కరోనా.. ఎందరో ఆశలు, ఆశయాలు, కన్న కలలకు గండి కొట్టింది. ప్రతి ఒక్కరినీ తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు పెడుతోన్న ఈ మహమ్మారి వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారు కొందరైతే, ఉపాధి అవకాశాలు లేక ఆకలితో అలమటిస్తోన్న వారు మరికొందరు. మనలాంటి సామాన్యులే కాదు.. ఎప్పుడూ షూటింగులతో బిజీగా ఉండే కొందరు సినీ తారలు, బుల్లితెర నటీనటులు సైతం గత రెండు నెలలుగా ఇంటికే పరిమితమై తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఈక్రమంలో బాలీవుడ్ బుల్లితెర నటి ప్రేక్షా మెహతా తన ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం చర్చనీయాంశమైంది.
ప్రేక్షా మెహతా.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఈ బుల్లితెర నటి ‘క్రైమ్ పెట్రోల్’, ‘తూ ఆషిఖీ’, ‘లాల్ ఇష్క్’, ‘మేరీ దుర్గా’.. వంటి టీవీ షోలతో పాపులారిటీ సంపాదించుకుంది. బుల్లితెరకు పరిచయం కాకముందు మధ్యప్రదేశ్‌లో పలు నాటకాల్లో నటిస్తూ తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆపై ముంబయికి తన మకాం మార్చి టీవీ షోలతో ప్రేక్షకులకు దగ్గరైంది. అంతేకాదు.. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘ప్యాడ్‌మ్యాన్’ సినిమాలోనూ ఓ చిన్న పాత్రలో మెరిసిందీ బ్యూటీ. ‘తోరే నైనా’, ‘సఖా’.. వంటి మ్యూజిక్ వీడియోల్లో నటించి మెప్పించిందీ సుందరి.
ప్రయత్నించా.. అలసిపోయా!
ఇలా తన నటనతో బుల్లితెర ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించిన ఈ ఇండోర్ సుందరి లాక్డౌన్ కారణంగా షూటింగ్స్ లేకపోవడంతో ఇంటికే పరిమితమైంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న ఆమె.. తన గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే తాను చనిపోవడానికి ముందు ఆమె ఇన్‌స్టా స్టోరీలో పెట్టిన ‘మన కలలు కల్లలు కావడం కన్నా ఘోరమైన విషయం మరేదీ ఉండదు’ అన్న పోస్ట్ ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది.

చనిపోయే ముందు సూసైడ్ నోట్లో కూడా ప్రేక్ష ఫలించని తన కలల గురించి ప్రస్తావించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ‘నా కలలు నీరుగారిపోయాయి.. నా ఆత్మవిశ్వాసం సడలింది. ఈ నిర్జీవమైన కలలతో ఇక నేను జీవించలేను. ఈ ప్రతికూల ఆలోచనల మధ్య నేను బతకలేను. నా ఆశయాలను నెరవేర్చుకోవడానికి ఏడాది కాలంగా ప్రయత్నిస్తూనే ఉన్నా.. ఇక అలసిపోయా..’ అంటూ తను రాసిన మరణ వాంగ్మూలంలోనే తెలుస్తోంది ఆమె ఎంత ఒత్తిడికి, మనోవేదనకు గురై ఉంటుందో!
ప్రేక్ష మృతి పట్ల పలువురు బుల్లితెర నటీనటులు సంతాపం తెలుపుతున్నారు. ‘ఈ కరోనా కష్ట కాలంలో ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలని, మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాల్సిన తరుణమిదే’ అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ప్రేక్ష ఆత్మహత్య చేసుకోవడానికి గల అసలు కారణాల గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఏదేమైనా.. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో నెగెటివ్ ఆలోచనలు మనల్ని చుట్టుముట్టడం సహజం. అయితే ఇకపై ఎప్పుడూ ఇవే కష్టాలు కొనసాగుతాయని అనుకోవద్దు.. ఎందుకంటే ఒక టన్నెల్ చివర వెలుతురు ఉన్నట్లే.. కొన్నాళ్లకు మన జీవితంలోని ఈ కష్టాలు కనుమరుగై సుఖం వస్తుంది. ఇదే ఆశతో, ధైర్యంతో, సానుకూల దృక్పథంతో ముందుకు సాగినప్పుడే కష్టకాలంలోనూ మనం హ్యాపీగా ఉండచ్చు.. మన చుట్టూ ఉన్న వారిని సంతోషపెట్టచ్చు.