సాధారణంగా మ్యాగజైన్ ఫొటోషూట్ అంటే ఎవరెవరుంటారు? అందమైన మోడల్స్, స్టైలిష్ ఫొటోగ్రాఫర్స్, ఫ్యాషన్ డిజైనర్స్, మేకప్ ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, లైట్‌బాయ్స్... ఇలా చాలామంది ఈ బృందంలో ఉంటారు. వీరందరూ ఎంతో కష్టపడితే కానీ అందమైన ఫొటోలు రావు. అయితే లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్‌లతో పాటు ఫొటోషూట్స్‌కి కూడా కళ్లెం పడింది. ఈ అసాధారణ పరిస్థితుల్లోనూ ఓ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం అందమైన ఫొటోషూట్ తీయించుకుంది శోభితా ధూళిపాళ్ల. మరి లాక్డౌన్ కాలంలో ఈ ఫొటోషూట్ తనకు ఎలా సాధ్యమైందనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.
వన్ ఉమన్ ఆర్మీ!
నిత్యం సినిమాలు, షూటింగ్‌లు, ఫారిన్ షెడ్యూల్స్, ఫొటోషూట్స్ అంటూ బిజీబిజీగా గడిపే మన సినీ తారలు లాక్డౌన్ పుణ్యమా అని ఇంట్లోనే బందీలైపోయారు. ఈ నేపథ్యంలో చాలామంది ముద్దుగుమ్మలు తమ ప్రతిభా పాటవాలకు పదును పెడుతున్నారు. మన తెలుగమ్మాయి శోభిత కూడా సెల్ఫ్ ఐసోలేషన్ పాటిస్తూ ఇంటికే పరిమితమైపోయింది. ఈక్రమంలో తనలోని సృజనాత్మకతను బయటికి తీసి ఓ పత్రిక కవర్ పేజీ కోసం అందమైన ఫొటోషూట్ తీయించుకుంది. ‘వన్ మ్యాన్ ఆర్మీ’లా తానే ‘వన్ ఉమన్ ఆర్మీ’ అయి.. మేకప్ ఆర్టిస్టుల సహాయం లేకుండానే స్టైలిష్‌గా ముస్తాబైంది. ఫ్యాషన్ డిజైనర్లతో పని లేకుండా ఫొటోషూట్‌కు నప్పే అందమైన దుస్తులను సెలక్ట్ చేసుకుంది. చివరకు తనే స్టైలిష్ ఫొటోగ్రాఫర్‌గా మారిపోయి తన అందాలను తన ఫోనులోనే బంధించుకుంది.
సెల్ఫ్ టైమర్ సహాయంతో!
లాక్డౌన్ వేళ అందరూ ఇంట్లోనే ఉన్నా సామాజిక దూరం పాటిస్తూ సెల్ఫీ ఫొటోలు తీసుకుంటూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈక్రమంలో శోభిత కూడా కొద్ది రోజుల క్రితం నుంచే మ్యాగజైన్ ఫొటోషూట్ కోసం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా తన ఇంట్లోనే అందమైన లొకేషన్లను ఎంపిక చేసుకుంది. తన ఫోన్లోని సెల్ఫ్ టైమర్ ఫీచర్ సహాయంతో టెర్రస్, సోఫాలపై వివిధ స్టిల్స్ ఇస్తూ ఎంతో అందంగా ఫొటోలు తీసుకుంది. అనంతరం ఆ విశేషాలను ఇన్స్టాగ్రామ్ ద్వారా అందరితో షేర్ చేసుకుంది శోభిత.
నాకు ఇదో అరుదైన అవకాశం!
‘ఈ లాక్డౌన్ కారణంగా నన్ను నేను అందంగా ముస్తాబు చేసుకునే అవకాశం నాకు దొరికింది. నా ఫొటోగ్రఫీ ట్యాలెంట్‌కు పదును పెడుతూ ఇంట్లోనే ఉన్న నా కొత్త ఫ్రెండ్ (ఫోన్లోని సెల్ఫ్ టైమర్) సహాయంతో ఫొటోలు తీసుకున్నా. మనలోని సృజనాత్మకతను, ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయాలంటే అందుకు ఒక చిన్న అవకాశం వస్తే చాలని నాకిప్పుడు అర్థమైంది. ఒక్క ఫొటోషూట్ విషయంలోనే కాదు.. అన్ని విషయాలకూ ఇది వర్తిస్తుంది. నేను ఈ మ్యాగజైన్ ఫొటోషూట్ కోసం రెండు రోజులు కష్టపడాల్సి వచ్చింది. అయితే ఎంతో ఇష్టం, నిజాయతీతో తీసుకున్న ఈ సింప్లిసిటీ ఫొటోషూట్ నాకెంతో నచ్చింది.. అది మీతో షేర్ చేసుకుంటుంటే మరింత ఆనందంగా ఉంది..’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చిందీ వైజాగ్ బ్యూటీ.
అందం, అభినయంతో ఎందరో అభిమానులను సొంతం చేసుకుంది శోభిత. తాజాగా ‘వన్ మ్యాన్ ఆర్మీ’ లాగా అన్నీ తానై ఎంతో అందంగా తీసుకున్న ఫొటోషూట్ కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు నెటిజన్లు కూడా ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆమె ఫొటోలకు లైక్‌లు కొడుతూ, షేర్ చేస్తూ అభినందనలు చెబుతున్నారు.
‘మేజర్’తో మరోసారి!
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంకు చెందిన శోభిత మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. అందుకోసం ముంబైకి మకాం మార్చిన ఈ ముద్దుగుమ్మ.. అక్కడే ఫిల్మ్ కోర్సు పూర్తిచేసింది. అందంతో పాటు ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్న ఈ భామ.. 2013లో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో రెండో స్థానంతో అందరి దృష్టినీ ఆకర్షించింది. అదే ఏడాది మిస్ ఎర్త్ పోటీల్లో భారత్ తరఫున పాల్గొని మిస్ ఫొటోజెనిక్, మిస్ ట్యాలెంట్ తదితర టైటిల్స్ సొంతం చేసుకుంది. ఇక 2016లో ‘రామన్ రాఘవ్ 2.0’ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శోభిత. అనతి కాలంలోనే తన అందం, అభినయంతో అందరినీ కట్టిపడేసిన ఈ తెలుగందం.. ‘గూడఛారి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించింది. గతేడాది ‘మేడ్ ఇన్ హెవెన్’ వెబ్‌సిరీస్‌తో ఆకట్టుకున్న శోభిత.. ‘మేజర్’ సినిమాతో మరోసారి టాలీవుడ్ స్క్రీన్‌పై మెరిసేందుకు సిద్ధమవుతోంది.
Photo: Instagram