తామెలా ఉన్నామో చూసుకోకుండా ఇతరుల్ని కామెంట్ చేయడం, విమర్శించడం చాలామందికి అలవాటు. ఇలాంటివి ఎదుటివారిని బాధపెడతాయేమోనన్న కనీస ఆలోచన కూడా లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటారు కొంతమంది. సోషల్ మీడియాలోనైతే ఇలాంటి ట్రోలింగ్కి హద్దే ఉండదు. ఇక ఇలా తమపై వచ్చిన విమర్శల్ని పట్టించుకోకుండా వదిలేసే వారు కొందరైతే.. వాటి మూలంగా కలిగిన బాధతో డిప్రెషన్లోకి వెళ్లే వారు మరికొందరు. ఈ రెండో జాబితాలో తాను కూడా ఉన్నానంటోంది టాలీవుడ్ బ్యూటీ వితికా షేరు. గతేడాది ఓ రియాల్టీ షోలో పాల్గొన్న సమయంలో తనపై వచ్చిన ట్రోల్స్‌కి తట్టుకోలేకపోయానని, అవి క్రమంగా తనని కుంగదీశాయంటూ తన మనసులోని ఆవేదనను ఓ సుదీర్ఘ వీడియో రూపంలో పంచుకుందీ ముద్దుగుమ్మ. తనలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదనే ఉద్దేశంతో తాను రూపొందించిన ఈ వీడియోను తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది.
వితికా షేరు.. ‘ప్రేమించే రోజుల్లో’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైందీ టాలీవుడ్ భామ. ఆపై ‘సందడి’, ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘పడ్డానండీ ప్రేమలో మరి’.. వంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ ఏడాది యూట్యూబర్‌గానూ మారింది. అందం, ఫ్యాషన్.. ఇలా అమ్మాయిలకు ఉపయోగపడే ఎన్నో విషయాలపై వీడియోలు రూపొందించి తన ఛానల్లో పోస్ట్ చేసే వితిక.. ఒకనొక సమయంలో తనకెదురైన చేదు అనుభవాలను, వాటి మూలాన తాను డిప్రెషన్లోకి కూరుకుపోయిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మరో వీడియోను రూపొందించింది. దీన్ని తాజాగా తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసిందీ చిన్నది. ఇందులో భాగంగా.. ఇతరులు చేసే విమర్శలకు మొదట్లో మానసిక క్షోభను అనుభవించినా.. ఆ తర్వాత దాన్నుంచి క్రమంగా బయటపడ్డానంటోంది. ముక్కూ మొహం తెలియని వాళ్లు అన్న మాటలకు తాను బాధపడాల్సిన అవసరం లేదన్న విషయం గ్రహించానని చెప్పుకొచ్చింది వితిక. మరి, తాను పెట్టిన వీడియో సారాంశమేంటంటే..!
నేనెందుకు బతికున్నానా అనిపించేది!
‘గతేడాది నేను నా భర్తతో కలిసి ఓ ప్రముఖ రియాల్టీ షోలో పాల్గొన్నాను. ఆ షో నుంచి బయటికి వచ్చే వరకు నాకు మించిన సక్సెస్ఫుల్ అమ్మాయి ఉండదని అనుకున్నా. ఇక ఆ షోలోకి వెళ్లే ముందు వరకు నా మీద నాకు చాలా నమ్మకం ఉండేది. ఎందుకంటే నేను ఎవరిపైనా ఆధారపడకుండా స్వతంత్రంగా ఎదిగిన అమ్మాయిని! అలాంటి నేను ఆ షో నుంచి బయటికొచ్చాక నన్ను నేను కోల్పోయాననిపించింది. నా గురించి ప్రేక్షకులు ఏం మాట్లాడుకుంటున్నారో, ఏ విధంగా నెగెటివ్ ట్రోలింగ్ చేస్తున్నారో, వాటిని చూసి నా కుటుంబం ఎంత ఇబ్బంది పడిందో ఆ షో నుంచి బయటికొచ్చాక గానీ నాకు అర్థం కాలేదు. ఒక వ్యక్తిని ఇంతలా విమర్శిస్తారా అని ఆశ్చర్యపోయా. పదే పదే అవే విమర్శలు నా మనసును తొలిచేసేవి. అలా క్రమంగా డిప్రెషన్లోకి కూరుకుపోయా. ఇవన్నీ ఆలోచిస్తే ఒక్కోసారి నేనెందుకు బతికున్నానా అనిపించేది. అప్పటిదాకా నాతో ఎంతో చక్కగా మెలిగిన నా స్నేహితులు కూడా ఆ సమయంలో నాకు మద్దతు తెలపలేదు. అప్పుడనిపించింది.. ఎప్పటికైనా మన కుటుంబమే మనకు అండగా ఉంటుందని! ఆ భయంకరమైన అనుభవాల నుంచి బయటపడి ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే అందుకు కారణం నా కుటుంబం, నా భర్త.
నా కుటుంబమే నా బలం!
