కారణం ఏదైనా సరే.. విడాకులు తీసుకున్న స్త్రీలంటే ఈ సమాజంలో కాస్త చిన్న చూపు ఉంటుంది. వాళ్లేదో తప్పు చేశారన్నట్లుగా చాలా చులకనగా మాట్లాడుతుంటారు. సెలబ్రిటీలు కూడా ఇందుకు అతీతమేమీ కాదు. ఈ నేపథ్యంలో ప్రముఖ హిందీ టీవీ నటి కామ్యా పంజాబీ కూడా గత కొంత కాలంగా ఇలాంటి విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. మొదటి భర్తతో విడాకులు తీసుకున్న ఆమె ఈ ఏడాది ఫిబ్రవరిలో మళ్లీ వివాహం చేసుకుంది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శలు, ట్రోల్స్‌కు తాజాగా తనదైన శైలిలో సమాధానమిచ్చిందీ అందాల తార.
కెరీర్ ప్రారంభంలో ‘కహోనా ప్యార్ హై’, ‘కోయి మిల్ గయా’ ‘ఫిర్ భి దిల్ హై హిందుస్థానీ’ తదితర చిత్రాల్లో కనిపించిన కామ్యా పంజాబీ ఆ తర్వాత టీవీ సీరియల్స్‌లో నటిస్తూ తనకంటూ ఓ గుర్తింపు సాధించుకుంది. ‘బనో మై తేరీ దుల్హన్’, ‘మర్యాద: లేకిన్ కబ్ తక్’, ‘దర్ సబ్ కో లగ్తా హై’ ‘దో దిల్ ఏక్ జాన్’, ‘సీఐడీ’, ‘కామెడీ సర్కస్’, ‘జీత్ జాయేంగే హమ్’ తదితర సీరియల్స్‌లో నటించి మెప్పించింది. ఇక బిగ్‌బాస్-7 సీజన్లో కంటెస్టెంట్‌గా పోటీ పడిన ఆమె బిగ్‌బాస్-9, 10, 12, 13 సీజన్లలో గెస్ట్ కంటెస్టెంట్‌గా హాజరైంది. ‘బాలికా వధు’ సీరియల్‌తో ఎంతో గుర్తింపు సొంతం చేసుకున్న ప్రత్యూషా బెనర్జీ, కామ్యలు బెస్ట్ ఫ్రెండ్స్ కావడం విశేషం. ఈక్రమంలో ప్రత్యూష ఆత్మహత్య తర్వాత ఆమె జీవితం ఆధారంగా ఏకంగా సినిమాను తెరకెక్కించి అందరి నోళ్లల్లో నానిందీ ముద్దుగుమ్మ. ఇక కామ్య వ్యక్తిగత జీవితానికి వస్తే 2003లో బంటీ నేగీని వివాహం చేసుకుంది. పదేళ్లు కలిసి కాపురం చేసిన ఈ దంపతులు వివిధ కారణాలతో 2013లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నటుడు షలాబ్ డాంగ్‌తో ప్రేమలో పడిన ఈ బుల్లితెర యాక్ట్రెస్ ఈ ఏడాది ఫిబ్రవరిలో అతనితో కలిసి పెళ్లి పీటలెక్కింది.
విడాకులు తీసుకోవడం తప్పేమీ కాదు!
ఈ సందర్భంగా రెండో పెళ్లి చేసుకున్న కామ్యను లక్ష్యంగా చేసుకుని కొందరు నెటిజన్లు విమర్శల వర్షం కురిపించారు. ఈ క్రమంలో సీరియల్స్‌లో బలమైన ప్రతినాయక పాత్రలతో ఆకట్టుకున్న ఆమె తనపై వస్తున్న విమర్శలను తనదైన శైలిలో తిప్పికొట్టింది.
‘మన సమాజంలో విడాకులు తీసుకున్న స్త్రీలను, సింగిల్ మదర్లను చాలా చులకనగా చూస్తుంటారు. వాళ్లేదో చేయరాని తప్పు చేశారన్నట్లుగా మాట్లాడుతుంటారు. విడాకులు లాంటి కఠినమైన పరిస్థితులను అధిగమించి కొత్త జీవితం ప్రారంభించాలనుకున్న మహిళలను చూసి సమాజం అసలు సహించదు. వారికి చేతనైన సాయం చేసే బదులు సూటిపోటి మాటలతో అవమానిస్తుంది. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి నేను ఎప్పటినుంచో ఇలాంటి విమర్శలు, ట్రోల్స్ ఎదుర్కొంటున్నాను. 2013లో నేను విడాకులు తీసుకున్నప్పుడు నన్ను లక్ష్యంగా చేసుకుని కొందరు నెటిజన్లు అసభ్యకరంగా కామెంట్లు చేశారు. అది సబబు కాదు. నిజానికి నేను విడాకులు తీసుకోవడానికి దారి తీసిన కారణాలేంటో అందరికీ తెలియకపోవచ్చు. అయినా విడాకులు తీసుకుని విడిగా జీవించడం తప్పేమీ కాదు.
సైలెంట్‌గా భరిస్తున్నారు!
ఇక ఈ ఫిబ్రవరిలో రెండో వివాహం చేసుకున్నప్పుడు నాపై విమర్శల దాడి మరింత పెరిగింది. అందుకే నేను స్వరం పెంచాల్సి వచ్చింది. ఇప్పుడు నేను మరింత స్ట్రాంగ్‌గా మారిపోయాను. ఎలాంటి విమర్శలు, ట్రోల్స్‌కు కుంగిపోవడం లేదు. నాకు నచ్చిన పని చేసుకుంటూ ముందుకెళుతున్నాను. నాకు నచ్చిన వ్యక్తితో జీవితాన్ని పంచుకుంటున్నాను. సామాన్యుల సంగతి పక్కన పెడితే సమాజంలోని కొందరు సెలబ్రిటీలు కూడా తమపై వస్తున్న ట్రోల్స్‌పై నోరు మెదపడం లేదు. ‘ఛోడో.. కౌన్ బోలేగా’ (ఎవరైనా, ఏమైనా అనుకోని... వదిలేద్దాం) అంటూ సైలెంట్‌గా ఉండిపోతున్నారు.
బాగా చదువుకొని సమాజంలో తెలివైన వారిగా పేరు తెచ్చుకున్న కొందరు మహిళలు కూడా అత్తారింట్లో వేధింపులు ఎదుర్కొంటున్నారు. మగ పిల్లాడు కావాలనో, అదనపు కట్నం కావాలనో వేధించే భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులందరి చేతుత్లో దెబ్బలు తింటున్నారు. పెళ్లికి ముందు ఎంతో ధైర్యంగా ఉన్న ఈ మహిళలు పెళ్లయ్యాక మాత్రం పూర్తి నిరాశలో మునిగిపోతున్నారు. పంటి బిగువున వేధింపులను భరిస్తూ కాలం గడిపేస్తున్నారు. ఇలాంటి వారందరూ ఓ స్టెప్ తీసుకుని నోరు విప్పాలన్న ఆకాంక్షతోనే ఇటీవల నేను ఓ లఘుచిత్రం తెరకెక్కిస్తున్నాను’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చిందీ బుల్లితెర బ్యూటీ.