సాధారణంగా వృత్తిఉద్యోగాలు చేసే వారికి వారానికి కనీసం ఒకట్రెండు రోజులైనా సెలవులుంటాయి. అదే సినిమా, క్రీడా రంగాలకు చెందిన వారికి ఆ సమయం కూడా దొరకదు. సినిమా వాళ్లు నెలల తరబడి షూటింగ్స్‌కి, క్రీడాకారులు ప్రాక్టీస్‌కు సమయం వెచ్చించాల్సిందే! అలాంటి వారికి అరుదుగా, అనుకోకుండా లాక్డౌన్ పేరుతో బోలెడంత ఖాళీ సమయం దొరికే సరికి తమకు నచ్చిన పనులపై దృష్టి పెట్టారు. లాక్ డౌన్ సడలించిన తర్వాత కూడా ఇంకా టోర్నమెంట్లు, షూటింగులు మొదలు కాకపోవడంతో బోర్ కొట్టకుండా ఉండేందుకు తమ అభిరుచులపై దృష్టి సారిస్తున్నారు. భారత యువ షూటర్ మనూ భాకర్ కూడా ఈ ఖాళీ సమయంలో శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేందుకు తనకు నచ్చిన పనులు చేస్తున్నానంటూ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది. మరి, ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మన సినీ తారలు, క్రీడాకారిణులు ఏం చేస్తున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం రండి..
మనూ భాకర్ - షూటర్
కరోనా మహమ్మారి మన దేశంలోకి అడుగుపెట్టి నెలలు గడుస్తోంది. లాక్ డౌన్ సడలించినా వివిధ క్రీడా పోటీలు ఇప్పట్లో మొదలయ్యేలా లేవు. ఈ క్రమంలో ఇంట్లో ఖాళీగా కూర్చోవడం బోర్‌గా అనిపించింది. దీంతో హరియాణాలోని జజ్జార్ జిల్లాలోని మా సొంతూరు గోరియాకు వెళ్లా. మా ఇంటి పరిసరాల్లోనే ఉన్న పొలాల్లో డ్రైవర్ సహాయంతో ట్రాక్టర్ నడిపా. గుర్రపు స్వారీ, తాడు సహాయంతో బిల్డింగ్ పైకి ఎక్కడం.. వంటివి నేర్చుకున్నా. ఈ ప్రతికూల పరిస్థితుల్లో శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారయ్యేందుకు నాకు ఈ పనులు ఎంతగానో దోహదం చేశాయి. ఇక వచ్చే ఏడాదికి వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్ కోసం నిరంతర సాధన చేస్తున్నా. చాలామంది ప్రస్తుతం ఉన్న గడ్డు కాలంలో శారీరకంగా, మానసికంగా ఒత్తిడి, ఆందోళనలకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవడంలో యోగా, ధ్యానం కీలక పాత్ర పోషిస్తాయి. ధ్యానం వల్ల మానసికంగా దృఢంగా మారడంతో పాటు చేసే పనిపై పూర్తి దృష్టి పెట్టగలుగుతాం. అందుకే ఈ కరోనా ప్రతికూల పరిస్థితుల్లో అందరూ శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు తమకు నచ్చిన పనులపై దృష్టి పెట్టండి.
అంజుమ్ మౌద్గిల్ - షూటర్
సాధారణంగా టోర్నమెంట్స్, ట్రైనింగ్ సెషన్స్ ఉంటే అసలు సమయమే దొరకదు. కానీ ప్రస్తుతం బోలెడంత ఖాళీ సమయం దొరికింది. అందుకే ఈ సమయాన్ని పెయింటింగ్ కోసం కేటాయిస్తున్నా. నేను పెయింటింగ్ వేసిన డైరీలను అమ్మి.. ఆ డబ్బును పంజాబ్‌లోని కొవిడ్-19 ప్రభావిత గ్రామాల్లోని ప్రజలకు సేవలందించడానికి పనిచేస్తోన్న ఓ స్వచ్ఛంద సంస్థకు విరాళంగా అందిస్తున్నా. అలాగే మా ఇంట్లోనే షూటింగ్ ప్రాక్టీస్ కోసం తగిన ఏర్పాట్లు చేసుకొని వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్ కోసం సాధన చేస్తున్నా. ఇంకా ఇంటిని శుభ్రం చేయడం, వంట చేయడం, ఇంటి పనుల్లో అమ్మకు సహాయపడడం.. ఈ పనులన్నీ నాకు శారీరకంగానే కాదు.. మానసికంగానూ ఎంతో ఆనందాన్ని అందిస్తున్నాయి.
