కరోనా నుంచి మానవాళిని రక్షించేందుకు యావత్ ప్రపంచం తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ వ్యాధి బారిన పడిన వారికి తగిన వైద్య సేవలు అందించేందుకు వివిధ దేశాల ప్రభుత్వాలు విపరీతంగా ఖర్చు పెడుతున్నాయి. మన కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సమస్యపై పోరాడేందుకు కోట్ల రూపాయలను వెచ్చిస్తోంది. ఈ క్రమంలో తమకు తోచిన నగదును ‘ప్రధాని సహాయ నిధి’కి విరాళంగా ఇవ్వమని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సాయం అందించేందుకు సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు సైతం ముందుకొస్తుండడం విశేషం. ఈ ఆపద సమయంలో దేశ ప్రజలకు అండగా నిలుస్తూ వాళ్లు తమ మంచి మనసును చాటుకుంటున్నారు.
ప్రియాంక చోప్రా
కొవిడ్-19 నుంచి ప్రజలను రక్షించేందుకు ఈ సంస్థలు చేస్తోన్న కృషి అసమానం. ఆకలితో ఉన్న వారిని ఆదుకోవడం, వైద్య బృందాలకు సహకరించడం, సరైన ఇళ్లు లేని వారికి ఆశ్రయం కల్పించడం, నిరుపేదలకు నగదు సహాయాన్ని అందించడం, వినోద రంగానికి చెందిన వారికి సాయంగా ఉండడం.. మొదలైనవి చేస్తున్నారు. ఈ క్రమంలో నేను, నిక్.. @FeedingAmerica, @goonj, #DoctorsWithoutBorders, @nokidhungry, @GiveIndia, @sagaftra, #IAHV, #Aseema, #PMCARES ఛారిటీలకు విరాళాలు అందించాం.
ఈ ఛారిటీలకు మీరు కూడా విరాళాలు పంపొచ్చు. పైన చెప్పిన ప్రతి స్వచ్ఛంద సంస్థలో నేను భాగమై ఉన్నాను. వాటికి సంబంధించిన మరిన్ని వివరాలు మీరు నా స్టోరీస్‌లో చూడొచ్చు. మనం చేసే ఏ సహాయం కూడా చిన్నది కాదు. మనమంతా కలిసికట్టుగా కరోనాను తరిమికొడదాం.
ఈ క్రమంలో నిక్ దీనిపై స్పందిస్తూ.. ‘కొవిడ్-19 సోకిన వారు వీలైనంత త్వరగా కోలుకోవాలని మేము ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ప్రజల కోసం పని చేస్తోన్న ఈ స్వచ్ఛంద సంస్థల గురించి అందరిలో అవగాహన తీసుకురావాలని నేను, ప్రియాంక అనుకున్నాం’ అంటూ ట్వీట్ చేశాడు.
కరీనా కపూర్
ఇలాంటి ఆపద సమయాల్లో మనమంతా ఒక్కటై.. ఒకరికొకరు అండగా నిలబడాలి. ఈ క్రమంలో మేము UNICEF, GIVE INDIA, The International Association for Human Values (IAHV) సంస్థలకు మా వంతుగా విరాళాలు అందిస్తు్న్నాం. మీరు కూడా మీకు తోచిన సహాయాన్ని వాళ్లకు అందించాలని కోరుకుంటున్నాం. జైహింద్..!
- కరీనా, సైఫ్, తైమూర్
కత్రినా కైఫ్
యావత్ ప్రపంచాన్ని కరోనా భయపెడుతోన్న తీరుని చూస్తుంటే నా హృదయం చలించిపోతోంది. ఈ క్రమంలో PM CARES fund, Chief Minister's Relief Fund (Maharashtra)లకు నా వంతు సహాయాన్ని అందిస్తున్నా..!
అలియా భట్
దేశమంతా లాక్డౌన్లో ఉన్న ఇలాంటి విపరీత పరిస్థితుల్లో.. కొవిడ్-19ని అదుపు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరాయంగా కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి విధుల్లో పాల్గొంటోన్న ప్రతి ఒక్కరికీ నా సెల్యూట్. ఈ నేపథ్యంలో PM CARES fund, Chief Minister's Relief Fund (Maharashtra)లకు మద్దతు తెలుపుతూ నా వంతు సహాయాన్ని అందిస్తు్న్నా..!
సారా అలీ ఖాన్
PM CARES fund, Chief Minister's Relief Fund (Maharashtra)లకు నా వంతు సహాయాన్ని అందిస్తున్నా..! మీరు కూడా మీకు తోచిన సహాయాన్ని వారికి అందించాలని కోరుకుంటున్నా. మనమంతా కలిసికట్టుగా కరోనాతో పోరాడదాం..!
శిల్పా శెట్టి
దేశానికి, తోటి భారతీయులకు అండగా నిలబడాల్సిన సమయం ఇది. ఈ నేపథ్యంలో నేను, రాజ్ (శిల్ప భర్త) మా వంతుగా రూ.21 లక్షలను ప్రధాని సహాయనిధికి అందజేస్తున్నాం.
మాధురీ దీక్షిత్
మనమంతా కలిసికట్టుగా ఈ యుద్ధాన్ని జయిద్దాం..! ఈ క్రమంలో ప్రధాని సహాయ నిధికి మా వంతుగా విరాళాన్ని అందజేస్తున్నాం..!
లతా మంగేష్కర్
కరోనాతో పోరాడే క్రమంలో మన ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఈ క్రమంలో నా వంతుగా రూ. 25 లక్షలను ప్రభుత్వ సహాయ నిధికి అందజేస్తున్నా..!
సానియా మీర్జా
కరోనా విజృంభణతో ప్రపంచమంతా వణికిపోతోన్న ఈ తరుణంలో రోజువారీ కూలీలకు సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తోంది ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా. ఈ క్రమంలో ఆమె ‘Safa Society’ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి విరాళాలు సేకరిస్తోంది.
‘నేను ముందు ఈ స్వచ్ఛంద సంస్థకు నా వంతుగా విరాళాన్ని అందించాను. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నిరుపేదలను వీళ్లు ఆదుకొంటోన్న తీరు నన్ను ఆకట్టుకుంది. అందుకే నేనూ ఈ సంస్థతో కలిసి విరాళాలు సేకరించడం ప్రారంభించాను. ఈ క్రమంలో మేము ఇప్పటివరకు రూ.1.50 కోట్ల రూపాయలను కలెక్ట్ చేశాం అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది సానియా.
వీరితో పాటు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా విరాళాలు అందించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.