‘స్టార్ మహిళ’... బుల్లితెరపై దశాబ్దానికి పైగా కొనసాగిన ఈ గేమ్ షో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆడపడుచులందరికీ తెగ నచ్చేసింది. స్టార్ యాంకర్ సుమ గలగల మాటలకు తోడు గమ్మత్తైన ఆటలు, ఆసక్తికరమైన టాస్క్‌లతో మహిళా ప్రేక్షకుల నీరాజనాలు అందుకుందీ సూపర్బ్ ప్రోగ్రామ్. 2008లో ఈటీవీలో ప్రారంభమైన ఈ కార్యక్రమం.. 2019 జనవరి 26న ముగిసిన సంగతి తెలిసిందే. 11 ఏళ్లకు పైగా సాగిన ఈ సుదీర్ఘ బుల్లితెర సెన్సేషన్.. 3,181 ఎపిసోడ్లతో భారతదేశంలోనే అతిపెద్ద రెండో గేమ్ షోగా రికార్డు సృష్టించింది. ఇప్పుడీ ‘స్టార్ మహిళ’ చిన్న గ్యాప్ తర్వాత ఆగస్టు 17, సోమవారం నుంచి ఈటీవీలో తిరిగి ప్రారంభమైంది. మొదటి సీజన్లో తన మాటల పరవళ్లతో ప్రతి ఇంటినీ సందడిగా మార్చేసిన సుమ... మహిళలందరినీ ‘స్టార్’గా మార్చేందుకు మళ్లీ మన ముందుకొచ్చేసింది. ఈ సందర్భంగా- ఈ మాటల ప్రవాహం పంచుకున్న కొన్ని ఆసక్తికర విశేషాలు...
ఇంటింటి ఆడపడుచులా మార్చేసింది!
‘స్టార్ మహిళ’... దశాబ్ద కాలానికి పైగా కొనసాగింది. ఇంతటి సుదీర్ఘ ప్రయాణంలో నన్ను ఎన్నో కుటుంబాలకు దగ్గర చేసింది ఈ ప్రోగామ్. ఇన్నేళ్ల పాటు వారంలో ఆరు రోజులు నన్ను చూస్తుండటం వల్ల ప్రతి ఒక్కరికీ నేను సొంతింటి మనిషిలా మారిపోయా. అంతకు ముందు నేను ‘మహిళలు-మహారాణులు’.. ఇతరత్రా కార్యక్రమాలతో అందరికీ తెలిసినప్పటికీ, నన్ను ప్రతి ఇంటి ఆడపడుచులా సుపరిచితం చేసింది ఈ కార్యక్రమమే. అందుకే నాకు ‘స్టార్ మహిళ’ చాలా ప్రత్యేకం.
ఈ షోతో రెండు తరాల్ని చూశాను!
ఈ సుదీర్ఘ ప్రయాణంలో నేనెంతో మంది మహిళల్ని నేరుగా కలుసుకోగలిగా. పెళ్లి కాని అమ్మాయిలు, పెళ్లయిన యువతులు, అమ్మలు, అమ్మమ్మలు, తాతమ్మలు.. ఇలా అనేక మందిని కలిశా. ఉద్యోగం చేసే మహిళలకు వృత్తితో పాటు మరో వ్యాపకమేదైనా ఉంటుంది. కానీ, ఇంట్లోనే ఉండే ఆడవాళ్ల దృష్టంతా భర్తకు ఎలాంటి వంటలు చేసి పెట్టాలి, పిల్లల్ని బాగా చూసుకోవాలి, అత్తమామల్ని చూసుకోవాలి.. వంటి విషయాల చుట్టూనే తిరుగుతుంటుంది. అలాంటి వాళ్లు ‘స్టార్ మహిళ’ షోకి వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉండటాన్ని చూశా. ఎందుకంటే వాళ్లలో చాలామంది గాయకులు, డ్యాన్సర్లు ఉండొచ్చు. ఆ ప్రతిభను చూపించడానికి గతంలో ఎప్పుడూ అవకాశం రాకపోయి ఉండొచ్చు. అలాంటి వాళ్లంతా ‘స్టార్ మహిళ’ వేదికపై తమ ప్రతిభను ప్రదర్శించినప్పుడు చాలా సంతోషపడటాన్ని స్వయంగా చూశా. కొంతమంది అమ్మాయిలకి ఈ ‘స్టార్ మహిళ’ లో చేసిన తర్వాత సంబంధాలు కుదిరాయట. ఇలా పెళ్లిళ్లయ్యాక తమ భర్తలతో కలిసి షోకి వచ్చిన వాళ్లున్నారు. చదువుకునే రోజుల్లో వచ్చి.. పెళ్లి తర్వాత పిల్లల్ని తీసుకొని వచ్చిన వాళ్లని చూశా. అమ్మలుగా వచ్చిన వాళ్లు మళ్లీ అమ్మమ్మలుగా షోకి వచ్చిన వాళ్లున్నారు. ఇలా ‘స్టార్ మహిళ’తో రెండు తరాల్ని చూశా (నవ్వుతూ).
