@teamvasundhara
హాస్టల్ ఫుడ్ తిని బాగా లావయ్యా.. అప్పుడలా సన్నబడ్డా!
‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు పెద్దలు. అవును మరి.. మనం ఏ పనిచేయాలన్నా ఆరోగ్యంగా ఉన్నప్పుడే దాన్ని సమర్థంగా పూర్తిచేయగలుగుతాం. అలాంటి ఆరోగ్యం మన సొంతం కావాలంటే పోషకాహారం తీసుకోవడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో పోషకాహారం, ఆరోగ్యం గురించి అందరిలో అవగాహన కల్పించే ఉద్దేశంతో సెప్టెంబర్ 1-7 వరకు ‘జాతీయ పోషకాహార వారం’గా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మాజీ ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ పోషకాహారం గురించి అందరిలో అవగాహన పెంచేందుకు సిద్ధమైంది. ఇందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకుందీ బ్యూటీ. ఒకప్పుడు లావుగా ఉన్న తాను చక్కటి పోషకాహారం తీసుకోవడం వల్లే లావు తగ్గానని, అప్పట్నుంచి చక్కటి ఆహారపుటలవాట్లను అలాగే కొనసాగిస్తున్నానంటూ తాజాగా ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్ చేసిందీ ముద్దుగుమ్మ. అంతేకాదు.. తన ఆహారపుటలవాట్లు, ఆరోగ్య రహస్యాల గురించి ‘ఆస్క్ మీ సెషన్’ వేదికగా ఫ్యాన్స్‌తో ముచ్చటించిందీ హరియాణా అందం. మరి, ఈ చక్కనమ్మ పంచుకున్న ఆ విశేషాలేంటో మనమూ తెలుసుకుందామా?!
మానుషీ చిల్లర్.. ‘మిస్ ఇండియా’ కిరీటంతో భారతీయులకు పరిచయమైన ఈ హరియాణా బ్యూటీ.. ‘మిస్ వరల్డ్’గా అవతరించి దేశ ఖ్యాతిని ఖండాంతరాలు దాటించింది. అంతకుముందు నుంచే ‘శక్తి’ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నెలసరి సమయంలో వ్యక్తిగత శుభ్రత, శ్యానిటరీ న్యాప్కిన్ల వాడకం-తద్వారా కలిగే ప్రయోజనాలేంటో వివరిస్తూ గ్రామీణ మహిళల్లో అవగాహన కల్పిస్తోంది. ఇక ఇటీవలే ‘స్మైల్’ ఫౌండేషన్‌తో చేతులు కలిపి తాను వేసిన పెయింటింగ్స్‌ని వేలం వేసిందీ అందాల తార. ఇలా పోగైన మొత్తాన్ని కరోనా యోధుల సంక్షేమానికి వినియోగించనున్నట్లు ఈ మధ్యే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందీ సుందరి. ఇలా నలుగురికీ మంచి చేయడానికి ఎప్పుడూ ముందుండే ఈ తార.. ప్రస్తుతం ‘జాతీయ పోషకాహార వారం’ సందర్భంగా మరోసారి మన ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో పోషకాహారం తీసుకోవడం వల్ల తన జీవితంలో ఎలాంటి మార్పులొచ్చాయో వివరిస్తూ తాజాగా ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్ పెట్టిందీ క్యూటీ.
కాలేజీలోనే మొదలైంది! తనకు ఇష్టమైన అంశాలు ఎన్నో ఉన్నాయని.. అయితే వాటిని ఓ జాబితాగా రూపొందిస్తే.. ఆరోగ్యం, పోషకాహారం.. ఈ రెండూ టాప్‌లో ఉంటాయంటోందీ చిన్నది. చక్కటి పోషకాహారంలో ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగున్నాయని, దాన్ని రోజూ తీసుకోవడం వల్ల ఆ ప్రయోజనాలు మనకు చేకూరతాయని చెబుతూ తన న్యూట్రిషన్ జర్నీని వీడియో రూపంలో పంచుకుంది మానుషి.
