‘ఏలే ఏలే మరదలా... వాలే వాలే వరసలా’ అంటూ ‘అన్నమయ్య’ మరదలి పాత్రలో అందరినీ ఆకట్టుకుంది కస్తూరి. తమిళ ఇంట్లో పుట్టినా... అచ్చమైన తెలుగమ్మాయిలాగా కనిపించే ఈ భామ ‘భారతీయుడు’ సినిమాలో కమల్ హాసన్ కూతురిగా కూడా నటించింది. వీటితో పాటు ‘నిప్పురవ్వ’, ‘మెరుపు’ ‘సోగ్గాడి పెళ్లాం’, ‘మా ఆయన బంగారం’, ‘చిలక్కొట్టుడు’, ‘ఆకాశవీధిలో’, ‘డాన్ శీను’, ‘శమంతకమణి’ తదితర తెలుగు చిత్రాల్లో నటించిన ఈ సొగసరి పలు తమిళ, కన్నడ, మలయాళ భాషా చిత్రాల్లోనూ సందడి చేసింది. అందం, అభినయం కలగలసిన ఈ అందాల తార తాజాగా ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సరదా సంగతులు పంచుకుంది.
మీ మాతృభాష ఏది?
కస్తూరి: నేను పుట్టింది తమిళ ఇంట్లో. మా అత్తామామలది మద్రాసు తెలుగు. మా ఆయనకు తెలుగు మాట్లాడటం రాదు. ఇంగ్లిష్ మాట్లాడతారు.
మీ వివాహం ఎలా అయింది?
పెద్దలు కుదిర్చిన వివాహం.
ఏ సంవత్సరంలో మీకు వివాహం అయింది?
2000లో వివాహం అయింది. ఆ తర్వాత మేము యూరప్ వెళ్లిపోయాం. ఇప్పుడు మా ఆయన అమెరికాలో ఉంటున్నారు. ఆయన డాక్టర్. నడిచే కాళ్లు.. వాగే నోరూ ఊరుకోదు. అందుకే నేను ఇండియాకు వచ్చేశాను.
ఐదేళ్లలో 21 దేశాలు తిరిగారట!
అవునండీ. పెళ్లయిన కొత్తలో అలా తిరిగాం. శీతాకాలంలో జర్మనీలో ఉండటం అస్సలు సాధ్యం కాలేదు. అక్కడ -17డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. అప్పుడు ఈజిప్ట్, ఆఫ్రికా తిరిగేవాళ్లం.
మీరు మిస్ మద్రాసు కదా!
అవును! మిస్ మద్రాసు అయిన తర్వాత రెండు మూడు సినిమాలు చేశా. ఆ తర్వాత మిస్ ఇండియా పోటీలకు వెళ్లా. ఐశ్వర్యారాయ్, సుస్మితాసేన్లతో నేను కూడా ఫైనలిస్ట్. నేను ఓడిపోయానంటే వాళ్ల అందమే కారణం. శ్వేతామేనన్ నా రూమ్మేట్. వయసు పరంగా, ఆలోచనపరంగా అప్పటికీ ఇప్పటికీ నాలో చాలా మార్పు వచ్చింది. అప్పుడు మనల్ని చూసి అమ్మానాన్న గర్వపడాలని చాలా బాధ్యతగా ఉండేదాన్ని. ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు. వాళ్లతో కలిసి ఆడుకుంటున్నా. అమ్మాయికి 14 ఏళ్లు. పదో తరగతి, బాబుకి 8 ఏళ్లు. మూడో తరగతి చదువుతున్నాడు. చాలా ఇంటెలిజెంట్.
అంటే కస్తూరిలా అన్నమాట!
అయ్యో.. నాలా అస్సలు ఉండకూడదు. జమైకా రాజధాని ఏదంటే ఇట్టే చెప్పేస్తాను. చెన్నైలో కరోనా కేసుల లెక్క చెప్పమంటే కూడా మొత్తం చెబుతాను. కానీ, ఇంట్లో తాళం ఎక్కడ ఉందంటే మాత్రం తెలియదు. వెతుకుతూ ఉంటాను.
మీ తల్లిదండ్రుల గురించి?
