మీరా రాజ్‌పుత్.. బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో షాహిద్ కపూర్ అర్ధాంగిగానే కాదు.. తన అందంతో, తనదైన ఫ్యాషన్ సెన్స్‌తో అనతికాలంలోనే సెలబ్రిటీగా మారిపోయిందీ బ్యూటీ. ఓ భార్యగా, ఇద్దరు పిల్లల తల్లిగా తన బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తిస్తూ పరిపూర్ణ మహిళకు చక్కటి ఉదాహరణగా నిలుస్తుంటుందీ అందాల అమ్మ. తన వ్యక్తిగత జీవితంలోని ఎన్నో విశేషాలను సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకునే మీరా.. సందర్భం వచ్చినప్పుడల్లా ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తూనే ఉంటుంది. అలా తాజాగా తన అభిమానులతో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్ నిర్వహించిందీ బ్యూటిఫుల్ మామ్. ఈ వేదికగా తన వ్యక్తిగత విశేషాలు, అభిరుచులు, షాహిద్‌తో తనకున్న అనుబంధం, తన ఇద్దరు చిన్నారుల గురించి బోలెడన్ని విషయాలు పంచుకుంది. మరి, అవేంటో మనమూ చూసేద్దామా?!
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్‌తో పెళ్లి తర్వాత ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయింది మీరా రాజ్‌పుత్. అలాగని అక్కడితో ఆగిపోకుండా.. పలు ఫ్యాషన్ షోలలో పాల్గొంటూ తన ఫ్యాషన్ సెన్స్‌ని చాటుకోవడం, సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ తన అభిమానులతో టచ్‌లోనే ఉండడంతో తనదైన గుర్తింపు సంపాదించుకుందీ స్టార్ వైఫ్. కుటుంబం, పిల్లలు.. ఇవి తనకు రెండు కళ్లంటూ ఫ్యామిలీ లైఫ్‌కే ఎక్కువ ప్రాధాన్యమిచ్చే ఈ అందాల అమ్మ.. అనతికాలంలోనే బోలెడంత మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. అయితే తాజాగా తన ఇన్‌స్టా అకౌంట్ వేదికగా తన ఫ్యాన్స్‌తో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్ నిర్వహించిందీ బ్యూటీ. మరి, ఆ సెషన్లో అభిమానులు ఈ ముద్దుగుమ్మను అడిగిన ప్రశ్నలేంటి? వాటికి మీరా ఏమని సమాధానమిచ్చింది? రండి తెలుసుకుందాం!
అభిమాని : అమ్మతనం నుంచి ఏం నేర్చుకున్నారు?
మీరా : ఓపిక, సహనం అలవడింది. ఈ విషయంలో అమ్మకు కృతజ్ఞురాలిని. ఇక మా నాన్నమ్మ వాళ్లింటిని అత్యుత్తమ డే-కేర్‌గా పిలవచ్చు. అమ్మతనం అనేది ఓ అందమైన అనుభూతి.. ఒక తల్లి తన పిల్లలపై కురిపించే ప్రేమకు ఈ లోకంలో మరేదీ సాటి రాదు.
పిల్లల్ని పెంచే విషయంలో ఈ తరం వారికి మీరిచ్చే సలహా ఏంటి?
ఈ విషయంలో మీ తల్లిదండ్రుల సలహాలు, సూచనలు పాటించండి..!
మిషా/జైన్.. వీరిద్దరిలో ఎవరు బాగా అల్లరి చేస్తారు?
జైన్.. మిషా నా స్వీట్హార్ట్!
మళ్లీ పిల్లల కోసం (మూడోసారి) ప్లాన్ చేసుకుంటున్నారా?
‘మేమిద్దరం.. మాకిద్దరు..!’ అంటూ అలాంటి ప్లానింగ్ ఏమీ లేదని చెప్పకనే చెప్పిందీ ముద్దుగుమ్మ.
దాంపత్య బంధం దృఢంగా ఉండాలంటే..?
ఒకరి పైన ఒకరు ఆధారపడుతూనే.. అదే సమయంలో ఎవరి కోసం వారు కాస్త సమయం కేటాయించుకోవాలి.. ఈ రెండింటినీ చక్కగా, ఆరోగ్యకరంగా బ్యాలన్స్ చేయగలిగితే దాంపత్య బంధం శాశ్వతమవుతుంది.
షాహిద్‌ని మీరేమని పిలుస్తారు?
‘Suniye (వినండి)’ అంటూ ఫన్నీగా సమాధానమిచ్చిందీ బ్యూటీ.
మీ అందానికి కారణం (స్కిన్‌కేర్ రొటీన్)?
రోజంతా సీరం, మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ ఉపయోగిస్తా (నిజానికి సన్‌స్క్రీన్‌ని బలవంతంగా నా స్కిన్‌కేర్ రొటీన్లో చేర్చుకున్నా. మొత్తానికి మంచి ఫలితం దక్కింది.)
ఇక రాత్రి పూట.. సీరం, క్రీమ్ వాడతా.. ఆపై ముఖానికి మసాజ్ చేసుకుంటా. ఫేస్ మసాజ్ అందాన్ని ఇనుమడిస్తుంది. ఇక వీటితో పాటు వారానికోసారి ఏదో ఒక ఫేస్‌మాస్క్ (కరోనా నుంచి రక్షణ కోసం వాడే మాస్కు కాదు!) ఉపయోగించడం, రోజూ కార్డియో వ్యాయామాల్ని నా ఎక్సర్సైజ్లో భాగం చేసుకోవడం నాకు అలవాటు.
మీకిష్టమైన ఆహారం?
నేనో పెద్ద ఫుడీని! ముఖ్యంగా దాల్ మఖానీ, పనీర్ మఖానీ, బైంగన్ భార్తా (పంజాబీ వంటకం), సోయా చాప్, బీరకాయ/సొరకాయతో చేసిన వంటకాలు, అమ్మ చేసిన గుమ్మడికాయ కర్రీ, అమ్మ చేతి పరాఠా, అప్పం, రసం, పోహాతో పాటు మా మామగారు చేసే ఆరెంజ్ పనీర్.. ఇవన్నీ నాకెంతో ఇష్టం..!
నచ్చే డెజర్ట్?
మార్బుల్ కేక్, చాక్లెట్, చాక్లెట్ కేక్, టఫుల్ కేక్, రసగుల్లా, బర్ఫీ
మీకు ఇష్టమైన నటుడు?
‘షాహిద్ అని చెప్తాననుకున్నారు కదూ?!’ అంటూ స్మైలీ ఎమోజీని జత చేసింది మీరా.
మీ విద్యార్హతలేంటి?
లేడీ శ్రీరాం మహిళా కళాశాలలో బీఏ (ఆనర్స్) ఇంగ్లిష్ పూర్తి చేశా. నిజానికి మానవత్వానికి మించిన గొప్ప విద్యార్హత మరొకటి లేదు.