@teamvasundhara
ఈ ఫీలింగ్ అద్భుతంగా ఉంది.. మీకూ కావాలా?
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలాన్ని సృష్టిస్తోన్న మాట వాస్తవమే అయినా.. చాలామందికి జీవితం విలువేంటో తెలియజేస్తోంది. ఆరోగ్యం విషయంలో ఎన్నో పాఠాలు నేర్పుతోంది. అందరూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకునేలా చేస్తోంది. గార్డెనింగ్ కూడా ఇందులో ఓ భాగమే! ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో బయటికెళ్లి ఆపద కొని తెచ్చుకోవడం ఎందుకన్న ఉద్దేశంతోనో.. లేదంటే సహజ పద్ధతుల్లో ఇంటి ఆవరణలోనే పండించిన కాయగూరలు ఆరోగ్యకరమన్న విషయం గ్రహించో.. ఇలా కారణమేదైనా చాలామంది హోమ్ గార్డెనింగ్కే ఓటేస్తున్నారు. ఈ జాబితాలో సామాన్యులే కాదు.. సెలబ్రిటీలూ ఉన్నారు. ఇప్పటికే టాలీవుడ్ బ్యూటీస్ సమంత, రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మి తమ గార్డెనింగ్ అనుభవాలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పంచుకుంటుండగా.. తాజాగా ఆ లిస్ట్‌లో సొట్టబుగ్గల సుందరి ప్రీతీ జింటా కూడా చేరిపోయింది. తన గార్డెన్లో పండించిన నిమ్మకాయల్ని కోస్తున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఆమె.. తన గార్డెనింగ్ అనుభవాలను క్యాప్షన్ రూపంలో పంచుకుంటూ మురిసిపోయింది. మరి, ఆ వివరాలేంటో తెలుసుకుంటూనే.. ఈ కరోనా రోజుల్లో తమ గార్డెనింగ్ అభిరుచికి పదును పెట్టిన ఇతర నాయికలెవరో, వారి గార్డెనింగ్ సంగతులేంటో మనమూ తెలుసుకుందాం రండి.. కరోనా కారణంగా గత ఐదు నెలలుగా తారలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో ఎవరికి నచ్చిన పనులు వాళ్లు చేస్తూ తమకు ఎదురయ్యే ఒత్తిళ్లను అధిగమిస్తున్నారు. మరికొందరు తమ అభిరుచుల్ని ఆచరణలో పెడుతున్నారు. బాలీవుడ్ సొట్టబుగ్గల బ్యూటీ ప్రీతీ జింటా కూడా ప్రస్తుతం ఇదే పనిలో ఉంది. బోలెడంత ఖాళీ సమయం దొరకడంతో హోమ్ గార్డెనింగ్ చేస్తున్నానంటూ తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్ షేర్ చేసిందీ ముద్దుగుమ్మ.
నేను పండించిన నిమ్మకాయలోచ్!
తన స్వహస్తాలతో పండించిన నిమ్మకాయల్ని కోస్తూ తీసిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ప్రీతి.. ‘ఇదండీ.. నా బుజ్జి కిచెన్ గార్డెన్! నాకు కావాల్సిన ఆహారాన్ని నేనే పండించుకుంటున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది.. అందుకే ఈ ఆనందాన్ని మీతో పంచుకోకుండా, నా కిచెన్ గార్డెన్‌ని మీకు చూపించకుండా ఉండలేకపోతున్నా. నేను పండించిన నిమ్మకాయలు చూడండి.. గార్డెన్, నిమ్మకాయలు.. రెండూ అద్భుతంగా ఉన్నాయి కదూ!! ఎంతైనా ఇంట్లో పండించినవి కదా! మన స్వహస్తాలతో మనం ఒక మొక్కను పెంచడం, వాటి ఎదుగుదలను దగ్గర్నుంచి వీక్షించడం.. ఇదో అద్భుతమైన అనుభూతి. ఇంత గొప్ప ఫీలింగ్‌ను నాకు అందించి, నా కలను నిజం చేసిన మా అమ్మకు థ్యాంక్యూ!!’ అంటూ తన ఆనందాన్ని పంచుకుందీ అందాల తార. ఇక ఈ వీడియోను చూసిన బాలీవుడ్ బ్యూటీ నర్గిస్ ఫక్రీ ‘నాకూ అక్కడికి రావాలనుంది’ అంటూ కామెంట్ పెట్టింది. ఇలా ప్రీతి పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.
|
నాతో పాటు ‘జర్నీ’ చేస్తారా?
