మనసులో ఎంత బాధున్నా బయటికి చెప్పరు చాలామంది. ఒకవేళ తమ సమస్య గురించి నలుగురికీ చెప్తే ఎక్కడ పలుచనైపోతామో, నలుగురూ ఏమనుకుంటారోనన్న భయమే వారితో వెనకడుగు వేయిస్తుంది. ఇలా చేస్తే ఆ బాధ తీవ్రత క్రమంగా పెరిగి పెరిగి మన మనసునే తొలిచేసే స్థాయికి చేరుకుంటుంది. ఒత్తిడి, ఆందోళన, యాంగ్జైటీ.. ఇలా పేరేదైనా మనసు మీద దెబ్బకొట్టే ఈ జబ్బు ఇప్పుడు చాలామంది పాలిట శాపంగా పరిణమిస్తోంది. సామాన్యులే కాదు.. సెలబ్రిటీలూ ఇందుకు అతీతులు కాదు. ఇలా తాము ఎదుర్కొన్న మానసిక సమస్య గురించి బయటికి చెప్పి సామాన్యుల్లో ధైర్యాన్ని నింపిన అందాల తారలు ఎంతోమంది! ఆ జాబితాలో తాజాగా చేరిపోయింది బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలీ నందా. గత కొంత కాలంగా యాంగ్జైటీతో బాధపడుతున్నానని, ప్రస్తుతం దాన్నుంచి విముక్తి పొందేందుకు థెరపీ తీసుకుంటున్నానంటూ ఈ మానసిక వ్యాధి నుంచి బయటపడే మార్గాల్ని చెబుతూ అందరిలో స్ఫూర్తి నింపిందీ క్యూటీ.
నవ్య నవేలీ నందా.. అమితాబ్ ముద్దుల కూతురు శ్వేతా నందా-అల్లుడు నిఖిల్ నందాల గారాలపట్టిగా ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. న్యూయార్క్‌లోని ఫోర్ధమ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొందిన ఈ చిన్నది.. ఇప్పటికే వారసత్వంతో జూనియర్ సెలబ్రిటీగా స్టేటస్‌ను సొంతం చేసుకున్నా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే తన స్నేహితులతో కలిసి ‘ఆరా హెల్త్’ అనే ఆన్లైన్ హెల్త్‌కేర్ పోర్టల్‌ను ప్రారంభించింది. మహిళల కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన ఈ ఆన్లైన్ వేదిక ద్వారా ఎన్నో శారీరక, మానసిక అనారోగ్యాలకు పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తోందీ బచ్చన్ గ్రాండ్ డాటర్.
ఎందుకలా జరుగుతుందో అర్థమయ్యేది కాదు!
అయితే గత కొంత కాలంగా యాంగ్జైటీతో బాధపడుతోన్న నవ్య.. దీన్నుంచి బయటపడడానికి వైద్యుల సహాయం తీసుకోవాలన్న విషయం ఆలస్యంగా గ్రహించానని, ప్రస్తుతం థెరపీ తీసుకుంటున్నానని చెబుతోంది. ‘ఆరా హెల్త్’ సహ వ్యవస్థాపకులు మల్లికా సాహ్నే, ప్రగ్యా సాబూ, అహిల్యా మెహతాలతో కలిసి నిర్వహించిన ఓ ఆన్లైన్ చర్చలో తన మానసిక సమస్య, దాన్నుంచి విముక్తి పొందేందుకు తాను తీసుకుంటోన్న థెరపీ గురించి పలు విషయాలు పంచుకుందీ క్యూట్ గర్ల్. ఆ వీడియోను తమ ఫౌండేషన్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది.
‘ఒకానొక సమయంలో నేను ప్రతికూల ఆలోచనలు చేసే వ్యక్తుల మధ్యే ఉండేదాన్ని. ప్రతి విషయంలోనూ వాళ్లు నెగెటివ్‌గానే ఆలోచించేవారు. అలాంటి ప్రతికూలతలు మనసుపై ఎంతలా ప్రభావం చూపుతాయో అప్పుడు నేను తెలుసుకోలేకపోయా. ఒక్కోసారైతే లోలోపలే కుమిలిపోయేదాన్ని. కానీ దానికి కారణమేంటో అర్థమయ్యేది కాదు. ఇది నా ఒక్కదానికి సంబంధించిన సమస్యే కాదు.. ప్రపంచమంతా పట్టి పీడిస్తోన్న మానసిక జబ్బు. మొదట్లో సమస్య తీవ్రత గ్రహించకపోయినా.. ఆ తర్వాత రియలైజ్ అయిన నేను.. ఇక అప్పట్నుంచి సానుకూల దృక్పథంతో మెలిగే వ్యక్తుల మధ్యే ఉండడం ప్రారంభించా. అంతేకాదు.. టీవీలో వచ్చే రియాల్టీ షోలు కూడా నా మానసిక సమస్యను తగ్గించడంలో దోహదం చేశాయి.
