బాలీవుడ్ టీవీ ప్రేక్షకులకు బాగా పరిచయమైన రియాలిటీ షో ‘ఖత్రోంకీ ఖిలాడీ: మేడిన్ ఇండియా’. ఒళ్లు గగుర్పొడిచే స్టంట్లు, భయానికి గురిచేసే సాహస కృత్యాలతో కూడిన ఈ అడ్వెంచరస్ టీవీ షోకు అభిమానుల ఆదరణ బాగానే ఉంటోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి కష్టసాధ్యమైన టాస్క్‌లన్నింటినీ సమర్ధంగా పూర్తి చేసి ఈ సీజన్ విజేతగా నిలిచింది నియా శర్మ. మూడేళ్ల క్రితం ఇదే ‘ఖత్రోంకీ ఖిలాడీ 8’ సీజన్లో సెకండ్ రన్నరప్‌గా నిలిచిన నియా.. ఈ సీజన్ ఆసాంతం తనదైన ధైర్య సాహసాలు ప్రదర్శించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా నియా శర్మ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి...
ఓడిన చోటే గెలిచింది!
దిల్లీకి చెందిన నియా శర్మ అసలు పేరు నేహా శర్మ. పదేళ్ల వయసులోనే బుల్లితెర పైకి అడుగుపెట్టిన ఈ అందాల తార...స్టార్‌ప్లస్‌లో ప్రసారమైన ‘కాళీ-ఏక్ అగ్నిపరీక్షా’ క్రైం థ్రిల్లర్ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘బెహెనీన్’, ‘ఏక్ హజారోన్ మే మేరీ బెహ్నా హై’, ‘జమైరాజా’, ‘ఇష్క్ మే మార్జావన్’, ‘పవిత్రా రిష్థా’, ‘ఖుబూల్ హై’ ‘నాగిన్ సిరీస్’ తదితర సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ‘ట్విస్టెడ్’ వంటి వెబ్ సిరీస్‌ల్లోనూ నటించిన ఈ అందాల తారకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 4.6 మిలియన్ల మంది నియాను అనుసరిస్తుండడం విశేషం. ఇక ‘కామెడీ నైట్స్ బచావో’, ‘బాక్స్ క్రికెట్ లీగ్’ వంటి రియాలిటీ షోల్లో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ 2017లో జరిగిన ‘ఖత్రోంకీ ఖిలాడీ’ ఎనిమిదో సీజన్లో సెకండ్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో ‘పడిన చోటే పైకి లేచి నిలబడాలి’, ‘ఓడిన చోటే గెలవాలి’ అన్న మాటలను అక్షరాలా నిజం చేస్తూ ఈ ఏడాది ‘ఖత్రోంకీ ఖిలాడీ: మేడిన్ ఇండియా’ ట్రోఫీని కైవసం చేసుకుంది.
ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ!
సీజన్ ఆసాంతం అడ్వెంచరస్ స్టంట్లను సమర్ధంగా పూర్తిచేసిన నియా ఫైనల్లో మరోసారి తనదైన ధైర్యసాహసాలు ప్రదర్శించింది. ఫైనల్ పోటీలో కొండచిలువలను తప్పించుకుంటూ, పైగి ఎగబాకుతూ, గ్లాసు పగులగొట్టి నెక్లెస్‌ను తీసుకురావాల్సిందిగా పోటీ నిర్వాహకులు టాస్క్ ఇచ్చారు. అంతేకాదు మధ్యమధ్యలో బాంబులు వేస్తూ కంటెస్టెంట్లను మరింత పరీక్షించారు. వీటన్నింటినీ సమర్ధంగా ఎదుర్కొన్న నియాశర్మ జాస్మిన్ భాసిన్, కరణ్ వాహి లాంటి సెలబ్రిటీలను వెనక్కునెట్టి విజేతగా నిలిచింది.
నియా ఒక విజేత!
ఇటీవల ఈ కార్యక్రమానికి సంబంధించిన బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. ఈ క్రమంలో ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్‌శెట్టి చేతుల మీదుగా విన్నింగ్ ట్రోఫీని అందుకుంది నియా. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయిందీ బ్యూటీ.. ‘మూడేళ్ల క్రితం ఇదే రియాలిటీ షోలో సెకండ్ రన్నరప్‌గా నిలిచాను. అదృష్టవశాత్తూ నాకు మరో అవకాశం లభించింది. అందుకే ఈసారి ఎలాగైనా టైటిల్‌ను గెలవాలనే ఆశయంతో ఈ షోలోకి అడుగుపెట్టాను. మొదట్లో చాలా సరదాగా స్టంట్లను పూర్తి చేశాను. ఆ తర్వాత వందకు వంద శాతం కష్టపడుతూ టాస్క్‌లు పూర్తి చేశాను. అనుకున్నట్లే విజేతగా నిలిచాను. నాకిది ఎంతో స్పెషల్ ఎడిషన్. ఈ విజయం నాకెంతో సంతోషాన్నివ్వడమే కాకుండా నాపై నాకు నమ్మకం కలిగించింది. నన్ను నేను నిరూపించుకోవడానికి ఈ షో ఎంతో దోహదపడింది. నాపై పూర్తి నమ్మకం ఉంచి ప్రోత్సహించినందుకు షో నిర్వాహకులకు థ్యాంక్స్! అదేవిధంగా నియా శర్మ అంటే కేవలం మేకప్, స్టైలింగ్ అని పనికట్టుకుని విమర్శించే వారికి ఈ విజయమే సమాధానం. నియా ఒక విజేత. తనను తాను నిరూపించుకున్న ఓ ధీరవనిత’ అని ఉద్వేగంగా చెప్పుకొచ్చిందీ అందాల తార.
ప్రస్తుతం ‘నాగిన్ 5’ సీరియల్లో నటిస్తోన్న నియా... సల్మాన్‌ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ -14 సీజన్లోనూ సందడి చేయనుంది.