‘తెలుగింటి పాల సంద్రము కనిపెంచిన కూన.. శ్రీహరి ఇంటి దీపమల్లె కనిపించిన జాణ’ అంటూ నవవధువు అందచందాల్ని పొగిడారో సినీ కవి. ఆ పోలికలకు ఏమాత్రం తగ్గకుండా కుందనపు బొమ్మలా ముస్తాబైంది మన భళ్లాలదేవుడికి కాబోయే భార్య మిహీకా బజాజ్. ఆగస్టు 8న రానా-మిహీకల వివాహ ముహూర్తం ఖరారైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మూడు రోజుల ముందుగానే వధూవరుల ఇళ్లలో ప్రి-వెడ్డింగ్ వేడుకలు మొదలయ్యాయి. తాజాగా మిహీక ఇంట్లో నిర్వహించిన హల్దీ ఫంక్షన్లో కొత్త పెళ్లి కూతురు పుత్తడి బొమ్మలా మెరిసిపోయింది. సంప్రదాయబద్ధమైన దుస్తులు-జ్యుయలరీతో తళుక్కుమన్న ఈ ముద్దుగుమ్మ పసుపు వేడుక ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘పెళ్లి కళ వచ్చేసిందే బాలా’ అంటూ నెటిజన్లు ఆమె లుక్‌కి ఫిదా అయిపోతున్నారంటే అది అతిశయోక్తి కాదు!
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రానా, తన ఇష్టసఖి-ఈవెంట్ ప్లానర్/మేనేజర్ మిహీకా బజాజ్‌తో ఏడడుగులు నడిచేందుకు సమయం ఆసన్నమవుతోంది. వివాహానికి మూడు రోజుల ముందుగా ఇరువురి ఇళ్లలో పసుపు ఫంక్షన్ నిర్వహించారు. ఈ వేడుక థీమ్‌కి తగినట్లుగానే పసుపు రంగు దుస్తుల్లో పుత్తడి బొమ్మలా మెరిసిపోయింది మిహీక.
మ్యాచింగ్ అవుట్‌ఫిట్‌తో మాయ చేసింది!
వృత్తిరీత్యా ఈవెంట్ ప్లానర్, మేనేజర్ అయిన మిహీకకు.. ఫ్యాషన్ డిజైనింగ్‌లోనూ నైపుణ్యం ఉంది.. ఇదే విషయం తాను హల్దీ కోసం ఎంచుకున్న అవుట్‌ఫిట్, జ్యుయలరీ చూస్తే మనకు ఇట్టే అర్థమవుతుంది. మేలో నిర్వహించిన నిశ్చితార్థంలో సంప్రదాయబద్ధమైన చీరకట్టులో మెరిసిపోయిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా జరిగిన పసుపు ఫంక్షన్ కోసం లెహెంగాను ఎంచుకుంది. అది కూడా పసుపు వేడుకకు తగినట్లుగానే పసుపు రంగులో రూపొందించిన అవుట్‌ఫిట్ కావడం విశేషం. ఈ క్రమంలో పసుపు-బంగారు వర్ణపు లెహెంగా చోళీపై అంచులకు సింపుల్ డిజైన్, నడుము భాగంలో వచ్చిన జర్దోసీ వర్క్ బెల్ట్, జరీ బోర్డర్ దుపట్టా ఆమె అందాన్ని రెట్టింపు చేశాయని చెప్పుకోవచ్చు. ఇలా హల్దీ ఫంక్షన్లో పుత్తడి బొమ్మలా కనిపించిందీ ముద్దుగుమ్మ. ఇక మరోవైపు మన భల్లాల దేవుడు రానా తెలుపురంగు షర్ట్, పంచకట్టు ధరించి సంప్రదాయబద్ధంగా కనిపించాడు. ఇక వీరిద్దరూ ఒకరి కళ్లలోకి మరొకరు కళ్లు పెట్టి చూస్తూ, ముసిముసిగా నవ్వుతూ ఫొటోలకు పోజిచ్చారు.
జ్యుయలరీ ప్రత్యేకత అదే!
ఇక మిహీక తన అటైర్‌కు జతగా ధరించిన జ్యుయలరీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే సాధారణంగా చాలామంది ప్రి-వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా విభిన్న ఫ్లోరల్ జ్యుయలరీని ఎంచుకుంటుంటారు. కానీ మన భళ్లాల దేవుడికి కాబోయే భార్య మాత్రం సముద్రపు గవ్వలతో రూపొందించిన జ్యుయలరీని ఎంచుకొని తనదైన ఫ్యాషన్ మార్క్‌ని ప్రదర్శించింది. మాంగ్టిక్కా, ఇయర్రింగ్స్, గాజులు, ఉంగరాలు.. వంటివన్నీ గవ్వలతో ఎంతో అందంగా రూపొందించారు డిజైనర్లు. వీటికి జతగా కాస్త హెవీ మేకప్‌తో తన లుక్‌ని పూర్తి చేసిన మిహీక.. ప్రి-వెడ్డింగ్ వేడుకల్లోనే ఇంత అందంగా ఉందంటే.. ఇక పెళ్లిలో ఇంకెంత క్యూట్‌గా ముస్తాబవుతుందో అనుకుంటూ ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నారు అమ్మాయిలంతా!
ఇలా ఈ కుందనపు బొమ్మకు సంబంధించిన హల్దీ ఫంక్షన్ ఫొటోలు, ఈ కొత్త జంట రొమాంటిక్ లుక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలు చూసిన టాలీవుడ్ ముద్దుగుమ్మలు కాజల్, శృతీ హాసన్, అమలా పాల్, శ్రియ, లక్ష్మీ మంచు ఈ ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ కపుల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇక మరోవైపు పెళ్లి కోసం మిహీకా ఇంటిని, పరిసరాలను కూడా పూలతో, విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. మొత్తానికి ఆగస్టు 8న మన భల్లాల దేవుడు తన ఇష్టసఖి మెడలో మూడుముళ్లు వేయబోతున్నాడు. కరోనా ప్రొటోకాల్‌కు అనుగుణంగానే ఈ వేడుక అతి కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో జరగనుంది.
Photo: Instagram
Also Read:
ఈ భళ్లాల దేవుడి ప్రేమకథ అక్కడే మొదలైంది!
పెళ్లి సందడి షురూ అయింది!
అంతా ఆరు నిమిషాల్లో అయిపోయిందమ్మా..!