‘జాతీయ పోషకాహార వారం సందర్భంగా నా న్యూట్రిషన్ జర్నీని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నా. పోషకాహారం నా జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. నిజానికి నేను ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చే కుటుంబం నుంచే వచ్చాను. మా అమ్మానాన్నలిద్దరూ డాక్టర్లు. వారు ఆహారం విషయంలో చాలా కచ్చితంగా ఉంటారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని, తద్వారా కలిగే ప్రయోజనాలేంటో పదే పదే చెబుతుంటారు.
నా న్యూట్రిషన్ జర్నీ నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు ప్రారంభమైంది. హాస్టల్ మెస్‌లో తయారుచేసే ఆహారం తీసుకోవడం వల్ల ఆ సమయంలో నేను బాగా బరువు పెరిగిపోయాను. ఆ తర్వాత రియలైజ్ అయి ఎంత త్వరగా పెరిగానో.. అంత త్వరగా తగ్గాను. ఇదంతా పోషకాహారం వల్లే సాధ్యమైంది. ఈ క్రమంలో నా ఆహారం నేనే వండుకునేదాన్ని. పోషకాలు నిండి ఉన్న పదార్థాల్ని రోజువారీ మెనూలో చేర్చుకునేదాన్ని. ఈ ఆహారపుటలవాట్లు నేను బరువు తగ్గడానికి, మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనేందుకు నాకు మార్గం సుగమం చేశాయి. కాబట్టి మీరు కూడా పోషకాహారాన్ని రోజువారీ మెనూలో భాగం చేసుకోండి.. ఫలితంగా బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాల్ని సొంతం చేసుకోండి..!’ అంటూ చక్కటి ఆహారపుటలవాట్ల గురించి అందరిలో స్ఫూర్తి నింపిందీ ముద్దుగుమ్మ.
నా బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి ఉండాల్సిందే!
అంతేకాదు.. ‘జాతీయ పోషకాహార వారం’ సందర్భంగా తన అభిమానులతో ‘ఆస్క్ మీ సెషన్’ నిర్వహించింది మానుషి. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తూ, వారి సందేహాలను నివృత్తి చేస్తూ, తన ఆహారపుటలవాట్ల గురించి కూడా పంచుకుందీ ముద్దుగుమ్మ. అభిమాని: బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకునే మంచి ఆహారమేంటి? మానుషి: నేను అల్పాహారం కాస్త ఎక్కువగానే తీసుకోవడానికి ఇష్టపడతా. ఇది నన్ను రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది. తాజా పండ్లు-గుడ్లు/పనీర్/టోఫు-ఓట్స్/ఉప్మా/టోస్ట్.. వంటివి నేను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటా. ఇవన్నీ మనలో ఉన్న బద్ధకాన్ని దూరం చేస్తాయి. కాలేజ్‌లో ఉన్నప్పుడు వంట చేసుకోవడం, క్లాసులకు వెళ్లడం, చదువుకోవడం.. ఇవన్నీ ఎలా మేనేజ్ చేశారు? సమయపాలన వల్లే ఇదంతా సాధ్యమైంది. కాయగూరలు, నట్స్, పండ్లు, ఓట్స్.. వంటివన్నీ ఎప్పుడూ నా దగ్గర స్టాక్ పెట్టుకునేదాన్ని. వీటితో పాటు మెస్‌లో పోషకాలు నిండిన పదార్థాలను కూడా కలుపుకొని ఆహారం వండుకునేదాన్ని. దీనికి పది నిమిషాలకు మించి సమయం పట్టేది కాదు. బాగా సన్నగా ఉన్న వారికి మీరిచ్చే సలహాలేంటి? నా దృష్టిలో బరువు కంటే ఆరోగ్యమే ముఖ్యం. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు బరువు తూకం (వేయింగ్ స్కేల్)తో పనేముంది? కాబట్టి మీలో ఎలాంటి పోషకాహార లోపం లేకపోతే బరువులెత్తే వ్యాయామాలు సాధన చేయచ్చు. చదువుకునే రోజుల్లో మీరు ఎలాంటి పోషకాహారం తీసుకునేవారు? చదువుపై ఏకాగ్రత పెంచుకోవడానికి ఏం చేసేవారు? వ్యాయామం, ధ్యానం.. మానసిక ఒత్తిళ్లను అధిగమించడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. ఇవే నేను ఏకాగ్రతతో చదువుకోవడానికి దోహదం చేశాయి. కాబట్టి మీరు కూడా మీ రోజును బ్యాలన్స్ చేసుకుంటూ ముందుకు సాగండి. చేసే పనిపై ఏకాగ్రత పెట్టండి.. కష్టపడి పనిచేయండి.. ఓ వైపు నా ఆహారం నేను వండుకుంటూనే, మరో వైపు చదువుపై దృష్టి పెట్టా. కాబట్టి ఆరోగ్యం కోసం ఆ కాస్త కష్టమైనా ఇష్టంగా భరించక తప్పదు!
