ఫ్రెండ్స్.. ఇన్స్టాపురంలో రెండు రోజుల నుంచి తారల బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు హల్చల్ చేస్తున్నాయి. వీరిలో అందాల తార సమంత, సొట్టబుగ్గల సుందరి లావణ్యా త్రిపాఠి, మిల్కీ బ్యూటీ తమన్నా, సౌత్ స్టార్ శృతిహాసన్.. బాలీవుడ్ ముద్దుగుమ్మలు దియా మీర్జా, బిపాసా బసు, కరీనా కపూర్.. చెప్పుకుంటూపోతే చాలామందే ఉన్నారు. వీరంతా బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న తమ ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. వీటికి #womensupportingwomen #ChallangeAccepted వంటి హ్యాష్‌ట్యాగ్‌లను కూడా జోడిస్తున్నారు. అంతేకాదు.. పోస్ట్ చేసిన వారు మరికొంతమందిని నామినేట్ చేస్తున్నారు.
ఏమిటీ ఈ ఛాలెంజ్?
ఇప్పటివరకు రకరకాల ఛాలెంజ్‌లు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశాయి. అయితే ఎన్ని ఛాలెంజ్‌లు వచ్చినా మహిళలకు సహకారం, తోడ్పాటునిచ్చేవి అంతగా లేవనే చెప్పాలి.
ఈ క్రమంలో - ‘మహిళలకు మహిళలే అండ’ అనే కాన్సెప్ట్‌తో పరస్పరం ఒకరిలో మరొకరు సానుకూల దృక్పథాన్ని నింపుతూ, మహిళా సాధికారతకు కృషి చేయాలన్నదే తాజాగా వైరలవుతున్న #womensupportingwomen ఛాలెంజ్ ప్రధాన ఉద్దేశం. 2016 లోనే సోషల్ మీడియాలో ప్రారంభమైన ఈ ఛాలెంజ్ వివిధ సందర్భాల్లో, వివిధ థీమ్స్ తో వెలుగులోకి వస్తూనే ఉంది. మళ్ళీ ఇప్పుడు తాజాగా బ్లాక్ & వైట్ ఫొటోలు పంచుకుంటూ 'ఒకరికొకరం అండగా నిలుద్దాం.. మహిళల శక్తి సామర్ధ్యాలను నిరూపిద్దాం' అంటూ పలువురు సెలబ్రిటీలు ఇందులో పాలుపంచుకుంటున్నారు.
ఈ ఛాలెంజ్‌లో భాగంగా తమ బ్లాక్ అండ్ వైట్ ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి దానికి #womensupportingwomen అనే హ్యాష్‌ట్యాగ్‌ని జోడించాలి. అంతేకాదు.. ఫొటోని పోస్ట్ చేసిన వారు ఇతరులను కూడా నామినేట్ చేయాలి. నామినేషన్ స్వీకరించిన వారు #ChallangeAccepted అని రాసి వారి బ్లాక్ అండ్ వైట్ ఫొటోని పోస్ట్ చేస్తారు. వీరు కూడా ఇతరులను నామినేట్ చేస్తుంటారు. ఇలా మహిళలు ఒకరికొకరు ఈ ఛాలెంజ్‌ని పంచుకుంటుంటారు. తద్వారా మహిళల్లో ఒకరికొకరం పరస్పరం అండగా ఉన్నామన్న ధైర్యం, నమ్మకం కలిగించాలన్నది ఈ ఛాలెంజ్ ఉద్దేశం.
హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా పలువురు తారల దగ్గరి నుంచి సామాన్య మహిళల వరకు కొన్ని లక్షలమంది తమ బ్లాక్ అండ్ వైట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ ఈ ఛాలెంజ్‌లో పాల్గొంటున్నారు. ‘ఒకరికొకరం తోడుగా ఉండి బలమైన మహిళలుగా పరస్పరం ప్రగతిని సాధిద్దాం’ అంటూ ముందుకు దూసుకుపోతున్నారు. అలాంటి కొన్ని ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి...