బయటికెళ్తే కరోనా వస్తుందన్న భయం.. ఇంట్లోనే ఉంటే ఓ రకమైన మానసిక ఒత్తిడి.. ప్రస్తుతం చాలామంది ఇదే పరిస్థితిలో ఉన్నారు. ఒకవేళ కరోనా వచ్చినా దాన్నుంచి కోలుకుంటామో, లేదోనన్న టెన్షన్‌తో అనుక్షణం భయపడిపోతున్నారు. కానీ కొంతమంది మాత్రం వారి కొవిడ్ అనుభవాలను పంచుకుంటూ నలుగురిలో ధైర్యం నింపుతున్నారు. అలాంటి వారిలో పలువురు నటీమణులు కూడా ఉన్నారు. బాలీవుడ్ బుల్లితెర బ్యూటీ శ్వేతా తివారీ కూడా తాజాగా ఈ లిస్ట్‌లో చేరిపోయింది. ఇటీవలే తనకు కొవిడ్ నిర్ధారణ అయిందని, అయితే ప్రస్తుతం ఇంట్లోనే స్వీయ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నానంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ. అంతేకాదు.. ఈ క్రమంలో తాను పాటిస్తోన్న పలు జాగ్రత్తల్ని కూడా పంచుకుంటూ తన ఫ్యాన్స్‌లో స్ఫూర్తి నింపుతోందీ అందాల తార.
ఏక్తా కపూర్ నిర్మించిన ‘కసౌటీ జిందగీ కే’ సీరియల్లో ప్రేర్నా బసూ పాత్రతో పాపులారిటీ సంపాదించుకుంది శ్వేత. ఆపై ‘నాగిన్’, ‘పర్వరిష్’, ‘అదాలత్’.. వంటి పలు టాప్ సీరియల్స్‌లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. అంతేకాదు.. హిందీ, భోజ్‌పురీ భాషా చిత్రాల్లోనూ నటించిన ఈ బుల్లితెర బ్యూటీ.. ‘నచ్ బలియే’, ‘ఝలక్ దిక్లా జా’.. వంటి డ్యాన్స్ రియాల్టీ షోలలోనూ సత్తా చాటింది. ఇక ‘బిగ్‌బాస్-4’లో విజేతగా నిలిచి మరింతమంది అభిమానుల మనసు దోచుకుంది శ్వేత. ప్రస్తుతం ‘మేరే డాడ్ కీ దుల్హన్’ అనే సీరియల్లో నటిస్తోన్న ఈ బుల్లితెర భామ.. ఇటీవలే కరోనా బారిన పడింది. నటుడు అభినవ్ కోహ్లీని వివాహమాడిన శ్వేతకు ఒక కూతురు, ఒక కొడుకు సంతానం.
తొలి మూడు రోజులు..!
సరిగ్గా వారం క్రితం తన ఆరోగ్యం విషయంలో తేడా గమనించానని, ఈ క్రమంలోనే కొవిడ్ పరీక్ష చేయించుకున్నట్లు చెబుతోంది శ్వేత. ‘కొన్ని రోజుల క్రితం నా ఆరోగ్యం విషయంలో ఏదో తేడాగా అనిపించింది. అదే సమయంలో ఒక ముఖ్యమైన షూటింగ్ కూడా ఉండడంతో నేను ఏ మాత్రం రిస్క్ చేయదలుచుకోలేదు. వెంటనే పరీక్షలు చేయించుకుంటే కొవిడ్ పాజిటివ్ వచ్చింది. అప్పట్నుంచి ఇంట్లోనే స్వీయ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నా. నా పిల్లలు కూడా సామాజిక దూరం పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొదటి మూడు రోజులు స్వల్ప లక్షణాలు కనిపించినా.. ఇప్పుడు బాగానే ఉన్నాను. తదుపరి కొవిడ్ టెస్ట్ కోసం ఎదురు చూస్తున్నా. రోజూ వేడి నీళ్లు తాగుతున్నా. మానసిక ప్రశాంతత కోసం పుస్తకాలు చదువుతున్నా..’ అంటూ చెప్పుకొచ్చిందీ బుల్లితెర అందం.
శ్వేత త్వరలోనే పూర్తిగా కోలుకోవాలని మనం కూడా ఆశిద్దాం. అలాగే ఆరోగ్యం విషయంలో ఏ మాత్రం తేడా కనిపించినా, అశ్రద్ధ చేయకుండా శ్వేత మాదిరిగా వెంటనే వైద్యులను సంప్రదించడం మాత్రం మర్చిపోవద్దు.