Photo: Instagram
ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో కరోనాతో పోరాడుతూ ఎంతోమందికి ప్రాణం పోస్తున్నారు వైద్యులు. తమ చుట్టూ ప్రమాదం పొంచి ఉందన్న విషయం కూడా లెక్కచేయకుండా ఉచితంగా సేవ చేయడానికి కదులుతూ తమలోని సేవాభావాన్ని, మంచి మనసును ప్రపంచానికి చాటుతున్నారు మరికొందరు మహిళలు. సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది - బాలీవుడ్ నటి శిఖా మల్హోత్రా. నర్సింగ్ కోర్సు చదువుతూనే నటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె.. ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో సేవకే ఓటేసింది. ఈ క్రమంలోనే గత ఆరు నెలలుగా ముంబయిలోని ఓ ఆస్పత్రిలో నర్సుగా కరోనా బాధితులను కంటికి రెప్పలా కాచుకుంటోన్న ఆమె.. తాజాగా వైరస్ బారిన పడింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో ఆస్పత్రిలో చేరిన శిఖ.. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో తనకు ఎదురవుతోన్న అనుభవాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే.. ఇంత క్లిష్ట పరిస్థితుల్లోనూ కరోనా జాగ్రత్తలు చెబుతూ అందరినీ అలర్ట్ చేస్తోందీ బాలీవుడ్ బ్యూటీ.
శిఖా మల్హోత్రా.. నటిగా బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైనా.. ఈ కరోనా పరిస్థితుల్లో నర్సుగా విధుల్లో చేరి ప్రపంచానికి తనని తాను సరికొత్తగా పరిచయం చేసుకుందీ ముద్దుగుమ్మ. షారుఖ్ నటించిన ‘ఫ్యాన్’ చిత్రంతో పాటు ‘కాంచలీ లైఫ్ ఇన్ ఏ స్లవ్’ అనే సినిమాలో నటించిన శిఖ.. 2014లో నర్సింగ్ కోర్సు పూర్తి చేసింది. నటన పట్ల మక్కువ ఉన్నా.. వైద్య వృత్తిలో సైతం రాణించడానికి తన తల్లినే స్ఫూర్తిగా తీసుకుందీ బాలీవుడ్ బ్యూటీ. గత ఆరు నెలలుగా ముంబయిలోని హిందూ హృదయ్ సామ్రాట్ బాలా సాహెబ్ థాక్రే ఆసుపత్రిలో నర్సుగా విధుల్లో కొనసాగుతోంది. ఈ క్రమంలో కొవిడ్ బాధితులకు ఉచితంగా సేవ చేస్తూ తనలోని సేవా భావాన్ని చాటుకుంటోందీ బాలీవుడ్ బ్యూటీ.
అలాంటి వారి కోసమే ఈ పోస్ట్!
కరోనా రోగులకు సేవలందించే క్రమంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొంతమంది వైద్యులు, నర్సులు వైరస్ బారిన పడుతున్నారు. ఆ జాబితాలో తాజాగా చేరిపోయింది శిఖ. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టిందామె. ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న క్రమంలో తీసుకున్న ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన శిఖ.. ‘నాకు తాజాగా కరోనా పాజిటివ్ వచ్చింది. శ్వాస తీసుకోవడం ఇబ్బంది కావడంతో ఆస్పత్రిలో చేరాను. ఇంత కఠిన సమయంలోనూ మీ ముందుకు రావడానికి, నా ఫొటోలు పోస్ట్ చేయడానికి ఓ కారణముంది. అదేంటంటే.. కొంతమంది కరోనా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అది మన చుట్టూనే ఉన్నా.. అసలేం లేదన్నట్లుగా కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా మసలుకొంటున్నారు. దానివల్ల మీకే కాదు.. మీ చుట్టూ ఉన్న వారికీ ప్రమాదమే! పైగా ఇప్పటిదాకా ఈ వైరస్‌ను అంతమొందించే వ్యాక్సిన్ తయారుకాలేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ గురించి, మీ కుటుంబ సభ్యుల గురించి కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే! సామాజిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం.. ఇందులో ఏ ఒక్కదాన్నీ నిర్లక్ష్యం చేయద్దు..’ అంటూ కరోనా జాగ్రత్తలు చెప్పుకొచ్చింది శిఖ.