20 ఏళ్లు దాటిన మహిళలు దృఢంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? సమతులాహారం తీసుకోవాలి. అయితే అలాంటి మహిళల్లో రక్తహీనత సమస్య లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే మన దేశపు మహిళల్లో అనీమియా సర్వసాధారణం! కాబట్టి ఆహారంతో పాటు బరువులెత్తే వ్యాయామాలు, ఇతర వర్కవుట్లు కూడా ఈ వయసు మహిళలు దృఢంగా ఉండేందుకు దోహదం చేస్తాయి. మీలా పర్ఫెక్ట్ న్యూట్రిషన్ ఛార్ట్ ఎంచుకోవడం ఎలా సాధ్యం? అదంత పర్ఫెక్ట్ ఛార్టేమీ కాదు.. నన్ను నేను తరచూ పరిశీలించుకుంటూ, పోషకాహార అన్వేషణ వల్లే అది సాధ్యమైంది. మీరు కూడా మీ శరీరానికి శక్తిని అందించే పోషకాలతో నిండి ఉన్న పదార్థాల్ని రోజువారీ మెనూలో చేర్చుకోండి. ఆహారమంటే కేవలం కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రొటీన్లే కాదు.. అంతకుమించి! శారీరక బలహీనత, అలసటను ఎలా దూరం చేసుకోవచ్చు? ఈ సమస్యకు చాలా కారణాలుండచ్చు.. నిద్రలేమి, పోషకాహార లోపం (ముఖ్యంగా రక్తహీనత, విటమిన్ ‘డి’ లోపం), వ్యాయామం చేయకపోవడం, మానసిక ఆందోళనలు మొదలైనవి కారణం కావచ్చు. కాబట్టి సమస్యకు సరైన కారణం తెలుసుకోవడానికి ఓసారి డాక్టర్ని సంప్రదించి సలహా తీసుకోవడం మంచిది.
|
త్వరగా బరువు తగ్గాలంటే...
తీపి తినాలన్న కోరికలు నాలో రోజురోజుకీ రెట్టింపవుతున్నాయి. వాటిని అదుపు చేసుకోవడమెలా? నాకూ స్వీట్స్ అంటే చచ్చేంత ఇష్టం. అయితే మీరు వాటిని మితంగా తినండి.. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తూ ముందుకు సాగండి. మితిమీరకుండా తీసుకుంటే ఏదీ మనకు హాని చేయదు! ఈ రోజుల్లో పిల్లలు స్కూల్లో తోటి విద్యార్థుల ఒత్తిడితో అనారోగ్యకరమైన స్నాక్స్ ఎక్కువగా తింటున్నారు. వారితో ఆ అలవాటు మాన్పించాలంటే ఏం చేయాలి? పిల్లలు వారు తీసుకునే ప్రతి ఆహార పదార్థం గురించి తమను అడిగేలా తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలి. ఈ విషయంలో లాజికల్‌గా వివరిస్తే పిల్లలు తప్పకుండా అర్థం చేసుకుంటారు.