టాలీవుడ్ బ్యూటీ సమంత గత కొన్ని నెలల నుంచి గార్డెనింగ్‌లో బిజీగా గడుపుతోంది. అంతేకాదు.. ఈ కరోనా ప్రతికూల పరిస్థితుల్లో ఆహారం విలువేంటో తనకు తెలిసిందని, ఇదే తనను గార్డెనింగ్ వైపు పురికొల్పిందంటూ ఇటీవలే ఇన్‌స్టాలో పంచుకున్న ఈ అందాల తార.. తాను పండించిన ఆకుకూరలు, కాయగూరల ఫొటోలను, వీడియోలను తరచూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. ‘మనం తినే ఆహారం మనమే పండించుకుంటున్నామన్న ఆలోచనే ఎంతో గొప్పగా అనిపిస్తోంది. అందుకే ఈ క్రమంలో మిమ్మల్నీ పాలు పంచుకోమని కోరుతున్నా. ఇలా ఈ జర్నీలో మిమ్మల్ని భాగం చేస్తున్నందుకూ చాలా సంతోషంగా ఉంది. రండి.. అందరం కలిసి మొక్కలు పెంచుదాం.. ఇందుకోసం కుండీ, మట్టి, విత్తనాలు, ఖాళీ పాల ప్యాకెట్ లేదంటే హైడ్రోపోనిక్ హోమ్‌కిట్.. వంటివి ఉంటే చాలు.. ఈజీగా మొక్కలు పెంచుకోవచ్చు. ఈ అలవాటు మన జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొస్తుంది.. నన్ను నమ్మండి!’ అంటూ #GrowWithMe అనే హ్యాష్‌ట్యాగ్ వేదికగా అందరూ గార్డెనింగ్‌లో భాగమవ్వాలని, ఆ ఫొటోలు, వీడియోలు పంచుకోవాలని కోరుతోందీ ముద్దుగుమ్మ. అంతేకాదు.. టాలీవుడ్ బ్యూటీస్ రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మీప్రసన్నలను ఈ గార్డెనింగ్ ఛాలెంజ్‌కి నామినేట్ చేసిందీ అక్కినేని వారి కోడలు పిల్ల.
|
అది చూసి ముచ్చటేస్తోంది!
ఇక సామ్ విసిరిన ఛాలెంజ్‌ని స్వీకరించిన రకుల్.. తన హోమ్ గార్డెనింగ్ వీడియోను ఇన్‌స్టాలో పంచుకుంటూ.. ‘థ్యాంక్యూ.. సమంత! ఈ విత్తనాలు మొక్కలుగా ఎదగడం చూస్తుంటే ముచ్చటేస్తోంది. మనకు ఆరోగ్యాన్ని అందించే అద్భుత ఔషధాలివి. మీ శరీర అవసరాలకు తగినట్లుగా మీకు మీరే ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోవచ్చు. రండి.. ప్రకృతితో మమేకమవుదాం.. ఆరోగ్యాన్ని అందిపుచ్చుకుందాం..!’ అంటూ క్యాప్షన్ పెట్టిందీ పంజాబీ భామ.
|
అందుకు గర్వంగా ఉంది!
ఇక ఇదే ఛాలెంజ్‌ని స్వీకరించిన మంచు లక్ష్మి తన కూతురు విద్యా నిర్వాణతో కలిసి గార్డెనింగ్ చేస్తోన్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ‘నేను, నా కూతురు గార్డెనింగ్‌లో బిజీగా ఉన్నాం. మొక్కలు మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ఓవైపు ప్రాణవాయువు అందిస్తున్నాయి. మరోవైపు ఆహారపు వనరుగా వినియోగపడుతున్నాయి. మన శరీరానికి నప్పే ఆహారమేంటో మనకు మాత్రమే తెలుసు. అలాగే ప్రస్తుత ప్రతికూల పరిస్థితులు మన ఆరోగ్యం, హెల్దీ లైఫ్‌స్టైల్ గురించి మనకు బోలెడన్ని పాఠాలు నేర్పించాయి. ఏది లేకపోయినా బతకొచ్చేమో గానీ ఆహారం లేకపోతే బతకలేం. అందుకే నా ఆహారాన్ని నేను పండించుకుంటున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నన్ను నామినేట్ చేసినందుకు థ్యాంక్యూ సమంత! రండి.. మీరు కూడా మాతో చేతులు కలపండి..’ అంటూ తన అభిమానులను కోరుతోందీ మంచు వారి ఆడపడుచు.
|
ఇలా సానుకూలంగా ముందుకు సాగుదాం!