శ్వాస ఆడట్లేదు.. చాలా ఇబ్బందిగా ఉంది!
ఇక కరోనా సోకిన దగ్గర్నుంచి తనకు ఎదురవుతోన్న అనుభవాలను ఓ సుదీర్ఘ పోస్ట్ రూపంలో ఇన్‌స్టాలో పంచుకుందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోన్న శిఖ ఆ ఫొటోలను పంచుకుంటూ.. ‘నేను గత ఆరు నెలలుగా కొవిడ్ బాధితులకు సేవలందిస్తున్నా.. మీ అందరి ఆశీర్వాద బలం, ప్రేమాభిమానాలే ఇప్పటిదాకా నన్ను కాపాడాయి.. ధైర్యంగా ముందుకు నడిపించాయి. ఇప్పుడు కూడా మీ ప్రార్థనలే తిరిగి నన్ను ఇంటికి చేర్చుతాయన్న నమ్మకం నాకుంది. నా ఆరోగ్యం గురించి అమ్మానాన్న, మీరందరూ ఎంతో ఆందోళన చెందుతున్నారు.. అందుకే ప్రస్తుతం నేను కృత్రిమ ఆక్సిజన్ సహాయంతో చికిత్స తీసుకుంటున్నా.. నాకేం పర్లేదు అని చెప్పడానికే ఇలా మీ ముందుకొచ్చా. ప్రస్తుతం నా ఆక్సిజన్ స్థాయులు తక్కువగా ఉన్నాయి.. శ్వాస తీసుకోవడం ఇబ్బందవుతోంది.. ఛాతీలో నొప్పిగా ఉంది.. చక్కెర స్థాయులు పడిపోయాయి. నిజానికి మా కుటుంబంలో ఎవరికీ మధుమేహం లేదు.. నేను కూడా ఎప్పుడూ కడుపు మాడ్చుకోను.. వేళకు భోజనం చేస్తాను.
అయినా కడుపు నిండా ఆహారం తీసుకున్నప్పటికీ నా చక్కెర స్థాయులు 30కి పడిపోతున్నాయి. దీంతో చాలా నీరసంగా అనిపిస్తోంది.. మరోవైపు ఆక్సిజన్ అందట్లేదు.. అయినా నేను సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ఉన్నా. మీ ప్రేమాభిమానాలు, ప్రార్థనలే నన్ను ఈ విపత్తు నుంచి గట్టెక్కిస్తాయన్న నమ్మకం నాకుంది. త్వరలోనే కోలుకొని మళ్లీ పీపీఈ ధరించి కరోనా బాధితుల మొహాల్లో నవ్వులు విరబూయించాలని ఉంది. అలాగే కరోనా ఒక కల్పితం అని దాన్ని నిర్లక్ష్యం చేస్తోన్న వారందరికీ నేను ముందు నుంచీ పదే పదే ఒకే మాట చెబుతున్నా. మీరు కరోనా వారియర్ కాకపోయినా పర్లేదు.. కానీ కరోనా క్యారియర్‌గా మాత్రం మారకండి. మిమ్మల్ని మీరు కాపాడుకుంటే.. మీ కుటుంబ సభ్యులను, మీ చుట్టూ ఉన్న వారిని కూడా మీరు కాపాడినట్లే!’ అంటూ తన ఆవేదనను బయటపెట్టిందీ ముద్దుగుమ్మ.
ఇప్పుడనే కాదు.. గత ఆరు నెలలుగా కరోనా రోగులకు సేవ చేయడంలోనే బిజీగా ఉన్న శిఖ.. ప్రతిసారీ కరోనా జాగ్రత్తలు చెబుతూనే ఉంది.. ఈ క్రమంలో తన అనుభవాలను పంచుకుంటూ వైరస్ విషయంలో అందరినీ అలర్ట్ చేస్తోంది.. మరి, ప్రస్తుతం ఈ మహమ్మారి బారిన పడి పోరాటం చేస్తోన్న శిఖ.. త్వరలోనే కోలుకోవాలని, తన కోరిక మేరకు మళ్లీ పీపీఈ ధరించాలని, కరోనా రోగులకు సేవలందించాలని మనమూ మనస్ఫూర్తిగా కోరుకుందాం!
గెట్ వెల్ సూన్ శిఖ!!
Also Read: దయచేసి ‘కరోనా’కు ఆ అవకాశం ఇవ్వకండి!