కరోనా ప్రభావం తీవ్రంగా ఉండడంతో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. దీంతో ప్రజలంతా సామాజిక దూరం పాటిస్తూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. అయితే ఈ లాక్డౌన్ వల్ల తమ వృత్తిగత జీవితానికి బ్రేక్ పడకూడదన్న ఉద్దేశంతో చాలామంది ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. అప్పటిదాకా ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఆప్షన్ లేని సంస్థలు కూడా ఈ కొత్త పని సంస్కృతికి శ్రీకారం చుట్టాయి. అయితే మనమే కాదు.. సినీ పరిశ్రమకు చెందిన కొందరు ముద్దుగుమ్మలు కూడా ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఇంటి నుంచే తమ వృత్తిగత బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో చక్కటి పని వాతావరణాన్ని ఏర్పరచుకొని మనందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ పాఠాలు నేర్పుతున్నారు. మరి ఇంతకీ వాళ్లెవరు? వాళ్లు చేస్తోన్న పనులేంటో తెలుసుకుందాం రండి..
కత్రినా కైఫ్
దేశంలో కరోనా లాక్డౌన్ మొదలు కావడానికి కొన్ని రోజుల ముందు నుంచే కత్రినా స్వీయ నిర్బంధం పాటిస్తూ ఇంటికే పరిమితమైంది. ఈ క్వారంటైన్ సమయంలో ఆమె ఇంట్లో అంట్లు తోమడం, ఇంటిని శుభ్రం చేయడం, వంట చేయడం, గిటార్ నేర్చుకోవడం.. మొదలైన పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తోంది. అయితే క్యాట్ ఈ మధ్యే ‘KAY’ పేరుతో ఓ సౌందర్య ఉత్పత్తుల వ్యాపారాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ లాక్డౌన్ సమయంలో తన వ్యాపారానికి సంబంధించిన కార్యకలాపాలను సైతం ఇంటి నుంచే పర్యవేక్షిస్తోందీ బ్యూటీ. ఇందుకోసం ఆఫీస్ వాతావరణాన్ని తలపించేలా క్యాట్ తన ఇంట్లోనే ఓ ప్రదేశాన్ని అందంగా తీర్చిదిద్దుకోవడం విశేషం.
గౌరీ ఖాన్
చాలామందికి గౌరీ ఖాన్ అంటే షారుఖ్ ఖాన్ భార్యగా మాత్రమే తెలుసు.. కానీ, తనలో ఓ మంచి ఇంటీరియర్, ఫ్యాషన్ డిజైనర్లు కూడా దాగున్నారు. తనకు ముంబైలో ‘గౌరీ ఖాన్ డిజైన్స్’ అనే సొంత వ్యాపార సంస్థ కూడా ఉంది. ముకేష్ అంబానీ, కరణ్ జోహర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సిద్ధార్థ్ మల్హోత్రా.. మొదలైన ప్రముఖుల ఇళ్లకు ఇంటీరియర్ ప్లాన్స్ ఇచ్చింది కూడా గౌరీనే కావడం విశేషం.
అయితే ఈ లాక్డౌన్ సమయంలో కూడా గౌరి తన వ్యాపారానికి సంబంధించిన పనులను ఇంటి నుంచే పూర్తి చేస్తోంది. ఇలా ఇంటి నుంచి పని చేయడం గౌరీకి మొదటి నుంచి అలవాటే. ఇందుకోసం ముంబైలోని తన ఇంట్లో (మన్నత్) ఓ ప్రత్యేక గదిని కూడా ఏర్పాటు చేసుకుంది. ఈ గదిని తనకు కావాల్సిన వస్తువులతో పాటు.. ఎన్నో జ్ఞాపకాలతో నింపేసిందీ మిసెస్ ఖాన్.
సుసానే ఖాన్
బాలీవుడ్లో గుర్తింపు పొందిన ఫ్యాషన్ డిజైనర్, ఇంటీరియర్ డిజైనర్లలో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ కూడా ఒకరు. లాక్డౌన్ ప్రారంభమైన నాటి నుంచి ఆమె హృతిక్‌తో కలిసే ఉంటోన్న సంగతి తెలిసిందే. ఈ క్వారంటైన్ సమయంలో తమ ఇద్దరు పిల్లలను ఆనందంగా ఉంచేందుకే హృతిక్-సుసానే జంట ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుసానే తన ఆఫీస్ సెటప్‌ని హృతిక్ ఇంట్లోనే ఏర్పాటు చేసుకుంది. అక్కడి నుంచి తన వృత్తిగత బాధ్యతలను నిర్వర్తిస్తోంది.