ఈటీవీలో ఉండే గొప్పతనం అదే!
నిజం చెప్పాలంటే.. 2008లో ‘స్టార్ మహిళ’ ను మొదలు పెట్టినప్పుడు ‘ఇన్నేళ్ల పాటు కొనసాగించాలి, ఇన్ని ఎపిసోడ్లు చేయాలి’ అనుకొని చేసింది కాదు. ఈటీవీలో ఉండే గొప్పతనం ఏంటంటే.. కొత్తగా ప్రారంభించే ఏ కార్యక్రమం విషయంలోనైనా అది పూర్తిగా ప్రేక్షకుల్లోకి చేరువయ్యే వరకు ఓపికగా ఎదురుచూస్తారు. ఎప్పుడూ ఒకే విధంగా చక్కగా కొనసాగిస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకొని షోలను అకస్మాత్తుగా రద్దు చేయరు. అలాగే ఈటీవీ షో టైమింగ్స్ విషయంలోనూ చక్కటి సమయపాలన కనిపిస్తుంటుంది. ఒక టైంలో వర్కవుటవ్వట్లేదని మరో టైంకి మార్చడం.. రోజుల్ని మార్చడం వంటి పనులతో ప్రేక్షకుల్ని ఎప్పుడూ గందరగోళానికి గురిచేయరు. ఇప్పుడు ‘స్టార్ మహిళ సీజన్ 2’ కోసం ఇలాంటి చక్కటి ప్రణాళికనే రూపొందించి ఉంచారు. మరి ఈసారి ఎన్నేళ్లు నడుస్తుందన్నది భగవంతుని ఆశీర్వాదాన్ని బట్టి ఉంటుంది. చూద్దాం ఏమౌతుందో!
ఈసారి ‘అంతకుమించి’!
‘స్టార్ మహిళ’ మొదలైన కొత్తలో చిన్నగా గవ్వలతో ఆటలు, మరికొన్ని ఆసక్తికర టాస్క్‌లు ఉండేవి. ప్రస్తుతం ట్రెండ్‌కు తగ్గట్లుగా కొన్ని కొత్త టాపిక్‌లు, టాస్క్‌లు తీసుకున్నాం. ఎలాంటి టాస్క్లైతే ప్రేక్షకుల్ని బాగా ఆకర్షిస్తాయో అలాంటివి చేయించబోతున్నాం. గతంలో ఉన్న క్వశ్చన్ ఆన్సర్ రౌండ్‌తో పాటు మరికొన్ని రౌండ్స్‌ని అలాగే ఉంచాం. ప్రత్యేకంగా ‘అంతకు మించి’ అనే మూడో రౌండ్ అందరినీ చాలా మెప్పిస్తుంది. ఆ రౌండ్లో డైస్ వేశాక మహిళలు అక్కడుండే బ్లాక్‌ల మీద నడవాల్సి ఉంటుంది. వాటిని ప్రత్యేకంగా కొన్ని ఎమోజీస్‌తో డిజైన్ చేశాం. వాటిపై ప్రత్యేకంగా టాస్క్‌లు ఏర్పాటు చేశాం. ఇవన్నీ నవ్వులు పూయించేలా ఉంటాయి.
