కరోనా వైరస్ ఎవ్వరినీ వదిలి పెట్టట్లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ దీని బారిన పడుతున్నారు. ప్రముఖ బాలీవుడ్ సింగర్ కనికా కపూర్‌కు ఇటీవల కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. మార్చి 9న లండన్ నుంచి ముంబై వచ్చిన కనిక.. అక్కడి నుంచి కాన్పూర్, లక్నో వెళ్లింది. అక్కడ ఓ విందులో ప్రముఖులతో పాల్గొంది. ఆ తర్వాత కరోనా లక్షణాలతో బాధపడడంతో ఆసుపత్రిలో చేరింది. వైద్యుల పరీక్షలో ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతున్న కనిక తాజాగా ఇన్‌స్టా వేదికగా చేసిన పోస్ట్ అందరినీ ఒకింత భావోద్వేగానికి గురిచేస్తోంది.
పది రోజులుగా చికిత్స పొందుతున్న కనికాకు ఇప్పటి వరకు నాలుగు సార్లు కరోనా నిర్ధారణ పరీక్ష నిర్వహించగా.. నాలుగు సార్లూ రిపోర్ట్ పాజిటివ్‌గా వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. ఇదే కారణంగా చూపి.. కనిక ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని.. ప్రస్తుతం తను ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ పుకార్లకు చెక్ పెట్టడానికి స్వయంగా కనికానే స్పందించింది. ఇన్‌స్టా వేదికగా భావోద్వేగంతో కూడిన ఓ పోస్ట్ చేసింది.
జీవితం విలువేంటో నేర్పిస్తుంది..
‘జీవితం సమయాన్ని తెలివిగా ఎలా వాడుకోవాలో నేర్పిస్తే.. సమయం జీవితం విలువేంటో నేర్పిస్తుంది’ అనే కొటేషన్‌తో ఉన్న ఫొటోను షేర్ చేసిందీ సింగర్. ఇక ఈ ఫొటోతో పాటు.. ‘పడుకోవడానికి బెడ్‌పైకి వెళుతున్నాను. మీకు నా ప్రేమను పంచుతున్నా. మీరంతా జాగ్రత్తగా ఉండండి. నా ఆరోగ్యం గురించి మీరు చూపిస్తున్న ఆదరణకు నా ధన్యవాదాలు. కానీ నేను ఐసీయూలో లేను. ప్రస్తుతం నా ఆరోగ్యం నిలకడగా ఉంది. నాకు చేసే తర్వాతి పరీక్షలో కరోనా నెగెటివ్ వస్తుందని ఆశిస్తున్నాను. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్లి నా పిల్లల్ని, కుటుంబ సభ్యులను కలుసుకుంటానా అని ఎదురుచూస్తున్నాను. వారిని చాలా మిస్ అవుతున్నా’ అనే క్యాప్షన్‌ను జోడించిందీ బాలీవుడ్ బ్యూటీ.
ఇలా పది రోజుల్లో నాలుగు సార్లు కరోనా పాజిటివ్ రావడంతో అటు ఆమె ఫ్యాన్స్, ఇటు కుటుంబ సభ్యులు కూడా విపరీతంగా ఆందోళన చెందుతున్నారు. కానీ ప్రస్తుతం కనిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందంటూ ఆమె చికిత్స పొందుతోన్న ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు.
ఏదేమైనా కనికకు ఐదోసారి చేయబోయే కరోనా టెస్ట్‌లోనైనా నెగెటివ్.. వచ్చి ఆమె తిరిగి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరుకోవాలని మనమూ ఆ దేవుడిని ప్రార్థిద్దాం..!