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ - బాలీవుడ్ నటి
నా ఫిట్నెస్ రొటీనే అన్ని వేళలా నన్ను ఫిట్‌గా, హ్యాపీగా ఉంచేందుకు దోహదం చేస్తుంది. ఇప్పుడూ అంతే! సాధారణంగా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నప్పుడు నాకు నచ్చిన పనులు చేయడానికి సమయం దొరకదు. అందుకు ఈ ఖాళీ సమయాన్ని కేటాయిస్తున్నా. రోజూ చేసే వర్కవుట్లతో పాటు నా మనసుకు నచ్చిన పనులు చేసేందుకు.. తద్వారా ఆనందంగా గడిపేందుకు మొగ్గు చూపుతున్నా. ఈ క్రమంలో గుర్రపు స్వారీ, స్విమ్మింగ్, రన్నింగ్, డ్యాన్సింగ్, యోగా.. వంటివి సాధన చేస్తున్నా. అంతేకాదు.. పుస్తకాలు చదవడం, పెయింటింగ్.. వంటివీ ప్రస్తుతం నా రోజువారీ షెడ్యూల్లో ఓ భాగమే. ఇలా ఇవన్నీ ఈ ప్రతికూల పరిస్థితుల్లో నేను సంతోషంగా ఉండేందుకు దోహదం చేస్తున్నాయి.
కాజోల్ - బాలీవుడ్ నటి
చాలామంది ఈ ఖాళీ సమయంలో తమకు ఇష్టమైన పనులు చేస్తూ మానసిక ఒత్తిడిని దూరం చేసుకుంటున్నారు. నేనూ అదే ఫాలో అవుతున్నా. బేసిక్‌గా నాకు కుట్లు, అల్లికలు అంటే చాలా ఇష్టం. గతంలో కుట్లు-అల్లికలు నేర్చుకున్నా. అయితే బిజీ షెడ్యూల్ వల్ల ఈ అభిరుచిపై ఇప్పటిదాకా దృష్టి పెట్టలేకపోయా. ఇప్పుడు నాలో ఉన్న క్రియేటివిటీని బయటపెట్టే సదవకాశం వచ్చింది. ఈ మధ్యే నా కూతురు నైసా డ్రస్ కుట్టడం పూర్తయింది. నిజానికి మన అభిరుచులు మనకు బోర్ అనే ఫీలింగే రానివ్వవు. కాబట్టి ఈ ప్రతికూల పరిస్థితుల్లో మీరూ మీ హాబీస్‌పై దృష్టి పెట్టండి.. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండండి.
ఊర్వశీ రౌతెలా – బాలీవుడ్ నటి
నేనైతే ఈ ఖాళీ సమయాన్ని ఎక్కువగా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టడానికే కేటాయిస్తున్నా. ఎందుకంటే మనం రోజూ చేసే వ్యాయామాలు మన శరీరానికే కాదు.. మనసుకూ మంచివే. ఈ కష్ట కాలంలో మనం ఎదుర్కొనే ఒత్తిడి, ఆందోళనల నుంచి మనల్ని బయటపడేస్తాయి.. ప్రశాంతతను మన దరిచేరుస్తాయి. అందుకే ప్రతి ఒక్కరూ వ్యాయామంపై దృష్టి పెట్టండి. ఈ క్రమంలో ఒకరు మిమ్మల్ని ప్రేరేపించాలనుకోకుండా స్వీయ ప్రేరణతో ముందుకు సాగండి.. అలాగే ప్రస్తుతం నేను వర్చువల్ డ్యాన్స్ సెషన్స్‌కు కూడా సమయం కేటాయిస్తున్నా. మీ అందరి కోసం జుంబా, టబాటా, లాటిన్ డ్యాన్స్ సెషన్స్‌ని ఉచితంగా అందిస్తున్నా. వీటివల్ల మీకు డ్యాన్స్ మెలకువలు తెలియడమే కాదు.. మీ శరీరం ఫిట్‌గా మారేందుకూ దోహదం చేస్తాయి.
రిచా చద్దా - బాలీవుడ్ నటి
ఈ ఖాళీ సమయాన్ని ప్రొడక్టివ్‌గా ఉపయోగించుకోవడానికే మొగ్గు చూపుతున్నా. ఎందుకంటే ఎలాగూ షూటింగ్స్ ఉన్నప్పుడు బిజీబిజీగా గడుపుతుంటాను. కనీసం ఈ ఖాళీ సమయంలోనైనా నాకు నచ్చిన పనులు చేసుకోకపోతే ఎలా? అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది ఒత్తిళ్లు, ఆందోళనలు భరించలేకపోతున్నారు. అలాంటి వారి ఫీలింగ్స్‌ని దూరం చేయడానికి ఫన్నీ కంటెంట్‌ని నా ఇన్‌స్టా అకౌంట్లో పోస్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నా. అంతేకాదు.. మా ఇంట్లో అనవసరమైన వస్తువుల్ని తొలగించి అవసరమైన వాటితోనే ఇంటిని అందంగా అలంకరించే పనిలో పడ్డా. ఇక మరోవైపు నాకు నచ్చిన పుస్తకాలు చదువుతున్నా. ఇక చాలామంది ఈ ప్రతికూల పరిస్థితుల్లో సినిమాలు చూస్తూ, కుటుంబంతో గడుపుతూ ఒత్తిళ్లను అధిగమిస్తున్నారు.
ఇలాంటి పాజిటివిటీనే అందరూ అలవర్చుకోవాలి. మీకు వీలైతే ఈ సమయంలో ఇతరులకు సహాయపడండి.. త్వరలోనే మనకు మళ్లీ మంచిరోజులొస్తాయి.. ఈ ఆశతోనే అందరం ముందుకు సాగుదాం..!