మెరిసే మీ మేని సౌందర్య రహస్యం? అందమనేది వారసత్వం, మనం అనుసరించే జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. పోషకాహార లోపం లేకుండా చూసుకుంటే సౌందర్యం సొంతమవుతుంది. అందుబాటు ధరల్లో, సులభంగా దొరికే ‘బి-12’ ఉన్న ఆహార పదార్థాలు? కోడిగుడ్లు, పాలు, పాల పదార్థాలు ఒత్తిడి, ఆందోళనల్ని దూరం చేసే పోషకాహారం ఏది? అలవాట్లు, జీవనశైలి, మానసిక స్థితి, జన్యుపరమైన కారణాలు.. ఇలా డిప్రెషన్‌కు వివిధ కారణాలుంటాయి. ఏదేమైనా పోషకాహార లోపం లేకుండా జాగ్రత్తపడుతూనే, మనసుకు నచ్చే అనారోగ్యకరమైన ఆహారం జోలికి వెళ్లకుండా చూసుకోవడం ఉత్తమం. త్వరగా బరువు తగ్గడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? బరువు తగ్గడానికి ఎలాంటి షార్ట్‌కట్స్ ఉండవు. దానికి చాలా సమయం పడుతుంది. జీవన శైలిలో చాలా మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. కరోనా సమయంలో ఇమ్యూనిటీని పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఇంట్లో వండిన ఆహారం తీసుకోవడం, ప్రశాంతమైన నిద్ర, సమయానికి నిద్ర లేవడం, వ్యాయామం, ఒత్తిడికి దూరంగా ఉండడం.. ఇవన్నీ తప్పనిసరి!
|
మంచి కొవ్వులు కావాల్సిందే !
త్వరగా, సులభంగా చేసుకునే వంటకాలేంటి? చాలానే ఉన్నాయి.. సలాడ్స్, ఓట్స్, సూప్స్‌తో పాటు పప్పు, రోటీ, అన్నం.. వంటివి కూడా త్వరగా వండుకోవచ్చు.
జుట్టు రాలకుండా ఓ చిట్కా చెప్పరా? ఈ సమస్యకు జన్యుపరమైన కారణాలు, వాతావరణం, పోషకాహార లోపం.. వంటివి ప్రధాన కారణాలు. కాబట్టి చక్కటి ఆహారంతో కొంతవరకు ఫలితం పొందచ్చు. మీ ఆహారంలో ప్రొటీన్లు అధికంగా ఉండే పదార్థాలేవి? పప్పులు, పనీర్, టోఫు, సోయా బీన్, నట్స్, గింజలు మీరు బాగా ఇష్టపడి తినే హెల్దీ స్నాక్ ఏది? పచ్చి కాయగూరలు/నట్స్/పండ్లు/పెరుగు.. ఇవంటే చాలా ఇష్టం.
నెలసరి నొప్పిని అధిగమించాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? పోషకాహార లోపం లేకుండా చూసుకోవాలి. స్ట్రెచింగ్, రోజువారీ వ్యాయామాలు కూడా ఉపశమనాన్ని అందిస్తాయి. శాకాహారులు పోషకాల కోసం ఏయే పదార్థాలు తీసుకోవాలి? పండ్లు, కాయగూరలు, పప్పులు, నట్స్, గింజలు, చిరుధాన్యాలు, స్ప్రౌట్స్.. తీసుకోవచ్చు. పనీర్, టోఫు, పప్పుల్లో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. ఆరోగ్యాన్నందించే పానీయం ఏది? దాన్ని ఎంత మోతాదులో తీసుకోవాలి? నీటిని మించిన పానీయం మరొకటి లేదు! కొవ్వులేని ఆహారమేదైనా ఉంటే చెప్పండి? కొవ్వులు మన శరీరానికి అత్యవసరం. అందులోనూ మంచి కొవ్వులు కావాలి. ఇందుకోసం నేను రోజూ టీస్పూన్ నెయ్యి తీసుకుంటా. అలాగే ప్రాసెస్డ్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్ అతిగా తినకుండా జాగ్రత్తపడాలి. సహజమైనవే మన ఆరోగ్యానికి మంచివి. అసలు కొవ్వులు లేకపోతే మనం ఆరోగ్యంగా ఉండలేం..! మీరు పాటించే డైట్? నేను శాకాహారిని! ఇంట్లో వండిన ఆహారమే తింటా. నా ఆహారంలో కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఉండేలా చూసుకుంటా.
|
ఇలా పోషకాహారం, తన డైట్ టిప్స్ గురించి ఫ్యాన్స్‌తో పంచుకుంటూ అందరిలో ఆరోగ్య స్పృహ పెంచిందీ అందాల తార. మరోవైపు మానుషి తన బాలీవుడ్ ఎంట్రీ కోసం సన్నాహాలు కూడా చేస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అక్షయ్ కుమార్ సరసన ‘పృథ్వీరాజ్’ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం.
|