తోబుట్టువులంటే కేవలం ప్రేమ, అనురాగం, ఆప్యాయతల్ని పంచుకోవడం మాత్రమే కాదు.. అవసరమైతే బాధ్యతల్లో భాగస్వాములై, ఒకరికొకరు సాయపడుతూ ఒకే కెరీర్లో కూడా కొనసాగొచ్చని చెబుతున్నారీ సెలబ్రిటీలు. ఇందులో కొందరు నటులుగా ప్రసిద్ధులైతే, మరికొందరు దర్శకులుగా, నిర్మాతలుగా.. ఇలా ఒకరికి మించి మరొకరు సినీరంగంలో తమ ప్రతిభను చాటుతున్నారు. అక్కను మార్గదర్శకురాలిగా తీసుకుని ముందుకు సాగుతున్న తమ్ముళ్లు కొందరైతే.. అన్నను ఆదర్శంగా తీసుకుని ఆయన బాటలో నడిచిన చెల్లెళ్లు మరికొందరు. ఏదేమైనా వీరందరూ అనుబంధంతో పాటు 'వెండితెర'నూ సమానంగా పంచుకున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వెండితెరను వేదికగా చేసుకుని పలు విభాగాల్లో వెలిగిపోతున్న కొందరు సెలబ్రిటీ తోబుట్టువుల గురించి 'రాఖీ పండగ' సందర్భంగా తెలుసుకుందామా.
సైఫ్ - సోహా
వెండితెర వేదికగా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన తోబుట్టువుల్లో సైఫ్ అలీఖాన్, సోహా అలీఖాన్ జంట కూడా ఒకటి. వీరిద్దరూ పటౌడీ వంశానికి చెందిన మన్సూర్ అలీఖాన్, షర్మిలా ఠాగూర్ దంపతుల వారసులు. వీరిలో అన్నయ్య సైఫ్ ప్రస్తుతం హీరో, దర్శకుడిగా కొనసాగుతున్నాడు. 'దిల్చాహ్ తా హై, హమ్ తుమ్, కల్ హో నా హో, ఓంకార, రేస్ సిరీస్, లవ్ ఆజ్కల్, కాక్టెయిల్, పాంథమ్ తదితర చిత్రాలు సైఫ్ కెరీర్లో మైలురాళ్లుగా నిలిచిపోయాయి. వెండితెరపై వర్సెటైల్ యాక్టర్‌గా పేరుపొందిన సైఫ్ వెబ్‌సిరీస్‌లోనూ నటిస్తూ అలరిస్తున్నాడు. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన ' సేక్రెడ్గేమ్స్'లో ఓ కీలక పాత్రలో కనిపించి సత్తా చాటిన ఈ పటౌడీ హీరో ఈ ఏడాది ప్రారంభంలో ‘తానాజీ’, ‘జవానీ జానేమన్’ సినిమాలతో సందడి చేశాడు. సైఫ్ ప్రస్తుతం ‘బంటీ ఔర్ బబ్లీ2’, ‘భూత్ పోలీస్’ సినిమాలతో పాటు ‘దిల్లీ’ అనే ఓ వెబ్‌సిరీస్‌లోనూ నటిస్తున్నాడు. చెల్లెలు సోహా అలీఖాన్ విషయానికొస్తే.. ఈమె కేవలం బాలీవుడ్లోనే కాకుండా బెంగాలీ, ఇంగ్లిష్ చిత్రాల్లోనూ నటించి గుర్తింపు పొందింది. ఆమె 'రంగ్ దే బసంతి', ‘షాదీ నెం.1’, ‘దిల్ మాంగే మోర్’, ‘గో గోవా గాన్’, ‘సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్’ వంటి పలు హిందీ చిత్రాలతో పాటు బెంగాలీ భాషలో రెండు, ఇంగ్లిష్‌లో మరో నాలుగు సినిమాల్లో నటించింది.