వారి మద్దతుతోనే నేను పూర్తిగా కోలుకున్నా. అయితే ఈ సమస్యను ఇలాగే వదిలేయడం కరక్ట్ కాదనిపించింది. నాలాగే ఎంతోమంది ఇలాంటి ట్రోలింగ్‌ని ఎదుర్కొంటున్నారు. అలాంటి వారి బాధ ఎలా ఉంటుందో తెలియజేయడానికే ఇప్పుడిలా మీ ముందుకొచ్చా. ఒకరిపై మీకు ఇష్టం ఉంటే ఆ ఫీలింగ్‌ని పంచుకోండి.. అంతేకానీ వారి గురించి నెగెటివ్‌గా మాత్రం మాట్లాడకండి. ఇతరుల్ని ట్రోల్ చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఆ స్థానంలో మీరుండి ఆలోచించండి.. అప్పుడు వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. నా వీడియో చూసి అలాంటి వాళ్లలో ఒక్కరు మారినా నాకు సంతోషమే! డిప్రెషన్‌ని నేను అనుభవించాను కాబట్టి అది ఎంత భయంకరమైందో నాకు తెలిసింది. కొంతమందికి క్యాన్సర్ అంటే భయం.. మరికొంతమందికి హెచ్ఐవీ అంటే భయం.. ఇప్పుడు కరోనా అంటే అందరూ భయపడుతున్నారు. కానీ డిప్రెషన్ వీటన్నింటికన్నా ప్రమాదకరమైంది. దీన్నుంచి బయటపడాలంటే ఎవరిని వారే ప్రేమించుకోవాలి.. మనో నిబ్బరంతో ఉండాలి.. ముఖ్యంగా మన చుట్టూ మనకు సపోర్ట్ చేసే వాళ్లుండాలి. అప్పుడే ఈ మానసిక జబ్బు నుంచి బయటపడగలం. ఈ విషయంలో నేను అదృష్టవంతురాలినని చెప్పాలి. ఎందుకంటే నేను బతికున్నానంటే అందుకు కారణం నా భర్త, నా కుటుంబమే! అందుకే ఆ విషయం గ్రహించిన మరుక్షణం నుంచీ నా కుటుంబంతో గడపడానికి మరింత ఎక్కువ సమయం కేటాయిస్తున్నా.
ఒక్క క్షణం ఆలోచించండి!
నా మానసిక సమస్య నుంచి బయటపడడానికి నాకు మూడున్నర నెలల సమయం పట్టింది. ఆ తర్వాత కూడా కొన్ని రోజుల దాకా సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టాలంటే భయమేసేది. అవి చూసి ఎవరెలా స్పందిస్తారో అనిపించేది. ఆ సందర్భాన్ని ఇప్పుడు గుర్తు చేసుకున్నా ఎంతో బాధగా అనిపిస్తుంటుంది. నిజానికి.. ఈ దశ నా జీవితంలో ఎన్నో మార్పులు తెచ్చింది. అనవసర విషయాల గురించి పట్టించుకొని సమయం వృథా చేసుకోవద్దని.. ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టాలన్న విషయం నాకు నేర్పించింది. ప్రస్తుతం నేను చాలా హ్యాపీగా ఉన్నా.. నా ఆనందాన్ని ప్రతిక్షణం ఆస్వాదిస్తున్నా.. ఆఖరుగా మీ అందరికీ మరోసారి చెబుతున్నా.. దయచేసి ఎవరినైనా ట్రోల్ చేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. మీకు సపోర్ట్ చేయాలనిపిస్తే చేయండి.. అంతేకానీ విమర్శించకండి..’ అంటూ తన మనసులోని ఆవేదనను చెప్పుకొచ్చింది వితిక.
నా కల అలా నెరవేరబోతోంది!
‘అంతేకాదండోయ్.. మీ అందరికీ ఓ గుడ్‌న్యూస్. చిన్నప్పటి నుంచి నాకు హోస్టింగ్ (యాంకరింగ్) అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే నా 14 ఏళ్ల వయసులో ఓ ఛానల్లో ఓ షో కోసం సెలక్షన్స్‌కి వెళ్తే వాళ్లు నన్ను ఎంపిక చేయలేదు. కానీ ఆ తర్వాత తమిళం, కన్నడ, తెలుగు సినిమాల్లో నటించాను. అయినా యాంకర్ అవ్వాలన్న కోరిక నాలో బలంగా ఉండిపోయింది. అది త్వరలోనే ప్రసారం కానున్న ‘సామజవరగమన’ అనే మ్యూజికల్ షోతో తీరబోతోంది. ఈ విషయాన్ని మీ అందరితో పంచుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది..’ అంటూ మరో వీడియోలో భాగంగా పంచుకుందీ ముద్దుగుమ్మ.
ఏదేమైనా వితిక చెప్పింది అక్షరాలా నిజం! ఎవరైతే ఇతరుల్ని విమర్శిస్తారో.. వాళ్లకు కూడా అలాంటి ట్రోలింగ్ ఎదురైతే అవతలి వాళ్లు పడే బాధేంటో అర్థమవుతుంది. మరి, సోషల్ మీడియా ట్రోలింగ్ గురించి మీరేమంటారు? మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలను ‘వసుంధర.నెట్’ వేదికగా మాతో పంచుకోండి.