ఆలస్యంగా గ్రహించినా..!
తీవ్రమైన ఆందోళనలతో నాలో నేనే మథన పడుతున్నా ఈ విషయం గురించి తొలుత ఎవరితోనూ పంచుకోలేదు. ‘నేను బాగానే ఉన్నాను.. కానీ నాలో ఏదో తెలియని మార్పొచ్చింది.. అదేంటో తెలుసుకొని నన్ను నేను మార్చుకోవాల’న్న విషయం సమస్య తీవ్రమయ్యాక గానీ గ్రహించలేకపోయా. ఈ క్రమంలోనే నా ఆందోళనల గురించి ఇతరులతో పంచుకోవాల్సిన అవసరం ఉందనిపించింది. అదే నా సమస్యకు సరైన పరిష్కారం చూపించింది. అవును.. మనసులో బాధ ఇతరులతో చెప్పుకుంటేనే గుండె భారం దిగుతుంది.. నిజానికి అదే మానసిక సమస్యలకు సగం పరిష్కారం చూపుతుంది! ఇక మిగతా సగం నిపుణుల సహాయం తీసుకోవడం ద్వారా దూరం చేసుకోవచ్చు. ప్రస్తుతం నేను అదే పనిలో ఉన్నా. వారానికోసారి థెరపిస్ట్‌తో మాట్లాడుతున్నాను. దీన్నే రొటీన్‌గా మార్చుకున్నా. ఇక అప్పట్నుంచి మళ్లీ యాంగ్జైటీలోకి వెళ్లిన సందర్భం ఒక్కటి కూడా రాలేదు. ప్రస్తుతం నా మనసు నా అధీనంలో ఉంది.. గతంలో నన్ను మానసిక వేదనకు గురిచేసిన ఆ విషయాలేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా నేను తెలుసుకోగలుగుతున్నా.
ఆ ‘మూస’ నుంచి బయటికి రండి!
నాలాగే చాలామంది తమ మానసిక సమస్యల్ని ఆలస్యంగా అర్థం చేసుకుంటారు. సమస్య తీవ్రమయ్యాక గానీ తాము ఫలానా సమస్యతో బాధపడుతున్నామన్న విషయం గ్రహించరు. కాబట్టి ఎంత వేగంగా సమస్యను గుర్తిస్తే అంత సులువుగా దాన్నుంచి బయటపడచ్చు.. నా మానసిక ఆందోళనల్ని దూరం చేసుకోవడానికి ప్రస్తుతం నేను తీసుకుంటోన్న ఈ థెరపీ నాకు కొత్తగా అనిపిస్తోంది. నేను అనుభవించాను కాబట్టే ఈ విషయాలన్నీ మీతో పంచుకుంటున్నాను. కాబట్టి మీరూ మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడే క్రమంలో సమస్య గురించి నలుగురితో పంచుకోవడానికి, నిపుణుల సహాయం తీసుకోవడానికి వెనకాడకండి.. మనసులోని బాధను పంచుకోండి.. గుండె భారం దించుకోండి.. సానుకూల దృక్పథంతో ఉన్న వ్యక్తుల మధ్యే ఉండండి.. మానసిక ఆందోళనల చుట్టూ నెలకొన్న మూసధోరణుల్ని బద్దలుకొట్టండి. మీ మానసిక సమస్యలను, అనుభవాలను కామెంట్ల రూపంలో మాతో పంచుకోండి..’ అంటూ తనదైన రీతిలో అందరిలో స్ఫూర్తి నింపిందీ నందా బ్యూటీ.
ఇలా నవ్య టీమ్ పెట్టిన ఈ వీడియో పోస్ట్ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని కొందరు ప్రశంసిస్తుంటే.. మరికొందరు తమ జీవితంలో ఎదురైన మానసిక సమస్యలను కామెంట్ల రూపంలో పంచుకుంటూ ధైర్యంగా ముందుకొస్తున్నారు.