సోనమ్ - హర్షవర్ధన్
తన అందం, అభినయంతో బాలీవుడ్లో ఇప్పటికే ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకుంది సోనమ్ కపూర్. ఆమె దారిలో నడుస్తూ సినీరంగంలో అడుగులేస్తున్నాడు ఆమె తమ్ముడు హర్షవర్ధన్ కపూర్. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, సునీతా కపూర్ దంపతుల పిల్లలే వీరు. ‘ఢిల్లీ-6’, ‘ఖూబ్సూరత్’, ‘రాన్‌జానా’, ‘భాగ్ మిల్కా భాగ్’, ‘డాలీ కీ డోలీ’, ‘నీర్జా’, ‘ప్యాడ్‌మ్యాన్’, ‘వీరె ది వెడ్డింగ్’, ‘సంజు’.. వంటి చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది సోనమ్. గతేడాది ఆమె నటించిన సినిమా 'ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా'. లెస్బియన్ రిలేషన్షిప్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో తండ్రీ కూతుళ్లుగా అనిల్‌కపూర్, సోనమ్ నటించడం విశేషం. అదే ఏడాది ‘ద జోయా ఫ్యాక్టర్’ అనే సినిమాలో ‘జోయా సింగ్ సోలంకీ’ గా మరోసారి సిల్వర్ స్ర్కీన్‌పై సందడి చేసింది సోనమ్. రాకేష్ ఓం ప్రకాశ్ మెహ్రా దర్శకత్వంలో రూపొందిన 'మిర్జ్యా' చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టాడు హర్షవర్ధన్ కపూర్. ఆ తర్వాత ‘భావేష్ జోషీ సూపర్ హీరో’ సినిమాలో మెరిసిన అతడు ప్రస్తుతం స్టార్ షూటర్ అభినవ్ బింద్రా బయోపిక్‌లో లీడ్ రోల్లో నటించనున్నాడు.
శ్రద్ధ - సిద్ధాంత్
వెండితెరపై వెలిగిపోతున్న తోబుట్టువుల జాబితాలో శ్రద్ధా కపూర్, సిద్ధాంత్ కపూర్ కూడా ఉన్నారు. వీరిరువురు ప్రముఖ బాలీవుడ్ నటుడు శక్తి కపూర్, శివాంగి కపూర్ దంపతుల వారసులు. శ్రద్ధా కపూర్ 2010లో 'తీన్ పత్తీ' అనే సినిమాతో బాలీవుడ్‌లోకి తెరంగేట్రం చేసింది. అయితే ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటించిన ఆమెకు.. తొలిసారి హీరోయిన్గా అవకాశం వచ్చింది మాత్రం 2011లో విడుదలైన 'లవ్ కా ది ఎండ్' అనే చిత్రంలోనే. 'ఆషిఖీ - 2' చిత్రంలో ఆమె నటనకు గాను 2013 ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో ఉత్తమ నటిగా నామినేషన్‌కు అర్హత పొందింది. ఆ తర్వాత వచ్చిన ‘ఏక్ విలన్’, ‘హైదర్’, ‘ఏబీసీడీ-2’, ‘రాక్ఆన్-2’, ‘స్త్రీ’, ‘సాహో’, ‘చిచ్చోరే’, ‘స్ట్రీట్ డ్యాన్సర్-3D’, ‘బాఘీ3’ వంటి చిత్రాలు ఆమెకు బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా పేరు సంపాదించి పెట్టాయి. సిద్ధాంత్ కపూర్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి, ఆ తర్వాత హీరోగా మారాడు. ఆయన సంజయ్ గుప్తా దర్శకత్వంలో వచ్చిన 'షూటౌట్ ఎట్ వాదాలా' అనే చిత్రంలో, ఆ తర్వాత ‘అగ్లీ’, ‘జస్బా’, ‘యారం’, ‘భూత్’ సినిమాల్లో నటించారు. ఈ అన్నా చెల్లెళ్లు ఇద్దరూ కలిసి 'దావుద్' జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన 'హసీనా పార్కర్' చిత్రంలో నటించారు. సిద్ధాంత్ దావుద్ పాత్రలో, శ్రద్ధ అతని సోదరి హసీనా పాత్రలో మెరిశారు.
ఫరా ఖాన్ - సాజిద్ ఖాన్
సినీరంగంలో కేవలం నటులే కాదు.. ఇతర విభాగాల్లోనూ సక్సెస్ సాధించిన తోబుట్టువులున్నారు. అలా దర్శకులుగా రాణిస్తోన్న అక్కాతమ్ముళ్లు ఫరా ఖాన్, సాజిద్ ఖాన్. వీరిలో అక్క ఫరా ఖాన్.. కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తూనే పలు హిందీ చిత్రాలకు దర్శకత్వం వహిస్తోంది. 'ఓం శాంతి ఓం', 'మై హూనా', 'హ్యాపీ న్యూ ఇయర్' వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆమె ఇప్పటి వరకు దాదాపు 80 హిందీ చిత్రాలలో సుమారుగా వంద పాటలకు కొరియోగ్రఫీ చేశారు. ఫరాఖాన్ మ్యారీ గోల్డ్, మాన్సూన్ వెడ్డింగ్, కుంగ్‌ఫూ యోగా వంటి ఇంటర్నేషనల్ చిత్రాలకు కూడా కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ఇక ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘మిసెస్ సీరియల్ కిల్లర్’ సినిమాతో నిర్మాతగాను సత్తాచాటింది ఫరా ఖాన్. మరోవైపు తమ్ముడు సాజిద్ ఖాన్ దర్శకుడిగా, స్క్రిప్ట్ రైటర్‌గా, టీవీ వ్యాఖ్యాతగా కొనసాగుతున్నారు. ఆయన 'హౌస్‌ఫుల్', 'హౌస్‌ఫుల్ 2', 'హమ్‌షకల్స్'.. వంటి పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు.