వీటికి సంబంధించిన ఫొటోలను సుసానే ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ ‘మనపై ఆధారపడి ఉన్న ఉద్యోగులకు, వారి కుటుంబాలకు అండగా ఉండాల్సిన సమయమిది. వాళ్లు ఇబ్బందులు పడకుండా ఆర్థిక భద్రత కల్పించాల్సిన బాధ్యత మనదే..!’ అని తన సంస్థలో పని చేసే ఉద్యోగులను ఉద్దేశిస్తూ రాసుకొచ్చింది.
ట్వింకిల్ ఖన్నా
బాలీవుడ్ బ్యూటీ ట్వింకిల్ ఖన్నాకు హీరోయిన్గా మాత్రమే కాదు.. రచయిత్రిగా, వ్యాపారవేత్తగా, ఇంటీరియర్ డిజైనర్‌గా మంచి గుర్తింపు ఉన్న సంగతి విదితమే. దేశంలో కరోనా వ్యాప్తి మొదలైన దగ్గర నుంచి ట్వింకిల్ సామాజిక దూరం పాటిస్తూ ఇంటికే పరిమితమైంది. తను ఈ క్వారంటైన్ సమయంలో వృథాగా కాలక్షేపం చేయకుండా ఓ కొత్త పుస్తకం రాసే పనిలో నిమగ్నమవడం విశేషం.
మాధురీ దీక్షిత్
బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ మాధురీ దీక్షిత్ కూడా ఈ లాక్డౌన్ సమయాన్ని తనదైన స్టైల్లో సద్వినియోగం చేసుకొంటోంది. డ్యాన్స్‌పై ఆసక్తి ఉన్న వారికి ‘DancewithMadhuri.com’ వేదిక ద్వారా మాధురి ఎప్పటినుంచో ఆన్లైన్ శిక్షణ ఇస్తోన్న సంగతి తెలిసిందే. దీనికి మెంబర్షిప్ తీసుకోవాలి. అయితే మన దేశంలో లాక్డౌన్ మొదలయ్యాక #Learnamove, #Shareamove పేరుతో తను ఓ ఆసక్తికర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదేంటంటే ప్రతివారం రెండు చొప్పున టాప్ డ్యాన్స్ తరగతుల్ని ఏర్పాటు చేస్తోంది మాధురి. డ్యాన్స్‌పై ఆసక్తి ఉన్నవాళ్లు DancewithMadhuri.com వెబ్సైట్ ద్వారా వీటిని ఉచితంగా నేర్చుకోవచ్చు. అంతేకాదు, కొన్ని పాటలకు తను ఇంట్లో ఉంటూనే డ్యాన్స్‌పై శిక్షణ ఇవ్వడం విశేషం.
శిల్పా శెట్టి
తమ ప్రతిభతో లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటోన్న బాలీవుడ్ నటీమణుల్లో ఫిట్టెస్ట్ బ్యూటీ శిల్పా శెట్టి కూడా ఒకరు. శిల్పకు యోగా, ధ్యానం, వ్యాయామం, డైట్‌కు సంబంధించిన విషయాలపై ఎంత పట్టుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా వేదికలతో పాటు ‘Shilpa Shetty - Yoga, Fitness, Exercise & Diet’ అనే మొబైల్ యాప్ ద్వారా కూడా నెటిజన్లకు ఫిట్‌నెస్‌పై శిక్షణ ఇస్తోందీ భామ. ఈ క్రమంలో మన దేశంలో కరోనా లాక్డౌన్ మొదలైనా శిల్ప తన శిక్షణ తరగతులకు బ్రేక్ ఇవ్వలేదు. ఇంట్లో ఉంటూనే యోగా ఎలా సాధన చేయాలి, ఆరోగ్యకరమైన రెసిపీలను ఎలా తయారు చేసుకోవాలి.. తదితర అంశాలపై శిల్ప తరచూ వీడియోలను పోస్ట్ చేస్తుండడం విశేషం.
ప్రచారకర్తలుగా కూడా..
ఇదేవిధంగా కొంతమంది తారలు కరోనా నేపథ్యంలో పలు స్వచ్ఛంద సంస్థలకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తూ ఆయా సేవా కార్యక్రమాల్లో భాగం పంచుకుంటున్నారు.
విద్యాబాలన్
అనుష్కా శర్మ
సోనాక్షి సిన్హా
మంచు లక్ష్మి
వీళ్లతో పాటు మరెందరో సెలబ్రిటీలు ఈ లాక్డౌన్ సమయాన్ని కాలక్షేపంతో వృథా చేయకుండా.. వృత్తిగత బాధ్యతలను నిర్వర్తించేందుకు వినియోగిస్తున్నారు.