తన బాల్కనీలో గార్డెనింగ్ చేస్తోన్న ఫొటోను పంచుకున్న బాలీవుడ్ డస్కీ బ్యూటీ బిపాసా బసు.. ‘ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో నన్ను నేను కొత్తగా మలచుకోవడానికి ప్రయత్నిస్తున్నా. ఈ సమయంలో మనమంతా శారీరకంగా, మానసికంగా ఎంతో దృఢంగా ఉండాలి. జీవితం మనకు దేవుడిచ్చిన గొప్ప బహుమతి. ఈ విలువైన జీవితాన్ని ప్రతి క్షణం ఆస్వాదించాలి. ధ్యానం, వ్యాయామం, మనసుకు నచ్చిన వాళ్లతో సమయం గడపడం, పుస్తకాలు చదవడం, కొత్త విషయాలు నేర్చుకోవడంపై దృష్టి పెడుతూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి. వంట చేసుకోవడం, ఇంటిని శుభ్రం చేసుకోవడంతో పాటు ఎవరి శరీరతత్వానికి నప్పే ఆహారం వారు పండించుకోవాలి. సానుకూలంగా ముందుకు సాగాలి..!’ అంటూ స్ఫూర్తిదాయక పోస్ట్‌ను రాసుకొచ్చిందీ బాలీవుడ్ అందం.
|
గార్డెనింగ్ ఓ థెరపీ!
బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ రిచా చద్దా తన గార్డెనింగ్ అనుభవాలను ఓ సందర్భంలో ఇలా పంచుకుంది. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడేందుకు గార్డెనింగ్ ఓ థెరపీలా పనిచేస్తుందని చెప్పుకొచ్చిందీ బాలీవుడ్ అందం. ‘గార్డెనింగ్ గురించి ఎంత తెలిసినా ఇంకా ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో నేను ఒక గార్డెనర్‌గా (తోటమాలిగా) మారాను.. నాకు కావాల్సిన ఆహారాన్ని నేను పండించుకునే పనిలో ఉన్నాను. గార్డెనింగ్‌లోనూ ప్రస్తుతం విభిన్న టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయి. హైడ్రోపోనిక్ గార్డెన్స్, వర్టికల్ గార్డెన్స్.. వంటి వినూత్న పద్ధతులు మన గార్డెనింగ్ కలను మరింత సులభతరం చేస్తున్నాయి. కరోనా పరిస్థితులు సద్దుమణిగాక నేనూ వీటిలో ఏదో ఒక పద్ధతిని ఆచరణలో పెట్టేందుకు ఆతృతగా ఉన్నా. అయితే ఇప్పుడు మాత్రం ఆల్ఫాల్ఫా స్ప్రౌట్స్, కలబంద, స్ప్రింగ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, నిమ్మ, జామ, దానిమ్మ.. వంటివి నా కిచెన్ గార్డెన్లో పెంచుతున్నా. వీటితో పాటు కొత్తిమీర, లెమన్‌గ్రాస్, తులసి, పుదీనా, కరివేపాకు, ఇతర పూల మొక్కలకూ చోటిచ్చా.. నిజానికి గార్డెనింగ్ అనేది ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో ఓ థెరపీలా పనిచేస్తుంది..!’ అంటూ గార్డెనింగ్ పట్ల అందరిలో ప్రేరణ కలిగించిందీ బ్యూటీ.
|
వీరితో పాటు బాలీవుడ్ ముద్దుగుమ్మలు జుహీ చావ్లా, భూమీ పెడ్నేకర్‌లు కూడా తమ గార్డెనింగ్ అనుభవాలను సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోల రూపంలో పంచుకుంటూ తమ అభిమానుల్లో గార్డెనింగ్, ఆరోగ్యం పట్ల ఆసక్తిని రేకెత్తిస్తున్నారు.
|