తల్లిగా ఆ సంతృప్తిని తనివితీరా అనుభవించా!
లాక్డౌన్ విరామంలో - నా ‘సుమక్క’ యూట్యూబ్ ఛానల్ కోసం కొన్ని వీడియోలు చేశా. కూచిపూడి డ్యాన్స్ ప్రాక్టీస్ మళ్లీ మొదలుపెట్టాను. ముఖ్యంగా మా పిల్లలతో గడపటానికి చాలా సమయం దొరికినట్లయింది. వాళ్లు పుట్టినప్పటి నుంచి ఇంత సమయమెప్పుడూ వాళ్లతో గడపలేదు. ప్రతిరోజూ పిల్లలకేం కావాలో, ఏం తింటారో.. అడిగి మరీ వండిపెట్టడంలో తల్లికొక తృప్తి కలుగుతుంది కదా. ఆ సంతృప్తిని ఈ లాక్డౌన్ సమయంలో తనివితీరా అనుభవించా.
రోజూ యోగాసనాలు వేస్తున్నా!
గతంలో షూటింగ్లో ఉన్నప్పుడు షాట్ అయిపోయాక చకచకా వెళ్లిపోయి ఏది కావాలంటే అది పెట్టుకొని తినేసేదాన్ని. అలాంటిది ఇప్పుడు చేతులు కడుగుతుంటే వాటిలో నుంచి వస్తున్న మురికి చూసి ‘దేవుడా.. ఇన్నేళ్లూ ఎంత మురికి తిన్నానా’ అనిపిస్తోంది (నవ్వుతూ). ఈ క్లిష్ట పరిస్థితుల్లో చిత్రీకరణల్లో పాల్గొంటున్నా కాబట్టి ఊపిరితిత్తుల్ని సురక్షితంగా ఉంచుకోవడానికి ప్రతిరోజూ ప్రత్యేక యోగాసనాలు వేస్తున్నా.
నాకు స్టేజి చూస్తే ఊపొస్తుంది!
అందరికీ స్టేజ్ ఎక్కాలంటే భయం వేస్తుంటుంది. నాకు ఎక్కడి లేని ఊపు, ఉత్సాహం వస్తుంది. పంచ్‌ల కోసం నేనెప్పుడూ ప్రత్యేకంగా కసరత్తులేం చేయను. కాకపోతే ఒక షోలోకి అడుగు పెడుతున్నానంటే దాని నేపథ్యం, సారాంశమేంటో గ్రహించి అక్కడ ఎలా మాట్లాడాలో ముందే ఓ అవగాహనకు వచ్చేస్తా. ఇక స్టేజి పైకి వెళ్లాక మాటల ప్రవాహం దానంతట అదే మొదలైపోతుంది.
మా అమ్మమ్మ కూడా అందగత్తే!
అందం అన్నది నాకు వారసత్వంగా వచ్చింది. మా అమ్మమ్మ వందేళ్లవరకూ చాలా అందంగానే ఉంది. ఆవిడకు ముఖంపై ముడతలే రాలేదు (నవ్వుతూ). నిజానికి నా అందం రహస్యమంటూ ప్రత్యేకంగా ఏం లేదు. టైంకి తింటా. మంచి ఆహారం తీసుకుంటా. క్రమం తప్పకుండా యోగా చేస్తుంటా. ఇవే నన్ను ఉత్సాహంగా ఉంచుతుంటాయి.
అలాంటి పాత్రలొస్తే సినిమాలు చేస్తా!
నటన పట్ల ఆసక్తి ఉంది కానీ, నా తొలి ప్రాధాన్యం యాంకరింగే. మంచి కథలు, విభిన్న పాత్రలు దొరికితే కచ్చితంగా సినిమాలు చేస్తా. పూర్తిస్థాయిలో వెండితెర పైనే స్థిరపడాలి అనుకోవట్లేదు. ప్రస్తుతం ‘స్టార్ మహిళ’, ‘క్యాష్’ షోలతో పాటు ఓటీటీ కోసం ప్రత్యేక షోలు చేస్తున్నాను.