ఆవిరిపై ఉడికించినవే మంచివి!
యాంకర్‌గానే కాకుండా నటిగా కూడా మంచి గుర్తింపు సాధించుకుంది ఝాన్సీ. సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటించి మెప్పించిన ఈ అందాల యాంకర్.. వీలు చిక్కినప్పుడల్లా సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్‌ని పలకరిస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా తన ఫ్యాన్స్‌తో లైవ్ చాట్ నిర్వహించింది. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారితో ముచ్చటించింది. ఆపై ఆ చిట్కాల్ని ఇన్‌స్టా పోస్ట్ రూపంలోనూ పంచుకుందీ బ్యూటిఫుల్ లేడీ. ఇంతకీ, ఆ చిట్కాలేంటంటే..!
* యోగా-ప్రాణాయామం, ధ్యానం.. రోజూ చేసేలా ఓ ప్రణాళిక రూపొందించుకోండి. * గోరువెచ్చటి లేదంటే గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసిన నీటిని మాత్రమే తాగాలి. * అభ్యంగన స్నానం (అత్యవసర నూనెలతో మసాజ్ చేసుకుని ఆపై స్నానం చేయడం - ఇదొక ఆయుర్వేద పద్ధతి), ఆవిరి స్నానం.. చేయడం మంచిది. * రోజూ ఇంట్లో సహజసిద్ధమైన మూలికలతో పొగ వేసుకోండి. * పగటి పూట నిద్ర పోకపోవడమే మంచిది. * రోజూ పాదాలకు నూనె రాసుకోండి. కాలి వేళ్ల గోళ్లు ఎప్పటికప్పుడు కత్తిరించుకోండి. * ఏది తిన్నా వేడివేడిగా తినండి.. అది కూడా తేలికగా జీర్ణమయ్యే ఆహారమైతే మరీ మంచిది.
* గోధుమలు, బియ్యం, చిరుధాన్యాలు, పెసరపప్పు, బార్లీ, జొన్నలు.. వంటివి తప్పకుండా తీసుకోండి.. అయితే వాటిని బాగా నానబెట్టి, ఆవిరిపై ఉడికించి తీసుకోవాలి. * అలనేరేడు, దానిమ్మ, ఉసిరి, అల్బుకరా.. వంటి సీజనల్ పండ్లతో పాటు ఖర్జూరం, బాదం పప్పులు, వాల్నట్స్ తప్పకుండా రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. * కీరా జాతికి చెందిన కాయగూరలు-పండ్లు (గుమ్మడి, పుచ్చకాయ, తర్బూజా.. మొదలైనవి), దుంపలు, అల్లం, ఇంగువ, ఆవు నెయ్యి.. వంటివీ ముఖ్యమే. * ఈ కాలంలో ఎదురయ్యే అనారోగ్యాల చికిత్స కోసం త్రిఫల, త్రికటు, కరక్కాయ వంటి ఆయుర్వేద మూలికలను ఉపయోగించడం మంచిది. * రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసినవి అస్సలు తీసుకోకూడదు. వీటితో పాటు పులియబెట్టినవి, చేదు పదార్థాలు, యాస్ట్రింజెంట్ ఆహార పదార్థాలు, పాలు, మొలకలొచ్చిన దుంపలు.. వంటి వాటికి దూరంగా ఉండండి. * ఈ కాలంలో పెరుగుకు బదులుగా చిక్కగా చిలికిన మజ్జిగైతే మరీ మంచిది. * ఆవిరిపై ఉడికించిన ఆహార పదార్థాలు, సూప్స్, కిచిడీ.. వంటివి ఎంత తాజాగా తయారుచేసుకొని, వేడివేడిగా తీసుకుంటే అంత మంచిది. * వర్షాకాలంలో చేపలు, రొయ్యలు.. వంటి సీఫుడ్‌కి దూరంగా ఉండాలి. అలాగే మటన్ జోలికి అస్సలు వెళ్లకూడదు. * సూర్యాస్తమయానికి ముందే భోజనం చేసేయాలి. అంటూ వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సుదీర్ఘ పోస్ట్ రాసుకొచ్చిందీ ముద్దుగుమ్మ. ఇలా తన చిట్కాలతో ఫ్యాన్స్‌లో మరోసారి స్ఫూర్తి నింపిందీ స్టార్ యాంకర్.
|