అమ్మ.. థైరాయిడ్ క్యాన్సర్‌తో కన్నుమూశారు. అది క్యాన్సర్ అని తెలియక సాధారణ నొప్పి అని భరిస్తూ, చివరకు చనిపోయారు. అమ్మ మరణించిన తర్వాత నాన్న తీవ్ర మనో వేదనకు గురయ్యారు. ఐదు నెలల్లో ఆయన కూడా చనిపోయారు. నా చిన్నతనంలో వాళ్లు ఎప్పుడూ గొడవ పడుతూనే ఉండే వారు. కానీ, మా అమ్మ ఆరోగ్యం పాడైన తర్వాత ఆయన చూపించిన ప్రేమ అంతా ఇంతా కాదు. రెండేళ్ల పాటు ఆయన అమ్మ పక్కనే ఉండిపోయారు.
‘భారతీయుడు’ సినిమా ఇప్పుడు తీస్తే.. ఆ ఆలోచన ఎవరికి వచ్చింది?
అవునండీ. అవినీతి గురించి ఇప్పుడే ఎక్కువ మాట్లాడాలి. ఆ ఆలోచన మొత్తం శంకర్గారిదే. అయితే, అక్కడ నటుడిగా ఉన్నది కమల్‌హాసన్. ఆయన తెరపై ఎలా నటిస్తారో అందరికీ తెలిసిందే.
‘భారతీయుడు’ కస్తూరికి, నేటి కస్తూరికి తేడా ఏంటి?
‘భారతీయుడు’ సినిమా 1995లో మొదలైందనుకుంటా. 25 ఏళ్ల తేడా ఉంది కదా! అప్పుడు నా వయసు 16 ఏళ్లు.
తెలుగులో తొలి సినిమా ఏది?
‘నిప్పురవ్వ’. ఆ తర్వాత ‘మెరుపు’, ‘చిలక్కొట్టుడు’, ‘అన్నమయ్య’, ‘ఆకాశ వీధిలో’ తదితర సినిమాల్లో నటించాను.
మీరు చాలా రెబల్ అని విన్నాం నిజమేనా?
అవును! చాలా ముఖ్యమైన విషయం. 25 ఏళ్ల ముందు నేను ఒక టీనేజ్ అమ్మాయిని. అప్పుడు మనకు ఏమైనా ఆలోచనలు ఉన్నా, మాట్లాడటానికి పరిపక్వత ఉండదు. ఇప్పుడు నాకు లోకజ్ఞానం తెలిసింది. అనేక అనుభవాలు ఎదురయ్యాయి. కష్టాలు.. సంతోషాలు చూశా. సమాజానికి ఏదైనా చేయాలని ఒక ఆలోచన కూడా వచ్చింది. దాని వల్ల ట్రస్ట్ ప్రారంభించా. చిన్న పిల్లలకు సాయం చేస్తున్నా. ఎక్కడైనా ఏదైనా జరిగితే నోరు మూసుకుని మాత్రం ఉండను. తమిళనాడులో నేనొక పొలిటికల్ అనలిస్ట్ అయిపోయా. నేనంటే భయం, గౌరవం ఉన్నాయి. నేనొక ఫెమినిస్ట్. మహిళల గురించి మహిళలు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు?. ‘కనెక్ట్ విత్ కస్తూరి’ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించా.
కాంట్రవర్సీలు లేకపోతే కస్తూరికి నిద్ర రాదు అంటుంటారు. నిజమేనా?
అదేం లేదండీ. మన కల్చర్‌లో ఏ మనిషి అయినా మాట్లాడటానికి ఆలోచిస్తాడు. మామూలుగా ఎన్నో కబుర్లు చెప్పే వ్యక్తిని వేదికపైకి వచ్చి మాట్లాడమంటే మాట్లాడరు. అందులో సెలబ్రిటీలు బాగా భయపడతారు. ఏది మాట్లాడినా ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే ఇదిగో ఇలా కాంట్రవర్సీ అనే ముద్ర కూడా పడుతుంది. నేను చెప్పేది అంతా నిజమే. కామన్ మెన్‌కు ఏ పార్టీ కూడా మంచి చేయడం లేదు. ఎవరైనా మంచి చేస్తే థ్యాంక్యూ చెప్పి, చెడు చేసినప్పుడు ఇలా చేయకూడదని చెప్పడానికి నాకు స్వేచ్ఛ ఉండాలి. ఒక పార్టీలో ఉంటే నాకా ఫ్రీడం ఉండదు. నేను పీపుల్స్ పార్టీని. ప్రజల వెనుక నేను ఉన్నా.
‘అన్నమయ్య’ గురించి?
నా జీవితంలో ‘అన్నమయ్య’ ఒక సినిమా మాత్రమే కాదు. అదొక వరం. అద్భుతమైన అవకాశం.
