స్వీయ పరిశుభ్రత, సామాజిక దూరం అంటూ మనుషుల జీవన విధానాన్ని పూర్తిగా మార్చేసింది కరోనా. ఈ మహమ్మారి తీసుకొచ్చిన భయంతో కనీసం కుటుంబ సభ్యులతో కూడా ప్రశాంతంగా మాట్లాడలేని పరిస్థితి. ఇప్పటికే లక్షలాది మందిని బలి తీసుకున్న ఈ వైరస్ కారణంగా అత్యంత సన్నిహితులైనా, స్నేహితులైనా దూరంగా ఉంచుతున్నాం. ఇలా శారీరకంగా, మానసికంగా ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెడుతోన్న ఈ మహమ్మారి తనను మరింత సతమతం చేస్తోందని వాపోతోంది బెంగాలీ నటి రూపాలీ గంగూలీ. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా సీరియళ్లు, సినిమా షూటింగులకు ప్రభుత్వాలు అనుమతినివ్వడంతో మళ్లీ షూటింగ్‌లకు హాజరవుతోందామె. అయితే కరోనా భయంతో తన కుటుంబ సభ్యులకు వీలైనంత దూరంగా ఉంటున్న ఆమె... తాజాగా తన ఆవేదన గురించి అందరితో పంచుకుంది.
కుటుంబానికి దూరంగా ఉంటూ!
కరోనా కారణంగా మూడునెలలుగా ఆగిపోయిన సినిమా, సీరియల్స్ షూటింగులు మళ్లీ ప్రారంభమయ్యాయి. సినీ తారలందరూ మళ్లీ ముఖానికి మేకప్ వేసుకుంటున్నారు. అయితే ఇటీవల తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి చాలామంది బుల్లితెర ఆర్టిస్టులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నో ఆంక్షలు, జాగ్రత్తల మధ్య షూటింగులు జరుగుతున్నాయి. ఈక్రమంలో బెంగాలీ నటి రూపాలీ గంగూలీ కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుని షూటింగ్‌లకు హాజరవుతోంది. స్టార్‌ప్లస్‌లో ప్రసారమైన ‘సంజీవని’, ‘సారాబాయి వర్సెస్ సారాబాయి’ వంటి సీరియల్స్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బుల్లితెర నటికి రుద్రాన్ష్ అనే ఐదేళ్ల కుమారుడున్నాడు. ప్రస్తుతం ‘అనుపమ’ అనే ఓ టీవీ సీరియల్ షూటింగ్లో పాల్గొంటున్న ఆమె కరోనా కారణంగా తానెలాంటి మానసిక క్షోభ అనుభవిస్తున్నానో పంచుకుంది.
ఎప్పటిలాగా నా బాబుని హత్తుకోవడం లేదు!
‘కరోనా భయం నేపథ్యంలో నా కుటుంబ సభ్యులకు వీలైనంత వరకు దూరంగా ఉంటున్నా. షూటింగ్ నుంచి ఇంటికి వచ్చాక నా ఐదేళ్ల కుమారుడు రుద్రాన్ష్‌ను ఎప్పటిలాగా హత్తుకోవడం లేదు. ముద్దుపెట్టుకోవడం లేదు. తను నా దగ్గరికొస్తున్నా వీలైనంత దూరంగా ఉంటున్నా. దీంతో నాకు చాలా బాధేస్తోంది. ఇటీవల ఒకరోజు నా కొడుకు ‘అమ్మా! మళ్లీ నిన్ను ముద్దుపెట్టుకోవాలంటే ఇంకో ఆరునెలలు ఆగాలా?’ అని ఏడుపు లంకించుకున్నాడు. అది విని నా గుండె బద్దలైపోయింది. అయినా నేను ఏం చేయలేని పరిస్థితి. నేను తనకు దూరంగా ఉంటున్నందుకు ప్రస్తుతం నా కుమారుడు బాధపడొచ్చేమో కానీ... భవిష్యత్‌లో నా షోలు, సీరియల్స్ చూసి తను చాలా సంతోషిస్తాడు, గర్వపడతాడు’ అని చెప్పుకొచ్చిందీ బెంగాలీ తార.
నాకు నా కుటుంబమే ముఖ్యం!
గత ఏడేళ్లుగా టీవీ సీరియల్స్‌కు దూరంగా ఉన్న రూపాలీ ఇప్పుడిప్పుడే మళ్ళీ బిజీ అవుతోంది. ఈనేపథ్యంలో ‘అనుపమ’ సీరియల్‌తో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిందామె. ‘నేను ఏడేళ్ల పాటు బుల్లితెరకు దూరమయ్యాను. అయితే ‘అనుపమ’ సీరియల్‌తో మళ్లీ మీ ముందుకు వస్తున్నా. ఇందులో నేను పోషిస్తున్న ‘అనుపమా షా’ పాత్ర.. నిజ జీవితంలో నా క్యారక్టర్‌కు చాలా దగ్గరగా ఉంటుంది. అందులో లాగే రియల్ లైఫ్‌లో కూడా నా కుటుంబమే నాకు ముఖ్యం. వారు చూపించిన ప్రేమ, అందించిన ప్రోత్సాహంతోనే నేను ఈ స్థాయిలో ఉన్నా. ఓ అద్భుతమైన క్యారక్టర్, మంచి ప్రదర్శనతో తిరిగి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలంటే కొంచెం భయంగానే ఉంది. అయితే చాలామంది ఆశీర్వాదాలు పొందిన కొందరు మాత్రమే ఇలా కమ్ బ్యాక్ అవుతారు. నా సెకండ్ ఇన్నింగ్స్ గురించి ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నా..’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చిందీ అందాల తార.
Photo: Instagram