొలి పండగ దసరాను ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంది రానా-మిహీక జంట. తాజాగా కర్వాచౌత్‌ను కూడా ఈ జంట చాలా గ్రాండ్‌గా జరుపుకొంది. వేడుకల్లో భాగంగా ఎరుపురంగు చీర, నుదుట కుంకుమ, బంగారు రంగు చెవి దిద్దులు, ముక్కుపుడక పెట్టుకుని అందంగా ముస్తాబైంది మిహీక. ఇక రానా బ్లాక్ కలర్ షర్ట్, జీన్స్ ప్యాంట్, తలకు బ్లాక్ కలర్ క్యాప్ ధరించి సింపుల్‌గా కనిపించాడు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను మిహీక తల్లి బంటీ బజాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
వీరు కూడా!
వీరితో పాటు ప్రియాంక చోప్రా, శిల్పాశెట్టి, కియారా అద్వానీ, కరీనా కపూర్, నీతూకపూర్, రవీనాటాండన్, సోనాలీ బింద్రే, బిపాసా బసు, కాజోల్, నీలం కొఠారీ, భావనా పాండే, తహీరా కశ్యప్, అనిత, నేహా కక్కర్, దివ్యాంకా త్రిపాఠీ, సునీతా అహుజా (నటుడు గోవిందా సతీమణి), అర్పితాఖాన్, మహి విజ్, కామ్యా పంజాబీ తదితరులు సైతం కర్వాచౌత్ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. అనంతరం ఆ ఫొటోలను తమ అభిమానులతో షేర్ చేసుకుని మురిసిపోయారు.