నాగార్జున షేక్ హ్యాండ్ ఇస్తే, ఆ చేతిని కడగకుండా ఆ రోజల్లా పక్కనే పెట్టుకుని పడుకున్నారట!
నేను చాలామంది హీరోలతో పనిచేశా. కానీ, లైఫ్ టైమ్‌లో క్రష్ అనేది ఒకరిపై వచ్చిందంటే అది నాగార్జున గారి మీదనే. నేను మోడలింగ్ చేసే సమయంలోనే ఆయన్ను కలిశా. అప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తే, చేతిని కడగకుండా 24గంటలు ఉంచా. చివరకు ఆకలికి తట్టుకోలేక చేయి కడగాల్సి వచ్చింది. (నవ్వులు) ఆయనతో నేను రెండు సినిమాలు చేస్తానని అనుకోలేదు.
క్రికెటర్ సౌరవ్ గంగూలీని కూడా ఇష్టపడ్డారట!
లేదండీ.. నాకు ధోనీ అంటే ఇష్టం. అయితే, ధోనీని చూసినప్పుడల్లా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గుర్తొస్తున్నాడు. అలాంటి విషయాలు ఇండస్ట్రీలో జరిగితే మనసుకు చాలా బాధగా ఉంటుంది.
ధోనీతో ఒక్కరోజు ఉండే ఛాన్స్ వస్తే ఎలా ప్లాన్ చేస్తారు?
అలా జరిగింది కూడా. సాక్షి, జీవాలతో పాటు నా పిల్లలు కూడా ఉంటారు.
‘ఆమె’, ‘సింధూరం’ ఎందుకు మిస్సయ్యారు?
డేట్స్ సర్దుబాటు చేయలేకపోవడం వల్ల వాటిని మిస్ అయ్యా.
మొదటిసారి మనిద్దరం (ఆలీ) కలిసి చేసిన సినిమా ఏంటో గుర్తుందా?
‘డాన్ శీను’
‘కాలా’ లో మిమ్మల్ని అనుకుని తర్వాత వద్దనుకున్నారట..
ముంబయి ధారావిలో జరిగే కథ అది. నేను కూడా ఆడిషన్‌కు వెళ్లాను. అయితే, స్లమ్‌లో ఉండేవాళ్లలా నేచురల్ లుక్ కావాలన్నారు. నేను చీర కట్టుకుని వెళ్లా. చూడగానే ‘ఆ పాత్రకు మీరు సరిపోరు’ అని చెప్పేశారు. అన్ని విధాలా వాళ్లను ఒప్పించే ప్రయత్నం చేశా. నేను చేసిన పాత యాడ్లు చూపించా. అయినా వాళ్లు ఒప్పుకోలేదు. ఆయనతో నటించి ఉంటే నా చిరకాల కోరిక నెరవేరేది.
రమ్యకృష్ణతో స్ర్కీన్ షేర్ చేసుకోవడం ఎలా అనిపించింది?
ఆమె నాకంటే చాలా సీనియర్. ఆమె అంటే కూడా నాకు క్రష్ ఉంది. నేను స్కూల్లో చదువుకునేటప్పటి నుంచి ఆమె సినిమాలు చూస్తున్నా. ఇప్పుడు నా పిల్లలు స్కూల్లో చదువుతున్నారు. అప్పటికీ ఇప్పటికీ ఆమె గ్లామర్ ఏమాత్రం మారలేదు.
కమల్‌తో నటిస్తున్నప్పుడు ఏం నేర్చుకున్నారు?
ఎన్సైక్లోపిడియా చదివి ఏం నేర్చుకున్నావ్ అంటే సులభంగా చెప్పగలను. కమల్ సర్‌ను సెట్లో చూడడమే ఒక పాఠం లాంటిది. ‘భారతీయుడు’ సినిమా కోసం ప్రతి ఒక్కరూ తమ మొదటి చిత్రంగా భావించి పని చేశారు. దర్శకుడు ఏదైనా సీన్ చెబితే ‘అలా చేయొచ్చా’ అని అడిగేవారు. ఎప్పుడైనా మనం సినిమా స్టార్స్ అని గర్వం వస్తే, వాళ్లను చూస్తే అది పోతుంది. ‘నిప్పురవ్వ’లో ఎక్కువ సన్నివేశాల్లో విజయశాంతి గారితో చేశా. ఒకరోజు ఆమె తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డారు. అయినా కూడా దర్శకుడు యాక్షన్ చెప్పగానే అవన్నీ మర్చిపోయి ఫైట్స్ చేశారు. ఆమె నటిస్తున్న తీరు చూసి నేను భయపడిపోయా. ఏయన్నార్‌గారితో ‘గాడ్ ఫాదర్’లో నటించా. సెట్లో ఎలా ఉండాలో ఆయనను చూసి నేర్చుకున్నా.