ఫర్హాన్ - జోయా
దర్శకుడిగా, స్క్రీన్ రైటర్‌గా, నిర్మాతగా, నటుడిగా, గాయకుడిగా.. ఇలా బాలీవుడ్లో పలు రంగాల్లో రాణిస్తోన్న వ్యక్తి ఫర్హాన్ అక్తర్. 1991లో విడుదలైన ‘లమ్హే’, 1997లో వచ్చిన ‘హిమాలయ్ పుత్ర’ అనే చిత్రాలకు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు రితేష్ సిద్వానీతో కలిసి ‘ఎక్సలెంట్ ఎంటర్టైన్మెంట్’ అనే ప్రొడక్షన్ సంస్థను ప్రారంభించారు. అనంతరం 2001లో విడుదలైన ‘దిల్ చాహ్తా హే’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జాతీయ అవార్డును సొంతం చేసుకోవడం విశేషం. నటుడిగాను ‘భాగ్ మిల్కా భాగ్’ తో సత్తాచాటి బెస్ట్ యాక్టర్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నాడీ క్రియేటివ్ డైరెక్టర్. గతేడాది అతడు ప్రియాంకతో కలిసి నటించిన ‘ద స్కై ఈజ్ పింక్’ కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆయన అక్క జోయా అక్తర్ కూడా సినీ దర్శకురాలిగా, స్క్రీన్ రైటర్‌గా కొనసాగుతోంది. ఆమె దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘లక్ బై ఛాన్స్’ 2009లో విడుదలైంది. 2011లో ‘జిందగీ నా మిలేగీ దుబారా’ అనే చిత్రం ఆమె కెరీర్లోనే పెద్ద హిట్‌ని సాధించి పెట్టడంతో పాటు ఆ సినిమాకు గాను ఆమెను ఉత్తమ దర్శకురాలిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు వరించింది. అంతేకాదు.. ‘దిల్ దఢఖ్నే దో’ అనే సినిమాకి కూడా దర్శకత్వం వహించిందామె. జోయా అక్తర్ తెరకెక్కించిన 'గల్లీబాయ్' బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్పెషల్ స్క్రీనింగ్‌కు ఎంపికైంది. ఈ ఏడాది ఆమె కరణ్ జోహర్, అనురాగ్ కశ్యప్‌లతో కలిసి తెరకెక్కించిన ‘ఘోస్ట్ సిరీస్’ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అమీషా - అష్మిత్

బాలీవుడ్‌తో పాటు తెలుగులోనూ రాణించిన బ్యూటీ అమీషా పటేల్. ఆమె హిందీలో నటించిన మొదటి చిత్రం 'కహో నా ప్యార్ హే' ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ తర్వాత 2001లో విడుదలైన 'గదర్ : ఏక్ ప్రేమ్ కథా' మంచి విజయాన్నే సాధించింది. ఈ చిత్రంలో ఆమె కనబరిచిన నటనకు గాను 'ఫిల్మ్‌ఫేర్ స్పెషల్ పెర్ఫార్మెన్స్' అవార్డు ఆమెను వరించింది. ‘బద్రి’ సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన అమీషా.. ఆ తర్వాత ‘నాని’, ‘నరసింహుడు’, ‘పరమ వీర చక్ర’ వంటి చిత్రాల్లోనూ నటించింది. రెండేళ్ల పాటు సినిమాలకు దూరమైన అమీషా ప్రస్తుతం ‘దేశీ మ్యాజిక్’, ‘ద గ్రేట్ ఇండియన్ కేసినో’ తదితర సినిమాలతో మళ్లీ మన ముందుకు రానుంది. ఇక ఆమె తమ్ముడు అష్మిత్ పటేల్ కూడా అక్క బాటలోనే నడుస్తున్నాడు. ఆయన మొదట విక్రమ్ భట్‌తో కలిసి అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించాడు. ఆ సమయంలో 'రాజ్', 'ఫుట్‌పాత్' వంటి చిత్రాలకు పనిచేశాడు. ఆ తర్వాత విక్రమ్ భట్ దర్శకత్వంలో వచ్చిన 'ఇంతెహాన్' చిత్రంలో తొలిసారి హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత ‘మర్డర్’, ‘బనారస్’, ‘జయహో’, ‘నిర్దోష్’ తదితర చిత్రాల్లో నటించాడు.
