ఆడపిల్ల ఇంటికి దీపం లాంటిది. ఆడపిల్ల లేని ఇల్లు...చందమామ లేని ఆకాశం ఒక్కటే’ అని పెద్దలంటుంటారు. ఇక ఇంట్లో కూతురు పుట్టిందంటే ‘మా అమ్మే మళ్లీ పుట్టింది’, ‘మా ఇంట మహాలక్ష్మి అడుగుపెట్టింది’ అని అనుకుంటారు చాలామంది తల్లిదండ్రులు. ఇలా ఆనందాలు కురిపించే ఆడపిల్ల ప్రతి ఇంట్లో ఉండాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో తమకూ ఓ ఆడపిల్ల పుడితే బాగుండేదని... తన భర్త కూడా ఇదే కోరుకున్నాడంటోంది దివంగత నటుడు ఇర్ఫాన్‌ఖాన్ సతీమణి సుతపా సిక్దార్. ఈ క్రమంలో ‘డాటర్స్ డే’ ను పురస్కరించుకుని ఆమె ఫేస్బుక్లో షేర్ చేసిన ఓ పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది.
35 ఏళ్ల ప్రేమ బంధం!
ఇర్ఫాన్, సుతపాలు 35 ఏళ్ల క్రితం దిల్లీలోని ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’ లో తొలిసారి కలుసుకున్నారు. తమ మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో ఫిబ్రవరి 23, 1995లో వీళ్లు వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఈ క్రమంలో ఇర్ఫాన్ నటుడిగా నిలదొక్కుకుంటే.. సుతపా సినిమా డైలాగ్ రైటర్‌గా కెరీర్లో స్థిరపడింది. మూడున్నర దశాబ్దాల వీరి అన్యోన్య దాంపత్య బంధానికి ప్రతిరూపాలుగా బాబిల్, అయాన్ అనే ఇద్దరు కుమారులున్నారు. అయితే వీరితో పాటు యావత్ సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 29న క్యాన్సర్‌తో కన్ను మూశాడు ఇర్ఫాన్. ప్రస్తుతం తన భర్త వదిలివెళ్లిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ జీవితం గడుపుతోంది సుతపా.
ఇర్ఫాన్ కూడా కూతురే కావాలన్నాడు!
కూతుర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని సామాన్యులు, సెలబ్రిటీలు తమ కూతుళ్లతో ఉండే అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు కుమారులకు జన్మనిచ్చిన సుతపా...తమకు ఓ కూతురు పుట్టి ఉండే బాగుండేదని చెబుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది.
‘బాబిల్ పుట్టాక నేను మరోసారి గర్భం ధరించాను. ఈసారి ఆడపిల్ల పుడితే బాగుంటుందనుకున్నాను. ఇర్ఫాన్ కూడా ఇదే కోరుకున్నాడు. ఇక నా డెలివరీ సమయంలో డాక్టర్ నోటి వెంట ఆ శుభవార్త విందామని ఆసక్తిగా ఎదురుచూశాం. అయితే మాకు ఆ అదృష్టం దక్కలేదు. పాప పుడుతుందని ఎంతగానో ఆశించిన మాకు ఈసారి కూడా బాబే పుట్టడంతో ఆ విషయాన్ని మాకు చెప్పడానికి డాక్టర్, నర్సులు మొదట్లో సంశయించారు.. అందుకే ప్రసవం కాగానే- పుట్టిందెవరో వెంటనే చెప్పకుండా - 'కంగ్రాట్స్...హెల్తీ చైల్డ్' అని మాత్రమే చెప్పారు.. ఆ తర్వాత ఈసారి కూడా బాబే అని తెలిసి మేం ఒకింత నిరాశకు గురయ్యాం. అప్పటి నుంచి నేటివరకూ ఆ బాధ అలాగే ఉంది.. ఇర్ఫాన్ పేరెంటింగ్ ని ఒక ఆడపిల్ల మిస్సయ్యిందని ఇప్పటికీ బాధపడుతూనే ఉంటాను..’ అని ఆ పోస్టులో రాసుకొచ్చింది సుతపా.
మా లైఫ్ లైన్ మీరే!
ఇక డాటర్స్డేను పురస్కరించుకుని కాజోల్, శిల్పాశెట్టి, నేహాధూపియా, సోహా అలీఖాన్, లారాదత్తా, మీనా, మంచు లక్ష్మి, ఝాన్సీ, చిరంజీవి, అజయ్‌దేవ్‌గణ్, అమితాబ్, అక్షయ్‌కుమార్, బోనీకపూర్ తదితర సెలబ్రిటీలందరూ సోషల్ మీడియా వేదికగా తమ కూతుళ్లకు శుభాకాంక్షలు తెలిపారు.