ఎవరైనా హీరోకు తల్లిగా చేస్తారా?
చేస్తాను. ఆ హీరో తండ్రిగా, కొడుకుగా డబుల్ యాక్షన్ చేయాలి. అప్పుడు తప్పకుండా చేస్తా. విజయ్ దేవరకొండకు మాత్రం తల్లిగా అస్సలు చేయను. ఆయనంటే చాలా క్రష్. ఇటాలియన్ మోడల్లా ఉంటారు.
మీరు బాగా ఇష్టపడి మిస్సయిన సినిమా ఏదైనా ఉందా?
అలా ఏమీ లేదు కానీ, ‘మెరుపు కలలు’ చిత్రంలో కాజోల్ క్యారక్టరైజేషన్ నాకు దగ్గరగా ఉంటుంది. ‘బొమ్మరిల్లు’లో జెనీలియా పోషించిన పాత్ర కూడా నాదే. నిజ జీవితంలో నేనూ అలాగే ఉంటాను.
తెలుగు ఇండస్ట్రీలో నచ్చిన/నచ్చని విషయం?
నచ్చిన విషయం అంటే గౌరవం. నచ్చనిది ఏమీ లేదు.
ఏ వయసులో కస్తూరికి ప్రేమలేఖ వచ్చింది?
కస్తూరి: 14 ఏళ్ల వయసులో.. అయితే, ఆ లెటర్‌ను ‘ఆ అమ్మాయికి ఇవ్వు.. ఈ అమ్మాయికి ఇవ్వు’ అని చెబుతుండేవారు.
నిద్రపోయే ముందు ముగ్గురు వ్యక్తులకు ‘థ్యాంక్స్’ చెప్పి నిద్రపోతారట!
అవును! నా జీవితంలో నన్ను ఉత్తమంగా తీర్చిదిద్దిన వాళ్లు. నేను తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇళయరాజా సంగీతం నన్ను ఆ ఇబ్బందుల నుంచి బయటపడేసింది. ఆ తర్వాత పుదుమైపిత్తన్ అనే తమిళ రచయిత. ఆయన చనిపోయి వందేళ్లు దాటిపోయింది. అయినా ఆయన రచనలు నాలో ఎంతో స్ఫూర్తి నింపుతాయి. ఆ తర్వాత షిర్డీ సాయిబాబా. ఆయన కృప వల్ల నా కూతురు బతికింది.
అమెరికాలో మన తెలుగు సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసేవారట
చాలా సినిమాలు చేశాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ చిత్రాలను డిస్ట్రిబ్యూషన్ చేశాం.
మంచి పాత్రల్లో నటిస్తూ, ఒక మ్యాగజైన్‌కు బోల్డ్ ఫొటో ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది?
అది ఇక్కడ ఇవ్వలేదు. అందరూ దొంగతనంగా వేసుకున్నారు. ఈ కల్చర్‌కు ఆ ఫొటో సూట్ కాదు. అది అమెరికన్ ప్రాజెక్టు. మాతృత్వానికి వాళ్లు ఇచ్చే మర్యాద, మనం ఇచ్చే మర్యాద వేరు. ఆ ఫొటోలు లీక్ కావడం నాకు చాలా బాధగా అనిపించింది. బిడ్డకు పాలిచ్చే ఫొటోలను ఇక్కడి వారు చూసే విధానం వేరుగా ఉంటుంది. కానీ, అది తప్పని తెలుసుకున్నా. మహిళల నుంచి నాకు ఎంతో మద్దతు లభించింది. గ్రామీణ మహిళలు కూడా నాకు సపోర్ట్ చేశారు.
వచ్చే జన్మలో తెలుగు హీరోలా పుట్టాలంటే ఎవరిలా పుడతారు?
ఎన్టీఆర్ డ్యాన్స్, ఫైట్స్.. ప్రభాస్ కండలు.. అల్లు అర్జున్ స్టైల్.. విజయ్ దేవరకొండ లుక్స్ అన్నీ కలిపి కావాలి.