నితిన్ - నిఖిత
తెలుగు చిత్ర రంగంలో రాణిస్తోన్న అక్కాతమ్ముళ్లలో నితిన్, నిఖిత కూడా ఒకరు. నితిన్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ ప్రముఖ హీరోగా కొనసాగుతున్నారు. 'జయం' చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా అందుకున్నారు. ఆ తర్వాత ఆయన నటించిన 'దిల్', 'శ్రీ ఆంజనేయం', 'సై', 'ఇష్క్', 'గుండెజారి గల్లంతయ్యిందే', 'హార్ట్ ఎటాక్', 'అ..ఆ..', 'శ్రీనివాస కల్యాణం' వంటి పలు చిత్రాలు నితిన్‌కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. నితిన్ ఈ ఏడాది రష్మిక మందనతో కలిసి నటించిన 'భీష్మ' చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇక నితిన్ అక్క నిఖితారెడ్డి కూడా టాలీవుడ్లో సక్సెస్ఫుల్ నిర్మాతగా కొనసాగుతోంది. నితిన్ హీరోగా నటించిన 'ఇష్క్', 'చిన్నదాన నీకోసం', 'గుండెజారి గల్లంతయ్యిందే', 'అఖిల్'.. వంటి చిత్రాలకు ఆమె నిర్మాతగా వ్యవహరించారు.
రామ్ చరణ్ - సుస్మిత
ఇక మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు రామ్ చరణ్. ఇక అతడి సోదరి సుస్మిత కూడా తన ప్రతిభతో సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ‘చిరుత’, ‘మగధీర’, ‘ఆరెంజ్’, ‘రచ్చ’, ‘నాయక్’, ‘ఎవడు’, ‘ధ్రువ’, ‘రంగ స్థలం’ తదితర సినిమాలతో రామ్‌చరణ్ టాలీవుడ్ టాప్ హీరోగా గుర్తింపు పొందాడు. ‘సైరా’ సినిమాతో నిర్మాతగానూ మారి సక్సెస్ అయ్యాడు. ఇక సుస్మిత కూడా సినిమా పరిశ్రమలో తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తోంది. ఫ్యాషన్ డిజైనింగ్‌లో ఎంతో అనుభవమున్న ఆమె ‘ఖైదీ నం.150, ‘రంగస్థలం’, ‘సైరా’ తదితర సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసింది. తాజాగా సోదరుడు రామ్‌చరణ్ బాటలోనే పయనిస్తూ సినిమా నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టింది సుస్మిత. ఈక్రమంలో తన భర్త విష్ణుతో కలిసి ‘గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్’ పేరుతో ఓ ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించిన ఆమె మొదటగా ఓ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించనుంది.
వరుణ్ - నిహారిక
మెగా కుటుంబానికి చెందిన హీరో వరుణ్ తేజ్, ఆయన చెల్లెలు నిహారిక కూడా ఈ లిస్టులో చెప్పుకోదగిన వారే. ప్రముఖ హీరో చిరంజీవి తమ్ముడైన నాగబాబు, పద్మజ దంపతుల వారసులు వీరిద్దరు. 'ముకుంద' చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన వరుణ్ ‘కంచె’, ‘లోఫర్’, ‘ఫిదా’, ‘తొలి ప్రేమ’, ‘అంతరిక్షం’, ‘ఎఫ్2,’ ‘గద్దల కొండ గణేష్’ వంటి చిత్రాలతో మంచి పేరు సంపాదించాడు. ఇక వరుణ్ చెల్లెలు నిహారిక నటించిన 'ఒక మనసు' చిత్రం ఆమెను తెలుగు చిత్రసీమకు పరిచయం చేసింది. దీనితో పాటు ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సూర్యకాంతం’ ‘సైరా’ తదితర సినిమాల్లో నటించింది. వెబ్ సిరీస్‌ల్లో కూడా నటిస్తూ ప్రేక్షకులకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది ఈ కొణిదెల వారి ఆడపడచు.
ప్రేమానురాగాలతో పాటు వెండితెరను కూడా పంచుకున్న కొందరు తోబుట్టువుల గురించి తెలుసుకున్నారు కదా! వీరితో పాటు సోనాక్షి సిన్హా- లవ్ సిన్హా, హ్యూమా ఖురేషీ - సాఖీబ్ సలీమ్, తుషార్ కపూర్ - ఏక్తా కపూర్లు కూడా సినీరంగంలో సక్సెస్ఫుల్ తోబుట్టువులుగా కొనసాగుతున్నారు. 'రాఖీ పౌర్ణమి' సందర్భంగా వీరందరికీ శుభాకాంక్షలు చెప్పేద్దామా!